రాజా బలవంతంగా పెదాల మీద నవ్వు తెచ్చుకున్నాడు. ఒక్క క్షణం, మంజుల ప్రసక్తి తో, ఆ చిరునవ్వు చాటున మాలిన్యపు చాయలు, రాజా వదనము లో తారాడటం సంధ్య గమనించక పోలేదు. మనస్సు చివుక్కు మాన్పించి, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీక చింతించ సాగింది. ఇంతలో సారధి, సుమిత్ర లోపలికి రావడంతో ముగ్గురూ రక్షించబడ్డారు. రామకృష్ణ బ్రతికిపోయా ననుకున్నాడు.
ఆ రాత్రి సంధ్య కి సరిగ్గా నిద్రపట్టలేదు. వెలవెల పోతున్న రాజా మొహం, పదే పదే కళ్ళల్లో మెదిలి వ్యధ చెందింది. అతడి తలపుల్లో మనసు ఆర్ధ్రమయింది. కానీ, వో పక్క మంజుల, మనసులో ముల్లులా మెదుల్తూ , మెత్తపడుతున్న మనసుని గడమాయిస్తోంది.
* * * *
సుమీ! మంచి స్పై పిక్చర్ ఆడుతుందంట . బెనర్జీ ఫోన్ చేసి చెప్పాడు. వాడి మిసెస్ కూడా వస్తున్నారంట. చప్పున తయారవ్వాలి. టైం ఎక్కువ లేదు.' లోపలికి వస్తూనే హడావుడి పెట్టేశాడు సారధి. 'రాజా యింకా రాలేదా?' కోటు సుమిత్ర చేతి కందిస్తూ ప్రశ్నార్ధకంగా చూశాడు. 'ఇందాకే వచ్చాడు. తను, రామకృష్ణ పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నారు. వచ్చేప్పటికి చాలా ఆలస్యమవు తుందేమో , ఎదురు చూడద్దని చెప్పి వెళ్లాడు.' కోటు హెంగర్ కి తగిలిస్తూ అంది. 'ఆహా! సంధ్య ఏది! వో మరదలు పిల్లా! ఎక్కడున్నావ్? అద్దం ముందు గంటల తరబడి కూర్చుంటే మనం అందుకునేది సెకండ్ షో కే, తొందరగా తయారయితే రక్షించిన దానివవుతావ్' గట్టిగా అన్నాడు సారధి. తన గదిలో , రాధాకృష్ణుల చిత్రాన్ని ఇండియన్ యింక్ తో దిద్దుతున్న సంధ్య విసురుగా వచ్చి ఉక్రోషంగా అంది.
"ఇదిగోండి బావగారు! మీరు చేసే పన్లు చేస్తూ, నాన్నంటే ఊరుకోను. బయటికి వెళ్తున్న ప్పుడల్లా 'సుమీ! షర్ట్ కి కొంచెం మరకయి నట్లుందే! అబ్బ! యీ క్రాఫ్ సరిగ్గా కుదరట ల్లేదు , కొంచెం దువ్వి పెడుదూ! ముఖం మీద పౌడర్ కన్పిస్తుందా. సరిగ్గా చూడు'; అని అక్కయ్య ప్రాణం తీసి, అనుకున్నదానికి అరగంట ఆలస్యం చేస్తారు. పైగా నన్నంటారే!' గుక్క తిప్పుకోకుండా అనేసింది.
'అమ్మా! తల్లీ! సంధ్యా దేవి! శాంతించు. ఇంతకీ తమరు దయచేస్తున్నట్లే నా?' చేతులు జోడించాడు. సంధ్య కొంచెం తగ్గింది.
'ఉహు! నాకివాళ రావాలని లేదు. బొమ్మ పూర్తీ చేయాలి' నసుగుతూ అంది. చీర కట్టుకొని అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర కి కోపం వచ్చింది.
'ఇంట్లో ఒక్కదానిని ఎలా వుంటావ్? సర్లే, నేనూ మానేస్తాను.' సంధ్య చప్పున సుమిత్ర దగ్గరకు వచ్చి, మెడ చుట్టూ చేతులు వేసి, ముద్దుగా అంది. 'ప్రక్కన రాణీ వాళ్ళు న్నారుగా! భయమన్పిస్తే తోడు తెచ్చుకుంటాలే. అసలు బావగారికి తీరిక దొరకడమే తక్కువ. అలాంటిది , ఎప్పుడో ఒకసారి తీసి కెళ్ళేదానికి మానేస్తా నంటా వేమిటి? నాకు బయటికి యివాళ వెళ్లాలని లేదక్కా. ప్లీజ్ బ్రతిమాలుతున్నట్లంది. సుమిత్ర మెత్తబడింది.
ఇద్దరూ వెళ్లి పోయిన తర్వాత సంధ్య కాస్సేపు తోటలో తిరిగింది. ఇంట్లో ఉన్నది తను ఒక్కతే అన్న భావన రాగానే ఏవేవో, వూహలు అల్లరి చేశాయి సంధ్య లో. మనసులోని మమతల మల్లెల ని, మాలలుగా కట్టే ఈ ఏకాంతం లో ఎంతటి మాధుర్యం ఉంది!
భోజనం పూర్తీ చేసి, పడక కుర్చీలో వాలుతూ గడియారం వంక చూసింది. ఎనిమిది దాటింది. 'అక్కయ్యా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకో రెండు గంటలు పడుతుంది. రాజా ఎప్పుడొస్తాడో?' కళ్ళు మూసుకుంది. ఊహల్లో స్వేచ్చగా విహరిస్తున్న సంధ్య మనసు, తలుపు చప్పుడవడంతో వాస్తవం లోకి దిగింది. పరధ్యానంగా తలవంచుకుని లోపలికి వస్తున్న రాజాని అలాగే కళ్ళప్ప చెప్పి చూడ సాగింది.
'రామకృష్ణ రూమ్ కి తాళం వేసుంది. ఎదురుగా ఉన్న కిళ్ళీ కొట్టతను , తను రూమ్ దగ్గర నిలబడ్డం చూసి పిలిచి చెప్పాడు. ఎవరో అమ్మాయి వస్తే యిద్దరూ కలిసి వెళ్ళారంట. బహుశా పరిమళ వచ్చి వుంటుంది.' ఆలోచనల్లో మునిగిపోయిన రాజా మొదట సంద్య ని గమనించలేదు. కుర్చీలో అలసటగా వాలబోతున్నవాడల్లా సంధ్య ని చూసి త్రుళ్ళిపడ్డాడు. ఏ వ్యక్తీ ఊహల్లో మునిగి పరిసరాల్ని విస్మరించిందో, ఆ వ్యక్తే అనుకోకుండా ఎదురుగా ప్రత్యక్షమయ్యే ప్పటికి , సంధ్య, పట్టుబడిన దొంగలా అనుభూతి చెందింది. ముఖంలోని భావాల్ని దాచుకోవడాని కన్నట్లు , చటుక్కున లేచి కిటికీ దగ్గర నిల్చొని బయటికి దీక్షగా చూడసాగింది. రాజా మొహంలో కన్పిస్తున్న అలసట ని చిరాకు ని సంధ్య కళ్ళు పట్టేసాయి.
'అన్నయ్యా వాళ్లేరి?' రాజా ఆశ్చర్యంగా అడిగాడు. 'సినిమాకు వెళ్ళారు ' తల తిప్పకుండానే సమాధాన మిచ్చింది. 'మరి నువ్వెందుకు వెళ్ళలేదు?' నాలిక చివరి దాకా వచ్చిన ప్రశ్నని బలవంతంగా వెనక్కి తోసేశాడు. సంధ్య వాలకం చూస్తుంటే , 'ఇహ నీదారిని నువ్వు దయచేయి బాబూ' అన్నట్లుంది. సంధ్య నిర్లక్ష్యం చురుక్కు మన్పిస్తోంది. వచ్చినప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాడు. తనని చూస్తేనే, మొహం మీద కట్టినట్లు అక్కడ్నించి లేచి వెళ్ళిపోతుంది. సమయానికి వదిన కన్పడక పొతే, సంధ్య ని అడగబోతే, ముందే పసికట్టిన దానిలా అక్కడ్నించి జారుకుంటుంది. ఒకవేళ అడిగినా , మహా కష్టంగా ముఖం పెట్టి , బలవంతం మీద అన్నట్లు చేస్తుంది. ఒక్క భోజనాల సమయంలో తప్పిస్తే తనింట్లో ఉన్నప్పుడు ఆ చాయలకే రాదు. కాని తనకెందు కో , ఎంత ప్రయత్నించినా సంధ్య మీద కోపం రావటం లేదు. పైగా అభిమానమే పెరుగుతోంది. తన ప్రవర్తన లో ఏం లోపం ఉందని, ఆ అమ్మాయి అలా దులపరించు కుంటుంది?' మృదు స్వభావుడైన రాజాకి సంధ్య ప్రవర్తన నొప్పి కల్గించగా, ఆత్మ విమర్శ చేసుకున్నాడు. 'ఒకవేళ మంజుల సంగతి తెలిసి అలా ప్రవర్తించడం లేదు కదా?' భయంకరమైన అనుమానం మెరుపులా మెరిసింది. 'ఎలా తెలిసి ఉంటుంది? వదినేమన్నా చెప్పిందా? అందుకే సంధ్య తనని ద్వేశిస్తున్నదేమో!' ఒక్క క్షణం ఈ భావంతో రాజా మనసు తల్లడిల్లి పోయినట్లయింది. మరుక్షణం లోనే విరక్తి గా నవ్వుకున్నాడు. 'తెలిస్తే నష్టమేముంది? పోనియ్! ఎలా అర్ధం చేసుకున్నా తనేం పట్టించు కొడు' బూట్లు టేబుల్ క్రిందకు తోసి లోపలికి వెళ్లి పోయాడు. సంధ్య తనపట్ల బలంగా ఆకర్షించ బడిందని , తనకు తెలియకుండానే, అతని పట్ల ఆరాధనని పెంచుకోందని , అది బయటపడ్డం యిష్టం లేక, తెచ్చుకున్న కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నదని , రాజాకి యేమాత్రం తట్టినా, అతడి మనసుకి ఉపశమనం కల్గి ఉండేది.
సంధ్య నెమ్మదిగా వచ్చి టీపాయ్ ప్రక్క ఉన్న సోఫాలో వాలింది. 'రాజాని చూస్తుంటే ఒంట్లో ఏం బాగోలేదని తెలుస్తూనే ఉంది. లోపల ఏం చేస్తున్నాడు? శబ్ధమేమీ వినపట్టం లేదు పాపం! భోజనం కూడా చేసినట్లు లేడు. ఇంత తొందరగా ఎందుకు వచ్చేశాడు?' ప్రశ్నలతో సంధ్య మనసు వేగిపోయింది , 'పోనీయ్! తన కెందుకు.' అని పట్టనట్లు కూర్చోవడానికి మనసు సుతరామూ ఒప్పుకోవడం లేదు. అలా అని వెళ్లి అడగటానికి అంతకన్నా ధైర్యం చాలడం లేదు. నెమ్మదిగా లేచి, శబ్దం చేయకుండా రాజా గది దగ్గరకు వెళ్లి కిటికీ లో నుంచి తొంగి చూసింది. అటు వైపు తిరిగి, ఒక చెయ్యి తల కింద, యింకో చెయ్యి కళ్ళ మీద పెట్టుకొని పడుకున్నాడు. బట్టలన్నా మార్చలేదు. 'భోజనానికి లెమ్మని' అడుగుదామని ఎంత ప్రయత్నించినా , సంధ్య నోరు పెగల్లేదు. రాజా గది దాకా మూడు సార్లు వచ్చినా అడగలేక పోయింది. నిస్పృహగా వచ్చి పడక కుర్చీలో పడుకుంది. లైటార్పేసి మగతగా. అలా ఎంతసేపు పడుకుందో సంధ్య కి తెలియలేదు. దగ్గరగా అడుగుల చప్పుడు విన్పడటం తో, మత్తుగా కళ్ళు సగం తెరిచి చూసింది. అంతే ! సంధ్య గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానేసింది. బెడ్ లైట్ వెల్గులో రాజా తనకేసి వస్తూ కన్పడ్డాడు. శాంతి మాటలు చప్పున బుర్రలో తిరిగాయి. జరగబోయే దాన్ని ఎదుర్కొనడాని కన్నట్లు, శరీరంలో శక్తి నంతా కూడదీసుకుంది. రాజా సంధ్య దగ్గరగా వచ్చి, వంగి, టీపాయ్ మీదున్న 'అమృతాంజనం ' తీసుకుని నిశ్శబ్దంగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు. దగ్గరగా రావడంతో కళ్ళు మూసుకొని, ఊపిరి బిగపట్టింది. అంతా నిశ్శబ్దం. ఏమీ కాలేదు. కళ్ళు తెరిచి అయోమయంగా దూసిన సంధ్య కి రాజా కన్పడ లేదు. దేనికి వచ్చినట్లు? ప్రక్కన ఖాళీ టీపాయ్ కన్పించింది వెక్కిరిస్తూ. అంతకుముందు , తను రాసుకొని , అక్కడ పెట్టిన అమృతాంజనం సీసా లేదు.
కాని, రాజా వెళ్ళిన పది నిమిషాల వరకు సంధ్య గుండెలో దడ, కాళ్ళల్లో వణుకు తగ్గలేదు. అనుమానం అర్ధరహితంగానే మిగిలిపోయినందుకు , బరువు తీరినట్లు దీర్ఘంగా విశ్వసించింది. మొదటిసారిగా సంధ్య శాంతి మాటల్లో నిజం శంకించింది. 'నిష్కల్మషంగా ఉండే రాజా అలాంటి వాడై ఉండడు.' సంధ్య హృదయం నిజం చెప్పింది.
