Previous Page Next Page 
కాగితపు పల్లకి పేజి 6

 

    రాజశేఖరం ఇంటికి వచ్చేసరికి పొద్దు పోయింది. ఇంటికి చేరేసరికి చలపతి సినిమాకి వెళ్ళాడని భార్య చెప్పింది. అందరినీ పరిశీలనగా ఓసారి పరికించి వారంతా సంతృప్తి గా ఉండటం గమనించి "చలపతి నీకు నచ్చాడా?" అన్నాడు.
    "ఆహా ,బాగానే ఉన్నాడు. పిన్నికి, రాధమ్మ కి కూడా నచ్చినట్టే"
    రాజశేఖరానికి ఓ పక్క బెడురుగానే ఉంది. ఓసారి వీధి చివరి కంటూ వెళ్ళి చూసి వచ్చాడు. తప్పతాగి అదే అవతారం లో ఇంటికి వస్తాడేమో నని అతనికి ఏదో బెదురుగా ఉంది. చాలాసేపు అరుగు మీదనే కూర్చున్నాడు. మధ్య మధ్య వీధి చివరి కంటా పోయి వస్తున్నాడు.
    సుభద్రమ్మ భర్త ధోరణి అర్ధం కాలేదు,
    "ఊళ్ళోకి వచ్చినవాడు రాకపోతాడా . మీరు చూడకపోటారా ఎందుకంత తొందర" అంది.
    రాజశేఖరం నసుగుతూ లోపలికి వచ్చేశాడు. అతని దృష్టి మాత్రం వీధి మీదనే ఉంది.
    సుభద్రమ్మ ఈ కాస్త వ్యవధి ని వృధా చేయకుండా "మీరు గట్టిగా చెబుతే అయన కాదనరు.' అంది.
    రాజశేఖరం నవ్వేసి "చిన్నప్పుడు పదిహేనేళ్ళ వయసులో వాడ్ని అక్కడికి పంపించేశాను. ఆ తర్వాత అతని జీవితం అతను బాగుగానో, ఒగుగానో దిద్దుకున్నాడు. మనకి అతని మీద అభిమానం ఉందని అధికారం ఉందని అనుకున్నా అది అపహాస్యంగా ఉంటుంది. మనం అతడికి నచ్చ చెప్పగలమే గాని శాసించటానికి పూనుకుంటే వాడు తప్పకుండా ఎదురు తిరుగుతాడు. తొందరపడితే ఇక్కడ పని సానుకూలం కాదు సరి కదా వ్యతిరేకం కావచ్చు."
    సుభాద్రామ్మ కు ఆతృతగా ఉంది. ఎప్పుడు ఖాయం చేసుకుంటారా అనే ఆదుర్దా ఆమె కనపరుస్తుంది.
    గడియారం పదిన్నర కొట్టేసరికి చలపతి ఇంటికి చేరాడు. చలపతిని మాములుగా చూసిన తర్వాత అతను పూర్తీ స్మారకం లో వున్నాడనే నమ్మకం చిక్కిం తర్వాత రాజశేఖరానికి సగం బెదురు తగ్గలేదు.
    భోజనాల దగ్గర చలపతి తలవంచుకొని భోజనం చేస్తుంటే సుభద్రమ్మ ఎలాగైనా చలపతిని మాటల్లోకి దింపాలని ప్రయత్నం చేసింది. అయినా చలపతి మౌనంగానే ఉన్నాడు. ఎక్కువగా మాట్లాడితే అసభ్యమైన పదాలు ఎక్కడ దొర్లుతాయోనని అతని జాగ్రత్త లో అతనున్నాడు. అక్కడికీ ఒకటి రెండు సందర్భాలలో అసభ్యాలు నోటి చివరి కంటా వచ్చి చట్టున ఆపుకున్నాడు. రాజశేఖరం కూడా తమ్ముడిని ఎక్కువగా కదపదల్చుకోలేదు.
    అయినా సుభద్రమ్మ ఒకంతట వదల్లేదు.
    "మరిది గారు కొత్త చోటు కొచ్చినట్టు గా మాటా మంతీ లేకుండా వున్నారేం?' అందావిడ.
    రాజశేఖరం "మావాళ్ళు ముక్తసరిగా , ముచ్చటగా పది వాక్యాలల్లో చెప్పవలసిందాన్ని మూడు ముక్కల్లో అర్ధం వచ్చెట్టుగా భావగర్భితంగా మాట్లాడతారు. అంతేగాని డబ్బాలాగా తెగ వాగరు" అన్నాడు.
    'అక్కడికి మేం అనవసరంగా మాట్లాడే వాళ్ళం కాబోలు."
    'అది తెలుస్తూనే ఉందిగా."
    "ఆ మాట కొస్తే అసలు నాకు మాట్లాడటమే చేతకాదు" అంది సుభద్రమ్మ సన్నగా దగ్గుతూ.
    చలపతి కాస్త తికమక పడ్డాడు.
    రాధ అవతల తల్లి దగ్గర వుండిపోయింది. అక్కడ చలపతి లేకుండా వుంటే ఇలాంటి పరాచాకాలలో దిగడానికి ఆమె వెనకాడేది కాదు.
    ఇంతగా కదిల్చినా చలపతి సంభషణల్లోకి జోక్యం చేసుకోక పోవటం తో సుభద్రమ్మ కొంత నిరుత్సాహపడినా ఇంకా పంతంగా ఇంత కూర తెచ్చి వద్దంటున్నా విస్తట్లో వడ్డించేసింది.
    రాజశేఖరం "ఏవిటా వడ్డన?" మావాడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడేమిటి?" అన్నాడు.
    "మీ కంటికి ఎలా కనిపిస్తున్నాడో, నాకంటికి అలాగే కనిపిస్తున్నాడు."
    "వాడు ఎంతో మితభాషి, అలాగే మితాహారి కూడాను."
    'అలాగని తినాలని ఉన్నా తినేవాళ్లని తినకుండా చేడగొట్టండి" అంది సుభద్రమ్మ చలపతి మొహమాట పడటం గమనించి.
    "అన్నయ్య చెప్పింది నిజమే వదినా. నాకు ఎక్కువగా తినటం అలవాటు లేదు" అన్నాడు చలపతి.
    ఈ మాటలు వదిన గారికి చిలక పలుకుల్లాగా వినిపించాయి. ఆమె ఈ ఆసరా చూసుకుని వదలకుండా "ఎక్కువగా ఒకరు మటుకు తింటారా ఆ మాత్రం తినకపోతే ఎలా? ఇదేమీ మీ అత్తగారి ఇల్లు కాదు గదా?" అంది.
    "అత్తగారి ఇల్లయితే అసలు వాడు నోటికి ముద్దు ఎత్తుతాడా అని" అంటూ రాజశేఖరం సమర్ధించాడు.
    'అలా ఉండకూడదు. చక్కగా చనువుగా కావాల్సిందేవిటో అడిగి వేయించుకోవాలి ఏదైనా కావాలంటే దండించి మరీ తీసుకోవాలి. ఒకవేళ మరిది గారికి తెలియక పోయినా మీరున్నారుగా చెప్పటానికి." అంది సుభద్రమ్మ.
    "ఓయబ్బో....నేను దండించి నీవాళ్ళ సొమ్మంతా తినేసినట్టు మాట్లాడుతున్నావే?" అన్నాడు రాజశేఖరం.
    "పుచ్చుకుని లేదంటే పాపం, అబద్దాలు చెప్పకండి.
    "ఏదో శాస్త్రం చెప్పినట్లు ఓ పంచల జత, నాలుగు చొక్కా గుడ్డలు ఇవ్వగానే సరా......రాజశేఖరం భోజనం అపు చేసి వాదనలోకి దిగాడు. ఒక చంప భార్య హుషారుగా మరిదిని సంభాషణల్లోకి లాగాలని ప్రయత్నం, చలపతి తన జాగ్రత్తలో తాను బయటపడకుండా జాగ్రత్త పడటమూ మధ్య రాజశేఖరం కలగజేసుకుని భార్య ధోరణి ని తృప్తి పరచాలనే చొరవ తీసుకున్నాడు.
    "ఎందుకు అనవసరంగా అబద్దాలాడతారు? మీ చేతికి ఉన్న గడియారం వాళ్ళు కొన్నది కాదూ?"
    "అది అబద్దం. మీ వాళ్ళు గడియారం కొనుక్కోమని ఇచ్చిన డబ్బునీ నీ కోసరమే ఖర్చయిపోయింది. నీ జబ్బులో అది వాడేశాను. గడియారం నా డబ్బుతో కొనుక్కున్నదే." అన్నాడు రాజశేఖరం.
    "కట్టుకున్న పెళ్ళానికి వైద్యం కూడా చేయించు కోలేరా. అదీ వాళ్ళ బాధ్యతేనా? ఎవరైనా వింటే నవ్వుతారు. వాళ్ళు గడియారం కొనుక్కుందుకు ఇచ్చిన డబ్బు మీరు మరోందుకు ఖర్చు పెట్టుకున్నా ఆ గడియారం వాళ్ళు కొన్నట్టే లెక్క." అంది సుభద్రమ్మ.
    'అవునన్నయ్యా ఆ గడియారం వాళ్ళు కొన్నట్టే లెక్క." అంటూ చలపతి వదిన గారిని సమర్ధించాడు.
    "అలా గట్టిగా చెప్పు అన్నగారికి."
    "నేను ఒప్పుకోను." అన్నాడు రాజశేఖరం.
    సుభద్రమ్మ "మీరు ఒప్పుకోక పోయినంత మాత్రాన వినేవాళ్ళు న్యాయం చెప్పలేరా. మీ మాటలు ఎవరూ నమ్మరు లెండి."
    రాజశేఖరం ముక్కు నులుపుకుంటూ "నా వాదన పూర్తిగా వినకుండానే మీరిద్దరూ ఏకమై నన్ను తప్పుబడితే ఎలా?" అన్నాడు.
    "ఏముందన్నయ్యా నువ్వు వాదించటానికి వదినకి జబ్బు చేస్తే వాళ్ళెందుకు ఆ ఖర్చు భరించాలి అది నువ్వు చెయ్యవలసిన పనే. ఆ డబ్బు నువ్వు ఎలా వాడుకున్నా ఆ గడియారం వాళ్ళు కొన్నట్టే లెక్క." అన్నాడు చలపతి.
    "అంతే ఇక మీరు నోరు మెదపకూడదు" అంది సుభద్రమ్మ.
    "నేను ఒప్పుకోను. అది ఏం జబ్బో తెలియకుండా నువ్వు సమర్ధించటం న్యాయం కాదు.
    చలపతి కొద్దిగా సర్దుకుని "పోనీ చెప్పు నీ వాదన" అన్నాడు.
    రాజశేఖరం "మొదటి పురుడు ఎవరైనా పుట్టింటి వాళ్ళే పోస్తారు అది లోక రివాజు. ఒప్పుకుంటారా?" కాదని మీ వదిన గార్ని అనమను" అన్నాడు.
    సుభద్రమ్మ భర్త వాదనకి కొంచెం వెనక్కి తగ్గినా "మీరు మాట మారుస్తున్నారు. ఇందాక జబ్బని అన్నారు. ఇప్పుడు పురుడు అంటున్నారు. ఒకవేళ అదే అయినా ఆ పురుడు మా వాళ్ళే పోస్తామని అన్నారు. మీరే అభ్యంతరం చెప్పి పంపలేదు" అంది.
    "అభ్యంతరం చెప్పానంటే మీవాళ్ళ పరిస్థితులు అలా వున్నాయి మీ నాన్నగారు పోయిన కొత్త రోజులు. అసలే కష్టంలో వున్నారు. అందుకని ఎలాగూ వాళ్ళిచ్చిన డబ్బు ఉంది కదా అని అలా ఖర్చు చేసేశాను" అన్నాడు రాజశేఖరం.
    సుభద్రమ్మ చిన్న బుచ్చుకుంది. ఆమెకు అభిమానం పీకల దాకా ముంచుకు వచ్చింది.
    'అయితే నీదే రైటు , ఒప్పుకున్నా" అన్నాడు చలపతి.
    సుభద్రమ్మ కు చిన్నతనం వేసింది. "అదేమన్న మాట మా తమ్ముడు స్వయంగా వచ్చి అడగలా చెప్పండి. నామీద ప్రమాణం చేసి చెప్పండి అడిగాడా లేదా?"
    "అడిగాడనుకో."
    "అడిగినప్పుడు పంపకపోవడం మీ పొరపాటు. మావాళ్ళు మీరనుకున్నంత లేనివాళ్ళు కారు. వాళ్ళకి తినటానికి, ఒకరికి పెట్టటానికి కావల్సినంత ఉంది నిండు కంచం ముందు కూర్చొని అబద్దం చెప్పకండి" అంది. ఆమె కంఠం అభిమానంతో బొంగురు పోతోంది.
    "అది సరే అన్నయ్యా. వాళ్ళు తీసుకు వెళ్ళటానికి వచ్చారా లేదా?" అన్నాడు చలపతి.
    రాజశేఖరం బోనులో నిలబడ్డ దోషిలా "వచ్చారనుకో" అన్నాడు.
    "వాళ్ళు తీసుకు వెళ్తాం అన్నారా?"
    "అన్నారానుకో."
    "మరి వాళ్ళ తప్పేం లేదు గదా. వాళ్ళ పరిస్థితులు బాగున్నా ఒగున్నా అవి మనకి అనవసరం పంపకపోతే బాధ్యత వాళ్ళది కాదు. అనక ఆ విధంగా చూసిన వదిన మాటే నెగ్గింది." అన్నాడు చలపతి.
    సుభద్రమ్మ "చూడు ఎలా మాట తిప్పుకున్నారో. ఏనాడో జరిగిన సంగతులు గదా. జ్ఞాపకం ఉంటాయా అనుకున్నారు పాపం."'
    "మంచికి పొతే చెడు ఎదురయిందంటారు దీన్నే. మీవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు గదా అని ఆ సొమ్ము ఈ విధంగా ఖర్చు చేశాను. మీ వాళ్ళు పోసినట్టే అనుకోరాదా?" అన్నాడు రాజశేఖరం.
    "మీవన్నీ అల్లరి పనులు. కాకపొతే" అప్పుడే ఈ మాట చెప్పి ఉంటె రాత్రికి రాత్రి పెట్టె బేడా సర్దుకుని ఈ మనిషిని లక్ష్య పెట్టకుండా తమ్ముడితో వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళేమీ దరిద్రంతో అడుక్కు పోవడంలా. మనకంటే బాగానే తింటున్నారు. బాగానే ఉంటున్నారు. అనవసరంగా మీరేమీ వారి మీద జాలి దల్చనవసరం లేదు" సుభద్రమ్మ ఉక్రోషంగా అన్నది.
    "లేకపోతె నీ మీద ప్రేమ పట్టలేక నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక ఆపేశాను అనుకుంటున్నావా?..... అన్నాడు రాజశేఖరం.
    సుభద్రమ్మ సిగ్గుపడుతూ "ఫర్లేద్దురు అనవసరపు మాటలు మాత్రం అనకండి. ఎవరైనా వింటే బాగుండదు" అంది.
    చలపతికి వదినగారు పరిహసంతో ఆరంభించి చివరికి కోపతాపాలు ప్రదర్శించటంతో నవ్వు వచ్చి అది దాచుకుందుకు తల బాగా కిందకు దించేసి నవ్వు ఆపుకున్నాడు.
    రాజశేఖరం రెట్టించేసరికి చలపతి తీర్పు చెబుతూ "ఇందులో ఎవరికీ దురుద్దేశాలు లేవు గాని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పంపకపోవడం నీదే తప్పు. అంతగా వాళ్ళు ఖర్చు భారించుకోలేరని నువ్వు అనుకున్నప్పుడు ఆమెను అక్కడే వుంచి ఆ ఖర్చు నువ్వే ఇంకో రూపంలో ఆమెకు పంపవచ్చుగా. అలా వాళ్ళని అల్లరి చేసింది చాలక పైగా ఈ గడియారం తగూని నీకు అనుకూలంగా తిప్పుకోవటం మాత్రం బాగులేదు" అన్నాడు.
    "అలా చెప్పు. మా బాగా చెప్పావు" అంటూ సుభద్రమ్మ భర్తని కొరకొరా ఓసారి చూసి "ఇక చాలు గాని మీ ప్రతాపాలు భోజనం చెయ్యండి. మరిది భోజనం పూర్తయి పోవచ్చింది." అంటూ హెచ్చరించింది భర్తని.
    రాజశేఖరం కొద్దిగా వుడుక్కున్నాడు.
    చలపతి కొంచెం పెద్దగానే నవ్వేశాడు.
    భోజనం పూర్తిచేసి అన్నదమ్ములిద్దరూ వరండాలో కూర్చున్నారు. రాధ తమలపాకుల పళ్ళెం తో మెల్లగా వచ్చి స్టూలు మీద అ పళ్ళెం ఉంచి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS