Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 6


    నన్ను బంధించిన వాళ్ళూరుకోరు. హత్య కేసులో నన్నిరికించడానికి ప్రయత్నిస్తారు. కాసేపట్లో యిక్కడికి పోలీసులు రావడం తథ్యం.
    పోలీసులకు నేనేం చెప్పాలి? అసలు నేనిక్కడ యెందుకున్నానంటే ఏం చెప్పాలి?
    మొదటిసారిగా తప్పుచేసినందుకు నన్ను నేను నిందించుకున్నాను. నిందించుకుని లాభంలేదుకదా....గదిలోంచి బయటపడడానికి ఏమైనా వీలుంటుందేమోనని చూశాను. నేను వేసిన తలుపు గడియ తీసేశాను. తలుపులు మళ్ళీ మళ్ళీ లాగిచూశాను. లాభంలేదు. తలుపు రావడంలేదు. బయటపడడాని కింకో దారిలేదు.
    నా ప్రయత్నాల్లో నేనుండనే వున్నాను. ఈలోగా గది తలుపులు తెరుచుకున్నాయి. అనుకున్నట్లే పోలీసులు వచ్చారు.
    "ఇన్ స్పెక్టర్! ఈ గదిలో నేనుండడం నా దురదృష్టం. ఈ హత్యతో నాకెలాంటి సంబంధమూలేదు. అంతా నేను నిజమే చెబుతాను. మీకు సహకరిస్తాను. నన్ను హంతకుడిగా భావించవద్దు....." అంటూనే యిన్ స్పెక్టర్ కి లొంగిపోయాను.
    
                                     5

    రామావతారం తళుకుబెళుకులతో నన్ను లొంగదీసుకుంది. నాకు స్త్రీలంటే బలహీనత వుంది. అది ఆధారంగా చేసుకుని ఆమె నానుంచి డబ్బు గుంజుతూ తన అవసరాలు గడుపుకునేది.
    వివాహమైనా ఆమె నన్ను వదిలిపెట్టలేదు. నా భార్యకు మా పూర్వ పరిచయం గురించి చెబుతానని బెదిరించి తన యింటికి రప్పించుకుంటుంది. నా దగ్గర డబ్బూ గుంజుతుంది. తన మోజు తీర్చుకుంటుంది.
    ఆరోజు నన్నామె ఏడింటికి పిలిచింది. తొమ్మిదిదాకా నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు వెడితే హంతకుడు నన్ను తెలివిగా గదిలో బందీచేశాడు.
    ఇదీ నేను పోలీసులకు చెప్పిన కథ ఈ కథను కొంత వరకూ పోలీసులు నమ్మారు. రామావతారం అడక్కపోయినా నేనామెకు కొంత డబ్బిస్తూ వుండేవాడిని. ఆ డబ్బునామె బ్యాంకులో వేసుకునేది. నేనిచ్చానన్న మొత్తాలూ, తేదీలూ-ఆమె పాస్ బుక్ తేదీలతో సరిపోయాయి.
    నేను చెప్పిన కథలో నిజముంది. ఎటొచ్చీ వంచన చేస్తున్నవారు తారుమారయ్యారు. చనిపోయిన మనిషిపై నిందవేయడం తప్పని నాకు తెలుసు. కానీ నేను చేస్తున్న తప్పు నా బ్రతుకుని నిలబెడుతుంది. చనిపోయిన వారి కోసం బ్రతికున్న వారు జీవితాన్ని త్యాగం చేయడం బుద్ధి హీనత అనిపించుకుంటుంది.
    నా కధకు ప్రచారం వచ్చింది. మామగారింట్లోనూ, రాధకూ కూడా నేను పోలీసు కస్టడీలో వున్న విషయం తెలిసింది. మామగారు మండిపడి నా ముఖంకూడా చూడనన్నారుట. రాధ నన్ను బెయిలుమీద విడిపించుకునేందుకు వచ్చింది.
    "మొత్తంమీద నా మంచితనానికి పరీక్ష పెడుతున్నారన్నమాట!" అంది రాధ మొదటిసారిగా నన్ను చూడ్డానికి వచ్చినపుడు.
    నేను సిగ్గుతో తల వంచుకున్నాను.
    "రామావతారం గురించి ముందే నాకెందుకు చెప్పలేదు?"
    "చివరివరకూ నీనుంచి దాచగలననుకున్నాను....."
    రాధ నిట్టూర్చి-"హత్య మీరు చేయలేదుకదూ!" అంది.
    "నేను చేయగలనని నమ్ముతున్నావా?" అన్నాడు దీనంగా.
    "నేనుండగా మరో స్తీతో సంబంధం పెట్టుకోగలరనీ నమ్మలేదు నేను....."
    చెళ్ళున కొట్టినట్లయింది నాకు - "నేను నిజంగా హత్య చేయలేదు...."
    "అది న్యాయవాదులు చూసుకుంటారు. నేను చేయగలిగిందల్లా బెయిల్ మీద విడిపించి మిమ్మల్నింటికి తీసుకుని వెళ్ళడం!" అంది రాధ.
    "థాంక్స్ రాధా!" అన్నాను.
    "నా డ్యూటీ నేను చేస్తున్నాను. థాంక్సెందుకు?"
    నేను మాట్లాడలేదు.
    మేము ఇంటికి వెళ్ళాం.
    రెండు రాత్రులూ-ఒక పగలూ తర్వాత మళ్ళీ ఇల్లు చేరాను నేను. ఆ యిల్లు నాది. నాదంటూ ఒక ఇల్లుంచుకుని నాది కాని ఒక యింటికి వెళ్ళడంవల్ల నేనిప్పుడు హత్య కేసులో అనుమానితుణ్ణి.
    "నాకు మిమ్మల్ని చూస్తే చాలా జాలిగా వుంది-" అంది రాధ.
    "ఇప్పుడు నీకు నామీద జాలేస్తోందా?" ఆశ్చర్యం గానూ, ఆనందంగానూ అడిగాను.
    "పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఒక్క మగవాళ్ళ విషయంలోనే నిజమనుకున్నాను. ఎందుకంటే నేను వయసులో వున్నా అందమైన స్త్రీని. వివాహానికి ముందు మగవాళ్ళను చూస్తే అప్పుడప్పుడు రకరకాల ఊహలు పుట్టేవి. వివాహమైనాక మనసంతా మీరే నిండిపోయారు. కలలోకూడా పరాయి పురుషుడిపై తప్పుడు ఊహరాదు నాకు. నిత్యం యెందరో సినీ హీరోలను, ప్రపంచశ్రేణి ఆటగాళ్ళను-టీవీల్లోనో, సినిమాల్లోనో, సభల్లోనో చూస్తూంటాను. కానీ పొరపాటునకూడా వాళ్ళలా ఎవరినీ మీ స్థానంలో ఊహించుకున్న సందర్భాలు నాకు లేవు. అది పాతివ్రత్యమని నేను భావించడంలేదు. స్త్రీకి సహజమని అనుకుంటున్నాను. స్త్రీ జీవితంలో స్థిరత్వాన్ని కోరుతుంది. రక్షణను కోరుతుది. ఆమె కోర్కెలు ఒక వలయానికి చుట్టూ తిరుగుతాయి. పురుషుడి విషయంలో అలా కాదని నేను విన్నాను....." రాధ ఆగింది.
    ఆమె చెప్పబోయేదేమిటో నాకర్ధం కాలేదు కానీ నేనిపుడు అపరాధిని. రాధ దృష్టిలోనే కాదు, న్యాయ స్థానం దృష్టిలోకూడా!
    రాధ మళ్ళీ ప్రారంభించింది-"ఈ లోకంలో పురుషుడివంటి స్త్రీలూ వుంటారని రామావతారం నిరూపించింది. ఆమె వలలో మీరు పడడం మీ దురదృష్టం. అందుకే నాకు మీరంటే జాలిగా వుంది...."
    "థాంక్స్ రాధా-నీనుంచైనా నాకు రవంత జాలి దొరికింది...."
    రాధ నా మాటలు వినే మూడ్ లో లేదు. ఆమె యింకా చెప్పుకుపోతోంది-"ఈ భూమ్మీద స్త్రీ పుట్టుక ఎందుకు? తన వాళ్ళను అర్ధం చేసుకుని లాలించడానికీ-తప్పులు చేయబోయే వాళ్ళను వారించడానికీ.....!అందుకే భగవంతుడామెను ప్రేమమయిని చేశాడు. అటువంటి స్త్రీ జాతికి మాయని మచ్చగా నిలిచిన రామావతారం వంటి ఆడదాని కీ లోకంలో జీవించే అర్హతలేదు. మీరామెను హత్యచేసి వుంటే నేనానందించి వుండేదాన్ని...."
    నేను ఇబ్బందిగా ఫీలయ్యాను. రామావతారాన్ని రాధ తప్పుపట్టి తిడుతోంది. రామావతారంలో తప్పులేదనీ ఆ తప్పు నాదనీ నాకు తెలుసు కాబట్టి ఆమె తిట్లన్నీ నాకు తగులుతున్నాయి.
    "నేనామెను చంపలేదు-" అన్నాను.
    "అసలేం జరిగిందో మొత్తమంతా మీరు నిజమే చెప్పారుకదూ!"
    "రాధా! నిజమొక్కటే యిప్పుడు నన్ను రక్షించగలదని నాకు తెలుసు. అబద్దం చెప్పలేను....."
    "మీకోసం ప్రత్యేకంగా డిటెక్టివ్ కిల్లర్ ని రప్పిస్తున్నాను. ఆయన మిమ్మల్ని తప్పకుండా రక్షించగలడు...."
    "డిటెక్టివ్ కిల్లర్?!" అన్నాను ఆశ్చర్యంగా.
    నేనాయన పేరు విన్నాను. ఆయన వయసు ముఫ్ఫై దాటింది. పెళ్ళి చేసుకోలేదు. తన జీవితాన్ని నేర పరిశోధనకే అంకితం చేశాననీ, వివాహమందుకు ప్రతిబంధకమనీ అంటాడాయన.
    ఆయనలో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే-పరిశోధనకు దిగేక మొత్తం వివరాలన్నీ లాగేస్తాడు. తను కనుగొన్న వివరాలన్నీ పత్రికలకు తెలియజేస్తాడు. ఏ కేసుకైనా ఆయన్నాహ్వానించే ముందు పెద్దమనుషులన్నవారు ఆలోచించుకోవాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS