Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 6

 

    పెళ్ళి నిర్విఘ్నంగా-సారధి అన్నట్లు-ఏ ఆడంబరమూ లేకుండా జరిగింది. తమ కులంగాని అమ్మాయిని చేసుకున్నాడని, శుభలేఖలు పంపినా, సారధి బంధువులు గానీ, తల్లిదండ్రులుగానీ రాలేదు. అతని తమ్ముడు మాత్రం వచ్చి ఆ మూడు రోజులూ ఉండి పోయాడు.
    ఆర్తి ఎం. బి. రిజల్ట్సు వచ్చాయి. పేపర్ సారథే తెచ్చాడు. ఆమె ఫస్టు క్లాసులో పాసయిన సంగతి చెప్పి, అభినందనలు చెప్పాడు. అప్పటికే వాళ్ళిద్దరు కాచి గూడాలో వేరే ఇల్లు తీసుకుని ఉంటున్నారు.    
    "మీతో పెళ్ళిజరిగిన వేళావిశేషం. లేకపోతే క్లాసు రావటమేమిటి?"
    "అంతా నా ప్రయోజకత్వమనుకోకు. నీ కృషీ ఉంది. రేపు నా రిజల్స్టు వస్తే నేనూ అలాగే అంటాను. మరి, ఇంతకూ ప్రాక్టీసు చేస్తావా?"
    "చెయ్యమంటారా?"
    "అది నీ ఇష్టంగానీ, నన్నడిగితే నేనేం చెప్పను?"
    "మీ ఉద్దేశ్యం చెప్పటానికేం?"
    "నాకు ఇష్టమే! ఇంత వైద్య విజ్ఞానాన్ని నీ మస్తిష్కంలో దాచేసుకుని చేసేది సున్న. దేశస్థాయిలో మనం చేసేది స్వల్పమైనా, ఏ కొంత చేసినా చాలు. ఇటువంటి విషయాల్లో నా ఆశీర్వచనం, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటాయి."
    "కృతజ్ఞురాల్ని."
    "కృతజ్ఞురాలివే! కానీ, డబ్బు అవసరం ఉంటుంది కదూ? నేనెంత ధనవంతుడినో నీకూ తెలుసు!"    
    "మా నాన్నను అడుగుదాం!"
    "మీ నాన్ననా? వద్దు, ఆర్తీ!"
    "అడిగితే ఏం? మీరు కట్నం గూడా తీసుకో లేదు..."
    "ప్చ్! అదంతా ఇప్పుడెందుకుగానీ, మరెక్కడైనా ప్రయత్నిద్దాం!"    
    "ఎవరిస్తారు? పోనీ, మీకిష్టం లేకపోతే అప్పుగా తీసుకుందాం!"
    "అప్పుగానా?"
    "ఊఁ! తరవాత నెమ్మదిగా తీర్చవచ్చు."
    సారధి ఏమీ అనలేదు.
    ఆ రోజే వెళ్ళి గోవిందరావును అడిగింది. ఆయన అప్పుగా ఇవ్వనన్నాడు. "ఇన్ని లక్షల ఆస్తి ఉంది. ఇంకా సంపాదిస్తున్నాను. ఇవన్నీ మీకోసం కాకపోతే, నా కెందుకమ్మా! నా కన్నబిడ్డవు. నీకు అప్పుపెట్టి ఋణదాతగా మసలలేను."
    "ఆయన ఒప్పుకోరు, నాన్నా!"
    "అప్పుగానే తీసుకుంటున్నట్లు చెప్పు. రహస్యం పొక్కనివ్వకుండా ఉంటే సరి."
    సారధి ప్రోనోటు వ్రాసి ఇస్తానన్నాడు. గోవిందరావు అలాగే వ్రాయించుకుని, సారధికి తెలియకుండా ఆర్తికి ఇచ్చి "నువ్వే చింపేసి కాల్చెయ్యి. సారధికి తెలియనివ్వకు" అన్నాడు.
    గోల్కొండకు వెళ్ళే రోడ్డుకు కుడివైపున, సిటీకి సుమారు అరమైలు దూరంలో స్థలం అమ్మకానికి వస్తే, అప్పుడెప్పుడో ఇల్లు కట్టించటానికని కొన్నాడు గోవిందరావు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, బంజారా హిల్సులో కట్టి ఉన్న మేడ కొన్నాడు. ప్రస్తుతం ఆ స్థలం ఖాళీ గానే ఉంది. అయిదారెకరాల వైశాల్యం ఉన్న ఆ జాగా, ఆస్పత్రి నిర్మాణానికి బాగుంటుందని ఆర్తికి ఇచ్చాడు. సారధికి అది నచ్చింది.
    పదిహేను రోజుల్లో ఆస్పత్రికి, ఆ ఆవరణలోనే వాళ్ళిద్దరు ఉండటానికి చిన్న మెడకు రెండిటికీ ప్లాన్లు తయారయ్యాయి. ఓ శుభముహూర్తాన పునాదులు తీయించి నిర్మాణం ప్రారంభించారు కూడాను.
    త్వరలోనే ఆర్తి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు, ఆమె చేతనే ప్రారంభోత్సవం చెయ్యబడింది. అన్ని ఆధునిక సౌకర్యాలు - డిస్పెన్సరీ, ఆపరేషన్ థియేటర్, లాబొరేటరీ, ఎక్స్ రే రూమ్ - ఇవి కాక స్త్రీలకూ, పురుషులకూ ప్రత్యేకమైన వార్డులు అన్నీ అయ్యాయి. అటు ఇల్లు కూడా అయింది. ఇవన్నీ అయ్యేసరికి నాలుగు నెలలు పట్టింది.
    చుట్టూ కాంపౌండ్ కూడా కట్టబడింది. అదివరకు ఆ చోటులో అడ్డదిడ్డంగా మొలిచిన మొక్కలు పీకేయించి వేపచెట్లు నాటించింది. ఇంటిముందు, హాస్పిటల్ ముందు చిన్నపూలతోటలు, హాస్పిటల్ నుండి ఇంటికీ, కాంపౌండ్ మెయిన్ గేటు వరకూ (ఇంటి నుండి కూడా) సిమెంటుతో చేసిన సన్నని కాలిదారి, కార్లు, రిక్షాలు, ఏమైనా వస్తే ఉంచటానికి పార్కింగ్ ప్లేస్ -అదంతా ఏదైనా ఎత్తు ప్రదేశం నుంచి చూస్తే అందమైన బొమ్మరిల్లులా ఉంటుంది.
    సారథి ఈ నిర్మాణంలో ఏమీ కలగజేసుకోలేదు.
    ఆస్పత్రి ప్రారంభమైనరోజున, "నేను ఈ గుమాస్తాగిరీ చెయ్యటం నీకూ, మీ నాన్నకూ తల వంపులుగా ఉండవచ్చు, ఆర్తీ!" అన్నాడు.
    "నే నెన్నడూ అలా అనుకోను. మీ ఆడంబర రహితమైన భావాలతో నాకు ఏకీభావం ఉన్నది."
    "నిన్న మీ నాన్నగారి మాటల్లో అదే భావం కనిపించింది. ఆయన కంపెనీకి మేనేజ్ మెంట్ చెయ్యమన్నాడు."
    "ఏమన్నారు?"
    "ఇంకా ఏమీ చెప్పలేదు. చెప్పను కూడా! మరొక నెల గడవాలి!"
    రెండు ఆపరేషన్ కేసుల్లో ఆర్తి విజయం సాధించింది, మొదటిసారే అయినా, అసలు ఆమె కాలేజీలో ఉండగా కూడా ప్రాక్టికల్సు బాగా చేసేది, తోటి విద్యార్ధులు, లెక్చరర్సు నుంచి భవిష్యత్తు ఉందంటూ మెచ్చుకునేవారు. ఆమెకు ఫస్టుక్లాసు రావటానికి ప్రాక్టికల్సే చాలవరకు కారణం.
    ప్రజల్లో ప్రచారం జరుగుతున్న కొద్దీ, ఆమె దగ్గిరికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూంది. డబ్బు విషయంలో, అంత ఖచ్సితమేమీ చెయ్యక పోవటంవల్ల మధ్యతరగతి వాళ్ళు, కార్మిక వర్గాల్లో చాలా వరకూ ఇటే వస్తున్నారు. ఆపరేషన్ కేసులు కూడా ఎక్కువ శాతం విజయం పొందుతూండటం వల్ల అదీ కొంత పేరు తెచ్చింది.
    ఈ సందర్భంలో సారధి ఆమె కొక సలహా ఇచ్చాడు.
    "మధ్యతరగతి వాళ్ళు, ఏ రోజు కా రోజు పొట్టకోసం తిప్పలు పడేవాళ్ళనుండి నువ్వు డబ్బు విషయంలో ఎంత ఉదారంగా ఉన్నా ఫర్వాలేదు. కానీ ఈ ఉదారత్వంహద్దులు మీరకూడదు. డబ్బు ఇవ్వగల ప్రతివాళ్ళ దగ్గిరా ప్రతి పైసాతో సహా వసూలు చెయ్యవలసిందే. లేకపోతే అందరినీ తేలికగా వదిలేస్తే ఈ వైద్యశాల నడవటం కష్టం. మందుల ఖర్చులూ, కాంపౌండర్లకు, నర్సులకు జీతాలూ-ఇంకా ఎన్నో ఉంటాయి. వాటన్నిటికీ మనకు డబ్బెవరిస్తారు? కనీసపు ఖర్చులైనా గడవాలి కద."
    "ఏమోనండి! నా కలా అడగా లనిపించదు. అయినా ఎవరు డబ్బివ్వగలవారో, ఎవరు ఇవ్వలేనివారో మన కెలా తెలుస్తుంది?"
    "ఆమాత్రం తెలుసుకోలేవా?"
    "పోనీ, మీరు మేనేజ్ మెంట్ చెయ్యకూడదూ?"
    "నేను? నేనా?"
    "మీరే! లోకం పోకడ నాకన్నా బాగా అర్ధం చేసుకున్నవారు. మీకీ సంగతులన్నీ బాగా తెలుసు. అదీగాక మీరు నా దగ్గిర ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది."
    సారథి దేన్నీ అంత త్వరగా తేల్చుకోడు. ఆలోచించి చెబుతా నన్నాడు.
    సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వచ్చాక తన నిర్ణయం తెలిపాడు.
    "మీ నాన్నగారుకూడా ఆయన ఆఫీసులో గుమాస్తాగా ఉండటం వద్దంటున్నాడు. నేను నీ కోరిక ప్రకారమే చేస్తాను. ఒకరి కొకరం తోడునీడగా పరస్పరం సహకరిస్తూ సాగిపోవటమే నేనూ అభిలషిస్తున్నాను. నా కీ అవకాశం కల్పించినందుకు థాంక్స్!"
    అప్పటినించీ సారధి ఆ వైద్యశాలకు సారధ్యం వహించాడు.
    రోజు లెంతో మధురంగా గడుస్తూండేవి. సారధి లిటరేచరువాడు కనక తెలుగు, ఆంగ్ల సాహిత్యంలో అతనికి ఎంతో పరిజ్ఞానం ఉంది. ఆర్తికి కూడా సాహిత్యమన్నా, లలిత కళలన్నా అభిమానమే! తీరిక వేళల్లో ఇద్దరూ దేన్నో ఒకదాన్ని చర్చిస్తూ గడిపేవారు. అది విసుగనిపిస్తే సారధి పాటలు పాడి వినిపిస్తాడు. లేకపోతే ఏ సినిమాకో, పార్కుకో, టాంక్ బండ్ మీదికో, లేదా మరింకేదైనా వినోద కార్యక్రమానికో వెళుతూండేవారు. వీళ్ళతోపాటు అప్పుడప్పుడు వేణు, విశ్వం వచ్చి కలుస్తూండేవారు.
    మూడు సంవత్సరాలు మూడు రోజులుగా దొర్లాయి.

                                
    ఒక రోజు పొద్దున -
    ఆస్పత్రి ఆవరణలో ఎవరిదో కారు ఆగింది. అందులో నుంచి ఒకామె దిగి నేరుగా ఆర్తి దగ్గిరికికన్సల్టింగ్ రూమ్ లోకి వెళ్ళింది. సారధి కనక ఆఫీస్ రూమ్ లో ఉంటే, ఆమె నలా వెళ్ళనిచ్చేవాడు కాదు. అందరిలాగే ఆమెను వరసలో కూర్చోబెట్టించి ఉండే వాడు. అతను లోపల రాత్రి విడిపించుకు వచ్చిన మందుల పార్సెళ్ళను విడదీయించి, ఆర్డరిచ్చిన వన్నీ వచ్చాయో లేదో చూస్తున్నాడు.
    ఆ వచ్చినామె కొంచెంసేపు ఏకాంతంగా మాట్లాడాలని ఆర్తిని కోరింది.
    "క్షమించండి! ఇప్పుడు వీలు ఉండదు. ఒంటి గంటకు లంచ్ టైమ్ లో వస్తే..."
    "ఒక్క పదిహేను నిమిషాలు చాలు. ఎక్కువ అవసరం లేదు." ఆమె అంది.
    "మీకన్నా ఎంతో ముందు వచ్చినవాళ్ళు ఉన్నారు. ఈ క్షణాల్లో వచ్చి మీ పని కావాలంటే అది జరగని పని."
    "మధ్యాహ్నం మీరు తప్పకుండ ఇంట్లో ఉంటారా?"
    "ఎక్కడికీ వెళ్ళను. మూడు గంటలవరకూ ఉంటాను."
    ఆమె మధ్యాహ్నం వస్తానని వెళ్ళింది.
    మధ్యాహ్నం ఆర్తీ, సారథీ భోజనం చేసి, హాల్లో చదరంగం ముందేసుకుని, ఎవరు ఏ ఎత్తు వేస్తే తామే ఎత్తు వెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. అంతలో తోటమాలి రామదాసు వచ్చి ఎవరో వచ్చారని చెప్పాడు.
    "రమ్మను!" అని సారధివైపు మళ్ళి, "ఇందాకా మీతో చెప్పానే, ఆమె వచ్చిందేమో?" అన్నది.
    "నీ కన్నా అందంగా ఉంటుందా?" కొంటె ప్రశ్న.
    ఆర్తి పంటితో కింది పెదవి బిగబట్టింది. "మీరే చూడండి. అదిగో, వచ్చింది."
    ఆమె వచ్చింది. ఆర్తికి కోపం వచ్చిందని సారధి భావం. అతను నవ్వుతున్నాడు.     
    ఆమె వస్తూ, "నమస్కారం" అన్నది. ఆర్తి తిరిగి నమస్కారం చేసింది. సారథి వెనక్కు చూశాడు.
    ఆమె నిశ్చేష్ట అయింది.
    సారథి స్తబ్దుగా కూర్చుండిపోయాడు. అతని నోటి నుండి అప్రయత్నంగా "ను....వ్వా....?" అన్న రెండు అక్షరాలు వెలువడ్డాయి.
    ఆ వచ్చినామె అక్కడ ఉండలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి చరచరా వెళ్ళిపోయింది. సారధి లేచి దర్వాజా వైపు పరిగెత్తాడు. అప్పటికే ఆమె కారు గేటు దాటుతున్నది.
    ఆర్తికి ఇదేమిటో బోధపడలేదు. సారధి వెనక నిల్చున్న ఆమెకు, "భగవాన్! మళ్ళీ ఎందు కీ పరీక్ష?" అన్న మాటలు వినపడ్డాయి.
    "ఎవరండీ ఆమె? మీకు తెలుసా?"
    "ఆఁ....ఊఁ... లేదు.... తెలీదు, ఆర్తీ!" సారధి నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతనేదో దాస్తున్నాడని ఆర్తి గ్రహించింది.
    తాను వెళ్ళేముందు మామూలుగా అడిగింది, "హాస్పిటల్ కు వస్తారా?" అని.
    కిటికీలో నుంచి దూరాన కనిపించే గోల్కొండ పైభాగాన్ని చూస్తున్నవాడల్లా వెనక్కు తిరిగి, "ఇవాళ నా మనసు బాగులేదు. నువ్వు వెళ్ళు, ఆర్తీ!" అన్నాడు.
    ఆ రోజే కాదు. మరొక రెండు రోజుల వరకూ అతను అదె స్థితిలో ఉన్నాడు. గదిలోనుంచి ఎక్కడికీ వెళ్ళలేదు. ఇదేమిటో ఆర్తికి అంతుపట్టలేదు.
    మూడవ రోజు సారధికి ఒళ్ళు వెచ్చబడింది. ఆర్తి తనే స్వయంగా ఇంజక్షను చేసింది. ఆమె కళ్ళలోకి జాలిగా చూస్తూ, "నన్ను మన్నించు, ఆర్తీ!" అన్నాడు.
    అతని గిరజాల జుత్తు వేళ్ళతో సవరిస్తూ, "ఏం చేశారని? మీరీ విచారాలన్నీ మాని ప్రశాంతంగా ఉండండి" అంది లాలనగా, ఆ సంఘటన మరిపించాలని.
    రాత్రి రెండుసార్లు నిద్రలో, "నేను ద్రోహిని...." అంటూ కలవరించాడు.
    ఆ తెల్లారి అతను మామూలుగా ఉన్నాడు. తుఫాను వచ్చేముందు వాతావరణంలా, అతనిలో ప్రశాంతత కనిపించింది. అతని వదనం చూసి ఆర్తి భయపడింది. చూపుల్లో ఏదో మార్పు ఉంది. కానీ, అతనెంతో సహజంగా మాట్లాడాడు.
    ఆ రాత్రి గడిచింది.
    ఉదయం సారధికి బదులు ఒక ఉత్తరం మాత్రమే ఉన్నది.
    అది చదివి గుండె లవిసిపోయేలా ఏడ్చింది ఆర్తి. గోడకేసి తల బాదుకుంది. ఏం చేసినా ఏం లాభం? సారధి ఎటో వెళ్ళిపోయాడు.
    అప్పటినించీ ఒక రకమైన మూగజీవితానికి అలవాటు పడింది. చిరునవ్వుతో వెలిగిపోయె ఆమె ముఖమండలం గంభీరంగా మారింది. ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఎందుకంటే తన ఉత్తరంలో, తను చేసిన తప్పిదానికి పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తం లభించాక తిరిగి వస్తానని వ్రాశాడు. సాధ్యమైనంత త్వరలో రావటానికే ప్రయత్నిస్తానన్నాడు.
    ఆ ఆశే ఆమెను జీవింప చేస్తున్నది.

                            *    *    *

    ఆర్తి కల చెరిగింది. కన్నీటితో మేజా చాలావరకు తడిసింది.
    ఆమె గొణుక్కుంటున్నది. "తప్పకుండా తిరిగి వస్తానన్నారు.....ప్రభూ....ఎప్పుడు? ఎన్నడు, ప్రభూ?"

                                     6

    వేణు వచ్చి రెండు మూడు రోజులైనా, ఎప్పుడు సునీతను కలుసుకుందామన్నా, ఎవరో ఒకరు, ఏదో ఒక కార్యక్రమం ఉంటూనే ఉండేది. వచ్చీపోయె ఖాతాదార్లు, స్నేహితులు. రెండు మూడు రోజులకు గానీ తెరిపిన పడలేకపోయాడు. ఆ రోజు గోవిందరావుకు బదులు తను వెళ్ళాడు ఆఫీసుకు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS