'సభ్యతా , సంస్కారాలు మూర్తీభవించినట్లున్న అతడిని చూస్తె ఎవరైనా ఆకర్షించ బడతారు. మరి తను విన్నదానికి స్వయంగా చూస్తున్న దానికి పోలికే లేదే?' మధన పడసాగింది . ఏదో అర్ధం కాని అశాంతి అసంతృప్తి తీవ్రంగా కల్గాయి. మరోసారి శాంతి మాటలు, మనసులో మార్మ్రోగాయి.
తిరుపతి కాలేజీలో క్రొత్తగా ఫైనల్ లో చేరిన శాంతికి, సంధ్య కి మంచి స్నేహం ఏర్పడింది.
ఏదో మాటల సందర్భంలో , అంతకు ముందు తను చదివిన కాలేజీ కబుర్లు చెప్తూ రాజా, ,మంజుల ప్రేమాయణాన్ని గురించి చెప్పింది.
'ఆ రాజాని చూస్తె అలాంటి వాడని ఎవరూ అనుకోరు సంధ్యా! పాపం, మంజుల ఎంత కృంగి పోయిందో తెలుసా! తన అందంతో వాక్చాతుర్యంతో ఆడపిల్లల్ని, అద్భుతంగా వశపరచు కుంటాడని ఉట్టికపటి స్వార్ధ పరుడని, అతడి ఆకర్షణ మహా ప్రమాదకర మైనదని, నాముందు వాపోయేది. ఐనా, పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం నాకూ చాలా అన్యాయంగా అన్పించింది. మంజుల కూడా అలా తొందరపడి తిరిగుండాల్సింది కాదనుకో. అమ్మాయికే లేని భయం, అబ్బాయికి మాత్ర మెందుకుంటుంది ? కాని ఒకటి మాత్రం ఒప్పుకోవాలి సంధ్యా! మంజులకి తను చాలా అందంగా ఉంటానని గర్వం. అదే నాకు నచ్చేది కాదు. సౌందర్యానికి సౌమ్యత తోడయి నపుడే రాణిస్తుంది.' శాంతి పెద్ద లెక్చర్ దంచింది. సంధ్య పెద్ద పెద్ద కళ్ళలో కుతూహలం ప్రతిఫలించింది. 'మరి మంజుల పెళ్లయిందా? రాజా ఏమయ్యాడు?' 'ఎవర్నో డాక్టర్ ని చేసుకుందట. రాజా సంగతి తెలీదు కాని, రాజా ఫ్రెండ్ రౌడి రామకృష్ణ అని చెప్పానే, అతగాడు మాత్రం, కెమిస్ట్రీ లో డింకీ కొట్టాడు అబ్బ! ఆ రామకృష్ణని చూస్తె నాకెంత భయం వేసెదను కున్నావ్. పాపం, నన్నెప్పుడూ ఏమీ అన్లేదనుకో' శాంతి మాటలు. సంధ్య మనసులో, రాజా రామకృష్ణ లని ఆడపిల్లల పాలిటి రాక్షసుల్లాగా చిత్రించాయి. అదే భావం యిప్పటి దాకా చెరగలేదు.
తీరా, రాజా సుమిత్రక్క మరిది అని తెలిసినపుడు చాలా ఆశ్చర్యం కల్గింది, ఒకసారి అతడిని చూడాలనే కుతూహలం తీవ్రమైన కోర్కె కలిగాయి. సుమిత్రక్క , తమ ఊరు వచ్చినప్పుడల్లా రాజా గురించి చాలా కబుర్లు చెప్పేది. ఎంతో ఆసక్తిగా వినేది సంధ్య. కాని తను చిత్రించుకొన్న రాజాకి, సుమిత్ర మాటల్లో ప్రత్యక్షమయ్యే రాజాకి, హస్తినుషకాంతరం కన్పించి తికమక పడేది. రెండింటి కి సమన్వయము కుదిరేది కాదు. కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ చిటికే లో సాల్వ్ చేసే సంధ్య కి , ఈ రాజా స్వభావం మాత్రం, మిస్టరీ గానే మిగిలిపోయింది. ఇప్పుడు రాజాని చూసిన తర్వాత ఇంకా చిక్కు పడింది. సుమిత్రక్క, ఇదివరలో ఒక్కసారి, రాజా, మంజుల కలిసి తిరిగేవారని, ఆ విషయం మాత్రం, తనకు నచ్చేది కాదని మాత్రం అంది. మళ్లీ ఎప్పుడూ, ఆ సంగతి ఎత్తలేదు.
* * * *
సారధి , రాజా ఆఫీసుకి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనాలు ముగించి తీరిగ్గా సుమిత్ర డిందు గలీబు మీద ఎంబ్రాయిడరీ చేస్తోంది. సంధ్య కేం తోచలేదు. నెమ్మదిగా సుమిత్ర దగ్గరకు చేరి, తన కాలేజీ కబుర్లు చెప్పమని వేధించింది. అసలు బాధ రాజా గురించి ఏమన్నా క్రొత్త విషయాలు తెలుస్తాయని. సుమిత్ర కబుర్లు చెప్తూ , మధ్యలో రాజా విషయం వచ్చి యధాలాపంగా అన్నట్లంది. 'రాజా సౌందర్యాన్ని ఆరాధిస్తాడు. ఎటొచ్చి , ఆ ఆరాధన అందమైన ఆడపిల్లల పట్ల అభిమానంగా రూపొందడం దగ్గరే వస్తుంది చిక్కు. అతడి స్వభావం పాదరసం లాంటిది. దేన్నీ స్థిరంగా అంటి పెట్టుకోలేడు. చైతన్య స్రవంతి లా గలగల పారే , అతడి ఆకర్షణా వాహిని కి ఎదురు నిలబడ దలచు కున్నవారు, అందులో కొట్టుకు పోవాల్సిందే కాని, నిరోధించలేరు. తమాషా ఏంటంటే , అతడ్ని మాత్రం, ఎవరి ఆకర్షణా ఎక్కువకాలం బంధించలేదు.' బహుశా , సుమిత్రక్కయ్య మంజుల విషయం మనసులో పెట్టుకొనే అలా అని వుంటుందని సంధ్య గ్రహించింది. 'తామరాకు మీద నీటి బొట్టు మనస్తత్వమా?' ఎందుకో యీ జవాబు తనకి తృప్తి కల్గించలేదు.
'రాజా యిలాంటి వాడా!' సంధ్య అంతరంతరాల్లో ఎక్కడో గుచ్చు కున్నట్ల న్పించింది. రాజా సామీప్యంలో అర్ద్రమై , మంచులా కరగుతున్న మనసు, శాంతి మాటల పునః స్మరణ లో , సుమిత్ర అభిప్రాయంతో ఘనీభవించి కఠినం గా మారింది. 'దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా, తన చుట్టూ ఆడపిల్లలు తిరుగుతారని భ్రమ పడుతున్నాడేమో! తనలాంటిది కాదని నిరూపించి, అతడి అహంకారాన్ని దెబ్బ తియ్యాలి!' దృడంగా అనుకొంది.
పాపం, సంధ్య! తన మనసు నావరించు కొన్న నీలి నీడల్ని భేదించె ప్రయత్నం లో , తన మనసుని తన అధీనం లో వుంచుకోవాలనే తాపత్రయం తో, రాజాని ద్వేశిస్తున్నాట్లు పోరాబడింది. నిజం కాకూడదని మనసు బలంగా కోతుకున్నప్పుడు, అదే పచ్చి నిజంగా బుజువయ్యే ప్పటికి ఆ అఘాతానికి తట్టుకోలేక మనుషులందరూ , అలానే ప్రవర్తిస్తారేమో!
* * * *
"హల్లో రాజా!' ఎవరో అమాంతంగా పేవ్ మెంట్ మీదే తన్ని కౌగలించు కున్నంత పని చేసేసరికి , రాజా ఉక్కిరిబిక్కిరయ్యాడు. రామకృష్ణ ఎదురుగా నిల్చొని నవ్వుతున్నాడు. రాజాకి ఆశ్చర్యంతో, ఆనందాతిశయం లో నోట్లోంచి చప్పున మాట ఊడిపడలేదు.
"ఏరా, ఆఫీసరు అయ్యేప్పటికి , యీ గుమస్తా గాడు, నీకంటి కానట్లేదా!' దబాయించాడు , కోపం నటిస్తూ.
'రామకృష్ణా!' చప్పున భుజం మీద చేతులేస్తూ, రాజా ఎదురుగా ఉన్న 'తాజ్' లోకి లాక్కుపోయాడు, రామకృష్ణ కి , యింకో మాట మాట్లాడే అవకాశ మివ్వకుండా.
'ఊ! ఇప్పుడు చెప్పు. ఇన్నాళ్ళూ ఏం చేస్తున్నావు? ఇప్పుడెక్కడ ఉద్యోగం.' పెసరట్టు తింటూ అడిగాడు రాజా.
'కెమిస్ట్రీ పరీక్షలో మూడుసార్లు డింకీ' కొట్టాను. కాలేజీ కి గుడ్ బై కొట్టాను. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ లో క్లర్కు గా ఉద్యోగం చేస్తున్నాను.' సీరియస్ గా, ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నంత ఠీవి గానూ అంటూ, 'ఇపుదుఇద్దరు పిల్లలు, భార్య రత్నం యస్.యస్, ఎల్.సి. తప్పింది.' వోరగా రాజాని చూస్తూ అన్నాడు. చివరి మాటలకి మొదట రాజా త్రుళ్ళిపడి రామకృష్ణ కేసి చూశాడు. మహా గంబీరంగా ఉంది. గట్టిగా నవ్వేసి , భుజం మీద చరుస్తూ , 'రాస్కెల్! నాకు తెలీకుండా పెళ్లి చేసుకుంటే పట్టుకు తన్ననూ.' అన్నాడు. రామకృష్ణ కూడా నవ్వేశాడు.
ఇద్దరూ బస్ స్టాప్ వైపు నడుస్తున్నారు. 'పెళ్ళీ, గిళ్ళీ ఏం లేదా?' రాజా నవ్వుతూ అడిగాడు. 'ముందు ప్రేమా, గీమా పూర్తీ చెయ్యి నియ్యి. ' సిగరెట్ వెలిగిస్తూ జవాబిచ్చాడు. 'ఏమిటి కధ' రాజా కళ్ళెగరేశాడు. రామకృష్ణ స్వరం గంబీరంగా, అదోరకమైన మార్ధవాన్ని నింపుకుంటూ పలికింది. 'తెగిన గాలి పటంలా ఎటుపడితే అటు తిరిగే , నన్ను ఒక క్రమపద్దతి లో, మనిషి గా తీర్చింది పరిమళ. తను మా ఆఫీస్ లో , నా కొలీగ్. ప్రేమకి పవిత్రమైన నిర్వచనాన్ని యిచ్చింది రా తను' పరిమళ నామస్మరణ తో రామకృష్ణ ముఖం ప్రకాశ వంతమయింది. రాజా విస్మయంగా చూశాడు 'ఎంత మారిపోయాడు రామకృష్ణ! ఇది వరకులా వివాహం తన స్వేచ్చ కాటంకమావుతుందనే బాధ, మచ్చుకైనా కన్పించడం లేదు. పై పెచ్చు కొన్ని నియమాలకు, కట్టు బాట్లకు మనస్పూర్తిగా కట్టుబడ్డ ఆత్మ తృప్తి ముఖంలో ప్రతిబింభిస్తుంది.' పైకి మాత్రం అన్నాడు 'ఒరేయ్! నువ్వు నిజంగా అలా ఫీలవుతున్నావా?'
'ఏమోరా! ఈసారి అనుభూతి క్రొత్తగా, హృదయం అదోరకంగా స్పందిస్తున్నట్ల న్పిస్తోంది.' అమాయకంగా ముఖం పెట్టి సగం చిలిపిగా అన్నా, నిజాయితీ ధ్వనించింది. ఇద్దరూ, ఒకరి ముఖాలొకరు చూసుకొని ఫక్కున నవ్వేశారు. ఎదురుగా వస్తున్న వయ్యారి చిడి ముడి పాటుతో, తీక్షణ వీక్షనాలతో 'ఆడపిల్ల కన్పడితే చాలు, బుద్ది వక్రిస్తుందెందు కో ?' గట్టిగానే అనేసి రయ్ మంటూ దూసుకుపోయింది. ఇద్దరికీ ,ఒక నిమిషం తర్వాత కాని అర్ధం కాలేదు. 'ఈ అమ్మాయెవరో మంజులకు నకలు లాగా ఉందిరా, రాజా! ఏం ఆడపిల్లల్రా భగవంతుడా, రోడ్డు మీద కళ్ళెత్తి చూడటానికి, హాయిగా నవ్వుకోటానిక్కూడా స్వతంత్రం లేదా!' రామకృష్ణ వాపోయాడు.
* * * *
'వదిన వాళ్ళు లేరా?'
నవలలో లీనమై పోయిన సంధ్య తలెత్తి చూసింది. ఎదురుగా రాజా ప్రక్కన ఎవరో క్రొత్త వ్యక్తీ, చప్పున పుస్తకం మూసి లేచి నిలబడుతూ జవాబిచ్చింది. 'లక్ష్మణ రావు గారింట్లో డిన్నర్ కి వెళ్లారు.' రాజాకేం చెయ్యాలో తోచలేదు. సంధ్యతో తనేక్కువ మాట్లాడలేదు, యింతవరకూ. పరిచయం చేస్తే ఏమను కుంటుందో? చెయ్యక పొతే అసభ్యతన్పించు కుంటుంది. 'నా ఫ్రెండ్ రామకృష్ణ ఆంధ్రా బాంక్ లో వర్క్ చేస్తున్నాడు.' కొంచెం భయంగానే పరిచయం చేశాడు. సంధ్య ముఖం లోని ప్రశాంత తను చూసాక, కొంచెం కుదుట పడి , 'తను , మా వదిన గారి చెల్లెలు అదే ......కజిన్....బి.యస్ సి. ఫస్ట్ క్లాసు . పేరు సంధ్య.' రామకృష్ణ కేసి తిరిగి అన్నాడు. రామకృష్ణ! పేరు ఎక్కడో విన్నట్లుంది. మనసులో ఏదో జ్ఞాపకం, గజిబిజి గా మెదిలింది. చటుక్కున గుర్తొచ్చింది. మనిషి ని చూడబోతే, మాంచి అందంగా , గంబీరంగా వున్నాడు. 'విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి' మనసులోనే గొణుక్కుంది. ముగ్గురూ బొమ్మల్లా కూర్చున్నారు కాసేపు. కులాసాగా, హాయిగా ఉన్న రాజాని చూస్తుంటే సంధ్య కి , రాజా మనసు నొప్పించి చూసి ఆనందించాలని కోర్కె కల్గింది. మనసులో ఏ మూలో రామకృష్ణ తో తను చనువుగా మెలిగితే, రాజా ఎలా రియాక్టవుతాడో చూడాలన్న కుతూహలం లేకపోలేదు.
కాఫీ, టిఫిన్ అమరుస్తూ అంది సంధ్య 'మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వెళ్లలేదా?' ఏడిపించబుద్దేసింది సంధ్యకి. రామకృష్ణ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
'కే....కెమిస్ట్రీ పోయింది.' నెమ్మదిగా గొణిగాడు.
'అయ్యో! నాకు తెలీకడిగాను' నొచ్చుకుంటూన్నట్లంది.
"మీకు నవలలు చదవడం యిష్టమేనా?" మరో పిడుగు పడింది.
పుస్తకాల్ని చూస్తూనే తలనొప్పి తెచ్చుకునే రామకృష్ణ రాజా కేసి దిగులుగా చూశాడు. 'ఏం చెప్పను' అన్నట్లు. రాజాకి సంధ్య వాలకం ఆశ్చర్యంగా ఉంది. అసలు 'రాజా' అనే శాల్తీ అక్కడున్న సంగతే గుర్తులేనట్లు ప్రవర్తిస్తోంది. ఇద్దర్నీ చూస్తూ నవ్వుకొంది సంధ్య. వాతావరణానికి యిహ మార్పు అవసరమని అప్పుడు నిర్ణయించు కొంది.
'అబ్బ! ఎవరు చూసినా క్రికెట్ గేం గురించే మాట్లాడుతుంటారు. నాకైతే ఎలా ఆడతారో కూడా సరిగ్గా తెలీదు. మీకు తెలుసను కుంటాను. చెప్తారా?' అమాయకత ఉట్టి పడేట్లు అడిగింది. తన ఫేవరేట్ ఫీల్డు రావడంతో రామకృష్ణ ఉత్సాహం పుంజుకుని వివరించడం మొదలు పెట్టాడు. అంతే, కబుర్లు ఏకధాటిగా యిద్దరి మధ్యా దొర్లిపోయాయి. పటౌడీ దగ్గర నుంచి దేవానంద్ దాకా -- రాజా చలనం లేనివాడిలా కూర్చుండి పోయాడు. రామకృష్ణ కి గంటలు నిమిషాల్లా పరిగెత్తితే, రాజాకి నిమిషాలు యుగాల్లా గా అన్పించాయి. సంధ్యకి....? రామకృష్ణ , కెమిస్ట్రీ లెక్చర్ లీలలు ఏక్షన్ తో సహా వర్ణిస్తూ , 'ఇంతలో మా కాలేజీ బ్యూటీ మంజుల లేచి నిల్చుని....' అంటూ గతుక్కు మన్నవాడి లా నాలిక్కరచు కున్నాడు. సంధ్య చటుక్కున రాజా వైపు చూసింది.
