భలేవాడివే రాఘవులూ నేనుంటే మాత్రం కట్టుకున్న పెళ్ళాం తో సమానం అవుతానా?"
"ఎందుకవరు? అంతకంటే ఎక్కువే మీరు" మీ కంటే కట్టుకున్న పెళ్ళాం బాగా చూస్తుందా?"
కట్టుకున్న పెళ్ళాం అయితే లోకం దృష్టిలో గౌరవం, మర్యాద ఉంటాయి. నాతొ ఉంటె ఏమీ లోకపోగా ఉన్న గౌరవం కూడా పోతుంది." అంది లిల్లమ్మ.
"ఎందమ్మగారు మీ మాటలు. అయ్యగారు పెళ్ళి చేసుకుంటే ఆడాళ్ళని ఏం సుఖ పెట్టగలరు." అన్నాడు రాఘవులు.
'అదంతా మనకి అనవసరం. ఆయనికి అన్నగారున్నారు. ఇతర బంధు బలగం ఉన్నది. వాళ్ళంతా పరువుగా బ్రతుకుతున్నారు. ఈయన కూడా పెళ్ళి చేసుకుని పిల్లా పాపలతో సుఖపడాలని వంశ వృద్ది కావాలని వాళ్ళు కోరుకుంటారు. అందులో తప్పులేదు."
"మీరు ఎన్నయినా చెప్పండి. సంసారం అంటే మాటలు కాదు. ఈయన గారికి తన వొళ్ళు తనకి తెలియదు." అన్నాడు రాఘవులు.
లిల్లమ్మ పేలవంగా నవ్వింది. ఆ నవ్వులో మునుపటి చురుకుదనం లేదు. "మీ అయ్యగారు పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండటం నీ కిష్టం లేదా" అంది.
లిల్లమ్మ ధోరణి రాఘవునికి స్పష్టంగా అర్ధం కాలేదు. చలపతి పెళ్ళి చేసుకోవటం గురించి ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని అతను ప్రయత్నించాడు గాని ఆమె ఏమీ తేలలేదు. కొద్దిగా అతడ్నే సమర్ధించింది కూడాను. ఏవిటో ఆవిడగారి ధైర్యం! చలపతి పెళ్ళి చేసుకుని ఈమెని వదిలెయ్యడని ఏవిటి నమ్మకం? చలపతి ఆలోచనా పాలోచనా లేని మనిషి అయినా నమ్మ తగని మనిషి మాత్రం కాడు అని లిల్లమ్మ ధైర్యం కాబోలు.
అదేఅడిగేశాడు కూడాను. "అయ్యగారు పెళ్ళి చేసుకుంటే మిమ్మల్ని సరిగ్గా చూస్తాడంటారా?"
లిల్లిమ్మ మొహం కోపంగా పెట్టింది. "అతనోక్కరేనా నాకు గతి. ఆమాట కొస్తే నేనే అతగాడ్ని అనేక సందర్భాలలో అదుకోన్నాను తెలుసా" అంది.
రాఘవులు చెవులు గోక్కుంటూ "తెలియకేం ? అందరికీ తెలుసు " అన్నాడు.
"మరింకేం?' ధీమాగా అంది లిల్లమ్మ ఆమె లోలోపల ఆ లోటుని దాచుకోనేందుకు ప్రయత్నిస్తుందని రాఘవులికి అనుమానం కలగలేదు. లిల్లమ్మ చాలా నిర్లిప్తంగా . ధైర్యంగా కనబడింది.
చలపతి లిల్లిమ్మ ధోరణికి పౌరుషంతో ఈ ప్రయాణానికి తలపెట్టాడు. తీరా బండి ఎక్కిం తర్వాత చలపతి కి ఓ ఆలోచన వచ్చింది. అన్నయ్య ఎలాగూ నాలుగు కబుర్లు చెప్పి ఈ సంబంధం "చెయ్యాలని చూస్తాడు. ఒకవేళ చూడగానే ఆ అమ్మాయి బాగుండి తనకు నచ్చిందనుకో. పెళ్ళి చేసుకుంటే ఈ లంపటం లో దిగబడితే తాను నిభాయించగలడా? తను స్వేచ్చగా తిరగటానికుంటుందా? లిల్లిమ్మ ఆ మాటే అంది. అయితే అమెది అసూయ. అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. తాను పెళ్ళాడితే ఆమె పట్ల అశ్రద్ధ చూపిడతానని అమెకు భయం. తనెం అంత మూర్కుడు కాడు. లిల్లమ్మ అనుకున్నట్టుగా అనాలోచితంగా పనులు చేసేవాడూ కాడు ఆమెకు తన పట్ల గల అభిమానం కంటే తనకి ఆమె పట్ల గల అభిమానం తక్కువ కాదు.
బండిలో రద్దీ ఎక్కువగా లేదు. తాను పైన బెడ్డింగు పరుచుకుని పడుకున్నాడు. కింద బెంచీ మీద ఎవరో దంపతులు కూర్చున్నారు. వాళ్ళకి ఇద్దరు సంతానం. ఆ పిల్లలతో వాళ్ళు ముచ్చట లాడుతున్నారు. వాళ్ళకి ఎదురుగా కూర్చున్న ముసలాయన తెగ ముచ్చట పడిపోతున్నాడు. అయన వాళ్ళకి ఓ స్టేషన్లో బిళ్ళలు కొనిచ్చాడు. ఇంకో స్టేషన్లో పళ్ళు కొనిచ్చాడు. "మధ్యమధ్య వాళ్ళని తన దగ్గర కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నాడు.
ముసలాయన వాళ్ళని ఆరాలు తీస్తున్నాడు.
"మీరేం చేస్తుంటారండి."
"నాకు ఎల్.ఐ.సి లో ఉద్యోగం" అన్నాడా యువకుడు గర్వంగా.
"ఎంతోస్తుంది జీతం!"
"నెలకి అయిదు వందలు వస్తుందండీ"
ఇలా వాళ్ళ కుటుంబం గురించో ఎంతో సంతృప్తి తో అడుగుతున్నాడాయన. అతగాడు అంతకంటే గర్వంగా చెబుతున్నాడు.
చలపతికి లిల్లమ్మ ఎద్దేవా చెయ్యటం గుర్తుకు వచ్చింది. అన్నయ్య రాసిన ఉత్తరం జేబులో ఉంది. అది లిల్లమ్మ కూడా చదవనే చదివింది. వంశ గౌరవం కోసరం, వంశ వృద్ది కోసరం పెళ్ళి చేసుకోవాలిట. అన్నయ్య కింతవరకు మొగ సంతానం లేదు. ఇక కలుగుతారనే నమ్మకమూ లేదు. వదిన గారికి ఆరోగ్యం సరిగా లేకపోతె ఆపరేషను చేయించేశారు. ఆమెకు ఇక సంతానయోగం లేదు. తనయినా పెళ్లి చేసుకుని మొగ సంతానం పొందక పొతే వంశం అంతరించి పోతుందిట. అన్నయ్య ఇలా చాలా రాశాడు. తనకు ముప్పయ్యేళ్ళు వచ్చాయి. ఇప్పటికైనా తాను ఓ ఇంటి వాడు కాకపొతే లోకులు అతడ్ని కాకులు పొడిచినట్లు పొడుస్తున్నారట" అని కూడా అన్నయ్య రాశాడు. వదిన ప్రోద్భాలమే అయి వుంటుంది. తనవైపు సంబంధం గనక ఆమె అన్నగారి మీద ఒత్తిడి తెచ్చి ఉంటుంది.
కింద బెంచీ మీద దంపతులు వాళ్ళలో వాళ్ళు పరాచికాలు ఆడుకుంటున్నారు. పిల్లలు ముందున్న ముసలాయనతో ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే తనకి అలాంటి సంసార జీవితం గడపాలని ఆసక్తిగా ఉంది. అయితే వాళ్ళు, వాళ్ళు అనే మాటలు గుర్తుకు వస్తుంటే సంసార జీవితం అంత కష్టమైందా అని భయమూ వేస్తుంది....
తను పదిహేను సంవత్సరాల వరకూ ఈ అన్నయ్య దగ్గర పెరిగాడు. అంటే తండ్రి పోయిన తర్వాత ఏ మూడు సంవత్సరాలో అన్నయ్య దగ్గర పెరిగాడు. ఆ తర్వాత తన దారి తాను చూసుకున్నాడు. అన్నయ్య తనను ఈ ఊళ్ళో ఫాన్సీ షాపులో చేర్చాడు. నెలకి పది హీను రూపాయల జీతం మీద. తన దగ్గర ఉంటె సరిగ్గా చదువుకోవటం లేదని ఇక్కడ చేర్పించాడు. అక్కడ కొన్నాళ్ళు పని చెసిం తర్వాత తనకు స్నేహాలు ఎక్కువయి తన జీవితం ఇంకొక రకంగా సాగిపోయింది. ఈ పదిహేను సంవత్సరాల జీవితంలో నూ తన అనుభవాలు చాలా కఠినమైనవి. ఇతరు లెవరూ వాటిని సహించలేరు. తనను లిల్లమ్మ తెగిన గాలి పటంతో పోల్చింది. వాళ్ళ దృష్టిలో తాను సంసార జీవితానికి పనికి రానని.
కింద కూర్చున్న దంపతులు సన్నగా మాట్లాడు కుంటున్నారు. మధ్యమధ్య కిలకిలా నవ్వుకుంటున్నారు. స్టేషన్ వచ్చినప్పుడల్లా ఆమె గారంగా ఏదేనా అడుగుతుంటుంది. ఆమె అడిగిందల్లా అతను కొంటున్నాడు.
"ఏమైనా జీవితం అంటే అదే జీవితం" అని పిస్తుంది చలపతికి.
వాళ్ళు ఆ తర్వాత స్టేషను లో దిగిపోయారు"
తాను దిగవలసిన స్టేషను వచ్చేవరకూ చలపతికి మనసులో ఖచ్చితమైన నిర్ణయం అంటూ చెయ్యకపోయినా పెళ్ళికి అనుకూలంగానే ఎక్కువగా ఆలోచించాడు. ఒక్కసారి పెళ్ళికి అనుకూలంగా ను, కొంతసేపు పెళ్ళికి వ్యతిరేకంగా నూ ఆలోచించాడు. ఈ ఆలోచనలు అప్పుడప్పుడు అతనికి విసుగ్గా అనిపించాయి. ఇలాంటి సున్నితమైన మాట గురించి ఆలోచించటం అతనికి అలవాటు లేదు. తగాయిదాలు, తక్కులాటలు వాటి గురించి ఆలోచించాడెమో గాని ఇలాంటి వాటి గురించి ఎన్నడూ ఆలోచించలేదు. లాభం అయినా నష్టం అయినా ముందు పని జరిగిపోవాలి తర్వాతనే ఆలోచించటం. ఇలాంటి మొరటు ఆలోచనలు చేసే మెదడు ఇవాళ రైల్లో కొత్త రకంగా ఆలోచించింది. లిల్లమ్మ మరీ బొత్తిగా చెడి పోయినవాణ్ణి చేసి చులకనగా మాట్లాడింది. ఆమె మాటలు గుర్తుకు వస్తుంటే పౌరుషం వస్తుంది. మరీ తీసి పారేసింది చులకనగా. తనకి ఓ సంసారం, అందం ఇలాంటివి తప్పవని ఆమె అభిప్రాయం ఆమె మాటలు గుర్తుకు వస్తుంటే అతనిలో పెళ్ళికి అనుకూలంగా పట్టుదల పెరుగుతుంది. కేవలం అన్నగారి ఉత్తరం ప్రకారమే అయితే తను అసలు పెళ్ళి చూపులకి ఒప్పుకునేవాడే కాదు. తనకా ధ్యాసే ఉండేది కాదు. అన్నగారి కంటే అభిమానం లేక కాదు గాని అతని మాట విని తీరాలనే పట్టుదల తనకి లేదు. తన జీవితం ఇలా తయారయి నందుకు అతనే భాద్యుడు. " అనే బాధ అతనికి ఉంది. అన్నగారి ఉత్తరంలో ఆ ధోరణే వ్యక్తం అయింది. "నిన్ను చిన్నప్పుడే స్వంతత్రంగా జీవించటానికి వదిలేశాను. అందుకే ఇప్పుడు చాలా విచారిస్తున్నాను. మా చేతులతో నిన్ను ఇంటి వాడ్ని చేసి నీ జీవితం ఓ దారికి తీసుకు రావాలని నా తాపత్రయం." అని రాశాడు.
వీధి తిరిగే మొదలోకి రిక్షా తిరిగేసరికి వీధి గుమ్మంలో ఓ అమ్మాయి పూలు గొంటూ కనిపించింది. నిడుపైన జడ. కోలా మొహం తాపీగా పూలు కొంటోంది. ఆమె జడ ముందుకు వాలి పువ్వుల మీద పడుతోంది. ఆమె శరీరచ్చాయ పచ్చగా మెరుస్తుంది.
గుమ్మం ముందు రిక్షా ఆగిన ఆమె తలెత్తి చూడలేదు. చలపతి సన్నగా దగ్గుతూ రిక్షా దిగేసరికి ఆమె తలెత్తి చూసి చట్టున ఒడిలో పువ్వులతో గబగబా లోపలికి పారిపోయింది. కంగారుగా. రిక్షా డబ్బులిచ్చి చలపతి లోపలికి అడుగు వేసే సరికి సుభద్రమ్మ నవ్వు మొహంతో ఎదురొచ్చింది. చలపతిని ఆమె పోల్చుకోగలిగింది.
