"దట్స్ మై ప్లెజర్!" అని అక్కణ్ణించి బయల్దేరాను.
దొరికిన ఆటో వెంటనే ఎక్కేశాను. గమ్యస్థానంలో దిగాను.
నా జాగ్రత్తలు నేను తీసుకుంటూ ఎవరికంటా పడకుండానే రామావతారం యింటి దొడ్డిగుమ్మం చేరుకున్నాను.
తలుపులు దగ్గర గా వేసివున్నాయి. తోయగానే తెరుచుకున్నాయి.
రామావతారం ఉంటున్నది చిన్న బంగళా యిల్లు. అదామె భర్త బాబాయిది. అందువల్ల చవగ్గా వచ్చింది వాళ్ళకి. ఇంటి చుట్టూ ప్రహరీగోడ. ఇంటి ముందూ వెనకాకూడా పెద్ద పెద్ద ఫలవృక్షాలున్నాయి. ఇప్పుడు నేను చుట్టూ తిరిగి ముందుకు వెళ్ళి ముఖద్వారంవద్ద తలుపు కొట్టినా రోడ్డుమీద వాళ్ళకు కనబడను. అయినా నేను రాజమార్గానెన్నుకోలేదు. మరొకరెవ్వరూ రాడానికి వీలులేకుండా దొడ్డితలుపు వేసేశాను.
ఇంటి వెనుక తలుపుకూడా తీసే వుంది.
నెమ్మదిగా యింట్లో ప్రవేశించాను.
ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు. రామావతారం ఇంట్లో ఉండేవుండాలి. కానీ యెక్కడా మసులుతున్న జాడ లేదు.
ఇల్లంతా చీకటిగాకూడా వుంది.
ఒక్క నిముషం తటపటాయించి తడుముకుంటూ దీపం వేశాను. నేనున్న గది ప్రకాశవంతమయింది.
కళ్ళు నులుముకున్నాను.
అక్కడున్న నిశ్శబ్దం నన్ను కలవరపరుస్తోంది. అయినా రామావతారంమీద నాకున్న మోజు నన్ను ముందుకే నడిపించింది.
పడక గదిముందాగాను. గది తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. బయటనుంచి గడియపడి వుంది.
ఆ గడియ చూడగానే నాకు స్ఫురించింది.
నేలబారుగా వున్న ఆ గడియ మనం లాక్ చేయడం మరిచిపోయామంటే-తలుపులు దగ్గరగా వేసినప్పుడు నేలమీదకు పడిపోయే అవకాశముంది. అప్పుడు ఎవరైనా వచ్చి తలుపులుతీస్తే తప్ప గదిలో వున్నవాళ్ళు బందీకిందే లెక్క....
ఈ గడియలో ఇబ్బందిగా వుందని రామావతారం నాకు చెప్పింది. ఇంట్లో మేమిద్దరమే వున్నప్పటికీ ఎందుకైనా మంచిదని గదితలుపులు వేయబోయాను. అప్పుడామె నన్నోసారి ఆ గడియ గురించి హెచ్చరించింది.
మేమిద్దరం లోపలుండగా ఆ గడియ పడిపోయిందంటే ఇంకేమైనా వుందా?
ఆ గడియ యే విధంగా పడుతుందో బయటనుంచి ఆమె చూపించింది.
ఇప్పుడా గడియను చూడగానే అసలు విషయం నాకు స్ఫురించింది.
హడావుడిలో తలుపు, గడియపడిపోయి రామావతారం పడకగది లోపల వుండిపోయుంటుంది., ఏడింటి కల్లా నేను వస్తానని ఎదురుచూసి వుంటుంది. ఎప్పటికీ నేను రాలేదు. ఇంట్లో ఇంకెవ్వరూ లేరు. విసుగుతో కళ్ళుమూసుకుంటే నిద్రపట్టేసి వుంటుంది.
అందుకే యిల్లంతా నిశ్శబ్దంగా వుంది.
నేను నెమ్మదిగా గడియతీసి తలుపు తోశాను.
లోపలకూడా చీకటి. అవతల గదిలో నేను వేసిన దీపపు వెలుతురీ గదిలోకి యే మాత్రమూ ఉపయోగపడ్డం లేదు. రామావతారం నిద్రపట్టడంకోసం లైటార్పేసి వుంటుంది.
నేను గదిలో అడుగుపెట్టి స్విచ్ బోర్డుకోసం తడమసాగాను.
ఇంతలో గదిలో అడుగుల చప్పుడు వినిపించింది. చెవులు రిక్కించాను.
రామావతారం పాదాల సవ్వడి మెత్తగా, మనోహరంగా వుంటుంది.
ఇప్పుడు నేను విన్నది ఆమె పాదాల చప్పుడుకాదు. అసలు నేనలాంటి చప్పుడు విన్నానా అన్న భ్రమకూడా కలుగుతోంది. ఎందుకంటే కొద్ది క్షణాలు మాత్రమే విన్నానా చప్పుడు....
స్విచ్ తలుపుకు పక్కనే వుండాలి. వెంటనే చేతికి దొరకలేదు. ఈలోగా నా చేతికి తగిలిందో యేమో గది తలుపు దగ్గరగా వేసుకుంది. గడియపడిన చప్పుడూ అయింది.
నాకు పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది.
ఇప్పుడు రామావతారంకూడా ఈ గదిలోనే వుంటే.....
మేమిద్దరం....ఒకే గదిలో....ఎవరో వచ్చి విడిపించేంతవరకూ బందీలుగా వుండిపోతాం. నా పరువుకు, రామావతారం జీవితానికీ తట్టుకోలేని దెబ్బ తగుల్తుంది.
ఈ విషయం రాధ వరకూ వెడుతుంది. అప్పుడామె నన్ను క్షమిస్తుందా? ఎందుకో ఆమె నన్ను తప్పక క్షమిస్తుందిస్తుందనే అనిపించింది.
మళ్ళీ తడుముకుంటూ మొత్తంమీద స్విచ్ పట్టుకున్నాను. ఒక్కసారి గదిలో ట్యూబ్ లైట్ వెలిగింది.
చీకటికి అలవాటుపడ్డ నా కళ్ళు వెలుగును భరించలేకపోయాయి. కళ్ళు నులుముకుని ముందుకు చూశాను.
మంచంమీద యెవరో దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు.
వాతావరణంలో చలిలేదు. అటువంటి సమయంలో దుప్పటి కప్పుకొని ఉక్కిపోవాలని ఎవరనుకుంటారు?
మంచంమీది వ్యక్తి రామావతారమేనని నేనూహించగలను ఆమె కప్పుకుని పడుకుందంటే-ఆరోగ్యంకానీ దెబ్బతినలేదుగదా....
తినబోతూ కూర రుచి అడగనేల?
గదిలో నేను, రామావతారం.....
గది తలుపులు గడియపడ్డాయి. బయట్నించి ఎవరైనా వస్తే తప్ప నేను బయట పడలేను. అలాగని యిప్పటి సమయం వృధాచేసుకోవడమెందుకు?
నేను లోపల్నుంచికూడా గడియ వేసి మంచందగ్గరకు నడిచి నేమందిగా "రామూ!" అన్నాను.
దుప్పటిలోని మనిషి నుంచి సమాధానంలేదు.
దుప్పటి కాస్త లాగాను.
రామావతారం!
ప్రశాంతంగా వుంది ముఖం.
"ఏయ్-యింత మొద్దు నిద్దరేమిటి? లే....లే...." అన్నాను.
ఆమె బదులివ్వలేదు. పూర్తిగా దుప్పటి లాగేశాను. ఏదో అనబోయి ఉలిక్కిపడ్డాను.
రామావతారం గుండెల్లోకి దిగి వుంది-ఒక బాకు! పిడిమాత్రం కనపడుతోంది. చుట్టూ రక్తం గడ్డకట్టి వుంది.
అంటే?
రామావతారం చచ్చిపోయింది. చచ్చిపోలేదు. చంపబడింది. అంటే హత్య..ఆమె నెవరో హత్యచేశారు.
గదిలో నేను, రామావతారం! రామావతారం హత్య చేయబడింది. నేనా గదిలో బందీని, ఎవరైనా వచ్చి తలుపులు తీస్తే తప్ప నాకు మోక్షంలేదు. అప్పుడు మాత్రం.....
నా వళ్ళు జలదరించింది.
రామావతారం హత్యకు నేను సంజాయిషీ యిచ్చుకోవాలి. అందరూ నేనే హంతకుడినంటే కాదని ఋజువు చేసుకోవాలి.
ఇప్పుడు రామావతారాన్ని చూస్తూంటే నాకు భయం వేస్తోంది. నా భవిష్యత్తంతా ఆమె హత్యతో ముడిపడి వుంది.
ఎవరామేను హత్యచేశారు? ఎందుకు చేశారు?
మళ్ళీ నా బుర్ర పనిచేస్తోంది. గదిలో అడుగుపెట్టినాక-నేను విన్న అడుగుల చప్పుడు భ్రమకాదు.
ఎవరో రామావతారంపై పగబట్టారు. ఆమెను చంపేశారు. అప్పుడు తెలిసింది-గది తలుపు బయటనుంచే గడియపడిందని, హంతకుడు గదిలో కూర్చుని అవకాశం కోసం యెదురుచూస్తున్నాడు. నేను తలుపుతీయగానే తను గదిలోంచి బయటపడి-బయటనుంచి తలుపు గడియవేశాడు.
ఇప్పుడు నాకు స్ఫురిస్తోంది. నేను తలుపు గడియ తీసినప్పుడు జాగ్రత్తగా పక్కకు పెట్టాను. అది మళ్ళీ క్రిందకు పడే అవకాశంలేదు. ఎవరో కావాలని నన్ను గదిలో బంధించారు.
