ఆర్తి అడ్డుపడింది. "కాదు, వేణూ! నిజానికి ఏ కేసూ లేదు.....కాని.....కాని.....బావ వెళ్ళవద్ధన్నారు....వద్దన్నారు ..." తల పక్కకు తిప్పి కళ్ళు మూసుకుంది.
"బావ? వచ్చాడా..... ఏడీ..... ఏడీ...." ఆత్రతగా అడిగాడు.
ఆర్తి శుష్కహాసం చేసింది. "రాలేదు, తమ్ముడూ! రారుకూడా నేమో? వేణూ! సరిగ్గా ఇదే రోజు-నవంబరు అయిదో తేదీ....... ఆయన వెళ్ళిపోయారు." ఆర్తి వెనక్కు వాలింది. ఆమె కళ్ళలోనుంచి రెండు అశ్రుబిందువులు క్రిందికి జారుతున్నాయి.
"అప్పుడే-మూడు సంవత్సరాలు?"
"అవును! ఎందుకో నాకీ శిక్ష, వేణూ! కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు."
"అక్కా!...." ఏదో అనబోయాడు.
"ప్చ్! ఆయన నా కిచ్చిపోయిన స్మృతులకు అడ్డుపడకు, వేణూ! దయచేసి వెళ్ళు!"
తన సోదరిని క్రుంగదీసే విషయం ఏమిటో వేణు ఎరుగును. నెమ్మదిగా లేచి దర్వాజా దగ్గరకు వెళ్ళి, "అక్కా! రేపు సాయంత్రం వస్తాను. ఎక్కడికీ వెళ్ళకు!" అని తలుపు దగ్గరగా వేసి పోయాడు.
ఆర్తి "ఊఁ!" అంది గానీ తనేమన్నదో ఆమెకే తెలీదు.
* * *
గోవిందరావుకు మొత్తం సంతానం ముగ్గురు. పెద్ద అమ్మాయికి పెళ్ళయింది. ఆర్తికి కూడా పెళ్ళయింది. మిగిలింది వేణు. ఆయన భార్య బతికున్న రోజుల్లోనే, పెద్దబిడ్డను తమ్మునికిచ్చి వివాహం చేసింది. ఆర్తి, వేణు అప్పటికి చిన్నవాళ్ళు. వేణు తరవాత మరొక పిల్లవాడు కలిగాడు కానీ ఇద్దరూ మరణించారు-తల్లీ, బిడ్డా.
గోవిందరావు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. ఆర్తి పెళ్ళి జరిగాక తల్లికూడా స్వర్గస్థురాలైంది. వేణుకూడా పెద్దవాడయ్యాడు కనక పెంపకం విషయంలో ఇబ్బంది అంటూ ఏర్పడలేదు.
ఆర్తి పెళ్ళి చాలా విచిత్రంగా జరిగింది. ఆమె కులాంతర వివాహం చేసుకున్నది.
అవి ఆర్తి ఎమ్.బి.బి.ఎస్. చదువుతున్న రోజులు. అప్పుడే ఆమెకు సారధి అనే అతనితో పరిచయమైంది. అతను ఎమ్.ఎ. పూర్తిచేసి, తాత్కాలికంగా గోవింద రావు ఆఫీసులో క్లర్కుగా చేరాడు. ఉద్యోగం చేస్తూ, మళ్ళీ లిటరేచరు పాసయి, ఏ కాలేజీలోనో లెక్చరరుగా చేరాలని అతని ఉద్దేశ్యం. సంగీతంలో కొద్దిగా ప్రవేశం ఉంది. పాటలు కూడా బాగా పాడగలడు.
ముందు వేణు అతనితో పరిచయం చేసుకున్నాడు, పాడతాడని తెలిసి.
అతను తీరికవేళల్లో -వాళ్ళు-అంటే వేణు, విశ్వంలతోనే కాలక్షేపం చేసేవాడు. అదిగాక వాళ్ళకు తెలీని విషయాలు చెప్పే ఉపాధ్యాయుడుగా కూడా అప్పుడప్పుడూ వ్యవహరిస్తుండేవాడు.
ఆ ఉద్యోగం చేస్తూనే అతను, చదువుకోవటమే గాక 'దిగంతాలకు పయనం' అనే నవలను వ్రాసి ప్రచురించాడు. అది వైజ్ఞానిక నవల. ఇద్దరు శాస్త్రజ్ఞులు ధ్రువాలదాకా వెళ్ళి, అక్కడి విశేషాలను ప్రజలకు ఎరుకపరచాలనే ఉద్దేశ్యంతో, చెరొక ధృవం వైపు బయలుదేరతారు. ఆ అన్వేషణలో వాళ్ళు కొంత వరకు విజయం సాధించగలిగి, తిరిగి వస్తూ ఎంత విషాద పరిస్థితుల్లో మరణించారో చాలా చక్కగా చిత్రించాడు.
అది వేణు తెస్తే ఆర్తి చూడటం తటస్థించింది. నవలలో శైలీ, కథా సంవిధానమూ ఆమెకు బాగా నచ్చాయి. వైజ్ఞానిక నవల కావటం వల్ల, సామాన్య ప్రజలు చదివి అర్ధం చేసుకోగల విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఎందుకో అతన్ని పరిచయం చేసుకోవాలనుకుంది. అక్క కోరిక విని, ఒక రోజు సాయంత్రం అతన్ని తీసుకు వచ్చాడు. పరస్పర పరిచయాలు జరిగిపోయాయి.
సారధి ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు. కళ్ళలో ఏదో మత్తు ఉండేది. నవ్వటం చాలా అరుదు. ఎంతో ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకసారి చిరునవ్వుమాత్రం నవ్వుతాడు. కళ్ళు ఎటో చూస్తుంటాయి. మాట లాడుతున్నా ఏదో యోచన.
సారధిలోని ఈ తత్త్వమే, అతనంటే ఓ విధమైన ఆకర్షణకు లోబడేటట్లు చేసింది ఆర్తిని. తనకు తెలియకుండానే అతనికి దగ్గరవుతూ వచ్చింది. రెండు మూడు రోజులకు ఒకసారి అయినా కలుసుకునేది. తోచిన విషయాన్నల్లా చర్చక్రింద మార్చి, సాధ్యమైనంత ఎక్కువ కాలం గడిపేది.
ఎమ్. బి. ఇంకొక సంవత్సరానికి అయిపోతుందనగా, ఆర్తి తెలుసుకుంది, తాను అతని పరిచయస్థురాలు మాత్రమే కాదని! తన మనసు ఎప్పుడూ అతని సమక్షాన్ని కోరుకుండే ఈ భావాన్ని ప్రేమ అనే రెండక్షరాల పదంతో నిర్వచిస్తారని అర్ధం చేసుకో గలిగింది.
సారధిమాత్రం ఈ ఊహలకే తావివ్వలేదు. ఆమె తనకు వేణులా, కేవలం స్నేహితురాలనే అనుకుంటున్నాడు. ఆమె తనను ప్రేమించిందన్న దృష్టే లేదు.
ఎమ్.బి. అయిపోతుండగా ఆమె పెళ్ళి ప్రస్తావన వచ్చింది. మనసులో మాట బైటపెట్టింది. సారధి కూడా పరీక్ష వ్రాశాడు ఆ సంవత్సరమే.
"సారధి? మన ఆఫీసులో సారధి?"
"అవును, నాన్నా!"
గోవిందరావు ముఖంలో ముడుతలు ఏర్పడ్డాయి. "కాని అది చాలా కష్టం, అమ్మా! అతను ఏమోగాని-అతని తల్లిదండ్రులు అంగీకరించరు!"
"ఎందుకు, నాన్నా?" వేణు అక్కడే ఉండటంచేత అడిగాడు.
"వాళ్ళు మన కులస్థులు కారు."
కులాలు వేరు. గోవిందరావు నచ్చజెప్ప చూశాడు. ఆర్తి పట్టువిడవలేదు. అతను కాకపోతే తనకు పెళ్ళే వద్దన్నది. విధిలేక గోవిందరావు ప్రయత్నం చేస్తా నన్నాడు.
తండ్రికన్నా ముందే వేణు ఇది చెప్పినపుడు సారధి ఆశ్చర్యపడలేదు. నిట్టూరుస్తూ, "నాకు పెళ్ళి చేసుకోవాలని లేదోయ్!" అన్నాడు.
"ఎందుకని?"
అతను మౌనం వహించాడు.
"అక్కయ్య ఏం చెప్పినా విననంటోంది." వేణు అన్నాడు.
"ప్చ్! చూద్దాం లేవోయ్!" వేణు మాటల్ని మధ్యలోనే తెంచేసి వెళ్ళాడు. ఆఫీసుకు వెళ్ళాక గోవింద రావు పిలిచి అదే చెప్పాడు.
"వాళ్ళ అమ్మ మరణించిననాటినుండీ వాళ్ళిద్దర్నీ ఎంతో గారాబంగా పెంచాను, సారథీ! మా పెద్దమ్మాయి కన్నా, వేణుకన్నా ఆర్తికే నా దగ్గర చనువు. నువ్వు బాగా ఆలోచించు, సారథీ! కాదంటే ఏదో అఘాయిత్యం చేస్తుంది."
"నేను ఒకసారి ఆమెను కలుసుకున్నాక ఏదైందీ చెబుతాను." అప్పటి కెలాగో తప్పించుకున్నాడు. సాయంత్రం గోవిందరావు స్వయంగా కార్లో వెంట బెట్టుకుని తీసుకువెళ్ళాడు. వాళ్ళింటికి వెళ్ళాక ఆర్తి అతన్ని టాంక్ బండ్ మీదికి షికారు తీసుకువెళ్ళింది.
"మీరు చాలా పొరపాటు చేశారు. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుంటే మీ భవిష్యత్తు ఇంకా సుఖమయంగా ఉండవచ్చు!"
"ఇంతకన్నా నాకే సుఖాలూ అవసరం లేదు. ఒక సారి ప్రేమించటం అంటూ జరిగాక మళ్ళీ మనసు మార్చుకోవటమనేది అసంభవం."
"నేను మీకు ఏ విధంగానూ తగను."
"అలా ఎందుకనుకుంటున్నారు?"
"కులాలంటే నా కంతగా పట్టింపు లేకపోయినా, సమాజంలో మీకు ఉన్న స్థానం వేరు, నా స్థానం వేరు."
"అంటే?"
"అంటే - మీరు కాబోయే డాక్టరు. నేను ప్రస్తుతం మామూలు గుమాస్తాను."
"అంతేనా?"
"మీ అభిప్రాయాలతో నా అభిప్రాయాలు..."
"ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పవచ్చు. డొంక తిరుగు డెందుకు?"
"ప్చ్! నన్ను అర్ధం చేసుకోండి, ఆర్తీ!"
'ఇంతకన్నా అర్ధం చేసుకునే శక్తి నాకు లేదు." ఆమె వెళ్ళటానికన్నట్లు నిల్చుంది.
"కాదు....." ఆర్తి చెయ్యి పట్టుకున్నాడు ఆపాలని. ఆర్తి కళ్ళు అతని కళ్ళతో చూపులు కలిపినాయి. సారధి, "క్షమించండి!" అంటూ చెయ్యి వదిలాడు. ఆర్తి మందహాసంతో, "మీరు బాగా ఆలోచించు కోండి! ఇవ్వాళ శుక్రవారం ఆదివారం సాయంత్రం ఇదే చోటులో, పెళ్ళిలో ఇటువంటి కరగ్రహణం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాలి మరి!" అన్నది.
"నేను మిమ్మల్ని మోసగిస్తున్నాను, ఆర్తీ!"
"మోసమా? కాదు. నా జీవన రథసారధి అలా చెయ్యడు. నాకు తెలుసు." ఆమె అతన్ని ఒంటరిగా అక్కడే వదిలి ముందుకు వెళ్ళింది.
ఆదివారం నాడు వేణును అడిగాడు. అప్పటికింకా ఆర్తికోసం టాంక్ బండ్ మీదికి వెళ్ళలేదు. "నేను మీ అక్కయ్యను పెళ్ళాడకపోతే నష్టమేమయినా ఉందా?"
తల ఊపాడు వేణు. "ఆమె సాహసికురాలు. విషాదకరమైన అంతం మనం చూడవచ్చు! అప్పటికి మనం చెయ్యగలిగింది ఏమీ ఉండదు."
కాదంటే ఆమెకు, తద్ద్వారావేణుకు, గోవిందరావుకు మనస్తాపం కలిగించిన వాడవుతాడు. అవునంటే అంత రాత్మ వెనుకంజ వేస్తున్నది. టాంక్ బండ్ మీదికి వెళ్ళే వరకూ ఈ సమస్యతో తంటాలు పడుతూనే ఉన్నాడు.
కొంత సేపటికి ఆర్తి వచ్చింది.
"జీవితాంతం - మళ్ళీ ఏ పని అయితే చెయ్య కూడదనుకున్నాడో అదే చెయ్యాల్సి వస్తోంది. మీ సాంగత్యంలో కొంతవరకు శాంతి లభించవచ్చు..." అంటూ తన నిశ్చయాన్ని తెలిపాడు.
"నాకు తెలుసు! మీరు నా మనోవాంఛను కాదన రని!"
"కాని..."
"కాని? చెప్పండి?"
"నాకు కొన్ని అభిప్రాయాలు- అంటే మీ పరిభాషలో షరతులు - ఉన్నాయి."
"ఏమిటని?"
"మనం పెళ్ళి అయ్యాక వేరుగా ఉండాలి. మనం ఒకరి గౌరవానికి మరొకరు భంగం కలిగే విధంగా ప్రవర్తించకూడదు."
"అలాగే!"
"మీరుగానీ, మీ స్నేహితులుగానీ, బంధువులు గానీ బాధాకరమైన నా గతాన్ని గూర్చి తెలుసుకో ప్రయత్నించవద్దు!"
"ఆ మాట అసలు ఎత్తను."
"అటు ధనంలో, మీ కన్న ఎక్కువ కాదు. విద్య విషయంలోనూ అంతే! ఇటువంటి హెచ్చుతగ్గులు ఉన్నపుడు పరిసరాలు, వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలియక పోవచ్చు..."
మధ్యలోనే ఆర్తి నవ్వింది. "ఆ అనుమానం ఎందుకు వచ్చింది? మీ రెంత సూటిగా ఉంటారో - నేనూ అంతే!"
"ఈ ఏడుతో మీ చదువు పూర్తయింది. మీరు వైద్యవృత్తి స్వీకరిస్తానంటే నా అభ్యంతరం ఏమీ లేదు. ఏదో విధంగా ప్రజాసేవ చెయ్యటం నాకు ఇష్టమే! లోకం పురోగమిస్తోంటే, మనం మడిగట్టుకు కూర్చోవటంవల్ల లాభం లేదు. విద్యాధికులైన మీ వంటి వారి అవసరం దేశానికెంతయినా ఉన్నది. అందరూ కలిసి కృషి చేస్తేనే దేశౌన్నత్యం. జాతి ద్వేషాలు, మత ప్రసక్తి అసలే వద్దు. కాని ఈ పేరుమీద మన ఆచార వ్యవహారాలకు ఏ మాత్రం విఘ్నం కలగటం నేను సహించను."
"నాకూ మన ఆచారం సంప్రదాయాలంటే ఇష్టమే."
"మన వివాహం పూర్తిగా హిందూ పద్ధతిలో, వేదోక్తంగా నిరాడంబరంగా జరిగిపోవాలి,"
"మీరలా అనక పోయినా నాన్న అలాగేజరిపిస్తాడు."
"చివరి మాట! ఈ వివాహానికి నా తల్లిదండ్రులు, బంధువులు ఎవ్వరూ రాకపోవచ్చు. కారణం మీరు ఊహించే ఉంటారు."
"ఊఁ!"
"దాన్ని గురించిన ప్రస్తావన పెళ్ళిలో రాకుండా కట్టుదిట్టం చెయ్యవలసిన బాధ్యత మీది. ఆఖరికి మీరుకూడా!"
"సరే! ఈ అనుమానాలన్నీ తీరాయా?"
"ఆఁ! ఇందులో దేనికి భంగం వాటిల్లనా ఫలితం ఎలా ఉంటుందో నేను వేరే చెప్పనవసరం లేదు. గృహ జీవితంలో ఒకరిమీద ఒకరికి ఉండే అధికారాలూ, హక్కులూ తెలుసుకుని ప్రవర్తించాలి. నేను మీకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే మీరు విడాకులివ్వవచ్చు...."
"మీమీద నాకు నమ్మకం ఉంది."
"కొన్నాళ్ళకు సడలిపోవచ్చు కూడాను."
"నేను మీ కేవిధమైన నొప్పి అయినా కలిగించి నట్లయితే-మీరే శిక్ష విధించినా నేను సంసిద్దురాల్ని."
"మీ నాన్నగారితో చెప్పండి- సారధి ఒప్పుకున్నా డని."
"థాంక్స్!"
* * *
