నర్సమ్మ కన్నీరు ఆపుకుంటూ "నేను చెప్పాను ఎవరింటికి వెళ్ళవద్దని" అని కోపం కొద్ది తన్ని నాలుగు దెబ్బలు వేసింది.
అసలే ఉక్రోషంగా వున్న లిల్లమ్మ కు దుఃఖం ఆగలేదు.
తర్వాత తనే మళ్ళీ అడిగితె ఏ కళ నున్నదో నర్సమ్మ తన బాధనంతా చెప్పింది. అయితే ఆమె చెప్పింది అప్పట్లో తాను ఊహించలేక పోయినా క్రమంగా వయస్సు వచ్చేసరికి తనకి అప్పుడు అంతా అర్ధం అయింది. నర్సమ్మ హాస్పిటల్లో చేరిన కొత్త రోజులవి. ఓనాడు ప్రొద్దున్నే ఓ అనాధ స్త్రీ హాస్పిటల్ కి వచ్చిందట. నిండు చూలాలు, ఆమె మాటల్ని బట్టి ఆమెను ఎవరో మోసగించారట. సానుభూతితో ఆమెను చేరదీసిందట నర్సమ్మ. ఆమెకు పురుడు పోసింది. అలా సానుభూతి ప్రదర్శించటమే తనకి ఈ అనుబంధం స్థిరం అయి పోయిందట. పురుడు వచ్చిన పదో రోజున ఓ తెల్లవారు ఝామున నర్సమ్మ వచ్చి చూస్తె మంచం మీద బాలింతరాలు కనపడలేదట. ఎంతసేపటికి ఆమె తిరిగి రాలేదుట. రోజులు గడిచినా ఆమె ఎమయిందీ తెలియలేదట. నర్సమ్మ అతి మంచి తనం చూసి ఆమె పిల్లని వదిలేసి వెళ్లి పోయిందట అప్పట్నించీ నర్సమ్మ తన్ని సాకింది. కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది. తాను ఏం కోరితే అది కొని ఇచ్చేది. మంచి మంచి బట్టలు ఖరీదైనవె కుట్టించేది. పెళ్ళీడు వచ్చేసరికి తగిన సంబంధం మాత్రం రాలేదు. నర్సమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఒక్క సంబంధమూ కలిసి రాలేదు. ఎలా వస్తాయి? తన గురించి తెలియంది ఎవరికి? తల్లి అప్పుడప్పుడు ఏడుస్తుండేది. తను విసుక్కునేది కూడాను. తన మంచితనమే తనకు నానా తిప్పలు తెచ్చి పెట్టింది అని. తనకి కష్టంగా ఉండేది. ఆమె అలా అంటుంటే, కోపం వచ్చినప్పుడు అలా అన్న తర్వాత నర్సమ్మ చాలా బాధపడేది. తన దగ్గరగా తీసుకుని కన్నీరు పెట్టుకునేది. ఆమె ఆరోగ్యం అంత మంచిది కాదు. ఆమెకు మాత్రం యేవరున్నారు? చిన్నప్పుడే భర్త చనిపోతే నర్సు వ్రుత్తి లో చేరి పొట్ట పోసుకుందుకు హాస్పిటల్లో చేరింది. తన్నే లక్ష్యంగా పెట్టుకుని ఆమె జీవించింది. అదే అంటుండేది. "నిన్ను చేరదీశాను గనకనే నీ ముద్దు ముచ్చటలు , ఆటపాటలు చూసుకుంటూ ఇన్నాళ్ళు కాలక్షేపం చెయ్య గలిగాను. నా జీవితంలో మాత్రం ఏముంది ఆధారం?' అని. నర్సమ్మ డబ్బు బాగానే సంపాదించేది చాలా వెనక వేసింది కూడాను. ఆమె సంపాదనే తనకీ నాడు ఆధారం అయింది. ఆమె సంపాదనతోనే ఈ ఒక కొంప కట్టింది. కాస్త పొలం పుట్రా పాడి పంట కూడా అప్పచెప్పింది. ఆమె హటాత్తుగానే కన్ను మూసింది.వయసు వచ్చిన పిల్ల ఉంటె చెడ గొట్టాలని చాలామంది చూస్తారు. అలా తన్ని పాడు చెయ్యాలని చాలా మంది చూశారు. నర్సమ్మ ఉన్నంత కాలం తాను చాలా జాగ్రత్త పడింది. ఎవరికీ లొంగలేదు, కానీ ఆమె పొయిం తర్వాత తన జీవితం చుక్కాని లేని పడవలా అయింది. తానూ కొన్నాళ్ళు నిగ్రహించుకో గలిగింది గాని తర్వాత లోంగిపోక తప్పలేదు. తన వీధిలోనే ఓ ముసలమ్మా ఉండేది. ఆమె అస్తమానూ తనకోసం వస్తుండేది. ఆమె అక్కడి విక్కడ ఇక్కడి వక్కడా చెబుతుండేది. అందరు వాగుడు కాయ అంటుండేవారు. ఆమెకు ఆ చుట్టూపక్కల వాళ్ళు అడ్డుపట్టం ఆనవాళ్ళుగా తెలుసును. ఆమె రోజూ వచ్చి చాలా అప్యాయతగా మాట్లాడేది. ఆమె తరుచుగా వస్తుండేది. ఆమె తమ్ముడి కొడుకు గురించి చెబుతుండేది. అతను బాగా చదువు కున్నాడట పెద్ద ఉద్యోగం చేస్తున్నాడుట చాలా మంచి వాడుట. ఓసారి అతగాడ్ని తనింటికి తీసుకొచ్చింది. చాలా నెమ్మదైన వాడులా కనిపించాడు. ఆమె మాటలకి అనుగుణంగానే వున్నాడు. తాను నమ్మింది. అతని ధోరణి తనకి అనుమానం కలిగించలా. అతను ఎంతో మర్యాద సభ్యత కనబరిస్తే తాను నమ్మింది. అయితే ఈలోపుగానే పెళ్ళి జరగకుండానే అతగాడికి తాను లొంగి పోయింది. పెళ్ళి ఊసెత్తితే అదిగో ఇదిగో అని తప్పుకునేవాడు. అస్తమానం డబ్బు అడుగుతుండేవాడు. తన దగ్గర వున్న డబ్బంతా కాజెయ్యాలని , ఆ యిల్లు స్వాధీనం చేసుకోవాలని అందుకోసరం తన జీవితం సయితం అంతం చేయ్యాలనేంత కుట్ర చేశాడతను. తన జీవితం నానాటికీ నరకం అయింది. అతను డబ్బు కోసరం తను చెప్పినట్లల్లా వినడం కోసరం అప్పుడప్పుడూ కోడుతుండేవాడు. అలాంటి సమయంలో ఓనాడు అయిదారుగురు పోలీసులు వచ్చి అతగాడ్ని అరెస్టు చేసి తీసుకుపోయారు. ఏదో హత్యా నేరంలో అతడే నిందుతుడుగా కోర్టు వారు యావజ్జీవ శిక్ష వేశారు. తన జీవితం మళ్ళీ మొదటికే వచ్చింది. అయితే ప్రాణాలు, డబ్బు మాత్రం దక్కాయి. ఆ హంతకుడే పట్టుబడకుండా ఉంటె ఎప్పుడో తన జీవితం అంతమయి పోయేది. అతగాని చేష్టలూ, మాటలూ అలాగే ఉండేవి. విచారణ సందర్భంలో సాక్ష్యం కోసరం తనూ కోర్టు చుట్టూ తిరగటం లో చలపతి తో పరిచయం అయింది తనకు. నలుగురూ తన్ని హేళన చేసి తన్ని ఏడిపిస్తుంటే చలపతి ఆదుకున్నాడు. ఆ కేసులో చలపతి కూడా ముద్దాయిగా కోర్టులో హాజరు పరిచారు అతనా సమయంలో ఆ చుట్టూ పక్కలే ఉన్నాడుట. కోర్టు వారు అతడు నిర్దోషి గా ఓడిలేశారు. చలపతి అప్పట్లో తన జీవితం లోకి ప్రవేశించక పొతే తన బ్రతుకు ఇంకా అనర్ధాల పాలయేది. అప్పటికే చితికిపోయిన తన జీవితానికి నిండుతనం వచ్చింది. తన కోరికని అనుసరించే చలపతి అప్పుడప్పుడూ తనింటికి వస్తుండేవాడు అలా క్రమంగా అతను తన జీవితంలోకి ప్రవేశించాడు. అతనికి రెండో సారిగా లొంగి పోయింది. తనే అతగాడ్ని రెచ్చ గొట్టి పతనం చేసింది. తనకి అతని అండ అవసరం అతడ్ని ఆకట్టుకోవాలంటే అంత కంటే మార్గం కనబడలేదు. అతను బలం ఉన్న వాడు అతను జారిపోతే దొరికిన ఈ కాస్త అండ కూడా పోగొట్టు కోవలసి వస్తుంది. తాను దిక్కులేనిదై పోతుంది. ఒక్కొక్కప్పుడు వారం రోజులు అయినా అతను కనిపించేవాడు కాడు. చలపతి లో నిజాయితీ ఉంది. అతని మాటలో వున్న మొరటు తనం మాట పెళుసుతనం కంటే అతని మనస్సు గొప్పది. ఆ రహస్యం తాను వారం పది రోజుల్లోనే కనిపెట్టింది. అతను చాలా హుందాగా ఉండేవాడు. తానుగా ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించే వాడు కాడు లోకులు రకరకాలుగా అనుకునేవారు అయితే కొన్నాళ్ళ కు వారు అనుకునేదే రుజువు చేసింది తాను. అతనూ కొన్నాళ్ళు ముఖం చాటు చేస్తే అల్లరి చిల్లర వాళ్ళు తనని వేధించేవారు. అతను రాగానే వాళ్ళు దూరంగా తప్పుకునేవారు. అతని అండన తాను చాలా మనశ్శాంతి పొందింది. అతనికి సేవ చేయడంలో ఆనందం అనుభవించింది. కాని ఇప్పుడు చలపతి తనకి దూరం అయిపోతున్నాడు. అతను పెళ్ళి చేసుకొని అతని సంసారంతో అతను గౌరవంగా జీవించాలని తనకిక ఓ అభిప్రాయం లేకపోలేదు. చలపతి కుటుంబం గౌరవం గల పెద్ద కుటుంబం. అన్న గారు అంత ప్రేమగా రాసినప్పుడు వారి కోరిక తీర్చటమే చలపతికి శ్రేయస్కరం తనకేముంది? ముప్పయి ఏళ్ళు పైన బడ్డాయి. మంచీ చెడు జీవితంలో చాలా వరకూ అనుభవించింది. చలపతి తనను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యలేడు. అప్పుడప్పుడు తన గురించి కనుక్కుంటూ ఉండక పోడు. అవసరమై కోరితే అదుకోక పోడు. లోకంలో తాను చలపతికి చాలా యిష్టు రాలిననే అభిప్రాయం బాగా బలపడి పోయింది. ఇప్పుడు తనకి నలుగురి లోనూ కాస్త వ్యవహార జ్ఞానం పలుకుబడి ఏర్పడ్డాయి. ఇప్పుడు తాను కొంచెం స్వతంత్ర్యంగా తన పనులు తాను చూసుకుంటుంది. అతగాడికి పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం ఏర్పడింది. ఇన్నాళ్ళకు. అతనికి అభిప్రాయం కలగటంలో ఆశ్చర్యం లేదు. అయినా లిల్లమ్మ కు దుఃఖం ఆగలేదు. తన కతను అన్యాయం చేస్తున్నాడు కాదు గాని, అయినా ఎందుకో ఆమెకు మనస్సులో తనది అనుకున్నది ఏదో తన్నుంచి దూరం అయిపోతున్నట్టే అనిపించింది. తన కేమి అసూయ లేదు. అతనేలాగూ తన్ను పూర్తిగా దూరం చేసుకోడు. తాను కోరితే తన అవసరాలని ఆదుకుంటాడు. అలాంటప్పుడు అతని జీవితం తానెందుకు పాడు చెయ్యాలి. లోకం తన మూలాన అతని జీవితం నాశనమై పోయిందనే అపఖ్యాతి తనకెందుకు రావాలి. అతని ఓ భార్య సంసారం, తన బంధు వర్గం తో అనుబంధం ఉంటె అ దారి వేరు. తనేమీనలుగురు చేడుగా అనుకొనే అవకాశం ఉండదు. ఆమెకు మరో ఆలోచన వచ్చింది. చలపతి చాలా మొరటు మనిషి౧ అతను వ్యసనాల పూర్తిగా బానిస . తప్పతాగుతాడు డబ్బెంతా పేకాట లు ఆడతాడు. ఒక్కొక్కప్పుడు రోజు తరబడి ఇల్లు పట్టకుండా అక్కడ అక్కడా గడుపుతాడు. అలాంటి వాడు పెళ్ళి చేసుకుని ఆమెను ఏం సుఖ పెడతాడు? ఆమెను కష్టాల పాలు చేసి అవస్థలు పెడితే ఆ పిల్ల ఉసురు అతనితో బాటు తనకీ తగుల్తుంది ఇప్పుడిలా అడిపోసుకునే లోకమే అప్పుడు ఇంకోలా అనుకుంటుంది. ఈ లోకులు రెండు వేపులా పదునైన కత్తుల్లాంటి వాళ్ళు. తన మూలానే అతగాడు ఆమెను సరిగ్గా చూడటం లేదని ఆమె కష్టాలకు తనే బాధ్యురాలని అపవాదు వేస్తారు. అప్పటికి చలపతిని తాను దూరం చేసుకోక తప్పదు. తన దారి తాను చూసుకోవాల్సిందే ఇప్పటికి తన జీవితంలో ఇద్దరయ్యారు . ఇద్దరితో గడపగా లేంది ఇంకొకరితో గడిపితే ఏం? ఈ జీవితం కన్నతల్లి హాస్పిటల్లో వదిలే నిర్లక్ష్యంగా పారిపోయినప్పుడే తప్పుదారిలో పడిపోయింది. ఇక ఈనాడు ఈ జీవితం గుట్టు మట్టు అనుకుంటే ఎలా సాగుతుంది?
పోద్దేక్కుతోంది.
రాఘవులు తలుపు తట్టాడు. లిల్లమ్మ తలుపు తీసింది. ఆమె నిర్లిప్తంగా "ఏం రాఘవులు అంది.
"అయ్యగారు రావటం ఆలస్యం కావచ్చు మీకేమైనా కావాలంటే తెస్తాను." అన్నాడు.
రాఘవులు లిల్లమ్మ నిర్లిప్తతను గమనించక పోలేదు. అయినా వదలకుండా "అమ్మగారు నాకు తెలవక అడుగుతాను. అయ్యగారికి ఉన్నట్లు ఈ బుద్ది పుట్టిందేం?' అన్నాడు.
"ఏం తప్పేముంది?" అంది లిల్లిమ్మ.
రాఘవులు లిల్లిమ్మ మొహంలోకి పరిశీలనగా చూసి "ఎందుకండీ అయ్యగారికి పెళ్ళి అవసరం అంటాను. మీరుండగా అయన కెందుకొచ్చిన రొష్టు" అన్నాడు.
