Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 4


    నేనామెకు నచ్చజెప్పడం ప్రారంభించాను-"రామావతారం! నువ్వు నాకు కొత్తకాదు. నేను నీకు కొత్త కాదు. మనం కలుసుకుంటే అది కొత్త తప్పూకాదు, నా ప్రోద్భలం మీద తప్పనిసరి పరిస్థితుల్లో యిరుక్కున్నావు కాబట్టి అది నీ తప్పూకాదు. ఇందులో నీ భర్తకు జరిగే అన్యాయమేమీలేదు. నువ్వనుకునే అన్యాయం నీ భర్త కెప్పుడో జరిగింది. ఇప్పుడు నీ భర్తకు నిజం తెలియడమె అన్యాయం. అది జరక్కుండా కాపాడుకో...."
    ఆ తర్వాత రామావతారం నన్ను గడువే అడగలేదు.
    నా మనసెంతో సంతోషించింది. తర్వాత ఆమెకు చెప్పాను-"నెలకు రెండుసార్లైనా నువ్వు నన్ను ఆహ్వానించాలి. నా ఫోన్ నంబరిస్తాను. ఫోన్ లో నాకు కబురు చెప్పు. నువ్వే నన్నాహ్వానించడంవల్ల నీకిబ్బంది వుండదు. నీ యింట్లో అనుకూల పరిస్థితులు నీకే బాగా తెలుస్తాయి గదా-"
    అటుపైన ఆమెను హెచ్చరించానుకూడా ఏ నెలలో ఆహ్వానం మర్చిపోయినా ఆమె భర్తకు నిజం తెలుస్తుంది.
    రామావతారం అన్నింటికీ ఒప్పుకుంది. అది అసహాయత అని నాకు తెలుసు. కానీ ఆడదాని అసహాయతకు జాలిపడకపోవడంలోనే మగాడి సుఖం వుంది. ఆ విషయం బాగా తెలిసినవాళ్ళలో నేనూ ఒకడిని.
    ఈ నెలలో అప్పుడే మూడు వారాలు గడిచాయి. ఇంకా రామావతారంనుంచి ఫోన్ రాలేదు. పిట్టకు బెదిరింపు డోసింకోటివ్వాలా అని ఆలోచిస్తున్నాను.
    కానీ ఫోన్ వచ్చేసింది.
    రాత్రి ఏడుగంటలకు......
    రామావతారం యింటి దొడ్డిదారి ఒక సందులోకి వుంటుంది. ఎవరికీ తెలియకుండా ఆమె యింటికి వెళ్ళడం పెద్ద కష్టంకాదు.
    నా ఆలోచనలను రామావతారం ఆక్రమించేసింది.
    ఆడవాళ్ళు రకరకాలు.
    నన్నే ప్రేమించి వేరే వివాహం చేసుకునికూడా అప్పుడప్పుడు నాకోసం వచ్చే రోజా....
    నన్ను ప్రేమించి వివాహం చేసుకొని నా వ్యక్తిగత జీవితం జోలికిరానని మాటిమాటికీ మాటయిచ్చే రాధ....
    నేను ప్రేమించాననుకుని మోసపోయి నన్ను ప్రేమించి మోసం గ్రహించేక వేరే వివాహం చేసుకొని నన్ను ద్వేషించాలనుకుంటూ అది సాధ్యపడక నన్ను ప్రేమిస్తూండడం తప్పనిసరి అయిన రామావతారం.....
    ముగ్గురిలోనూ నాకు రాధ మనసంటే యిష్టం. రోజా శరీరమంటే యిష్టం. స్త్రీగా యిష్టపడేది మాత్రం రామావతారాన్ని!
    అందుకే - హోటల్ ఉడ్ లాండ్స్ లో రోజా వున్నదని తెలిసినప్పటికీ - నాకుత్సాహం పుట్టించింది రామావతారం పిలుపు.
    ఆఫీసులోనే వుండిపోయాను ఆరింటివరకూ.
    అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఆలస్యానికి రాధ ఫోన్ చేసిందా అనుకున్నాను. కానీ తీరాచూస్తే రోజా!
    "అర్జంటుగా రా!" అంది రోజా పిలుపు.
    ఆఫీసునుంచి తిన్నగా రోజా గదికి వెళ్ళాను.
    "ఏమిటి అర్జంటు?"
    "నేను వచ్చింది నీ కోసం...."
    "సాయంత్రాలు రాలేనని చెప్పానుగా...."
    రోజా నా వంక దీనంగా చూసి-"ఇలాగైతే నాకిక్కడ బోర్ కొడుతుంది. రాలేనంటే కుదరదు....." అంది.
    రోజాకు నాతో కలిసి సినిమా చూడాలనుంది అందుకని కాసెట్ తెప్పించి వుంచింది. ఆ రూంలో వీడియో సౌకర్యముంది.
    సినిమా పేరు శంకరాభరణం.
    "నేను చూసేశాను...." అన్నాను.
    "నేనూ చూసేశాను. కానీ మనం చూడలేదుగా..." అంది రోజా.
    ఆ సినిమా ఆమెకెంతగానో నచ్చింది. నాతో కలిసి ఆ సినిమా చూడాలన్నదామె కోరిక.
    కాదనలేకపోయాను.
    ఏడుగంటలకు నాకు రామావతారం ఆహ్వానముంది అది నేను వదులుకోలేనిది.
    అప్పుడు టైము ఆరున్నరయింది.
    ఏదో వంకపెట్టి తప్పించుకోవలనుకున్నాను.
    రోజా కాసెట్ పెట్టింది. సినిమా ప్రారంభమైంది.
    అప్పుడామె నాకు దగ్గరగా జరిగింది. తన తలను నా భుజంపై వాల్చింది. రెండో చేతిని నా రెండో భుజంపై వేసింది.
    కాలేజీ రోజుల్లో బాక్స్ టికెట్ తీసుకొని మేమిద్దరం అలా సినిమా చూసేవాళ్ళం. థియేటర్ కు ముందామె వెళ్ళేది. కాసేపటికి నేను వెళ్ళేవాణ్ణి. సినిమా చూడ్డం అయేక ముందు నేను వెళ్ళిపోయేవాణ్ణి తర్వాత ఆమె వచ్చేది.
    ఆ రోజుల్లో కాబట్టి అలా సరిపోయింది.
    ఇప్పుడలా కుదరదు.
    ఇద్దరూ వివాహితులం. అందుకే ఆమె సర్దార్జీ వేషంలో గురు క్ష్ సింగ్ పేరుతో ఈ హోటల్లో మకాంపెట్టింది. సర్దార్జీని కలుసుకునే నెపంతో నేనామెను కలుసుకుంటున్నాను. ఏ సరదాలైనా ఈ హోటల్ గదికే పరిమితం.
    నేనామె నడుంచుట్టూ చేయివేశాను.
    సినిమా నడుస్తోంది.
    కథలో అర్ధముంది. అందముంది, నడకలో ఆకర్షణుంది. వేగముంది. అందుకే చూడ్డంలో విసుగుండదు.
    ఒకరినొకరు పొదివిపట్టుకొని మేమా సినిమా చూస్తున్నాం. అయితే గతంలోనూ యిద్దరు ప్రేమికుల్లాకాక పసిపాపల్లా ఆ చిత్రం చూశాం.
    చిత్రం చూస్తూన్నంతసేపూ నవరసాల అనుభూతీ కలిగింది.
    నేను యేడుగంటలనీ, రామావతారాన్నీ మరిచిపోయాను.
    సినిమా అయిపోయింది.
    "నీతో ఈ సినిమా చూస్తూ గొప్ప అనుభూతి పొందాను...." అంది రోజా.
    నాకూ అలాగే అనిపించింది. కానీ....
    సినిమా చూస్తూ మేము కబుర్లు చెప్పుకోలేదు. ఒకరి నొకరు పలకరించుకోలేదు. మేము సినిమానే చూశాం. అయితే నన్ను కదిలించిన దృశ్యం ఆమెనూ కదిలించిందనీ, నన్నానందపరిచిన విశేషం ఆమెనూ ఆనందపరిచిందనీ-అనిపించే భావన ఒక పెద్ద విశేషం!
    "ప్రేమికులు కలిసి చూడదగ్గ సినిమా యిది!" అన్నాను.
    ఈ భావన ఆ చిత్ర నిర్మాతకూ, దర్శకుడికీ వచ్చి వుండదు. ప్రేమికులేం కర్మ-ఆబాలగోపాలమూ చూసి ఆనందించిన చిత్రమిది!
    "నీకు తీరికలేకపోయినా-నాకోసం నాతో యింత సేపో గడిపావు. చాలా సంతోషం థాంక్స్!" అంది రోజా.
    "నేనే నీకు థాంక్స్ చెప్పాలి-" అందామనుకున్నాను కానీ నాకు తీరికెందుకు లేదో స్ఫురించింది. రామావతారం గుర్తుకొచ్చింది.
    చటుక్కున లేచాను.
    టైము తొమ్మిది కావస్తోంది. త్వరపడితే అక్కన్నించి పావుగంటలో రామావతారం యిల్లు చేరుకోగలను.
    ఇంకా నాకు అవకాశముంటుంది.
    ఎందుకంటే రామావతారానికి నేను ముందే చెప్పాను.
    "నేనేదో వేశ్య వద్దకు వెడుతున్నానన్న భావం నాకు కలక్కూడదు. ఇద్దరు ప్రేమికుల్లా గడపాలి మనం. కులాసాగా కబుర్లు చెప్పుకుంటాం. చదివిన కథలు మననం చేసుకుంటాం. కలిసి టిఫినో, భోజనమో చేస్తాం. తీరుబడిగా మనింట్లో మనం గడుపుతున్నట్లుండాలి. అంటే మనం కలుసుకున్నప్పుడల్లా మూడు నలుగు గంటలసేపైనా మనం నిర్భయంగా, నిస్సంకోచంగా వుండగలగాలి...."
    అంటే యిప్పుడుకూడా రామావతారం ఇంట్లో ఏకాంతంగానే వుంటుందన్నమాట....
    "మరి నేను వెళ్ళాలి రోజా!" అన్నాను.
    రోజా ప్రేమతో నాకు వీడ్కోలుచెప్పి-"తెల్లవారేసరికి మళ్ళీ నువ్వు నా రూం తలుపుతట్టాలి-" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS