"బాబాయ్..." సునీత కళ్ళలో నీరు సుడులు తిరిగింది.
సునీత కళ్ళను గమనించాడు. "అవునమ్మా! కంట నీరు పెట్టగలిగినవాడే మనిషి! పాషాణం కన్నీరు కార్చలేదు. నవ్వుతూ ఉండేవాడు దుఃఖాన్ని భరించలేక పోవచ్చు. ఏడవగలిగినవాడు, తప్పకుండా నవ్వగలడు. లే! ఆఫీసుకు టైమవుతున్నట్లుంది." ఆమె భుజం తట్టాడు.
సునీత లేచి వచ్చేసింది.
"పిచ్చితల్లి!" నవ్వుకున్నాడు యాదగిరి.
యాదగిరి అన్నట్లే-ఆవేళ ఇద్దరూ కలిసి భోజనంచేశారు. అలా తినడంలో సునీతకు ఏదో సంతృప్తి కనిపించింది. యాదగిరి కూడా ఆ రోజు కాస్త ఎక్కువగానే తిన్నాడు. యాదగిరి అంటే గౌరవం ఇనుమడించింది సునీతకు.
మామూలుగా ఆఫీసుకు వెళ్ళింది. రెండు మూడు రోజుల్లో వేణు వస్తూండటం వల్ల కాస్త హడావుడిగా ఉన్నది. ఫ్యూన్లు గదులన్నీ తుడుస్తున్నారు. క్లర్కు ఒకాయన రంగు కాగితాల్ని డిజైన్లుగా కత్తి రించి ఇస్తుంటే, మరొకాయన అంటిస్తున్నాడు. ప్రతివాడూ నెత్తిన ఏదో ఒకటి వేసుకుని తిరుగుతున్నాడు. అర్జెంటు ఫైళ్ళూ, బాస్ కోపం-ఈ రెండు మూడు రోజులవరకూ బంద్!
సునీత తనేమీ కల్పించుకోలేదు. తిన్నగా సెక్షన్ లోకి వెళ్ళింది. వేణు వచ్చిన రోజు పార్టీకని ఆహ్వానాలు టకాటకా బాదేస్తున్నది జేనీ! గంటపైగా ఏ పని లేకుండానే కూర్చుంది సునీత. ప్రొప్రయిటరు కూడా లేడు. ఏం తోచలేదు. విసుగెత్తి ఇంటికి వచ్చేసింది.
సాయంత్రం బజారుకు వెళ్ళినపుడు ఆర్తి మనసులో మెదిలింది. పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో పదిపైసలు వేసి ఫోన్ చేసింది.
"మీరు ఆదివారం నాడు స్టేషనుకు వస్తున్నారా?"
ఒక్క నిమిషం సమాధానం లేదు. తరవాత "చెప్పలేను!" అని వినబడింది.
"పనేమయినా ఉందా?"
"క్షమించు, సునీతా!" గాద్గదికంగా ఉన్నట్లుంది స్వరం. అవతల ఫోన్ పెట్టినట్లు శబ్దం వినవచ్చింది.
ఆదివారం ఉదయం వేణు వస్తున్నాడు.
స్టేషనుకు గోవిందరావు కారుమీద వెళ్ళారు. వెనకనే కంపెనీ వానులో ఆఫీసు స్టాఫ్ అంతా స్టేషనుకు వెళ్ళారు.
ఆర్తిమాత్రం స్టేషనుకు రాలేదు. ఆపరేషన్ కేసు ఉందని, రాలేనని ఫోన్ చేసింది.
క్లర్కులు కొందరు పుష్పగుచ్చాలు, మరి కొందరు పూలదండలు పట్టుకువచ్చారు వేణును ఆహ్వానించడానికి. సునీత మాత్రం అటువంటి పనేమీ చెయ్యలేదు. అందరికీ భిన్నంగా, సాధ్యమైనంత దూరంగా ఉంటున్న సునీతను చూసి, గోవిందరావు నిట్టూర్పు విడవడం కన్న చెయ్యగలిగిందేమీ లేకపోయింది.
వాన్ లో పక్కనే కూచున్న జేవీ అడిగింది. "బాస్ కొడుకును ఇన్ వైట్ చెయ్యడానికి నువ్వు బంచ్ తీసుకోలేదా?"
"లేదు టైమ్ లేకపోయింది." వద్దనుకుంటూనే అబద్దమాడింది.
"ఓ! పోనీ, ఈ రోజు తీసుకో!" గుచ్చంలోనుంచి గులాబి పువ్వొకటి తీసి ఇచ్చింది జేవీ దాన్ని వాసన చూసింది సునీత.
వాసు ఆగగానే అందరూ బిలబిలలాడుతూ దిగి ఫ్లాట్ ఫారం మీదికి పరిగెత్తారు. సునీత ఆఖరున దిగింది. అమెకూడా చిన్నగా ఫ్లాట్ ఫారం వైపు అడుగులు వేస్తుంటే, ఇంకా కారులోంచి దిగని గోవింద రావు ఆమెను పలకరించాడు.
ఆమె ఆగింది. ఆయన అన్నాడు? "ఓ చిన్నపని చెయ్యగలవూ?"
"చెప్పండి. ప్రయత్నిస్తాను."
ఒక క్షణం ఉండి, "నువ్వు అందరికన్నా ముందు ఉండు. బాబుకు నీ చేతిలో గులాబి ఇవ్వు" అన్నాడు.
చిత్రంగా చూసింది సునీత. ఏమనుకుందో ఏమో గానీ, "క్షమించండి! మీకేకాదు, నాకూ మానాభిమానాలు ఉన్నాయి. హిందూ స్త్రీనైన నేను. పరాయి పురుషునికి-స్వతంత్రంగా-అలా చెయ్యలేను. ఒకవేళ నేనలా చేసినా సాటి ఉద్యోగస్థుల్లో నవ్వులపాలు కావలసి ఉంటుంది" అంది.
"ఇందులో తప్పేంఉంది, సునీతా!"
"లేకపోవచ్చు! లేదు కూడా! కాని.....చెయ్యలేను."
"నీ ఇష్టం." డోర్ తెరుచుకుని కిందికి దిగాడు గోవిందరావు.
ఆయన వెళ్ళాక సునీత, ఫ్లాట్ ఫారం మీదికి పొయ్యే ప్రయత్నం విరమించుకుంది. వెనక్కు తిరిగి వచ్చి మళ్ళీ వానులోనే కూర్చుంది. ఎందుకో తనను తను కంపెనీలో నుంచి మరో చోటికి వెళ్ళిపోకుండా ఉండాలని చూస్తున్నాడు గోవిందరావు. జీతం ఎక్కువ కావాలన్నా పెంచ సిద్ధంగా ఉన్నాడు. ఏమాట కామాటే చెప్పుకోవాలి-ఆయనకు తనమీద కోరిక లేదన్నమాట సత్యం ఆయన తనను బిడ్డలాగానో, చెల్లెలిగానో- మొత్తంమీద అటువంటి వాత్సల్యమేదో ఉండి ఉంటుంది. తనవంటి పిల్లలెవరైనా మరణించి, లేదా తప్పిపోయి ఉండవచ్చు. అందుకే తనను మొదటి సారి చూసినప్పుడు చలనరహితుడయ్యాడు. ఆర్తి కూడా అలాగే అయింది. తనను కున్న వ్యక్తేమోనని, ప్రత్యేకంగా తల్లిదండ్రులను గురించిన వివరాలడిగాడు. కాదని తెలుసుకుని-కనీసం తనలోనైనా వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని చూసుకుందామని తనకీ ఉద్యోగం ఇచ్చి, ఎవ్వరికీ లేని ప్రత్యేకతలు అంటగట్టాడు; కడుతున్నాడు.
సునీతకు ట్రెయిను వచ్చిన ధ్వని, వెండర్ల అరుపులు, రిక్షాల గుణగణాలు, కార్ల హారన్లు అన్నీ వినబడుతూనే ఉన్నాయి. ప్రయాణికులు వస్తున్నారు, వెళుతున్నారు. కూలీలు పరుగులు పెడుతున్నారు. టాక్సీలు, రిక్షాలు వెళుతున్నాయి.
బండి దిగుతూనే పూలదండల్లో మునిగిపోయాడు వేణు. రెండు చేతుల్లో పూలగుత్తులు. ప్రయోజకు డయిన కొడుకును చూసి, తృప్తిగా తల పంకించాడు గోవిందరావు. వేణు అందరికీ జవాబులిస్తూనే ఉన్నాడు. కళ్ళుమాత్రం ఎవరినో వెతుకుతూనే ఉన్నాయి. కావలసిన వ్యక్తులుమాత్రం అగుపించటంలేదు.
"అక్కయ్య రాలేదా, నాన్నా?" వేణు ప్రశ్న.
"లేదు కేసు ఉందన్నది."
ఈ సందడిలో సునీత అక్కడుందో లేదో, ఎవరికీ పట్టలేదు.
ముందు గోవిందరావ్, పక్కన వేణు నడుస్తుండగా, మిగతా స్టాఫ్ అంతా వెనక వచ్చారు. అక్కయ్య రానందుకు వేణు కొంచెం విచారపడ్డాడు. సునీత తమ కంపెనీలో టైపిస్టుగా చేరిందని, తండ్రి ఉత్తరాల వల్ల తెలుసుకున్నాడు. ఆమెకూడా రానట్లుంది. తండ్రితోపాటు తనూ కారులో కూర్చున్నాడు.
వేణు కారు స్టార్టు చెయ్యబోతూ ఉండగా, జేనీ గోలగా అరిచింది- "బాస్! నీతా ఇక్కడుంది....ఆమె ఫ్లాట్ ఫారంమీదకు రాలేదు..." అంటూ.
"వాన్లో ఉందా?" వేణు కారు దిగబోయాడు.
గోవిందరావు వారించాడు. "మనసు బాగా లేనట్లుంది. తర్వాత మాట్లాడవచ్చు."
వేణు ఆ ప్రయత్నం మానుకున్నాడు. కారు, దాని వెనక వాను స్టార్టయినాయి.
5
వేణు వచ్చిన సాయంత్రమే ఆర్తి ఇంటికి వెళ్ళాడు.
ఒక ఫర్లాంగు ఎడంలో, హాస్పిటల్ కు ఎదురుగానే ఆమె మేడ ఉంది. ఇంటి దగ్గర అడిగితే ఇంకా రాలేదని పనిమనిషి చెప్పింది.
వేణు హాస్పిటల్ కు వెళ్ళాడు.
అయిదు దాటింది. రోగులెవరూ లేరు. కాంపౌండర్ ఒక్కడే ఉన్నాడు. వెనక వార్డులో నుంచి వచ్చిన నర్సుకు ఏవో మందులిస్తున్నాడు. వేణును చూసి "నమస్కారమండీ!" అన్నాడు.
"నమస్తే! నమస్తే! అక్కయ్య లేదూ?"
"ఉన్నారండీ! ప్రైవేట్ రూంలో ఉన్నట్లున్నారు. వెళ్ళండి!"
అటువేపుగా వెళ్ళాడు. తలుపులు దగ్గరగానే వేసి ఉన్నాయేమో, నెట్టగానే తెరుచుకున్నాయి. ఆర్తి రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని ముందున్న మేజామీద తలపెట్టుకున్నది. ఆమె తల దగ్గర, ఫ్రేమ్ లో నవ్వుతూన్న ఒక యువకుడి ఫోటో ఉంది. పక్కనే స్టెత స్కోప్, చిన్న హాండ్ బాగ్ ఉన్నాయి. గది అంతా ప్రశాంతంగా ఉంది.
వేణు అడుగుల చప్పుడు విని ఆర్తి తలెత్తి చూసింది.
"ఇంకా ఇంటికి వెళ్ళలేదా, అక్కా!" వేణు మరో కుర్చీలో కూర్చున్నాడు.
దీర్ఘంగా శ్వాస విడిచింది. "లేదు!" ముక్తసరిగా ఉంది జవాబు. మళ్ళీ ఆమే అన్నది: "ప్రయాణం సుఖంగా జరిగిందా?"
"ఊఁ!"
"పొద్దున రాలేకపోయాను, వేణూ! నాన్న ఏమైనా అన్నాడా?"
"ఎందుకంటారు? డాక్టర్లకు తమ ధర్మాన్ని మించిన..."
