Previous Page Next Page 
కాగితపు పల్లకి పేజి 3

 

    రాత్రి నిద్రకు పడుకోబోయే ముందు చొక్కా కొంకికి తగిలిస్తుంటే చలపతి జేబులోంచి ఓ ఉత్తరం జారి కింద పడింది. లిల్లమ్మ చప్పున ఆ ఉత్తరం అందుకుంది. ఆమె చేతిలోంచి ఆ ఉత్తరం లాక్కోవాలని చలపతి ప్రయత్నం చేశాడు గాని ఆమె అందకుండా చప్పున అవతల గదిలోకి వెళ్ళి ఉత్తరం విప్పి చదివేసింది. పూర్తిగా చదివేసి ఆమె ఇవతలకు వస్తూ పెద్దగా నవ్వేసింది.
    "ఎందుకంతగా నవ్వుతావు యెవరైనా వింటారు."
    "చలపతయ్య గారు పెళ్ళి చూపులు చూస్తారంటే ఊరు ఊరంతా అట్టుడికినట్టు ఉడికి పోదూ ఇంతకీ ఎవరండీ మీకు పిల్ల నివ్వటానికి యిష్టపడింది."
    "ఏం అంత పనికి మాలిన వాడ్నా?"
    "మిమ్మల్ని కట్టుకుని ఆ ఇల్లాలు ఏం సుఖ పడుతుందోనని . అసలే ఆలోచించటం అంటే ఇష్టం లేని మొరటు మనిషి గదా. మీకీ భాద్యతలు అంట గట్టాలనే దుర్భుద్ది మీ అన్నగారికి ఎలా పుట్టిందా అని.
    "నీకు ఎగతాళిగా వుంది కదూ? నువ్వేం కష్టపడుతున్నావు నాతొ..."
    'అయ్యో రాత . పెళ్ళి చేసుకుంటే సంసారంలో పిల్లా జల్లా బయల్దేరితే అయ్యగారి పని బందిఖానా ఇలా స్వేచ్చగా తిరగటానికి , తాగటానికి , తైతక్కలాడటానికి వీలుంటుందా? ఇంత స్వేచ్చగా తిరిగినవారు ఆ బందిఖానా భరించగలరా . నా సంగతి వేరు , నాకు మీరే మోక్షం కాదు. మీరే గతి కాదు. నేను మీమీదే ఆధారపడటం లేదు. మీరు లేకపోయినా నాకు ఇబ్బంది ,లేదు నా ఆర్జన నాకుంది."
    "అందుకే కాబోలు ఇందాక తాగుడు మానకపోతే ఏదో ఊరు వెళ్ళి పోతానన్నావు."
    లిల్లమ్మ "అభిమానాలుండచ్చు . దాందేముంది. ఇన్నాళ్ళు కలిసి మెలిసి స్నేహం చేశాం గనక అభిమానం ఉంటుంది. అవసరం లేదు?" అంది.
    లిల్లమ్మ నవ్వు చలపతికి ఉక్రోషంగా ఉంది.
    "వెళ్తారా?"
    "ఇంకా నిర్ణయించుకోలేదు."
    ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది.
    "ఎందుకంతగా నవ్వుతావు."
    "అంటే అలోచిస్తున్నారన్న మాట"
    చలపతికి కోపం పెరిగిపోతోంది. అతని ముఖం ఎరుపెక్కింది. "నీకు ఎగతాళిగా ఉంది కదూ?" అన్నాడు.
    "మీ రాఘవులు కి ఈ సంగతి తెలుసునా?"
    "ఏమో?' చలపతి కోపంతో జవాబు చెప్పాడు.
    "చలపతయ్య పెళ్ళి చూపులు చూస్తున్నాడంటే నేనే కాదు ఎవరైనా నవ్వుతారు."
    "ఎందుకు నవ్వటం - వళ్ళు పోగరేక్కితే సరి"
    "చలపతయ్య గారికి పెళ్ళావిటా అని ఎవరైనా నవ్వుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. అందుకు సందేహం లేదు. అసలు ఈయన గారికి ఎవరు పిల్లనిస్తారని అని కూడా అనుకుంటారు. ఎవరబ్బా తెలిసి తెలిసి గోతిలో కి దూకింది అని కూడా అనుకుంటారు."
    "కాస్త ఆపుతావా నీ ధోరణి"
    లిల్లమ్మ నవ్వు ఆపుకోలేక ఆయాసపడుతూ "నామాట విని ఊరుకోండి. ఓ నిండు ప్రాణాన్ని ఎందుకు గోతిలోకి తోస్తారు. మిమ్మల్ని కట్టుకుని ఆ ఇల్లాలు అవస్థలు పడలేదు. ఆమె అవస్థలు పడుతుంటే ఆమె తాలూకు వాళ్ళు చూడలేరు. కొసకి మీ ప్రాణానికి సుఖం ఉండదు. ఏదో ఇలాగే గాలి జీవితం గడిపెయ్యటమే మీలాంటి వాళ్ళకు తగిన పద్దతి."
    చలపతి కి బాణాలు గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి ఈ మాటలు. "అంటే పెళ్ళి చేసుకుని సంసారం చెయ్యలేని అసమర్దుడ్ని అంటావు."
    "మీరు తెగిన గాలిపటం లాంటి వాళ్ళు. మీకు పూర్తీ స్వేచ్చ అవసరం. ఏ కట్టు బాట్లకి మీరు లొంగరు . పెళ్ళవుతే అలాంటి స్వేచ్ఛలు చెల్లు బాతవుతాయా మరి"
    "నా స్వీచ్చకు ఆటంకం ఎందుకు కలుగుతుంది."
    "ఎందుకు కలుగుతుందా? మీరు ఆలోచించలేరు లెండి" లిల్లమ్మ మళ్ళీ నవ్వేసింది.
    "అస్తమానూ నా ఆలోచన గురించి మాట్లాడతావు గదా. నే చేసే పనులు తెలివితక్కువ పనులా."
    "ఇది మాత్రం తెలివి తక్కువ పనే"
    "పెళ్ళి చేసుకోవటం తెలివి తక్కువ పనేం?"
    "తప్పకుండాను"
    "చేసుకు తీరతాను."
    'అవతల వాళ్ళు ఇష్టపడోద్దు"
    "నాకేం లోటని వాళ్ళు ఇష్టపడరు?" నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు"
    "అబ్బే మీకేం లోటు, ఓ ముండ, తాగుడు, జూదం అన్నీ లక్షణాలు మీకుండగా మీకేం లోటు."
    "చూడగా నాకు పెళ్ళి కావటం నీకు ఇష్టం లేనట్టుందే?"
    "అవును మరి మీ సంపాదనంతా ఇప్పుడు నాకు దోచి పెడుతున్నారు కదూ. ఇంకో అవిడోచ్చి అదంతా అనుభవిస్తుందని నాకు అసూయ."
    "రేపు వెళ్తున్నాను పెళ్ళి చూపులకి. ఇప్పుడే నిర్ణయించుకున్నాను."
    "ఇష్టపడితే చేసుకుంటారా?"
    "తప్పకుండాను"
    "అయితే ఈ తాగుడు, వ్యభిచారం , జూడాలు , అల్లరి చిల్లరి తిరుగుళ్ళు అన్నీ కట్టి పెడతారా?"
     'ఆహా"
    "మీరు మానగలరా?"
    "ఒకవేళ మానలేకపోతే మాత్రం ఏం?"
    "అక్కడే ఉంది అసలు చిక్కంతా...."
    చలపతికి అంతకంటే ఈ గొడవ గురించి ఆలోచించటం ఇష్టం లేక ఇక ఆ గొడవ ఒదిలేద్దూ" అన్నాడు చికాగ్గా."
    తెల్లవారటం ఆలస్యం రాఘవులు వచ్చాడు.
    "రాఘవులు మీ అయ్యగారు పెళ్ళి చూపులకి వెళ్తున్నారు. నీకు తెలుసా?" అంది లిల్లమ్మ.
    "అమ్మగారు పరాచికాలు ఆడుతున్నారు."
    "ఒక చెంప  బట్టలు సర్దుకుని బయల్దేరుతుంటే....?"
    "మీరుండగా అయ్యగారికి ఏం ఖర్మ? పెళ్ళి చేసుకుని తిప్పలు పడటానికి?" అన్నాడు రాఘవులు.
    "నేనుంటే మాత్రం కట్టుకున్న పెళ్ళాంతో సమానం అవుతానా?"
    "మీకంటే ఎక్కువ కారు ఎవరైనా?"
    "ఒరేయ్ నువ్వు అనవసరంగా వాగకు. ఈ సంచి పట్టుకుని పద." అన్నాడు చలపతి.
    లిల్లమ్మ గుమ్మం దాకా వచ్చి "పిల్ల ని చూసోచ్చిం తర్వాత కాస్త నా చెవిని కూడా వెయ్యండి." అంది.
    చలపతి ముందుకు సాగిపోయాడు.
    లిల్లమ్మ అలాగే గుమ్మంలో నిలబడింది. చలపతి సందు మలుపు తిరిగేవరకూ. కాని ఆమె ఆశించినట్లుగా అతను కనీసం వెనక్కైనా చూడలేదు.

                                    3
    లిల్లమ్మ తలుపు మూసుకుని గదిలోకి వెళ్ళి మంచం మీద చారబడింది. ఆమెకి గతమంతా ఒక్కసారి గుర్తుకు వచ్చింది. చలపతితో తన పరిచయం ఏడెనిమిదేళ్ళ అయినా అభిమానాలు మాత్రం అనాది నుంచి స్థిర పడినట్లుగా బలపడి వున్నాయి.
    తన చిన్ననాటి తలపులను మళ్ళీ స్మృతి పదంలో తిరిగాయి. తన గాధ తనకి తెలియ కూడదని పెంచిన తల్లి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. తనకా అనుభవాలన్నీ బాగా గుర్తు వున్నాయి.

                              
    ఓనాడు పొద్దున్నే తాను పక్కింటికి వెళ్ళింది. అప్పటికి తనకి పరిచయం అప్పుడే అయింది వాళ్ళు ఆ మధ్యనే ఆ ఇంట్లోకి వచ్చారు వాళ్ళ నాయన గారికి పెద్ద ఉద్యోగమే. చాలా చాదస్తపు మనుష్యులు. తన తల్లి ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుండేది. తన్ని చాలా గారాంగా చూసేది అయితే ఎప్పుడూ ఎవరింటికి తీసుకుపోయేది కాదు. తానుగా వెళ్తానన్న వద్దనేది. ఎందుకలా వారించేదో తనకి అప్పట్లో అర్ధం కాలేదు. ఓనాడు పక్కింటి పద్మజకు తనకి స్కూలు లో పరిచయం ఏర్పడింది. ఆమెతో కలిసి మెలిసి తిరగటం మొదలు పెట్తిం తర్వాత ఓనాడు ఆమె వాళ్ళింటికి రమ్మంది. తాను తల్లిని అడిగితె "వెళ్ళద్దు ఆమెతో కలిసి ఇక్కడే ఆడుకో" అంది. అయినా తాను వినలేదు వాళ్ళింటికి వెళ్ళి ఆమెతో చింత గింజలాట ఆడుకుని వస్తుండేది. అలా ఒకటికి రెండు సార్లు వెళ్ళేసరికి ఓసారి ఆమె తల్లి కూతుర్ని మందలిస్తూ ఏదో అంటుంది తాను వింది. "పరువూ మర్యాద లేని వాళ్ళతో తిరిగావంటే వీపు చీరేస్తాను." దానికి తండ్రేవారో తల్లెవరో తెలియకుండా దిక్కు లేని పుట్టుక పుట్టిందది ఈ నర్సమ్మ చేరదీసి పెంచుతోంది అలాంటి వాళ్ళతో కొంపలో కూర్చుని ఆటలాడకు తెలిసిందా?' అని మందలిస్తుంది. ఆ మాటలు తన చెవిని పడ్డాయి. వాళ్ళు అంతకు ముందు కూడా తాను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు విసుక్కునేవారు. అలా వాళ్ళు విసుక్కువటం లో అంతర్యం ఆమెకు బోధపడలేదు. వాళ్ళ మాటలు విన్న తర్వాత తనకి ఉక్రోషం వచ్చింది ఎవరో అక్రమంగా అవినీతి పనుల ఫలితంగా తాను పుట్టిందని ఈ తల్లి కన్నతల్లి కాదని తనకి ఆనాడే తెలిసింది తల్లిని నిగ్గదీసి అడిగింది. "నువ్వు నా అసలు అమ్మవి కాదు అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS