"నే నెప్పుడూ ఒకటే అంటాను. నేను మిమ్మల్ని నమ్ముతాను. కానీ మీరుకూడా నన్ను నమ్మాలి....." అంది రాధ.
ఆమె వివరించి చెబుతూంటే నేనే ఆశ్చర్యంగా విన్నాను.
స్త్రీ అంటే బలహీనత వుండడం మగాడికి సహజం. అవతలి స్త్రీకి అన్యాయం జరుగనంతకాలం, ఆరోగ్యానికి భంగం లేనంతకాలం ఆ తప్పుకు భర్తను క్షమించే సహృదయత రాధకుంది. భర్త మరో స్త్రీని వివాహమాడేందుకామె వ్యతిరేకి. కానీ భర్త మరో స్త్రీతో అనుభవాన్ని పంచుకుంటే ఆమె తప్పుపట్టదు.
"నన్ను నమ్మమంటావా?" అన్నాను.
"మోసంనాకు నచ్చదు. అత్యాచారం నాకు గిట్టదు. నన్ను నిర్లక్ష్యం చేస్తే నేను బాధపడతాను. ఈ మూడూ లేనప్పుడు మీరు చేసింది తప్పయినా నేను పట్టించుకోను. కానీ మీరు నానుంచి రహస్యందాస్తే నేను బాధపడతాను...." అంది రాధ.
"నేనిప్పుడు రహస్యం దాస్తున్నానని నీ కనుమానం వచ్చిందా?"
"మీరెప్పుడెప్పుడెక్క డెక్కడికి వెడుతున్నదీ నాన్నకు తెలుస్తూనే వుంటుంది. అది నాన్న ద్వారా తెలుసుకోవడం నా కిష్టముండదు. నాన్న చెప్పడానికి ముందే మీ విషయం నేను నాన్నకు చెప్పగలగాలి. అందుకని మీ కార్యక్రమం ముందే నాకు చెబుతూండండి...."
"అందువల్ల ప్రయోజనం?"
"ఇందాకా-ఉడ్ లాండ్స్ హోటల్లోలా మరోసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరముండదు...." అంది రాధ.
రాధ చాలా తెలివైనది. ఆమె నన్ను క్రమంగా తన గుప్పిట్లో యిరికించుకోవాలని చూస్తోంది. ఎక్కడా నా మనసుకు నొప్పి తగలకుండా నన్ను నిందిస్తోంది. తను క్షమిస్తానని హామీ యిస్తూ నా తప్పు తెలుసుకుందుకు ప్రయత్నిస్తోంది.
ఇదంతా పెద్ద ట్రాప్ అని నాకు తెలుసు.
"రాధా! బిజినెస్ వ్యవహారాలన్నీ అందరికీ చెప్పలేను. నువ్వు నన్ను నమ్ముతున్నందుకు చాలా థాంక్స్! నా ప్రవర్తన నీ నమ్మకాన్ని వమ్ముచేసే విధంగా వుండదని హామీ యిస్తున్నాను-" అన్నాను.
అప్పుడు రాధ మనోహరంగా నవ్వింది -"నేనేం చెప్పినా మీ మంచికోఅమే చెప్పాను. అటుపైన మీ ఇష్టం, మీ యిష్టం మీకు హానిచేయవచ్చు. అదొక్కటే ఆలోచించుకోండి...."
ఆమె మాటలు నవ్వంత మనోహరంగాలేవు. మాటల్లో హెచ్చరిక వుంది.
నేను మళ్ళీ ఉడ్ లాండ్స్ హోటలుకే బయల్దేరాను. రాధ మంచిది కావచ్చు. కానీ ఆమెకోసం రోజాను వదులుకోగలిగిన మంచితనం నాకు లేదు.
4
సాయంత్రం నాలుగు గంటలకు నాకు ఫోన్ వచ్చింది. "రాత్రి ఏడూ గంటలకు-దొడ్డి గుమ్మాన-రా-" ముక్తసరిగా చెప్పింది రామావతారం.
ఫోన్ లో మాట్లాడినా ఆమె గొంతు చాలా సెక్సీగా వుంటుంది. ఒక అమ్మాయికి రామావతారం అన్న పేరే చిత్రమనుకుంటే ఆమె గొంతులో సెక్సు ధ్వనించడం మరింత విచిత్రం.
ఈ మాట చెబితే రామావతారానికి నచ్చదు. ఆమె పవిత్రతకు ప్రాధాన్యతనిస్తుంది. పురుషులకు దూరంగా వుండడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి యువతి నన్ను ప్రేమించడమొక పెద్ద విశేషం.
నిజానికి నే నామె గొంతు విని ఆకర్షితుడినయ్యాను. ఆమెతో పరిచయానికి ప్రయత్నించాను. స్వల్పకాలం లోనే ఆమె నాతో ప్రేమలో పడింది. రోజా నాతో తిరిగేటప్పుడు వుపయోగించిన తెలివితేటలన్నీ ఉపయోగించాను. అందువల్ల మా పరిచయం గురించి మా యిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు.
రామావతారం క్రమంగా నన్ను పెళ్ళి గురించి నొక్కించసాగింది. అదెంతవరకూ దారితీసిందంటే చివరి కామెను వదుల్చుకోవడం నాకు తప్పనిసరి అనిపించింది. అప్పుడామెకు నా గురించి నిజం చెప్పేశాను.
అప్పుడు రామావతారం నన్ను తిట్టని తిట్టులేదు.
నేను నవ్వి-"నేను మోసగాడినే, ఒప్పుకుంటాను. కానీ నీ గొంతులో సెక్సు ధ్వనిస్తుంది. ఆ ధ్వని నన్ను పెడదారి తొక్కించింది. నిన్ను మన్నించగలిగితే మన్నించు-" అని చెప్పాను.
రామావతారం అప్పుడు తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఒప్పుకొని పెళ్ళిచేసుకుంది. ఆమె భర్త నాకంటే అందంగా వుంటాడు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతడిని చూస్తూంటే నాకు చాలా అసూయగానే వుండేది. అతడి లాలనలో రామావతారం నన్ను పూర్తిగా మర్చిపోయింది.
వివాహమైనా రోజా నన్ను మర్చిపోలేదు. రామావతారంకూడా రోజాలాగే నన్ను మరిచిపోకుండా నా కోసం పరితపించాలి.
ఒకసారి ఆమెతో ఈ విషయం చెప్పాను.
"నా భర్త పురుషోత్తముడు నీ పరిచయం నా దురదృష్టం, ఓ పీడ కల, ఇప్పుడు నువ్వది గుర్తుచేయకు-" అంది రామావతారం.
ఆమె అలా మాట్లాడుతూంటే-గొంతులో సెక్సు ధ్వనిస్తోంది నాకు. ఆమెను దగ్గరగా తీసుకొని-"ఇంకా తిట్టు-" అనాలనిపించింది నాకు.
రామావతారం తిడుతూంటే నాకు కోపంరాదు. మామూలుగాకంటే-ఆవేశంలోనే ఆమె గొంతు ఎక్కువ బాగుంటుంది. నన్ను రెచ్చగొడుతుంది.
"నీ భర్త ఎంతటి పురుషోత్తముడో చూస్తాను. మన పూర్వ పరిచయం గురించి అతడికి చెబుతాను...." అన్నాను.
రామావతారం భయపడుతూనే-"ఆయన నీ మాటలు నమ్మరు...." అంది.
ఎంతటి పురుషోత్తముడికైనా భార్యననుమానించక తప్పదీ కర్మభూమిలో, అప్పటికే ఆమె భయపడుతున్నదని గ్రహించి-ఆమె భయాన్ని మరికాస్త పెంచడానికి నా దగ్గరున్న సాక్ష్యాలు చెప్పాను.
తిరుగులేని సాక్ష్యాలవి! అవేమిటో ఆమెకూ నాకూ మాత్రమే తెలుసు. ఆమె భర్తను నమ్మించడానికని అద్భుతంగా పనిచేస్తాయని ఆమెకు తెలుసు.
"వద్దు నాకాపురం పాడుచెయ్యొద్దు...." అందామె.
"నీ కాపురం పాడుచేసే ఉద్దేశం నాకూలేదు. ఎటొచ్చీ నువ్వు నన్ను సంతోషపెట్టాలి-"
"ఎలా?"
"ఎలాగో నీకు తెలుసు....."
నా ఉద్దేశ్యం విని ఆమె వణికిపోయింది-"పెళ్ళికి ముందు ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్విలాగనడం భావ్యం కాదు-"
నేను నవ్వి-"గతం నీ భవిష్యత్తును బాధించకూడదంటే గతాన్ని గతంలాగే కొనసాగనీ-"అన్నాను.
"అందుకు నేను మానసికంగా సిద్దంగాలేను-" అందామె.
"గడువు కావాలా?"
ఏమనుకుందో-"ఇస్తావా?" అంది.
"నన్ను వదుల్చుకోవడంకోసం గడువడిగితే ధారుణంగా నీపై పగతీర్చుకుంటాను. లేనిపక్షంలో కొంత గడువివ్వగలను..."
"నన్ను వదిలిపెట్టలేవా?"
"వదిలిపెడతాను-డబ్బిస్తే!"
"ఎంతకాలం?"
"అడిగినప్పుడల్లా అయిదువేలు. ఎన్నిసార్లు డుగుతానొ నాకే తెలియదు ఆలోచించుకో!"
ఆమె ఆర్ధికస్థితి నాకు తెలుసు. నా షరతు వినగానే ఆమె "నీకు డబ్బెందుకు?" అంది.
"డబ్బడిగే ఆడవాళ్ళకివ్వడానికి...."
రామావతారం మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయింది.
