Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 3


    జేవీ ఇంకా టైప్ చేస్తూనే ఉంది. వెళుతున్నానని చెప్పిదస్తీతో ముఖం ఒత్తుకుంటూ ఇవతలికి వచ్చింది. హాల్లో గడియారం అయిదున్నర చూపిస్తున్నది. రోజు పని రోజు చేసుకోలేని మహానుభావులు ఆ వేళ ఇంకా పని చేస్తూనే ఉన్నారు. అయ్యగారు వెళ్ళి పోవడంచేత ఫ్యూన్లు కునికిపాట్లు పడుతున్నారు.
    ఆమె అకౌంటెంట్ వైపు నడిచింది.
    సునీత అడుగుల చప్పుడు విని, అకౌంటెంట్ తలఎత్తి చూశాడు. సునీత కుర్చీలో కూర్చున్నది. అందరిలా- కనీసం మొదటి తేదీనాడైనా- ఆమె నమస్తేలు ముట్ట చెప్పదని అతనికి అనుభవం. వ్రాస్తున్న ఫైలు పక్కకు జరిపి, పేమెంట్ రిజిస్టరు తీశాడు. కాసేపు దానిమీద బరబరా గీకి, దానిని సునీతకు అందించాడు. ఆమె కలం అందుకుని సిరాలో ముంచి, సంతకం చెయ్యబోతూ, అక్కడ వేసిఉన్న సంఖ్యను చూసి, "ఇదేమిటి! నూటయాభై అని వేశారు?" అన్నది.
    పిన్ లో నుండి తీసిన కొత్త కరెన్సీ నోట్లను లెక్క పెడుతూ, "అదా? అదంతే! ప్రొప్రయిటర్ గారి అబ్బాయి వేణు బొంబాయి నుంచి అయిదో తేదీని వస్తున్నారు. అందరికీ యాభై రూపాయలు బోనసు ఇమ్మన్నారు" అంటూ పదిహేను పది రూపాయల నోట్లు అందించాడు.
    "వేణు వస్తున్నారా?" రిజిస్టరు అతనికి ఇచ్చేసి కలం స్టాండులో పెట్టింది.
    "ఆఁ! ఆఁ! సరిగా స్టాంప్ మీద సంతకం చేశావు కదా! అవి లెక్కపెట్టుకో!" ఒక వైపు చెపుతూనే తన వ్రాతలో మునిగిపోయాడు.
    అదేమీ వినిపించుకోలేదు. యాంత్రికంగా ముందుకునడిచింది. యాభై రూపాయలు బోనసు వచ్చినా, ఎందుకో ఆమెకు సంతోషంగా లేదు. పరధ్యానంగానే బస్సుస్టాప్ దగ్గరికి వచ్చింది. బస్సు వచ్చింది కానీ ఖాళీ లేదని ఆగకుండానే వెళ్ళింది. ఎంత సేపు చూసినా మరో బస్సు రాలేదు. విసుగెత్తి రిక్షాను పిలిచి అందులో ఎక్కింది.
    సునీతను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ఆమెది. అందానికి తోడు పేదరికం, ఆ వాతావరణం. ఒంటరితనం. నిత్య జీవితంలో స్వానుభవాలు, అవి ప్రసాదించిన ఆలోచన, వివేచనా శక్తి ఆమెలో ఎక్కువ. అందుకే ఆమె భావాలు అతి విచిత్రంగా అనిపిస్తాయి. దేన్నీ అంత సులభంగా ఫలానా అని నిర్ణయించదు. ఆ నిర్ణయాలకు ముందు ఎంతో విత్కరం ఉండి, సూటిగా ఉంటాయి. ఇరవై ఏళ్ళయినా నిండని వయస్సులో, నా అన్న వాళ్ళెవ్వరూ లేకపోయినా, ఎంతో నిబ్బరంగా జీవయాత్ర సాగిస్తున్న ఆమె ఆత్మవిశ్వాసం ప్రశంస నీయం. సాధారణంగా ఆమె లాంటి స్త్రీలు అరుదు.
    రిక్షా దిగి, డబ్బు లిచ్చేసి, గేటు తెరుచుకుని లోపలకు వచ్చింది. ఇంటాయన యాదగిరి. వరండాలో వాలుకుర్చీ వేసుకుని కళ్ళు సగం మూసి, వెనక్కు ముందుకు ఊగుతున్నాడు. సునీత తన వాటా తాళం తీసి లోపలకు వెళ్ళింది. శీతాకాలం కావడం వల్ల త్వరగా పొద్దుగూకి, ఇల్లంతా మసక చీకటిగా ఉంది. లైటు స్విచ్ ఆన్ చేసి, చీర అయినా మార్చుకోకుండా, బెడ్డింగు తల కింద వేసుకుని పడుకుంది.
    వేణు రావటం ఆమె కేమాత్రం సంతోషం కలిగించలేదు. అసలు ఇవ్వాళ ఫస్టు కాకున్నా బావుండేది. అతను వస్తున్నాడంటే, తనేదో నేరం చేసిన దానిలా బాధపడుతున్నది. ఎంత ప్రయత్నించినా మామూలు స్థితి రావటం లేదు.
    రోజూ రాగానే తనలో తను పాటలు పాడుకుంటూ, మధ్య మధ్య వంట చేసుకుంటున్నట్లు నిదర్శనంగా చప్పుడవుతున్న గిన్నెలతో, సందడిగా ఉండే సునీత, అసలు ఉందో లేదో అన్నట్లుంది. వంట ప్రయత్నం కూడా చేస్తున్నట్లు లేదు.
    ఇంటాయన యాదగిరి కి ఇదేం నచ్చలేదు.
    ఇవ్వాళ ఒకటో తారీఖు అనీ, జీతం తీసుకుంటా ననీ పొద్దున హుషారుగా కబుర్లు చెప్పి, నవ్వించి, రాజు నెత్తిని రెండు మొట్టికాయలు వేసి వెళ్ళిన సునీత, అంత నిరుత్సాహంగా ఎందుకున్నదీ? జీతాలు ఇవ్వలేదా?
    యాదగిరి లేచి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. లోపలికి వెళుతూ, "సునీతా! అమ్మాయ్, సునీతా!" అని పిలిచాడు.
    "ఉఁ! ఉఁ!" సునీత కంఠం సన్నగా వినిపించింది.
    "అన్నమైనా వండుకున్నట్లు లేదు."
    సునీత లేచి కూర్చుంది. యాదగిరి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆ క్షణం సేపట్లో గదినంతటినీ పరిశీలించాడు. కిటికీకి అవతల వంటఇంట్లో విశ్రాంతిగా ఉన్న స్టౌ కనిపించింది .
    "ఆ స్టౌ అంటే విశ్రాంతిగా కూర్చుంది. మరి మన ఉదరుల వారు కూడా అలా ఊరుకుంటారా? రాత్రికి భోజనం ఎలా గమ్మాయి?"
    "చేతకావడం లేదు."    
    "ఆ హోటల్ మెతుకులు తెప్పించుకుంటా నంటావు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నాతో చెపితే నేను ఏర్పాటు చేద్దునే?"
    "ఆఁ! మీ కెందుకు, బాబాయ్, శ్రమ?"
    "శ్రమా? శ్రమ ఏం ఉంది? అసలు శ్రమ అనేది లేనిదే మానవజాతి ఇంత మనహోన్నత స్థితిలో ఉండేదంటావా? శ్రమ అనేది ప్రతి పనికీ ఉండవలసిన లక్షణం. అది తప్పనిసరి! మానసిక శ్రమ కాని, శారీరక శ్రమ కాని లేకపోతే మనిషి మనిషి కాదమ్మా! ఉండు, ఉండు. రాజుకు బియ్యం ఎసరెక్కించమని చెప్పి వస్తాను." ఆయన లేచాడు.
    సునీత ఎదురు చెప్పలేదు.
    యాదగిరితో అదే చిక్కు. ఇటువంటి మాటలు వస్తే చిన్నసైజు ఉపన్యాసం చెబుతాడు. అవి ఆణిముత్యాలు. విందామన్నా ఎవ్వరి నోటా వినపడని జీవిత సత్యాలు. యాదగిరి మాటలు వినాలంటే సునీతకు ఇష్టమే. కాని, ఇప్పుడు మాత్రం వినే ఓపిక కూడా లేదు.
    ఓ గంట అయ్యాక రాజు అన్నమూ, కూరలూ పట్టుకు వచ్చి స్టూలు మీద ఉంచాడు. "చల్లారక ముందే తినమని చెప్పారు" అని వెళ్ళాడు.

                                  *    *    *

    పొట్టిగా దృఢంగా ఉండే యాదగిరి, మరో నాలుగైదేళ్ళతో షష్టి పూర్తి చేసుకుంటాడంటే ఎవరూ నమ్మరు. ఒకప్పుడు బట్టల వ్యాపారంలోనూ, కంట్రాక్టరుగానూ లక్షలకొద్దీ సంపాదించాడు. ఆయన జన్మస్థలం ఖమ్మం. ఆర్జించేదంతా ఖర్చుపెట్టడానికే తప్ప. రేపటికోసం వెనకేసుకోటానికి కాదంటాడు. ఆనాడూ, ఈనాడూ కూడా ఆయన 'రేపు'ను గురించి ఆలోచించలేదు. 'రాబోయే రేపును గురించి విచారిస్తూ కాలం వ్యర్ధం చేసేదానికన్నా, ఈ రోజును ఆనందంగా గడపటానికి ప్రయత్నించు. బతికి బావుంటే రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు!' ఈ రకమైన ఆయన ఆదర్శాలన్నీ ఇప్పుడు చాలావరకూ తగ్గిపోయాయి. ఆయనే అంటాడు-ఏది చెప్పాలన్నా, చెయ్యాలన్నా ఆ రోజుల్లో ఉన్నంత ఉత్సాహం లేదని.
    స్వాతంత్ర్యం శంఖారావం ఆయనను బాగా ఆకర్షించింది. కొద్దో గొప్పో దానిలో పాల్గొంటూనే, ఇటు వ్యాపారం చేసేవాడు. అయితే ఉద్యమాలకూ, వ్యాపారాలకూ పొత్తు కుదరలేదు. రెండు రోడ్లు కంట్రాక్టు తీసుకుంటే లక్ష రూపాయలు నష్టం వచ్చింది. మరొకడైతే జారున గుండె పగిలి చచ్చేవాడేమో! కాని యాదగిరి నవ్వుతూ, అంతటితో తనకూ, దానికీ ఋణం తీరిందని అంటుంటే తోటి వ్యాపారస్థులు నోరు ఆవలించేవారు. మిగిలింది బట్టల దుకాణం. అది మరొక భాగస్థుడు నిర్వహిస్తూ ఉండేవాడు కనక దాని విషయం ఆయన మరీ పట్టించుకోలేదు.
    ఇప్పుడు యాదగిరికి వ్యాపారాలు కానీ, బాధ్యతలు కానీ ఏమీలేవు. కాలవాహినిలో అంతా కొట్టుకు పోగా మిగిలిన కొండంత ఆస్తి, ఆయన స్మృతులు మాత్రమే.
    ఇద్దరు కొడుకులు ఉన్నా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. వాళ్ళు చెరోచోట గెజిటెడ్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడాయన ఉంటున్న ఇల్లు వాళ్ళు కట్టించుకున్నదే. ఇద్దరూ ఉండటానికని రెండు భాగాలుగా కట్టించుకున్నారు. వాళ్ళు మరో చోటికి వెళ్ళినా ఆయన ఇక్కడే ఉన్నాడు.
    రెండవ వాటా అద్దెకివ్వకపోయినా ఆయనకు గడవదన్న బెంగ లేదు. డబ్బు కావాలంటే కొడుకులు పంపుతారు. వండి పెట్టేందుకు రాజు ఉన్నాడు. దిక్కులేనివాడు రాజు. వంట వచ్చు. ఆయన దగ్గరే ఉంటాడు.
    ఊరు మునిగిపోతుందన్నా, మిన్ను విరిగి వెన్నుమీద పడటానికి సిద్ధంగా ఉందన్నా తొణకడు, బెణకడు. గుబురుగా ఉన్న మీసాల మధ్యనుంచి నవ్వుతూ, "అదైతే జరగనీ, చూద్దాం" అంటాడు.
    సునీతను మొదటిసారి చూసినప్పుడు ఆయన ఓ విధమైన ప్రకంపనానికి గురైనాడు. ఓ విధమైన ప్రకంపానికి గురైనాడు. ఆమె రూపం యాదగిరికి గతస్మృతులేవో కళ్ళకు కట్టించింది. సునీత రూపం ఎక్కడో చూసినట్లే ఉంది. మాట కూడా పరిచయమైదానిలాగే ఉంది. ముఖ్యంగా క్రింది పెదవి, దానికి క్రింద కొద్దిగా కుడివైపున ఉన్న పుట్టుమచ్చ అంతా అదే. కానీ పేరు, వయస్సు ఆమె మరొక వ్యక్తి అని ఋజువు చేస్తున్నాయి. వాత్సల్యం చుట్టుముట్టగా, సునీత అడిగిందే తడవుగా ఖాళీగా ఉన్న వాటా చూపించాడు. అద్దె చాల తక్కువ చెప్పాడు. సునీత తన ఇంట్లో అద్దెకు ఉండాలని కోరుకున్నాడు. అలాగే జరిగింది.
    
                                *    *    *

    సునీత ఉదయం లేచేసరికి ఏడయింది. ఆదరా బాదరా లేచి మొహం కడుక్కుంది. కాఫీ పెట్టు కుందామని స్టౌకోసం కిటికీ దగ్గరకు వెళితే అది లేదు. సునీతకు ఒళ్ళు మండింది. అప్పుడప్పుడు, కట్టెలు మండటం లేదని రాజు తీసుకువెళుతుంటాడు. వంట చేస్తున్నట్లున్నాడు, పోపు వాసన కమ్మగా ముక్కులో దూరుతున్నది. సునీత కోపంగా వాళ్ళ వంట ఇంటికీ, తనున్న వంట ఇంటికీ మధ్య నున్న కిటికీ తెరిచింది. రాజు స్టౌమీద ఉన్న గిన్నెలో కూర కలియబెడుతున్నాడు.
    "ఏయ్ రాజూ! నిన్నెవర్రా స్టౌ ముట్టుకోమన్నారు?"
    "మరే! బాబుగారు చెప్పారు. ఇకనుంచి మీకూ, వారికీ కలిపి వండమన్నారు." గుడ్డతో గిన్నె దింపాడు.
    "కలిపి చెయ్యమన్నారా?"
    "ఆఁ! స్టౌ మీద అయితే తొందరగా, మీ ఆఫీసు వేళకు అందుతాయని నేను వద్దంటున్నా తనే తెచ్చారు. మీకు కాఫీ ఫ్లాస్కులో పోసి చిలక్కొయ్యకు తగిలించాను." సునీతను చల్లబరుస్తూ, ఇందులో తన ప్రమేయమేమీలేదని స్పష్టపరిచాడు రాజు.
    యాదగిరి తత్త్వమే అంత. తనేది చెయ్యదలుచుకున్నాడో అది చేసే చూపిస్తాడు. అంతే తప్ప తను చెయ్యబోయేదాన్ని గురించి ఒక్క మాట అయినా జారడు.
    ఉదయం ముందర వసారాలో, పాతకాలం నాటి ఆ వాలుకుర్చీలో కూర్చుని రామకోటి వ్రాసుకోవటం ఆయన దినచర్యల్లో ఒకటి. అక్కడికి వచ్చింది సునీత.
    ప్రతినిత్యం రామకోటి వ్రాసే యాదగిరికి పూజా విధానంలో బొత్తిగా నమ్మకం లేదంటే నమ్మడం కష్టం. మనసులో ఉండాలి. నిష్కల్మష చిత్తంతో కొద్దిసేపైనా, సృష్టికి కారణమైన ఈ మహాశక్తి లేక భగవంతుడు అనేవాడిని ఒక మార్గంలో తలుచుకోవడమే, రామకోటి వ్రాయడంలో ఆయన ఉద్దేశ్యం. సర్వాంతర్యామి అయిన ఈ అజ్ఞాతశక్తి, మానవుడిని నైతికమైన సరిహద్దులను అధిగమించకుండా అడ్డు పడుతుంది. నమ్మకం లేనివాళ్ళకు అది ఏవిధంగాను తోడ్పడదు.
    మనసు పరిశుద్ధంగా ఉన్నపుడు, దైవత్వమనబడే గుణం మనిషిలోనే ఉంటుంది. చేసిన పొరపాట్లకు మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడటం, ఒక మనిషిమీద మరొక వ్యక్తి సానుభూతి చూపడం, బాధపడుతుంటే చేతనైన సహాయం చెయ్యగలగడం - ఇదే నిజ మైన మానవత. పరాయి మనిషికి హృదయ పూర్వకంగా సేవ చెయ్యగలిగినవాడు గొప్పవాడు. అది లేకపోతే ఎన్నిపూజలు, పునస్కారాలు చేసినా నిష్ఫలం. శరీరాన్ని శుష్కింపజేసుకుని, దేహమంతా మలినమవుతున్నా తపస్సు పేరిట జడలు పెంచుతూ, శీర్షాసనాలు వేసి బాధపడ నవసరం లేదు. అందరూ నిజమైన  తపస్వులు కాలేరు. దేహం పరిశుభ్రం కానప్పుడు మనసుకూడా నిర్మలంగా ఉండటం సాధ్యంకాకపోవచ్చు. శుచీ, శుభ్రతా అవసరం. అట్లా అని శుభ్రత పేరుమీద అనాచారాలు చెయ్యటం కాదు!
    సాధారణంగా ఆకలి తీరాకనే మనిషి అన్నీ ఆలోచిస్తాడు. ఉపవాసాలు చేస్తే దేవుడు మెచ్చుకుని మోక్షం ఇస్తాడనుకోవటం శుద్ధ అవివేకం. ఆకలి వేస్తుంటే అది తీరే మార్గం యోచిస్తారుకానీ, ఆధ్యాత్మిక చింతనమీద చిత్తం కేంద్రీకరించడం కష్టం. ఈ కఠోర నియమాలు అన్నీ ఆడంబరులైన కొంత మంది లోకం దృష్టిలో గొప్పతనం కోసం సృష్టించినవే! మానవసేవ, మాధవసేవ అన్న మాటలు యాదగిరి అంగీకరిస్తాడు.
    సునీతను చూసి కూచోమన్నట్లు సైగచేశాడు. ఆయన అలవాట్లన్నీ సునీతకు తెలుసు. మరొక కుర్చీలో కూర్చున్నది. ఆ పేజీ వ్రాయటం పూర్తిచేసి, "ఏమిటమ్మాయ్! కాఫీ అయినా తాగనట్లుందే?" అన్నాడు.
    స్వచ్చంగా ఉన్న యాదగిరి కంఠం ధ్వని, సునీత చెప్పదలుచుకున్న మాటల్ని బైటికి రానివ్వలే దొక క్షణం నెమ్మదిగా అన్నది: "రాజు ఇద్దరికీ కలిపి వంట చేస్తున్నాడు, బాబాయ్!"
    పసిపాపలా నవ్వాడు. "ఇద్దరం కలిసి భోజనం చేద్దామని నేనే అలా చెప్పాను."
    "ఇద్దరమా!?" సునీత తెల్లబోయింది. తనెవరు? తన కులమేమిటి? తెలిసే అలా అంటున్నాడా? తెలిసి ఉండదు... "కానీ...కానీ.... నా కులం.."

                                     
    కుర్చీలో వెనక్కు వాలాడు. సునీత మాట ఆయనకు వినిపించింది. "మనుష్యత్వాన్నే విభాగించే ఈ కంటికి కనిపించని గోడలు కులమతాలు. ఇవేకాదు, ఇటువంటి వేమన్నా నాకు వాటిమీద నమ్మకం ఉండదు. మానవుడు దానవుడు కాకుండా మానవత్వంతో జీవించటం గొప్పతనం. కులం, మతం అంటూ గొప్పలు చెప్పుకోవడం, వీటిపేరిట ఈర్ష్యలూ, కక్షలూ పెంచుకుని రక్తపాతం చెయ్యడం-అది దానవత్వం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS