18
"నమస్కారమండీ!" అన్నాడతను. సునీత పరిశీలనగా చూస్తూ, 'ఎవరబ్బా? చూసినట్లుంది' అనుకుంది.
కళ్ళజోడు తీశాడు. "నేనండీ! మోహనమూర్తిని. సుజన తెలు ..."
"ఓ......ఓ......జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు వచ్చారు?"
"రెండురోజులైంది. సుజన కిప్పుడు ఏడోనెల కదూ ..." నవ్వాడు.
"కంగ్రాట్యులేషన్స్. సుజన కులాసాయేనా?"
"ఆఁ! ఆఁ! మిమ్మల్ని రెండుసార్లు జ్ఞాపకం చేసింది. ఒకసారి చూసిపోకూడదూ?"
"ఇప్పుడా ..... సరే ..... అబిడ్స్ లో మారదామా?"
"ఓ ఎస్!"
అబిడ్స్ లో బస్సు మారి, జాంబాగ్ లో దిగారు. ఓ ఫర్లాంగు నడిస్తే ఇల్లు వచ్చింది.
"అబ్బ! ఎన్నాళ్ళకు? ఉత్తరం ముక్కయినా లేదు. పెళ్ళి అయ్యాక అందర్నీ మరిచావు. అవునులే. మాతో ఏం పని?" తనను గట్టిగా వాటేసుకున్న సుజనాను విడిపించుకుని భావగర్భితంగా పరిహాసం చేసింది సునీత, మోహనమూర్తిని చూస్తూ.
"ఊరుకోవే."
పరిచయమైన నాటినుండి గతాన్ని తవ్వుకున్నారు.
"సునీతా, కరుణ తెలుసు గదే?"
"కరుణా?"
"ఆఁ..... ఆఁ .... స్కూల్ ఫైనల్లో ఉండగా మనం నాటకం వేశాం .... అందులో బాక్ గ్రౌండ్ పాటలు పాడిందీ ..."
"ఓ .... ఆమెకు ఆరుగురు అక్కయ్యలు."
"ఆఁ, అదే. నిన్న షాపింగ్ కు వెళితే కనబడిందే! ఉస్మానియా హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తూందిట. మొన్ననే, పదిరోజుల క్రితం ట్రెయినింగ్ అయిపోయి పోస్టింగ్ అయిందిట. వాళ్ళ ముగ్గురక్కయ్యల పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ నాన్న పోయాడుట. వాళ్ళు అసలే పేదవాళ్ళు. ఒక అక్క ఇరుగుపొరుగువాళ్ళ మాటలు భరించలేక బావిలో పడిందిట. ఒకామె లేచిపోయిందిట. ఇంకొకామె విశాఖపట్నంలో టీచర్ గా పని చేస్తున్న అతణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్లిపోయింది. ప్రస్తుతం కరుణ, వాళ్ళమ్మ, తమ్ముడు - ముగ్గురే. వీళ్ళను అదే పోషించాలి. అది మనం విడిపోయిన దగ్గిరనుండీ అంతా చెప్పుకువచ్చింది. జాలివేసింది, అది కన్నీరు పెట్టుకుంటే. మనం ఎరిగిననాటినుండి అదెప్పుడూ అంతే, పాపం!"
మౌనముద్రలో అంతా విని నిట్టూర్చింది.
"సుజా, ఈ జీవితాలే అంత! ఎక్కడో నామ రూపాలు లేకుండా పుట్టి, అలాగే గడిచిపోతాయి. ఏమైనా అందరి జీవితాలు పూలబాటలు కావు!"
మరికొంతసేపు మాట్లాడాక సునీత వస్తూంటే, "అది నీ అడ్రసు అడిగి తీసుకున్నది. ఈ అయిదారు రోజుల్లో తీరిక చేసుకుని కలుస్తానన్నది" అంది.
సుజన అన్నట్లే శనివారంనాడు కరుణ ఆఫీసుకు వచ్చింది. సునీతతో ఓ పావుగంట మాట్లాడి, మరునాడు తనకు ఆఫ్ డ్యూటీ అని. ఇంటికి వస్తానని వెళ్ళిపోయింది. కాని ఎందువల్లనో రాలేదు.
కరుణను చూసి ఇంటికి వచ్చాక, వరండాలో నీల కంఠం పచార్లు చేస్తూ అగుపించాడు. సునీతను చూడగానే పచార్లు ఆపి, దగ్గిరికి రాగానే జేబులోనుంచి ఒక ఇన్ లాండ్ కవరు తీసి ఇస్తూ, "రేపు మా నాన్న వస్తున్నాడట. నా సంగతేమిటో కనుక్కుని పోతాడుట. ఇప్పుడేం చెయ్యాలి, పెద్దమ్మా!" అన్నాడు.
యాదగిరి అక్కడే కుర్చీలో కూర్చున్నాడు. సగం మూసి ఉన్న కళ్ళను సొంతం తెరిచి, "దీనికి కంగారెందుకంటే వినరు. వాళ్ళ నాన్నగారు కోర్టు పనిమీద వస్తున్నారుట. పనిలో పనిగా పెళ్ళి విషయంకూడా ఏదో తేల్చేసి వెళతారుట" అన్నాడు.
"కాదు, పెద్దమ్మా! అర్ధాంతరంగా నాకీ పెళ్లేమిటి?"
"ఇప్పుడు చెయ్యటం లేదుగా? వేసవి సెలవుల్లో అంటున్నారు గదా?" ఆ ఉత్తరం చదివిన సునీత అంది.
"అవెన్నాళ్ళున్నాయి! ఈ టైమ్ లో నేను ఎవర్నని ఎన్నుకోవాలి? ఆలోచించుకోటానికి టైమేదీ? ఏమో? తాతయ్యగారు అదో తరహా మనుషులు."
"దీనికీ తరహాయేనా? వారైతే వచ్చి పోనివ్వండి. నేను మీకు తగిన అమ్మాయిని నిర్ణయించాను. వెళ్ళి చూద్దాం. లేదా మీ నాన్నగారితో కలిసే వెళదాం."
"నిజం? రేపు రాత్రి ఎప్పుడో వస్తాడు. ఎల్లుండి పనిమీద తిరిగి ఆ రాత్రే చలో ఆయనకు తీరికెక్కడిది?"
"మరి మీరాయనను కలుసుకునే దెప్పుడు?"
"అంటే సోమవారం మనం సెలవు పెట్టి ఆయన వెంట తిరగాలి!"
"సరే! మీ ఇష్టం."
నీలకంఠం తండ్రి వచ్చాడు. ఆయన హోటల్ లో దిగాడు. తన పెళ్ళివిషయం కదలేసినప్పుడు, "రెండు మూడు రోజుల్లో ఏదైందీ రాస్తాను" అన్నాడు.
"బామ్మ తొందరపెడుతున్నది. మమ్మల్ని బతక నివ్వటం లేదు. నువ్వు ఇంకా ఎన్నాళ్ళీ ఒంటరితనం? నాకుకూడా ఏమీ బాగులేదు" అంటూ రెండు మూడు చురకలు అంటించాడు. ఎన్ని అన్నా నీలకంఠం కిమ్మనలేదు.
ఆరాత్రి ఆయనను పంపించేసి, సునీతకు మరొకసారి గుర్తుచేసి తృప్తిగా నిద్రపోయాడు నీలకంఠం.
అతన్ని తీసుకువెళ్ళేముందు సునీత చెప్పింది? "నేను మీకు చూపించబోయే అమ్మాయి నిరుపేద కుటుంబానికి చెందినది. అందమైనదే. మంచి గాయని. మీరు కోరుకున్న సహనం ఆమెలో పరిపూర్ణమై ఉంది. మిమ్మల్ని నీడలా వెన్నంటి, తన సేవలతో మీ జీవితాలను సుఖమయం చేస్తుంది. సందేహం లేదు. కాని ... ఆమెనుండి మీరు కట్నం కనుక లేమైనా ఆశిస్తే, అని అలభ్యం."
"పోనివ్వండి. అవేమంత ముఖ్యం కాదు. మా అమ్మ, నాన్న, బామ్మ ఆశించినట్లు నన్ను మరమ్మత్తు చెయ్యగల ఎక్స్ పర్ట్ అయితే, వాళ్ళుకూడా ఇవేమీ కావాలనకుండానే ఓకే అని బిల్ పాస్ చేసేస్తారు."
"మరొక సంగతి. కుటుంబం సాంప్రదాయికమైనదే! కులగోత్రాలు - అన్నీ కావుగాని, ముప్పాతిక మూడు వంతులు మీకు సరిపడతాయి. కాకపోతే, గతచరిత్ర తవ్వుకోవటం అంత మంచిది కాదు. కాని ఆమెమాత్రం సచ్చీల!"
"నెవర్ మైండ్! గతం తవ్వుకునే అవసరమే లేదు. మీరు ఎన్నిక చేసినదానిలో నాకే వంకలూ అవుపించవు."
చీకట్లు ముసురుకుంటున్నాయి. కాచిగూడాలో ఒక పాతకాలం పెంకుటింటిముందు వాళ్ళిద్దరూ ఆగారు. సునీత పిలిచింది "కరుణా!" అని.
"ఆఁ... ఎవరూ?" కరుణ వచ్చి తలుపు తెరిచింది. సునీతను, నీలకంఠాన్ని చూసి, "రండి. రావే, సునీతా!" అంటూ వెనక్కు అడుగు వేసింది. వాళ్ళు లోపలికి వచ్చారు. ఒకే ఒక స్టూలు ఉన్నది. దానిమీద ఉన్న గ్లాసు తీసి, "కూర్చోండి. నువ్వా కిటికీమీద కూచోవే. కాఫీ తెస్తా" అంది.

"సరే, నాకే ఆ కిటికీ తగిలించావన్నమాట! ఇంతకీ మీ అమ్మ ఏదీ? మొన్న నువ్వెందుకు రాలేదు?"
"అమ్మ శిశుసంరక్షణ కేంద్రానికి వెళ్ళింది."
"అక్కడేమైనా జాబ్ లో ..."
"అదేం లేదు. అక్కడ ఆవిడ స్నేహితురాలు ఒకామె ఉంది. ఆమె సహాయంవల్ల అందులోనే చిన్న పని సంపాదించాలని..."
"బుట్టలో వెయ్యటానికి వెళ్ళిందన్నమాట!"
కరుణ గమ్మత్తుగా నవ్వి, "మొన్న పనుండి రాలేదు. అరే ... కాఫీ .... ఉండుండు..... నీళ్ళు మరుగుతున్నట్లు న్నాయి" అని గబగబ వెళ్ళింది, వంటింటివైపు.
నీలకంఠం ఇంటిని శల్యపరీక్ష చేస్తున్నాడు. సునీత అతన్ని అక్కడే వదిలి వంటింటిలోకి వెళ్ళింది. కరుణ డికాక్షన్ లో పాలుపోసి కుంపటి విసురుతున్నది. ఓ పీట వేసుకుని కూర్చుంటూ, "కరుణా, అతనెలా ఉన్నాడే?" అంది.
"ఎవరు? నీ వెంట వచ్చినతనా? బావున్నాడు."
"పేరు నీలకంఠం. ఈ సంవత్సరమే లెక్చరర్ అయ్యాడు. పరధ్యానం మనిషిలే! పుస్తకాలు ఉంటే అన్నం, నీళ్ళూ అవసరం లేదు. ఇంకా పెళ్ళి కాలేదు."
"ఏమిటేవ్? పెళ్ళిళ్ళ పేరమ్మవయ్యావా, ఏం కథ?"
"అనుకోవే. ఇంకా దాయటమెందుకుగాని, అతను నిన్ను చూడటానికి పెళ్ళిచూపులకు వచ్చాడు!"
"నీమొహం! నీదంతా చోద్యం."
"కాదే! ఒట్టు."
"నీకెందుకీ తాపత్రయం? నువ్వు చేసుకోరాదూ?"
సునీత రూక్షంగా చూసింది. "కరుణా, అతను నా సోదరుడు."
కరుణ వెలవెలబోయింది. సునీత చూపును తప్పించుకుని, "పొరపాటు అయిందే! ఏమనుకోకు" అన్నది.
"అని అందరూ అనే మాటలే, కరుణా. ఈసారి కాఫీ ఇవ్వటానికి వచ్చినపుడు బాగా చూడు. నీ ఇష్టానిష్టాలు తెలియజేస్తే ..... తరవాత అన్నీ తీరికగా మాట్లాడుకోవచ్చు."
నీలకంఠం పిలిచాడు: "పెద్దమ్మా!"
"విను, కరుణా, ఆ పిలుపులో నువ్వనుకున్న అనుబంధాలు గోచరిస్తాయేమో?"
కరుణ కాఫీ రెండు కప్పులలో పోసి ఓ పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చింది. నీలకంఠానికి, సునీతకు ఇచ్చింది. నీలకంఠాన్ని కొంచెం కళ్ళెత్తి చూసింది. అతను ఆమెనే చూస్తున్నాడు. కరుణ ఆ చూపులకు సిగ్గు జోడించి అవనతశిరస్క అయింది.
ఎంతసేపు ఉన్నా ఆమె తల్లి రాలేదు. నీలకంఠం ఏ ప్రశ్నా వెయ్యలేదు. కరుణ తమ్ముడు ఎనిమిదింటికి వచ్చాడు. వచ్చి, తల్లి శిశుసంరక్షణ కేంద్రంలోనే ఆ రాత్రి పడుకుంటుందని అక్కతో చెప్పాడు.
* * *
వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామం వెళ్ళి, సునీతకు ఉత్తరం వ్రాశాడు నీలకంఠం. అందులో సునీతకు ఆసక్తి కలిగించిన విషయంకూడా ఉంది.
"పెద్దమ్మకు, నమస్తే!
