Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 29


    "నీతా,
    అందమైన నీ పేరులో ఉచ్చరించడానికెంతో తియ్యగా ఉండే అక్షరాలను, టైపు రైటరు దిమ్మల కింద కర్కశంగా నలగకొట్టదలుచుకోలేదు."
    'కవులుగూడా అయ్యారు, వేణూ.' స్వగతం చెప్పుకుంది.
    'పుట్టినరోజు పండుగ అంటే ఏదో ఒక బహుమతి తప్పకుండా తీసుకువెళ్ళాలి. నెల చివరి రోజులు. డబ్బు? కనీసం ఓ పాతికైనా ఉండాలి. ఎలా?'
    సునీత మెడ తడుముకున్నది. సన్నని ఒంటిపేట గొలుసు తగిలింది. అది అమ్మితే ఓ యాభై రూపాయలు రావచ్చు. దాన్ని రెండుసార్లు బోనసులు దొరికి నప్పుడు మిగిలినడబ్బుతో కొనుక్కున్నది. అది అవసరానికి ఆదుకున్నది.
    దాన్ని బాగ్ లో వేసుకున్నది. ఉదయం ఆఫీసుకు వెళుతూ షాపుకు వెళ్ళింది. అరవైరెండు రూపాయలు వచ్చాయి. అదే షాపులో, యాభై రూపాయలకు వేణు చిటికెనవేలికి అందంగా ఉంటుందని ఓ ఉంగరం కొన్నది. మిగతా పన్నెండు రూపాయలు, తన దగ్గిర ఉన్న పదమూడు రూపాయలు కలిపి, రాధకోసమని చిన్నగాజు పెట్టెలో కదలకుండా తాపటం చేసిన, మురళీకృష్టుని విగ్రహం కొన్నది. మురళి వాయిస్తున్న బాలకృష్ణుడు ఎటునుండి చూసినా చక్కని భంగిమలో అగుపిస్తాడు.
    యాదగిరి ఆ సాయంత్రం అడగనే అడిగాడు. మెడలో గొలుసు లేదేమని. సునీత అబద్ధం చెప్పలేదు. అమ్మేశానన్నది. ఎందుకని ఆయన అడగనూలేదు, చెప్పనూ లేదామె!
    యాదగిరికి, నీలకంఠానికి గూడా ఆహ్వానాలు పంపబడ్డాయి.
    కాలేజీ ఫంక్షన్లు ఉండటంచేత తను రాలేనని, రెండు ఎన్ సైక్లోపీడియాలు కొని, ఆరోజు తన కానుకగా వేణుకు, రాధకు ఇమ్మని సునీతకు ఇచ్చాడు.
    యాదగిరి స్పష్టంగా చెప్పాడు: "నాకు రావాలని లేదమ్మా. వేణుకు, రాధకు, ఆర్తికి నా శుభాకాంక్షలు చెప్పు."
    బర్త్ డే ఆదివారం నాడు.
    నీలంకంఠం ఇచ్చిన పుస్తకాలతో, తన బహుమతులతో ఆ రోజు తొమ్మిది గంటలకే వెళ్ళింది. అప్పటికి విశ్వం నిర్మలతోసహా వచ్చాడు. ఆర్తి సోఫాలో వారి కెదురుగా సాలోచనగా కూర్చుంది. రాధ హడావిడిగా తిరుగుతూ ఉంది. వేణు కారుమీద ఎక్కడికో వెళ్ళాడు. ఇంకా అతిధులెవరూ రాలేదు. అప్పుడే ఒక్కొక్కడే వస్తున్నారు.
    అందరి హుషారూ రాధలో కనిపిస్తున్నది. కంచి పట్టుచీరతో, విశాలమైన నల్లని కాటుకకళ్ళతో చిరునవ్వులు చిందిస్తున్న రాధను చూసి, చాలామంది అతిథులు వేణు భార్య అనే అనుకున్నారు.
    ఆర్దరిచ్చిన కేక్స్, కొవ్వొత్తులు వగైరా  సరంజామాతో వేణుకూడా వచ్చాడు. అన్నీ అమర్చే పని రాధ తీసుకున్నది. వేణు సునీతను చూసి, "ఏమిటో విజ్ఞాన మంతా రెండు పుస్తకాల్లో అమర్చి తెచ్చావు!" అన్నాడు.
    "ఇది నీలకంఠంగారి పని!"
    "వారు రాలే దెందుకని? మీ బాబాయేరి?"
    వాళ్ళు ఎందుకు రాలేదో చెప్పింది.
    పదిన్నరకు వేణు, రాధ పోటీలుపడుతూ కొవ్వొత్తులు ఒక్క ఊదుతో ఆర్పేసి కేక్ కోశారు. అతిథులు చప్పట్ల మధ్య వేణు కేక్ లో కోసిన మొదటి ముక్క రాధ నోటికి అందించాడు. లజ్జిత అయి తనూ అలాగే చేసింది రాధ. చిట్టచివరి వంతు సునీతది. కాని రాధ మూడవ వంతుగా ఆమెకు అందించింది.
    విందు అనంతరం తమ తమ కానుకలను అందించి, శుభాకాంక్షలు చెబుతూ, వచ్చినవారు ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు. మిగిలినవారు విశ్వం, నిర్మల, సునీత.
    విశ్వం కొడుకు బాజీ కింద కేకుముక్కలతో ఎవరి దగ్గిరికి రాకుండా ఆడుకుంటున్నాడు. ఎవరి దగ్గిరికి వెళ్ళని బాజీ, ఆర్తి ఎత్తుకుంటే వెళ్ళాడు.
    విశ్వం తను తెచ్చిన రెండు వెండి పళ్ళాలు ఇస్తూ, "నీ పేదమిత్రుని కుటుంబం తరఫున, భోజనంచేసే చల్లని వేళల్లో జ్ఞాపకం చేసుకునే అభిమతంతో మీ ఇద్దరికీ ఈ పళ్లాలను ఇస్తున్నాను" అన్నాడు,
    వేణు వాటిని నిండైన నవ్వుతో అందుకుని రాధ కిచ్చి, "నీ స్నేహాభిమానాలకు సర్వదా కృతజ్ఞులం" అన్నాడు.
    "మై ప్రెటీ బోయ్, ఫర్ గెట్ మీ నాట్!"
    సునీత నీలకంఠం పంపిన కానుక అందజేసింది. థాంక్స్ చెప్పమన్నాడు వేణు. యాదగిరి శుభాకాంక్షలందజేయగా విని, "ఆయనకూ థాంక్స్" అని వేణు అన్నాడు.
    "మరి నీ ప్రెజంట్ ఏదోయ్?"
    వేణు అంటుండగానే చేతిలో కాగితం చుట్టి ఉన్న గాజుపెట్టె కాగితం తీసివేసి రాధకు ఇస్తూ, "అందులో మీ బావే ఉన్నాడు" అంది.
    ఆమె కపోలాలు ఎరుపెక్కాయి.
    "కొత్త పెళ్ళికూతురులా తల వంచుకుంటారేం, రాధా?" నిర్మల వ్యాఖ్య.
    విశ్వం అందుకున్నాడు. "పాపం! నువ్వు పెళ్ళికూతురైనప్పుడు తలెత్తి అలా చూస్తూంటే పురోహితుడు మందలించాడు కదూ?"
    పెదిమ పంటితో నొక్కిపట్టింది నిర్మల, పెళ్ళి నాటి స్మృతులు తెచ్చిన లజ్జాభావంతో.
    "బ్యూటీఫుల్! ఆ వదనారవిందం ముద్దువస్తూ ఎంత బావుందని!"
    తన మాట తనకే తగిలినందుకు రోషం వచ్చింది నిర్మలకు.
    "నీళ్ళు మరుగుతున్నాయి." విశ్వం మరో సమిధ వేశాడు.
    రాధ నవ్వాపుకోలేక కిలకిలా నవ్వింది.
    అంతటితో ఆ సంభాషణ ముగిసింది. సునీత బాగ్ లో నుంచి చిన్న పెట్టె తీసి, "ఇది....ఈ ఉంగరం మీకు" అంది ఇస్తూ.
    తీసుకుని ముందుకు కొద్దిగా వంగి, "శ్రమపడ్డావు థాంక్స్!" అన్నాడు.
    సునీతకూడా మందహాసంతో, "రాధా, రోజూ ఆ వేణును పూజించాలి!" అంది.
    వెంటనే విశ్వం మరో మాట వదిలాడు. "ఇదిగో, రాధమ్మా! పెళ్ళి కాకముందే నువ్వు అలా సిగ్గుపడుతున్నావు. మ్ ఆవిడ చూడు. పెళ్ళిలోనే అలా మొహంలోకి చూస్తూ 'ఏయ్, విశ్వం!' అని పిలిచే సింది."
    కుంచించుకుపోయింది నిర్మల. "చాల్లెండి" అని మాత్రం అనగలిగింది.
    "రేయ్, బ్రదర్, చాల్లేరా?" వేణు కళ్ళతో సైగ చేశాడు.
    విశ్వం ఆర్తివైపు చూశాడు. అప్పటివరకూ ఆర్తి ఒక్క మాటకూడా అనలేదు. నిశ్చలంగా ఉంది. "అక్కా...." వేణు పిలిచాడు.
    ఆర్తి తన చేతిలో ఉన్న బాజీని విశ్వానికి అందిస్తూ, "ఇప్పుడే వస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి" అని అక్కడినుంచి కదిలింది.
    రాధకూ, సునీతకూ అదేమిటో, ఆమె అలా ఎందుకు అన్నదో అంతుబట్టలేదు. పిలవబోతే, వేణు నోటిమీద వేలుఉంచి "శ్.....శ్...." అన్నాడు. సునీత ఊరుకుంది.
    ఆర్తి, సారధి ఉండగా వాళ్ళు మసిలిన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
    "బావ ఉండగా - ఇంకొక రెండు నెలలకు వెళ్ళి పోతాడనగా-అక్కయ్య బర్త్ డే కూడా ఇట్లాగే నవ్వులతో, హాస్యాలతో గడిచింది. అదె పునశ్చరణ చేసుకుంటూంది." వేణు అసలు కారణం విడమర్చాడు.
    మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళారు విశ్వం, నిర్మల. సునీతకూడా వెళతానంటే రాధ బలవంతం చేసింది సాయంత్రందాకా ఉండమని. సునీత కాదనలేదు.

                                *    *    *

    ఆఫీసుకు ఫోన్ చేసింది ఆర్తి, అయిదు గంటలకు ఒకసారి రమ్మని.
    ప్రైవేట్ రూమ్ లో ఉన్న ఒక చిన్న ఇనప బీరువాలో నుండి నాలుగు ఫోటోలు తీసింది. వాటిని సునీత ముందు పరిచింది. అడగకుండానే చెప్పసాగింది;
    "ఆయన నా జీవంలో జీవమై అఖండమైన వెలుగుగా నా బతుకును వెలిగించినప్పుడు ఇవి తియ్యబడ్డాయి. ఆ నాలుగింటిలో ఒకటి ఆయనే తీశారు. అందులో నేనొక్కదాన్నే ఉన్నాను. మిగతావి నేను జరుపుకున్న చిట్టచివరి బర్త్ డే నాడు, మా ఇద్దరినీ కలిపి వేణు తీసినవి. ఆరోజు, నిన్నటిలాగే, మధురమైన హాస్యాక్తుల మధ్య మరుపురాని విధంగా గడిచింది. ఒక అతిథి కుటుంబంలో పాపాయిని ఎత్తుకున్నప్పుడు 'నువ్వూ తల్లివై నిండుగా మాతృత్వం తొణికిసలాడే ముఖవర్చస్సుతో నా కెన్నడు దర్శనమిస్తావు, ఆర్తీ?' అన్నారాయన. ఆ క్షణాలు ..... ఆ క్షణాలు ..... పాపా, నేను వర్ణించలేను. అప్పటికీ ఇప్పటికీ నేను తల్లిని కాలేకపోయాను. నిన్న నేను ఏమీ కల్పించుకోకుండా ఉన్నది. ఇది మనస్సును కెలికిన కారణంగానే!"
    "నిన్న వేణుగారేవో రెండు మాటలు చెప్పారు, డాక్టర్!"
    "విన్నాను, వినబడ్డాయి. ఇప్పుడే, నేను నిన్ను పాపా అంటూ ఎందుకింత దగ్గిరగా లాక్కుంటున్నానో చెప్పాలనుకుంటున్నాను."
    "చెప్పండి!" ఆసక్తిగా అంది.
    "దాదాపు ఇరవై ఏళ్ళు నిండవస్తున్నాయి. నేను చిన్నదాన్ని. జ్ఞాపకం ఉంచుకోగలిగిన వయస్సే అప్పట్లో నాన్న స్వంత చెల్లెలు అత్తయ్య ఉండేది. అమ్మకన్నా ఆమెదగ్గిరే నాకు చనువెక్కువ. ఆమె అంతా నీలాగే ఉండేది..."
    "డాక్టర్..." అంజడిగా అంది సునీత.
    "అవును. తేడా ఏమీ లేదు. కాని.....కాని.... ఆమె సుమారు నీ వయస్సులో ఉండగా మరణించింది..."
    "ఎందుకు? ఎందుకు మరణించింది?"
    "మనుషులు ఎందుకు మరణిస్తారు, పాపా?" అయిష్టంగా ఉందా వాక్యం.
    "తరవాత ఏమయింది?"
    "తరవాత ఏమీ లేదు. అదే రూపంతో నువ్వు సాక్షాత్కరించావు. ఈ ఉద్యోగమూ, ఇదంతా నీకూ తెలుసు. వేణు కిదేమీ తెలియదు. అప్పటికి మూడు నాలుగేళ్ళ పసివాడు."
    "ఊఁ!"
    "నిన్ను చూస్తే నాలో ఏవో మాతృభావాలు ఉద్ధృతంగా పొంగివస్తాయి. నీ బుగ్గలను, నుదురును గాఢంగా ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది. నే నెలాగూ బిడ్డలు లేని తల్లిని, నువ్వు నా పాపవు అనుకుని తృప్తిపడతాను. నిన్నే ఎందుకనుకోవాలనుకుంటా వంటావు! నీకు....నీకు.....ఎవరూ లేరని తెలుసు. అందుకే .....నేను నీ సంరక్షకురాలుగా ఊహించుకుంటాను. అందులోనే ఏదో ఆనందం. పాపా! నువ్వెవరమ్మా?"
    "నేనా? మీ....మీ బిడ్డను, డాక్టర్!"
    "డాక్టర్ కాదు.....డాక్టర్ కాదు."
    "అ .... మ్మ .... అమ్మ." ఆ పదం ఉచ్చరించడం అదే కొత్త. కెరటాలలో తన్నుకువస్తున్న కరుణా భావాలు. ఆనందభాష్పాలు.
    "చాలు.....చాలు, పాపా! ఇకనుంచీ డాక్టర్ అనే పిలుపు. మళ్ళీ మళ్ళీ వింటే....మరణిస్తానేమో....దేవుడెంత దయామయుడు! పాపా, నువ్వెంత మంచిదానివి!"
    తనెన్నడూ 'అమ్మా!' అనలేదు. సునీత ఉక్కిరి బిక్కిరవుతున్నది. అంతా కలలా ఉన్నది. లోలోపల వందసార్లయినా 'అమ్మా...అమ్మ' అనుకుంది.
    ఆ నిరామయస్థితిలో వాళ్ళెంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు.

                                *    *    *

    ఉత్తరమైనా వ్రాయకుండా రాధ తల్లిదండ్రులు వచ్చారు.
    వర్ధనమ్మే రాధను పోల్చుకోలేకపోయింది. 'అమ్మా' అంటూ ఆమె ఒడిలో వాలేదాకా రాధ అన్న నమ్మకం కలగలేదు. డిస్పెన్సరీకి పరుగుతీసి వేణుకు చెప్పింది ఫోనులో! సాయంత్రం తొందరగా వస్తానన్నాడు వేణు.
    "అబ్బ, నీకెప్పుడూ పనులేను!"
    "అవి మన బ్రతుకు, డార్లింగ్! ప్లీజ్, నా అశక్తత నీ వెరగనిది కాదు. అక్కతో చెప్పు!"
    "మరి సాయంత్రం తొందరగా వచ్చెయ్యాలి!"
    "ఎస్ యువరానర్ .....సారీ..... యువర్ హైనెస్!"
    రాధను ఇక్కడికి పంపడమే మంచిదైనదనుకుంది వర్ధనమ్మ. రఘుపతితో అదే అంటే, "అక్కడే కూపస్థమండూకంలా ఉంచమన్నావుగా మరి? మీ నాన్న వచ్చాక ముహూర్తంకూడా పెట్టించు" అన్నాడు.
    వంకాయలు తరగవే తల్లీ అంటే, ఏదో మస్కాకొట్టి స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్ళే పల్లెపడుచు రాధకు, ఈ మిస్ రాధకు పోలికే లేదు.
    "చూశావా? ఎంతైనా మీ ఆడవాళ్ళకు పుట్టింటి వైపువాళ్ళంటే తెగ ఆపేక్ష. పెళ్ళి కాకముందే తన సొంత ఇల్లులా, మనకు మర్యాద చేస్తూంది. ఎంతైనా మీ ఆడవాళ్ళ బుద్ధులు వేరు."
    వర్ధనమ్మ రఘుపతి మాటకు ప్రసన్నంగా, "ఏం, మీకు ఈర్ష్యగా ఉందా?" అంది.
    "ఛా! అది సుఖపడితే నాకూ సంతోషం కదా? నా విచారమల్లా ఏమంటే ఆ మూడు ముళ్ళూ పడితే అమ్మాయి మనల్ని మరిచిపోవచ్చని!"
    తల్లి చేతుల్లో తల దాచుకుంది రాధ, అది విని.
    రాధ మీనాక్షి, సుబ్బులు, పంకజం వగైరా స్నేహితులను అడిగింది.
    "నువ్వు పెళ్ళి కాకముందే వచ్చావు. వాళ్ళకు పెళ్ళి అయింది కాదే! నీలాగ కాకుండా మొగుళ్ళతో వెళ్ళారు నిన్ను అడిగినట్లు చెప్పమన్నారులే!"
    రాధ ఆ ఇంట్లో బంధం పడకముందే తన స్థానం తీసుకుంది. ఒక పదిహేను రోజులు ఉండి వెళుతూ, 'ఎప్పటికైనా నువ్వు ఇక్కడిదానివే! కన్నవాళ్ళం మాకు ఉండే బాధ మీకు ఉండదు. నీకూ ఒకప్పుడు అనుభవంలోకి వస్తుంది రాధా, ఉత్తరాలు రాస్తూండు" అని రఘుపతి అంటూంటే వర్ధనమ్మ గుడ్లనీరు కుక్కుకుంది.
    రాధ భోరున ఏడ్చింది.
    "ఊరుకో, తప్పు కదూ? పిన్నీ, మామయ్యా ఉన్నారు" అని ఓదార్చారు.
    వేణు, రాధ వాళ్ళను స్టేషనుదాకా సాగనంపి వచ్చారు.    
    
                              *    *    *

    సునీత అనుకుంటూనే ఉంది. వేణు అడగనే అడిగాడు, మెడలో ఒంటిపేట గొలుసు ఏమయిందని? పోయిందన్నది సునీత.
    "నెలాఖరి దినాలు. నాకిచ్చిన ఉంగరానికి, రాధకిచ్చిన విగ్రహానికి డబ్బు ఎక్కడిది?"
    "అదంతా మీ కనవసరం!"
    "అయినా అడుగుతున్నాను. చెప్పు!"
    "ఇన్ని వివరాలడిగేవారు, నన్నెందు కాహ్వానించారు?"
    "పిలిస్తే? శక్తికి మించిన పని చెయ్యమనా? సింపిల్ గా ఓ పుస్తకం పట్టుకువస్తే సరిపోయేది!"
    "సరిపోదు అంతమందిలో ఏ రూపాయో పెట్టి కొన్న పుస్తకం మీకిచ్చి - నాకేమోగానీ - మీకు తలవంపులు తేలేను."
    "కాదు......"
    "ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే, పాపపు సొమ్ముతో కొని మీకు ఇచ్చానన్న అనుమానం ఉంటే వాటిని ఇవ్వాళే మూసీలో పారవెయ్యండి." మరి అక్కడ ఉండలేదు.

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS