Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 31


    మీ సెలవు పొంది, క్షేమంగా చేరుకున్నాను. నేను ఇప్పటికి ఒక దరి అంటూ చేరుకోబోతున్నందుకు అమ్మా, నాన్నలకన్నా బామ్మ ఎక్కువ సంతోషించటమే కాక, నాకు ఇష్టమైన పకోడీలు చేసి, తను దగ్గిర కూర్చుని ఒక సగం బుట్టెడు తినిపించింది. అంతేకాదు. నే నిక్కడ ఉన్నన్నాళ్ళూ, ప్రతిరోజూ నా కిష్టమైన వంటకాలన్నీ చేసి, పెడతానని, అలాగే ఆచరిస్తూంది కూడా! మీకు నవ్వు వస్తున్నది కదూ?
    ఒక సంగతి చెప్పాలని ఇక్కడికి వచ్చాక తట్టింది. అక్కడ ఉండగా ఎన్నడూ ఇది చెప్పే సందర్భం రాలేదు. ఇప్పుడు అన్నీ కలిసివచ్చాయి కనక వినండి.
    మేము మొత్తం ఇద్దరం అన్నదమ్ములం. నేను చిన్న వాడిని. మా అన్నయ్య ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు.
    నేను పుట్టాక మొదటి సంవత్సరంలో నా కన్నతల్లి పరమపదించింది. నేను ఇంకా పాలు మరవని చిన్నవాడిని కనక, నా పెంపకం సమస్య అయింది.
    ఆ అమ్మ అక్క-మా పెద్దమ్మ-ఒకామె ఉండేది. ఆమె ఇప్పుడు లేదనుకోండి. అప్పట్లో ఆమెకు కూడా ఓ కూతురు పుట్టి నాలుగు నెలలైనా తిరగకముందే చచ్చిపోయింది. బామ్మ కాస్త దూరాలోచన కలది. మా అన్నయ్య కాస్త పెద్దవాడే కాబట్టి అతన్ని తను దగ్గిర ఉంచుకుని, నన్ను మా పెద్దమ్మకిస్తే - పసిబిడ్డను కోల్పోయిన తల్లి అవటంవల్ల, ముఖంగా ఆమెకు అయిదారుగురు బిడ్డలు పుట్టి పోవడం దృష్టిలో ఉంచుకుని, ఆమె కిచ్చింది. పెద్దమ్మ సంతోషంగా నన్ను తీసుకున్నది. ఆమే నాకు స్తన్యం ఇచ్చి తల్లిలా పెంచింది.
    తరవాత మా నాన్న రెండవ వివాహం చేసుకున్నాడు. నా సవతితల్లి ఎవరోకాదు. మా అమ్మకు చెల్లెలు.
    నా అయిదో ఏట నన్ను తిరిగి తమకు ఇచ్చెయ్యమన్నారు మా బామ్మ, నాన్న, అమ్మ (అంటే చిన్నమ్మ). కాని అయిదేళ్ళుగా తన బిడ్డగానే పెంచిన ఆమె, నన్ను తిరిగి తీసుకుపోతూంటే విలవిలలాడింది. నేను చిన్న వాణ్ణి. లోకజ్ఞానం లేని నాకుకూడా అలా విడదియ్యడంలో రాక్షసత్వం గోచరించింది. సరే, మేము విడి పోయాం.
    నేనుమాత్రం ఆ దెబ్బతో మంచాన పడ్డాను. నెల రోజుల్లోనే చిక్కి ఎముకలగూడులా అయ్యాను. ఎన్ని మందులు ఇప్పించినా లాభం లేకపోయింది. మా ఊరి కరణంగారు భూతవైద్యాలు చేస్తాడు. నాకు గాలేమైనా సోకిందేమోనని ఆయనకు కబురు చేశారు. ఆయన నన్ను చూసి పెదవి విరుస్తూ, ఇది దెయ్యం కాదు భూతంకాదు, ఈ పిల్లవాడు ఎవరిమీదో బెంగ పెట్టుకున్నాడనీ, మరొక నెలరోజులు ఇలా ఉంచితే బతకటం కష్టమనీ చెప్పాడు.
    నా రోగం ఏమిటో బామ్మకు తెలిసివచ్చింది. పెద్ద మ్మకు నాచేత కలం పట్టించి, ఆ రోగం ఏమిటో, నా చెయ్యి పట్టుకుని రాయించారు ఓ ఉత్తరం. వాళ్ళు చెయ్యి ఎలా తిప్పిస్తే, అలా తిప్పి, దానిమీద అప్పటికి నాకు ఇంకా పూర్తిగా తెలియని భాషలో రాశాను.
    అది చూస్తూనే, పెద్దమ్మ వాయువేగంతో వచ్చి, నన్ను ఒడిలోకి తీసుకుంది. ఆమెకూడా నామీద బెంగతో జబ్బుపడ్డ మనిషిలా తయారైంది.
    పదిహేను రోజుల్లో నా మనోవ్యాధి మటుమాయమైంది. నేను కోలుకున్నాను. పెద్దమ్మ వెళ్ళిపోతానంది. నేనామెను వదల్లేదు. నా ఘోష చూసి, నన్ను శాశ్వతంగా తనకు ఇచ్చెయ్యమని బామ్మను, నాన్నను అడిగింది. వాళ్ళు రెండు రోజులు ఆలోచనచేసి, మళ్ళీ నేను ఏ జబ్బు తెచ్చుకుంటానోనని, నెలనెలా తమకు తెచ్చి చూపించే షరతుమీద ఆమె కిచ్చారు. సర్వలోకాలు తన గుప్పిటిలోకి వచ్చినంత ఆనందపడింది పెద్దమ్మ.
    వాళ్ళు మామూలు కుటుంబీకులే. నన్ను తెచ్చుకుని శాస్త్రోక్తంగా దత్తత చేసుకున్నారు. ఆ సంవత్సరమే మా పెద్దమ్మకు దూరపు బంధువు ఒకామె మరణించటంవల్ల, సుమారు లక్ష రూపాయలు నిలవచేసే ఆస్తి కలిసివచ్చింది. అదీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వేళావిశేషమేనని పెద్దమ్మ అంటూండేది.
    అప్పుడప్పుడు నాన్న వచ్చి నన్ను తీసుకువెళ్ళి, వారంరోజులపాటు ఉంచుకుని పంపిస్తూండేవాడు.
    నేను బెంగపడి మృత్యువు నాహ్వానించబోయి, పెద్దమ్మ చలవవల్ల ఆ పని చెయ్యలేదన్నాగదూ? అప్పటినించే నాకీ పరధ్యానం అనే జబ్బు ఆవేశించింది. అయితే నన్ను అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడుతూ, నేను చేసినా చెయ్యకపోయినా, అది ఇట్లా, ఇది ఇట్లా అని హెచ్చరించేది పెద్దమ్మ. అందువల్ల ఎప్పటి పని అప్పుడు చక్కబెట్టుకోగలుగుతూ ఉండేవాడిని. ఆమె ఉన్నంతకాలం దీన్ని గురించిన చింత నాకు లేకుండే.
    ఎమ్. ఎ. లో ప్రవేశించిన కొత్తలో మళ్ళీ నేను జబ్బులో పడ్డాను. రాత్రింబవళ్ళూ నాసేవే చేసింది. కానీ ఈసారి ఆమె నా ఆరోగ్యం కోసం తను అనారోగ్యం తెచ్చుకుంది. నేను కోలుకుంటున్నకొద్దీ ఆమె కృశించిపోసాగింది. చివరకు ఆ కృశింపే ఆమె ప్రాణాలను పొట్టబెట్టుకుంది.
    చివరి శ్వాస వదులుతూ, నన్ను తిరిగి బామ్మ చేతుల్లో పెడుతూ, గాఢంగా మూడుసార్లు ముద్దు పెట్టుకున్నది. తనకు కలిసివచ్చిన ఆస్తి అంతా నాకే ఇచ్చేసింది.
    'పెదనాన్నను మరిచిపోకు. బాబూ! నెలనెలా నీ దృష్టిలో ఆయనకు సరిపోతుందనుకున్న డబ్బు ఇవ్వు. లేదా నీ దగ్గిరే ఉంచుకుంటానంటే కృతజ్ఞురాలిని' అన్నది.
    నాకోసం భర్తకుకూడ చిల్లిగవ్వ ఇవ్వలేదు. ప్రస్తుతం పెదనాన్న మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన దొక తపస్సు. మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే భోజనం. ఎల్లవేళలా మా మిద్దెమీద గదిలో ప్రాచీ దిశాభిముఖుడై పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. ఆయనతో ఏదైనా ముచ్చటించాలంటే మధ్యాహ్నం భోజనానికి కిందికి వచ్చినప్పుడే వీలు.
    ఇదీ మీకు చెప్పాలనుకున్నది.
    నేను నా పెళ్ళిని గురించి ఇంత త్వరపడటానికి కారణం, పెదనాన్న రాసిన ఉత్తరం. తన ఉత్తరాలు ఎవరికీ చూపించవద్దని ఆయన రాసినప్పుడల్లా - నేను పరధ్యాసలో చెబుతానేమోనని - చివర హెచ్చరిక చేస్తాడు. నాన్న రాయకముందు, ఆయన రాసిన ఉత్తరంలో (మీకు చెప్పలేదు. చూపలేదు) పెద్దమ్మ తఃనకు కనిపించి, బాబు పెళ్ళి ఎప్పుడు చేస్తారని అడిగిందిట. అందుకే కొంచెం బాధపడుతూ రాశాడు. నాన్న ఇక్కడికి వచ్చేముందు కూడా తను చెప్పినట్లు, మరీ మరీ చెప్పాడు.
    మీరు పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు, నాకు భార్య కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పాను. దానికి పూర్వ రంగం ఇదే! అప్పుడు పెద్దమ్మ ఉండబట్టి, నేను ఏదీ వదిలిపెట్టకుండా నా పనులు చేసుకోగలిగాను. ఆమె పోయాక, రోజువారీగా ఉండే కాలేజీ, చెప్పవలసిన సబ్జెక్టు తప్ప భోజనం సంగతికూడా పట్టకపోయేది. విసుగెత్తింది. ఎలాగూ పెళ్ళి అనేది ఒక సహచరిని ప్రసాదిస్తుంది కనక ఆమెలో ఈ గుణాలు (మీకు చెప్పినవి) ఉండాలనుకోవడం అసహజమేమీ కాదు. మీరేమంటారు?
    ఇక మీ విషయం. మిమ్మల్ని "పెద్దమ్మా' అని పిలుస్తున్నదెందుకో చెప్పటం అవసరంలేదు. అది చెయ్యండీ, ఇది కాదు అంటూ నన్ను వాస్తవికతకు దూరం చెయ్యని మీ మాటలే నన్నా పిలుపుకు ప్రోత్సహించాయి.
    నిష్కర్షగా చెప్పుతున్నందుకు క్షమించాలి! మీరు నాజూగ్గా, ఓ చిన్న తిలకంబొట్టు పెట్టుకొంటూ నాకు కనిపిస్తూంటే, ఏ దృష్టితో చూసేవాడినో చెప్పలేను. కానీ నిండుగా, అందమైన మీ ఫాలభాగాన మెరిసిపోయే ఆ కుంకుమతిలకం నాకు మరొక దృష్టి కలగనివ్వలేదు. మీలాగే పెద్దమ్మకూడా వెడల్పైన కుంకుమబొట్టు ధరించేది. ఆ బొట్టులోనే నేను నా తల్లి, పెద్దమ్మలను చూసుకోగలిగాను.
    అదృష్టవశాత్తు కరుణాదేవి కుంకుమకాక, చిన్న అగరుచుక్క ధరించింది. ఆమెకూడా మీలాగే కనిపిస్తే నా భార్య కావటానికి అంగీకరించకపోదును. కరుణ గారితో చెప్పండి, చిన్న అగరు చుక్కతోతప్ప ఎన్నడూ నిండైన కుంకుమబొట్టుతో నా ఎదట పడవద్దని.
    బామ్మకు, నాన్నకు మిమ్మల్ని గురించి చెప్పాను. తాతయ్యగారిని, కొద్దో గొప్పో మీలాగే ఉండే డాక్టర్ ఆర్తిగారినికూడా వీళ్ళకు పరిచయం గావించాను. వీలుచూసుకుని కరుణ వాళ్ళ తల్లితో మాట్లాడడానికి వస్తామని చెప్పమన్నారు బామ్మ, నాన్న.
    మిత్రులు వేణుగారిని, రాధాదేవిని అడిగినట్లు చెప్పండి. డాక్టర్ గారికి, తాతయ్యగారికి, మీకు నమస్సులు. సౌభాగ్యవతి కరుణకు శుభాకాంక్షలు.
                                                                 సాధ్యమైనంత త్వరలోనే మీ సన్నిధిలో
                                                                            -నీలకంఠం."
    ఆ ఉత్తరాన్ని కరుణకు చూపించింది. "మంచివారే! కానీ అప్పుడే పెళ్ళి నిశ్చయమైనట్లు రాశారే!"
    "నీ కిష్టంలేదా, కరుణా?"
    "కలగబోయే సౌభాగ్యాన్ని కాలదన్నుకునే అవివేకం నాలో ఇంకా కలగలేదే! నువ్వు నాకు అత్తవవుతున్నా వంటే కావలసిందేం ఉంది?"
    "అమ్మతో చెప్పావా?"
    "వాళ్ళు వచ్చినప్పుడు చెప్పవచ్చు. అప్పుడే ఏం తొందర?"
    సునీత బస్సు ఎక్కుతూంటే, "అత్తా, జాగ్రత్తేవ్! మనసు పోగొట్టుకున్నదానివి. నాకు తెలుసు అదెక్కడుందో? ప్రమాదంలో పడకుండా వెళ్ళు" అంది చిలిపిగా.
    "పోవే! నీలాంటి మాయలమారివాళ్ళు కోటి మంది వచ్చినా, నా మనసు దాచబడిన ఇనప్పెట్టె తలుపు విడివడదు. పెళ్ళి అయితే కానీ ..."
    "కోడంటికం వెలగబెడతావా?"
    "రాసి రంపాన బెట్టనూ?"
    నవ్వులు. బస్సు కదిలింది. కరుణ తను వెళ్ళే బస్సుకోసం చూస్తూ అక్కడే నిలబడింది.

                          *    *    *    *

    వేసవిలో నీలకంఠం పెళ్ళి కరుణతో అతి వైభవంగా జరపటానికి ముహూర్తం పెట్టారు. ఆ సమయంలో సునీతకూడా అక్కడ ఉన్నది. కరుణ కృతజ్ఞతతో సునీతకు జోహార్లు అర్పించుకుంది.
    వేణు కిది తెలిసింది. సునీత ఒంటరిగా ఉన్నపుడు పరహాసం చేస్తూ, "అందరి పెళ్ళిళ్ళూ చేయిస్తావుగానీ, తమరి పెళ్ళి ఎన్నడు?" అన్నాడు.
    సునీత ప్రత్యుత్తరం మౌనమే.
    "నీతా, పొరపాటుగా అడిగానా?"
    అడ్డంగా తల ఊపింది. "నా పెళ్ళి ఎన్నడో మీకు తెలియదా?"
    "నాకేం తెలుసూ?"
    "తెలీకపోతే జరిగేదాకా చూస్తూ కూర్చోండి!"
    "తప్పకుండా!" ఒత్తి పలికాడు. "సాయంత్రం గోల్కొండవైపు వెళదాం రాగలవా?"
    "కారణం చెప్పి అడిగితే ఒప్పుకోగలనేమో?"
    "చెప్పకున్నా వస్తావనే నా ఆశ!"
    "రాలేను!"
    అయితే సాయంత్రం వేణు కారులో కూర్చోబోతూంటే వెనకసీట్లో సునీత. ఆశ్చర్యంగా, "అరే! ఇంటికి వెళ్ళలేదూ?" అన్నాడు.
    "గోల్కొండకు వెళదామన్నారుగా?"
    "ఓ, థాంక్స్ ! ఇలా ముందుకు రా!"
    "వద్దులెండి!"
    "నువ్వు పక్కన కూర్చుంటే నా ఏకపత్నీత్వానికి భంగం రాదు. న పవిత్రత మంటగలవదు!" హాస్పిటల్లో ఉండగా ఆమె అన్న మాటలు ఆమెకే అప్పగించాడు.
    పెదవి బిగబట్టి, ముందు సీట్లోకి వచ్చింది.
    అక్కడికి చేరుకుని, గోల్కొండ శిథిలాల్లో మళ్ళీ ఒకసారి తిరిగారు.    
    "ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు? ఊరికే తిరగటానికేనా?"
    "నీకీ మధ్య మరీ ఓపిక తక్కువైంది. ఉండు. వెన్నెల పూర్తిగా రానీ, చెబుతా!"
    "వెన్నెల వచ్చేదాకా బతికిఉంటానన్న నమ్మకం లేడు. మరొక క్షణమాగి, ఏ పురుగు కరిచో చచ్చిపోవచ్చు!"
    "తప్పదంటావు!"
    "ఊఁ!"
    తూర్పు దిశన చంద్రబింబం అప్పుడే పైకి వస్తున్నది. వేణు దాన్ని చూస్తూ, "ఆకాశమంతా నీ నుదురైతే, ఆ చంద్రుడు నీ కుంకుమ. నీతా, రామదాసును బంధించిన జైల్లోకి వెళదాం రా" అన్నాడు జేబులో చెయ్యి పెట్టుకుని.
    "చీకటిగా ఉంటుంది, వేణూ!"
    "ఫర్వాలేదు. ఒక్కసారి అక్కడున్న ఆ రామునికి నమస్కరించి వద్దాం!"
    అతణ్ణి అనుసరించింది. వాళ్ళిద్దరూ అనుకున్న ప్రకారం చేసి, వెలపలికి వచ్చారు. ఎత్తయిన చోట కూర్చున్నాడు వేణు. సునీత మౌనంగా చంద్రబింబాన్ని చూస్తూ వేణు పక్కనే నిల్చుంది.
    "ఇవ్వాళ అక్కయ్య పెళ్ళికూతురైన రోజు. ఆ సందర్భంగా నీకు ప్రజంట్ చేద్దామని ఇది తెచ్చాను. నీతా!"
    వేణు చేతిలో సన్నని ఒంటిపేట లాకెట్ గొలుసు ఉన్నది. దానిని దీక్షగా పరికించింది సునీత.
    "ఇలా చెయ్యమని డాక్టరుగారు చెప్పారా?"
    "లేదు. ఈ ఆనందాలన్నీ ఏనాడో వదులుకుంది. ఏ పండుగలూ, పర్వదినాలూ లేవు. ఆమె దొక నిశ్శబ్ద జీవితం!"
    "మీ రెందు కివ్వాలనుకున్నారు?"
    "ఊరికేనే! ఇన్నాళ్ళైంది, మన స్నేహమే. నేను నీకు ఒక్క బహుమతి అయినా ఇవ్వలేదు."
    "ఇవ్వకపోతే ఏమవుతుంది?"
    "నేను చచ్చిపోతే, నా గుర్తులు నీ దగ్గిర ఏమీ మిగలవు."
    "ఊఁ!" కనుదోయి చంచలం కాగా అతనివైపు చూసింది. వేణు గోటితో నొక్కి లాకెట్ తెరిచి ఆమెకు చూపించాడు.
    అందులో ఒకవైపు వేణు, మరొక వైపు సునీత.
    "నా ఫోటో మీ కెక్కడిది?"
    "ఈ ఒక్కటే కాదు. నా హృదయంనిండా ఫోటోలే! చూస్తావా?"
    "వద్దు లెండి. ఇదెక్కడిదో చెబితే చాలు."
    "ఒకసారి నువ్వు రాధకు ప్రైవేటు చెబుతున్నపుడు గదిలోనుండి తీశాను. చాలా బాగా వచ్చింది కదూ? ఇది తీసుకుని మెళ్ళో పెట్టుకో, నీతా!" అందించాడు.
    సునీత తీసుకోబోయి, మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలా ఆగింది. "మీరే నా మెడలో ఉంచండి!"
    విస్తుపోయాడు వేణు. తను ..... తను .... కనీసం చెయ్యి పట్టుకోటానికైనా ఎన్నడూ సాహసించలేదు. తనకు అంత భాగ్యమా?
    "నేనీ మాట అన్నానని విశ్వాసం కలగలేదా, వేణూ!"
    "కాదు....కాదు....సునీతా!" సునీత అతనికి దగ్గిరగా జరిగింది. వేణు కిందికి దూకాడు. సునీత తల వంచుకున్నది. వేణు ఆమె కెదురుగా నిలుచుని సంతోషం ముప్పిరిగొనగా, వణుకుతున్న చేతులతో దాన్ని ఆమె మెడ నలంకరింపజేశాడు.
    
                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS