తెలతెలవారే వేళ అతనికి మెలకువ వచ్చింది.
ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. భార్య తప్పించి. ఆమె పెరట్లో కసవు వూడుస్తుంది. పనిమనిషిని పెట్టుకోమంటే ఆమె ఒప్పుకోదు. ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు కావాలంటే ఎవరు వినిపించుకోరు. ఆడవాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో చాలా పట్టుదలతో ఉంటారు. అనవసరంగా ఎదుటి వాళ్ళ జాలి కోసం కొన్ని కొన్ని పనులు చేస్తారు వాళ్ళు. చలపతి చెడిపోయిన మనిషే కావచ్చు. అతనిలో ప్రేమ, వాత్సల్యం , ధర్మం న్యాయం, ఇలాంటి సున్నితమైన భావాలకి చోటు లేకపోవచ్చు. కాని వయస్సులో చిన్నవాడు. తల్లి తండ్రి లేరు కాబట్టి అలా దిక్కు లేకుండా వదిలేశారు. అనే అపవాదు ఇప్పటికే తన మీద ఉంది. ఇలా వాడ్ని గాలికి వదిలేస్తే వాడు ఇంకా చెడిపోతాడు. పెద్దవాడు తాను ఉండి కూడా వాడ్ని ఇలా వదిలేస్తే నలుగురూ ఏమనుకుంటారు? కుటుంబ గౌరవం ఏమవుతుంది? ఫలానా వారి తమ్ముడు చేదిపోయాడు అనుకుంటే తనకి మాత్రం అవమానం కాదూ? పెళ్ళయితే సంసార భాద్యతలు తెలిసి పిల్లా జెల్లా బయల్దేరితే కాస్త ఒద్దిక వచ్చి బాగుపడిన వాళ్ళెంతమంది లేరూ? తాను అనేకమందిని చూశాడు అలాంటి వాళ్ళని. అందుకే భార్య దగ్గర ఇవన్నీ దాచాడు. ఇదంతా చెబుతే ఆమె ఈ సంబంధానికి ససేమీ-- అంగీకరించదు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. పరాయి వాళ్ళు ఎవరూ తన తమ్ముడి సంబంధానికి ఇష్టపడరు. ఒకవేళ మోసం చేసి పెళ్ళి జరిపించినా ఆ తర్వాత ఏమైనా గొడవ లోస్తే అలరయిపోతుంది. సంసారంలో గుట్టు పోతుంది. అయిన సంబంధం అయితే ఫర్వాలేదు ఏమైనా గొడవ లోచ్చినా సర్దుకు పోవచ్చు. రాధమ్మ చాలా తెలివైన పిల్ల... చురుకైన పిల్ల.... ఇలాంటి సంబంధం దొరకటం చాలా కష్టం. చేసేస్తేనే మంచిది.
ఒక చెంప కుటుంబ గౌరవం, మరొక చెంప వ్యక్తిగతమైన స్వార్ధం ఇలా రకరకాల ఆలోచనల ఘర్షణ లో చాలాసేపు అలానే మంచం మీద పడుకుని ఉన్నాడు.
"ఏవిటి బావా ఇంకా బండ నిద్ర" అంటూ రాధ గదిలోకి ప్రవేశించింది.
రాజశేఖరం బద్ధకం ఒదిలించుకుని మంచం మీద లెఛి కూర్చుని "టైము ఎంతయింది?" అనుకున్నాడు అర్ధ స్వగతంగా.
వీధి గది లోంచి సుభద్రమ్మ గొంతు బిగ్గరగా వినిపిస్తుంది. పిన్నితో పరాచికాలు ఆడుతుంది. పిన్ని ముందు గొప్పలు చెబుతుంది.
ఆమె లోపలికి రాగానే "నువ్వు నెగ్గావు. ఇవాళే చలపతికి పెళ్ళి చూపులకి రమ్మనమని ఉత్తరం రాస్తున్నాను." అన్నాడు రాజశేఖరం.
2
హల్లో అట జోరుగా సాగుతుంది. రాఘవులు గదిలో కొచ్చి చూసేసరికి చలపతి మస్తుగా తాగేసి టేబుల్ మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. ఒంటి మీద స్మారకం ఇంకా ఉంది. చొక్కా కాలరు బాగా తడిసింది.
"చలపతయ్య గారూ" రాఘవులు చలపతి ముఖం మీద ముఖం పెట్టి పలకరించాడు.
చలపతి ఏదో లోతుల్లోంచి పలుకుతున్నట్టుగా "ఊ' అన్నాడు.
రాఘవులు చలపతిని అటూ ఇటూ గుంజి వదిలేసరికి చలపతి కొంచెం తెప్పరిల్లి "రాఘవులూ' అన్నాడు.
"నేనేనయ్యా. రాఘవుల్ని ఏంటయ్యా ఈ అవస్థ హాయిగా ఎల్లమ్మ కొంపకి పోరాదూ. నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది. మీరంటే ఆమెకు ప్రాణం. ఇక్కడిలా బల్ల మీద ఎందుకొచ్చిన అవస్థ."
చలపతి మట్టుగానే "రిక్షా పిలు" అన్నాడు.
రాఘవులు రిక్షా పిల్చి రిక్షా వాడి సాయంతో చలపతి ని రిక్షా ఎక్కించాడు. పక్కన తానూ కూర్చున్నాడు. బండి కొద్ది దూరం పోయిందో లేదో చలపతి కళ్ళు తెరిచి ఇప్పుడు టైము ఎంతవుతుంది?" అన్నాడు.
"ఎనిమిది గంటలయింది."
"అయ్యగారున్నారా?"
"ఇప్పుడే బైటికి వెళ్ళారు."
"డబ్బు బొత్తిగా లేదురా గురూ ఎల్లమ్మకు ఈ నెలలో ఏమీ కొనలేక పోయాను. దాని ఎదాన పడి తినటానికి సిగ్గుగా ఉంది." అన్నాడు చలపతి.
"నా దగ్గర పది రూపాయలున్నాయి ఇవ్వనా?"
"చా! అదేం చాల్తుందిరా ? ఎల్లమ్మ కు పాపం ఖర్చు పెరిగి పోయిందిట. మొన్న అన్నది."
రాఘవులు నవ్వేశాడు. "చలపతయ్యా మీ పిచ్చి గాని, ఎల్లమ్మ కు నీ డబ్బే కావాలా? ఆమెకు డబ్బు తక్కువ? నీలాంటి వాళ్ళని నలుగుర్ని పోషించగలదు.
చలపతికి కోపం వచ్చింది. రఘువుల్ని జల్ల కొట్టి "పిచ్చి బూతులు కూయబోకురా" అన్నాడు.
"ఉన్నమాటే గదయ్యా నాకు తెలివదా? లోకం అంతా తెలుసు ఎల్లమ్మ మిమ్మల్ని పోషిస్తుందని అందరూ అనుకుంటున్నాదేగా."
చలపతి గర్వంగా తల పంకించి బిరుసుగా నవ్వాడు.
"ఇవాళ గడ్డం చేసుకోవటం కూడా మరిచారా రాఘవులు" అన్నాడు గడ్డం రాసుకుంటూ.
"సర్లెండి? అసలు మీ గడ్డం చూసేగా ఎల్లమ్మ మిమ్మల్ని చేరదీసింది" అన్నాడు రాఘవులు.
చలపతి నవ్వేసి "అచ్చం ఎల్లమ్మ ఇలాగే అందిరా రాఘవులు. నా గడ్డం లోనే ఉందిట నా ఆకర్షణ అంతా" అన్నాడు.
"అదిగో చూసారా మరి. నే చెప్పిందే ఖాయం."
రిక్షా పూల బజారు దగ్గర కొచ్చేసరికి మత్తుగా పూల వాసన వేసింది. చలపతి కళ్ళు బాగా తెరిచి "పూల బజారుకి వచ్చాం ఏవిట్రా రాఘవులూ" అన్నాడు.
"ఆహా. ఏం రిక్షా అపమంటారా?"
"అపు....అపు.... పూలు ఇన్ని పట్టుకురా." అన్నాడు చలపతి. చలపతి జేబులు తడుముకుంటుంటే "నే తెస్తాలేవయ్యా." అంటూ రాఘవులు బండి దిగి కొట్టు దగ్గరకు వెళ్ళాడు. పూల దుకాణాల దగ్గరి దీపాలు ఎలక్ట్రిసిటీ దీపాలను మింగేస్తూన్నాయి.
రాఘవులు పెద్ద పొట్లం తీసుకొచ్చి చలపతి కిచ్చాడు.
బండి ఇంకొంచెం ముందుకు పోగానే బ్రాందీ షాపు కనిపించింది.
చలపతి అక్కడ బండి ఆపించి రెండు సీసాలు తెప్పించాడు. బండి ముందుకు పోతుంటే "నా మాట ఇని ఈ పూటకు ఇక తాగకు చలపతయ్యా. ఇంత చెడ తాగుతే గుండె చెడిపోతుంది. ఎల్లమ్మ మిమ్మల్ని చివాట్లు పెడుతుంది." అంటూ చికాకు పడ్డాడు రాఘవులు.
"ఓస్....దానికేం తెలుసు. నీకేం తెలుసు?"
"ఒద్దులే గురూ. బోర ఆరిపోయి ఎముకలు బయట పడ్డాయి చూడు ఎల్లమ్మ ఊరు కోదు గొడవ చేస్తుంది. ఈ సీసాలు నేను పట్టుకు పోయి దాస్తాను. రేపటికి ఉంటాయి.
"లిల్లమ్మ కు నేను సర్ది చెబుతాగా"
"మీ మాటే మీది గదా' రాఘవులు సణుక్కున్నాడు.
రిక్షా ముందుకు సాగిపోయింది.
"మిమ్మల్ని అక్కడ గుమ్మం దగ్గరే ఒదిలేసి నేను చటుక్కున వెనక్కి తిరిగి వచ్చేస్తాను. తలుపు తీసేదాకా అక్కడే ఉన్నానా ఈ సీసాలూ, నిన్ను చూసిందంటే లిల్లిమ్మ నన్ను వదల్దు. చీపురు తిరగేస్తుంది. నానా కూతలు కూస్తుంది."
రిక్షా లిల్లమ్మ యింటి ముందు ఆగింది. రాఘవులు చలపతి ని గుమ్మం దాకా నడిపించి అక్కడ నిలబెట్టి తన దారిని తాను పోయాడు.
తలుపు తెరుచుకుంది.
తూలుతూ లోపలికి అడుగు వేశాడు చలపతి. ఆ స్థితిలో అతడ్ని చూసి "మీరా రండి....రండి?.... ఈసారి రెండు మూడు రోజులయినా దర్శనాలు లేవు" అంది లిల్లమ్మ.
"ఉట్టి చేతుల్తో రావటం ఇష్టం లేక...."
"ఏం వస్తే?"
"అన్నట్టు మరిచా వరండాలో పూల పొట్లం ఉంది తెచ్చుకో."
నాకోసమే....ఇంకేం.... నాకిష్టం అయినవే తెచ్చారన్న మాట" ఆమె గబగబా ముందు వరండాలోకి వెళ్ళి పూలు తెచ్చుకుని అవి గుచ్చుకుంటూ కూర్చుంది.
"నువ్వు అల్ప సంతోషివి."
"నాకేం కొరతని చింత పడాలి."
"రాఘవులు వచ్చాడా మీతో"
"ఆహా....ఈ బ్రాంది సీసాలు చూస్తె నువ్వు వాడ్ని చీపురు తిరగేస్తావని హడలి నన్ను గుమ్మంలో దిగవిడిచి పారిపోయాడు."
లిల్లమ్మ పెద్దగా నవ్వేసింది.
చలపతి జేబులోంచి బ్రాంది సీసాలు తీసి పక్కనే ఉన్న టేబులు మీద ఉంచాడు. లిల్లమ్మ నుదుటి మీద మొత్తుకుంది "ఖర్మ....ఇది మాత్రం మానమంటే మానరు. చివరికి నలుగురూ ఈ లిల్లమ్మ చలపతయ్య ని ఆర్పేసింది. చెడగొట్టేసింది అనేలా చేస్తారు మీరు....పోనీ ఎక్కడ తాగినా ఇక్కడికి వచ్చేటప్పుడయినా అవి తీసుకు రాకండి." అంది ప్రాధేయ పడుతున్నట్టుగా.
"పిచ్చిదానా లోకం ఎప్పుడూ నిన్నే అంటుంది. తప్పునాదయినా. నిన్నే మాట అంటుంది. నువ్వు నన్ను ఎంత బాగా చూసినా చివరికి నిన్నే ఆరోపిస్తుంది.
"అవును మరి మీలాంటి వారు ఇలా తాగి తందానాలాడి ఆరోగ్యం పాడు చేసుకుంటే అనరూ మరి. అందుకే నా భాధ. ఇలాంటివి మానాలని అంటున్నది."
"రాఘవులికి నీ మంచితనం తెలుసులే."
"లోకం అంతా రాధమ్మ లాంటి వాళ్ళే ఉంటారా? రాజా లాంటి మనిషిని చెడగొట్టేసింది అంటారు."
'అనుకోనీ. ఇప్పుడు నీకూ, నాకూ వచ్చిన నష్టం ఏముంది గనుక?"
"సరే అన్నీ లాభానష్టాలేనా. ఒకవేళ అలా ఆలోచించినా మీకిది మంచిది కాదు గదా. ఇలా తాగుతే నష్టం లేదంటారా?"
"ఉన్న నాలుగు రోజులూ అనుభవించాలే లిల్లమ్మా."
"నాలుగు రోజులెం ఖర్మ. నూరేళ్ళు బ్రతకమంటాను. బ్రతికినన్నాళ్ళూ అనుభవించమంటున్నా."'
'ఛా....ఈ లోకంలో నూరేళ్ళూ బ్రతికితే కష్టాలే గాని సుఖం ఉండదు. లోకం సహించదు.
లిల్లమ్మ పువ్వులు గుచ్చి దండ తల్లో తురుముకుంది.
"ఇక మీదట మీరు చెప్పిన మాట వినకపోతే"
"నా యింటికి రావద్దంటావు "
'అంతమాట అనగలనా?"
"మరి మానకపోతే ఏం చేస్తావు?"
"ఏం చెయ్యాలో అదే చేస్తాను."
"ఏం చెయ్యగలవు?"
"చేసేదేదో చెబుతారా. చెప్పకుండా చేసేస్తారు. తర్వాత మీరే విచారిస్తారు. అరెరే లిల్లమ్మ ని దూరం చేసుకున్నానే అని."
"ఆహా అర్ధం అయింది. ఊరు విడిచి వెళ్ళిపోతావు కాబోలు."
"ఆ పని చేస్తాను. తిక్క బాగా కుదురుతుంది."
"అంతపని మాత్రం చెయ్యకు. నువ్వు కూడా నాకు దూరం అయితే నాకు చికాగ్గా ఉంటుంది."
"అంతా అబద్దం! రెండు రోజులుండగా లేంది ఇంకో వారం రోజులు ఆగలేరు.....మీకేం నాలుగు సీసాలు పట్టించేస్తారు. ఏ సినిమా హల్లోనో పడుకుంటారు. మిమ్మల్ని కాదనే వారెవరు? రాఘవులు ఉండనే ఉన్నాడు నమ్మిన బంటు."
"వాడికీ ఈ మధ్య నీ పాఠాలు బాగా వంట పట్టాయి. నాకు నీతులు చెబుతున్నాడు."
"రఘవులు మాత్రం మనిషి కాడా. వాడికీ మనస్సు అనేది ఉందిగా."
"ఆ...ఆ....అందరూ మనుష్యులే ....నేను మాత్రం...."
"అది సరే కానియ్యండి.. ఆ గోవిందయ్య రెండు వందలు పట్టు కెళ్ళాడు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానంటున్నాడు గాని దమ్మిడి చెల్లు బెట్టటం లేదు. ఎన్నిసార్లు గద్దించినా కాళ్ళా వెళ్ళా పడి బ్రతిమిలాడుతాడు. వాడ్ని అంతకంటే గట్టిగా రోక్కించ లేకుండా ఉన్నాను. మీరు కాస్త కనిపిస్తే చాలు ఇచ్చేస్తాడు."
"రేపు గుర్తు చెయ్యి వసూలు చేస్తా."
"ఆడదాన్ని చేసి అలుసు చేస్తున్నాడు."
"అలుసు చెయ్యటానికి వాడికి ఎన్ని గుండె లుండాలి. నా పేరు చెప్పక పోయావా?"
"చెప్పాను. మరీ కాళ్ళా వెళ్ళా పడుతున్నాడు." అంతా ఉత్తదే. వాడి దగ్గర డబ్బుంది." వాడి వ్యాపారం ఇప్పుడు చాలా బాగుంది కూడాను. వాడికేం లోటని."
చలపతి అద్దం ముందు నిలబడి తలదువ్వు కుంటూ "ఇవాళ ఏం వండావు?" అన్నాడు.
"మీ కిష్టం అయినదే. రండి భోజనం చేద్దురు గాని."
ఆమె వంట గదిలోకి వెళ్ళి వడ్డన చేసింది. చలపతి వెళ్ళి విస్తరి ముందు కూర్చుని కడుపు నిండా భోజనం చేసేశాడు. మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని మరీ భోజనం చేశాడు.
ఆమె ఇవతలికి వచ్చేసరికి చలపతి మంచం మీద జారబడి పడుకుని ఉన్నాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
చలపతి తడుముకుంటూ "ఆహా ఏం లేదు" అన్నాడు.
"ఇంతగా మీరు ఆలోచించటం నేనెప్పుడూ చూడలేదు. అసలు ఆలోచించే ఏ పనయినా చేస్తారా మీరు."
చలపతి ఆలోచించటం అంటే భయం" అన్నాడు.
లిల్లమ్మ నవ్వుతూ "భయమా" అంది.
"బుర్ర తక్కువ వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు."
లిల్లమ్మ బిగ్గరగా నవ్వేసి "అయితే మీకు.... అంటూ అర్ధంతరంగా ఆపేసింది. ఆమెకు నవ్వు ఆగలేదు.
"ఎందుకలా నవ్వుతావు."
మీకు బుర్ర....బుర్ర....."
"ఆ నా బుర్ర కేం?"
"చాలా పెద్దది....ఇప్పుడు ఎనిమిది కాలేదు. కదా వండిందంతా . మీరే భోజనం చేశారు. మరి నా సంగతి నేను అన్నం తిన్నానో లేదో అనయినా ఆలోచించారా?" అని ఆమె ఇంకా పెద్దగా నవ్వేసింది.
చలపతికి ఉక్రోషం వచ్చింది. అతనికి లిల్లమ్మా ఎగతాళి అప్పటికి అర్ధం అయింది. నువ్వు భోజనం చెయ్యలేదని నాకేం తెలుసు.' అన్నాడు.
"అసలు మీరు ఆలోచించారా చెప్పండి. అబద్దం ఆడకుండా చెప్పాలి.
"చలపతి బుర్ర గోక్కుంటూ ముఖం దాచుకున్నాడు. అతను సిగ్గు పడ్డాడు.
