ఆమె నన్ను ప్రేమిస్తున్నదని నాకూ తెలుసు. అందుకే ఆమెను నమ్మి నిజం చెప్పడం కష్టం!
2
"ఇప్పుడు టైము పది దాటింది. తెలుసా?" అంది రోజా.
"అన్నటైముకు రావాలనే అనుకున్నాను. కానీ రాధ వదలాలికదా-" అన్నాను.
"మర్చేపోయాను. నీకు పెళ్ళయిందికదూ!" అని నిట్టూర్చింది రోజా-"నువ్వే ఆమెను వదిలి రాలేకపోయావేమోనని నా అనుమానం-"
ఆమె అనుమానానికి నేను నవ్వి ఊరుకున్నాను. మగాడికి భార్య అందుబాటులోని వస్తువు. పరాయి ఆడదానికోసం తపించినట్లు మగాడు భార్యకోసం తపించడు. ఆ విషయం రోజాకూ తెలుసు. కానీ ఇప్పుడామె అలా ఎందుకన్నదంటే-నేను తనను రాధతో పోల్చి ఎక్కువ చేయాలి......అది ప్రస్తుతం నా కిష్టం లేదు. మా యిద్దరి మధ్యా రాధ ప్రసక్తి రావడం నాకిష్టం లేదు.
రాధ అందమైనది. నన్ను ప్రేమించింది. మీదు మిక్కిలి ఆమె మనసు మంచిది. పనిగట్టుకుని ఆమెను చిన్నబుచ్చడ మెందుకు?
అలాగని రోజాను నిరుత్సాహపర్చలేను.
కాలేజీ రోజుల్లో రోజా, నేను ప్రేమించుకున్నాం. అరమరికలు లేకుండా కలిసి తిరిగాం. అవి నాకు మధురానుభూతులు.
రోజా చాలా తెలివైనది. మేము విచ్చలవిడిగానే తిరిగినప్పటికీ మా పరిచయం గురించి ఎందరికో తెలియదు. ఆమెకు నేనుకాక యింకా మగస్నేహితులున్నారని నా అనుమానం. కానీ ఎక్కడా రోజా నాకు దొరకలేదు.
కాలేజీ చదువు పూర్తికాకుండానే రోజాకు పెళ్ళయిపోయింది. అప్పుడుకూడా ఆమె నాతో-"నీకూ నాకూ పెళ్ళికుదరదు. నీకంటే వయసులో, ఆస్థిలో, అంతస్థులో పెద్దవాణ్ణి మాత్రమే నేను పెళ్ళిచేసుకుంటాను. కానీ నిన్ను నేను మరిచిపోలేను. నీకోసం మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. మళ్ళీ ఈ రోజులప్పుడు గుర్తు తేవాలి-" అంది.
ఆమె ఇప్పుడు నాకోసం వచ్చింది. భర్త ఫారిన్ వెళ్ళాడు. పిల్లలు బోర్డింగ్ స్కూల్లో వున్నారు. తను నాకోసం ఈ ఊరొచ్చింది. ఎంతకో తెగించి ఈ ఊరొచ్చింది. ఆమెదికూడా ప్రేమేకదా! ఆమెను మాత్రం నే నెలా నిరుత్సాహపర్చగలను?
"అప్పటికీ యిప్పటికీ నీలో యే మార్పూలేదు-" అన్నాను. రాధ ప్రసక్తి తీసుకురావడం యిష్టంలేక నేనామాట అనలేదు. నేనన్నమాటలో నిజముంది.
రోజా గర్వంగా- "ఈ ప్రపంచంలో అన్నింటికీ మించి నేను నా శరేరాన్ని ప్రేమిస్తున్నాను. దీనికోసం నేనేమైనా త్యాగం చేయగలను. ఈ శరీరాన్నిలా వుంచడంకోసం రోజూ నేను వ్యాయాయం చేస్తున్నాను. తిండి బాగా తగ్గించడమే కాక ఇష్టమైన పదార్ధాలేనో తినడం మానేశాను-" అంది.
"పోనీలే - నామీద ఇష్టాన్నుంచుకున్నావు....." అన్నాను.
"నీమీద ఇష్టమెలా పోతుంది? యూ ఆర్ మై ఫస్ట్ లవ్!" అందామె.
నేనామెను దగ్గరగా తీసుకున్నాను. రోజా నా కౌగిలిలో ఒదిగిపోతూ-నీ స్పర్శలో ఏదో పత్యేకత వుంది. నా శరీరమంతా నరనరాలా విద్యుత్హు ప్రవహించినట్లుంది-" అంది.
అదే అనుభూతి నాకూ కలిగింది. అది మాలోని ప్రత్యేకతకాదు. తప్పుచేయడంలోని థ్రిల్!
రాధకు డబ్బుంది. నామీద ప్రేముంది. అన్నింటికీ మించి నాపైన నమ్మకముంది. నేనామె నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాను.
ఇదామెకు తెలిస్తే ఏమవుతుంది?
ఎలాంటి తప్పునైనా తనకు చెబితే క్షమించగలనందామె. నేనామెకు చెప్పడంలేదు. ఎందుకంటే నాకామెపై నమ్మకం లేదు.
"మళ్ళీ పాతరోజులు గుర్తుస్తున్నాయి-" అంది రోజా. ఆమె కళ్ళలో మెరుపు. ఆమెకవి మధురానుభూతులు.
నాకు రవంత గర్వం కలిగింది. నాలో ఏదో ప్రత్యేకత వుంది. నా తొలి ప్రియురాలు రోజా ఇప్పటికీ నన్ను గుర్తుంచుకుని నాకోసం వచ్చింది. నా భార్య రాధ నన్ను మనసారా ప్రేమించి నమ్ముతోంది ఇంకా....
రోజా చేతులు నన్ను చుట్టేశాయి. నా ఆలోచనల్లోంచి అన్నీ తప్పుకొని రోజా మాత్రమే ఆక్రమించుకుంటున్న దశలో గదిలో ఫోన్ మ్రోగింది.
ఫోన్ నేనే అందుకొని-"హలో!" అన్నాను.
"నమస్తే సర్! గదిలో రమణ్ కుమార్ అనేవారున్నారా?"
"నే నే రమణ్ కుమార్ ని!" అన్నాను.
"మీకోసం ఎవరో వచ్చారు. పంపేదా?"
తెల్లబోయాను. నాకోసం ఎవరొస్తారిక్కడికి? ఎవరికీ తెలియకుండా రహస్యంగా నేనిక్కడికొచ్చాను.
"ఎవరు?"
"ఒక యువతి. పేరు రాధ!"
ఉలిక్కిపడ్డాను. అంటే రాధ నన్ననుసరించి వచ్చిందా? అలా అనుసరించి రావడానికి కారణమేమిటి? ఆమెన్ననుమానించిందా?
నిన్న రాత్రి నేను ఆలస్యంగా రావడం గురించి ఆమె ఆరాతీయకపోయినా ప్రత్యేకంగా మాట్లాడింది. ఆమెకు అసలు విషయం తెలిసిపోయిందా?
మౌత్ పీస్ మూసి-"రాధ వచ్చింది-నాకోసం" అన్నాను రోజాతో.
రోజా పెద్దగా ఆశ్చర్యపడ్డట్లు కనబడలేదు-"చాలా రాంగ్ టైములో వచ్చింది-" అంది నిట్టూర్చి.
"ఇప్పుడు నేనేం చేయాలి?"
"ఏదో అనుమానం మీదే ఆమె యిక్కడకొచ్చింది. రూంలోకి రమ్మనమంటేనే మంచిది...." అంది రోజా.
"వస్తే....?" అన్నాననుమానంగా.
"భయపడకు. గురుబక్ష్ సింగ్ వుండనే వున్నాడు." అని నవ్విందామె.
నేను వెంటనే - "ఆమెను పైకి పంపండి-" అన్నాను.
3
రాధ, నేను ఇంట్లో సోఫాల్లో ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నాం.
నేను భయం భయంగా వున్నప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తున్నాను. ఆమె ఇప్పుడేమంటుందో?
"చాలా సారీ అండీ!" అంది రాధ.
"ఎందుకు?"
"అర్జంటుగా నాన్న పీల్చుకుని రమ్మన్నాడని మీకు చెప్పాను, అది నిజంకాదు-" అంది రాధ.
"మరేమిటి నిజం?" అన్నాను అసహనంగా.
"మీ నడవడిక బాగుండడంలేదనీ, చెడుతిరుగుళ్ళు తిరుగుతున్నారనీ-ముఖ్యంగా మీకు స్త్రీ అంటే బలహీనత వున్నదనీ నాన్నకు అనుమానం వచ్చింది....."
నేను తెల్లబోయాను. రాధ అంత సూటిగా విషయం మాట్లాడుతుందనుకోలేదు నేను.
"అనుమానం మీ నాన్నకేనా-నీక్కూడానా?"
"ఊరికే మాటవరసకి అనుమానం అన్నాను కానీ-నాన్నకు మీ గురించి తెలిసింది-అని చెప్పాలి...." అంది రాధ.
నా ప్రశ్నకందులోనే బదులుంది. అనుమానం రాధకూ వుందన్నమాట!
"అంటే నువ్వూ నన్ననుమానిస్తున్నావన్నమాట!" అన్నాను.
"మా నాన్న సంగతి మీకు తెలియదు. ఆయనకీ ఊరినిండా అనుచరులున్నారు. ఎలాంటివాడి గురించైనా ఆయన క్షణాలమీద సమాచారం రాబట్టగలడు...."
"అంటే?"
"ఆయన మీ గురించి ఏదైనా అన్నాడంటే అందుకు తగ్గ సాక్ష్యాలున్నాయన్న మాటే కదా!"
నేను వెంటనే ఏమీ చెప్పకుండా కాసేపాగి-"ఇంతకీ నువ్వనే దేమిటి?" అన్నాను. అసహనాన్ని ప్రకటిద్దామనుకున్నాను కానీ భయమే నా గొంతులో ధ్వనించింది.
