Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 2


     "ఊఁ! నన్ను క్షమించాలి. బ్రదర్!"
    అతని మొహం చూసి "వెధవ ఫోజూ, నువ్వూ!" అన్నాడు విశ్వం.
    "కాదురా! నేను చాలా బాధపడుతున్నా!"
    "ఏమిటా విరహం?"
    "నీ పేరు, సునీత పేరు రాసి కార్టూన్లు వేసి, ఆ కవరు పంపింది నేనేరా!"
    "నువ్వు.... నువ్వా?" విశ్వం కుర్చీకి అంటుకు పోయాడు.
    "నేనే! సరదాకి ఏం జరుగుతుందోనని రాశానలా...'
    విశ్వం వేణువైపు జాలిగా చూశాడు. నేరస్థునిలా తల వంచుకున్నాడు వేణు.
    "ఏం జరిగిందో చూశావుగా?"
    "విశ్వం!" పాదాలు అందుకోబోయాడు.
    "ఊఁ! ఆ పిచ్చిపని చెయ్యకు." భుజాలు పట్టుకుని ఆపాడు. "ప్చ్! ఈ సంగతి ముందు చెప్పినా బావుండేది. అనవసరంగా నేరస్థుడివైనందుకు నాకు విచారం లేదు, వేణూ! మనలో ఎవరైతేనేం? కాని నిష్కారణంగా సునీత భవిష్యత్తును పాడుచేశావు..."
    "విశ్శూ! నన్ను మన్నించరా?"
    "మిత్రులుగా మనకు క్షమాపణ ఏమిటి? సునీత సంగతే! పాపం-ఎంత దారుణమైన ఫలితాలు ఎదుర్కొంటుందో..."
    "నన్నేం చెయ్యమంటావు, చెప్పు! తప్పకుండా చేస్తాను. చెప్పు, బ్రదర్!" విశ్వం రెండు చేతులు పట్టుకున్నాడు.
    "చేస్తావు కానీ, చెయ్యవలసిన సమయం చేయిజారింది. ఆమెకు జరగవలసిన అన్యాయం జరగనే జరిగింది. ఆమె ఎక్కడుంటున్నదో సుజనకు కూడా తెలీదుట!"
    రాత్రి విశ్వం వెళ్ళాడు. వేణు అతనిచేత ఒక ఉత్తరం వ్రాయించుకున్నాడు. వేణు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు, సునీతకు విశ్వమే వ్రాసినట్లు వ్రాయించాడు. విశ్వం తను కూడా కొంత వ్రాశాడు. దాన్ని ఎప్పుడైనా సునీత కలవటం సంభవిస్తే, ఆమెకిచ్చి క్షమించమని అడగాలని వేణు అనుకున్నాడు.    
    రెండు మూడు నెలలు చూశాడు. సునీత జాడ లేదు. ఆమె ఎప్పుడోకనిపించి తీరుతుందన్న నమ్మకం చావలేదు.
    వేణుకూడా చదవదలుచుకోలేదు. తండ్రి కోరిక ప్రకారం వ్యాపారం చెయ్య నిశ్చయించుకున్నాడు. కొన్నాళ్ళు ఎక్కడున్నా పనిచేస్తే బావుంటుందని, తండ్రి చెప్పిన సలహా ప్రకారం వేణు తమ కంపెనీతో లావా దేవీలు ఉన్న ఒక అమెరికన్ సంస్థలో, జీతం లేకుండా పనిచెయ్యడానికి బొంబాయి వెళ్ళాడు. హైదరాబాదు నుండి బొంబాయికి వెళ్ళే రోజు, సికిందరాబాదు స్టేషన్లో సునీత అవుపించింది. వేణు గుర్తుపట్టి పిలిచాడు. తనే ఆమె దగ్గరకు వెళ్ళాడు.
    "ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నారు?"
    "బ్రతుకు తెరువు అన్వేషించుకుంటున్నాను. అంత వరకూ మీబోటి మిత్రుల్ని సాగనంపటానికి ప్రతి రోజూ ఇక్కడికి వస్తుంటాను."
    "అంటే? ఎవరైనా వెళుతున్నారా?"
    "ఊఁ! నిన్న సుజన అత్తవారింటికి వెళ్ళింది. ఇవ్వాళ మీరు..."
    "అత్తవారింటికి కాదు, బొంబాయికి. నేను వెళ్తున్నట్లు మీకు తెలుసా?"
    "తెలీదు. రోజూ వచ్చిపోతుంటాను."
    ట్రెయిను కదిలే ముందు వేణు, సునీతతో అన్నాడు! "గోవిందరావ్ అండ్ సన్ అన్న కంపెనీ వాళ్ళకు, ఇద్దరు టైపిస్టులు కావాలిట. వారు మొన్న నాతో అన్నారు. ఇంకా ప్రకటన వెయ్యలేదు. మీరు వెళ్ళి అక్కడ ఎంక్వయిరీ చెయ్యండి. మీకు టైపు వచ్చుకదూ?"
    సునీత ఏమీ అనలేడు. వేణు డైరీలో కాయీతం చింపి, ఏమిటో వ్రాశాను. అది ఆమెకిచ్చి, "ఇది మీకు ఉపకరించవచ్చు. మీరు ప్రకటన పడ్డాక దరఖాస్తు చేస్తే, ఈ కాగితం కూడా జతపరచండి. లేదా మీ రివ్వాళ వెళ్తే -ఇది చూపించండి" అన్నాడు.
    "రికమెండేషనా?" దాన్ని బాగ్ లో వేసుకుంది.
    "ఏమన్నా అనుకోండి! వెళతాను." ట్రెయినెక్కాడు.
    'కృతజ్ఞురాల్ని." నమస్కరించింది.
    అతనన్నట్లు ఆమె వెళ్ళలేదు. రెండు రోజులకు ప్రకటన పడింది. దానికి దరఖాస్తు పెట్టి, తన సర్టిఫికేట్లు జతపరిచింది కానీ, వేణు ఇచ్చిన కాగితం పెట్టలేదు.    
    వారం రోజులకు ఇంటర్వ్యూకు రమ్మని కార్డు వచ్చింది. సునీత పది గంటలకల్లా అడ్రసు ప్రకారం ఆ ఆఫీసు వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ ఆమె అనుకున్నట్లు పెద్ద క్యూ లేదు. అప్లికేషన్లు ఎన్ని వచ్చాయో గాని, ఆమెను, మరొక ఆంగ్లో ఇండియను లేడీని పిలిచినట్లుంది.
    ఆమెను చూసి ఫ్యూన్ అడిగాడు. "మీరు కూడా ఈమెలాగే వచ్చారా?" అంటూ ఆ ఆంగ్లో ఇండియన్ ను చూపించాడు.
    సునీత అవునన్నది.
    "అక్కడ కూర్చోండి" అంటూ ఆమె కార్డు అడిగి లోపలికి తీసుకు వెళ్ళాడు.
    కొంత సేపటికి లోపలినుంచి పిలుపు వచ్చింది. ముందు ఆంగ్లో ఇండియను లేడీ, జేనీ వెళ్ళింది. కొంచెంసేపటికి ఆమె నవ్వుతో తిరిగివచ్చి, "టైప్ రైటర్సు ఎక్కడున్నాయి?" అని ఫ్యూన్ ను అడిగింది. ఫ్యూను ఆ గది చూపించాడు.
    సునీత కూడా వెళ్ళింది. లోలోపల ఇంటర్వ్యూల్లో కలిగే ఒక విధమైన జంకు ఆమెను పీడిస్తూనే ఉంది.
    యాభై అయిదేళ్ళు-కొంచెం ఎక్కువే- ఉన్న ఒకాయన ఏమిటో వ్రాస్తున్నాడు. తల అయినా ఎత్తకుండా, "ఒక్క నిమిషం కూర్చోండి" అన్నాడు.    
    సునీత కూర్చుంది.
    ఆయన అన్నట్లు నిమిషం గడిచింది. సంతకం బరబరా గీకేసి, ఫెయిల్ పక్కకు జరిపి, "మీ పేరు" అంటూ తల ఎత్తాడు.
    "సునీత."
    ఆయనలో చలనం కనిపించలేదు. రెండు క్షణాల పాటు అదె స్థితిలో ఉన్నాడు. సునీతకు కోపం వచ్చింది. ఈ ఇంటర్వ్యూ వెనక గూడుపుఠాణీ ఏమైనా ఉందేమో నన్న అనుమానం కలిగింది.
    "మీ నాన్న పేరు?"
    "తెలీదు."
    "తెలీదూ?"
    "నేను పుట్టక ముందే..."
    "ఐ సీ! పోనీ, మీ తల్లి పేరు?"
    "ఆమె కూడా నా పసితనంలో మరణించింది."
    "పోనీ మీ పోషకు లెవరైనా ఉంటే చెప్పండి!"
    "సర్టిఫికేట్ల ట్రూ కాపీల్లో అవన్నీ ఉన్నాయి."
    ఆయన వదనం వివర్ణం కావటం సునీత గమనించింది. ఏమిటో సణిగాడు. ఆమె అదేమిటో తెలుసుకోలేక పోయింది.
    "ఆమె ఎక్కడుంది?"
    "చనిపోయింది. ప్రస్తుతం నేను ఏకాకిని."
    "ఊఁ! వేణు మీకు తెలుసా?"
    వేణు తనకు తెలిసినట్లు ఈయన కెలా తెలిసింది? బహుశా ఉత్తరం వ్రాసి ఉంటాడు. అనుకుని, "ఊఁ! కాలేజీలో చదువుకున్నప్పుడు కేవలం పరిచయం మాత్రమే!" అని జవాబిచ్చింది.
    ఇంకేమీ అడగలేదు. ఆ పూటనుంచే పనిలో చేరమన్నాడు. వెళ్ళేముందు, "ఇదివరకు మీ రెక్కడైనా పని చేశారా?" అన్నాడు.
    "రెండుచోట్ల, తాత్కాలికంగా." ఆ రోజునుంచే ఆమె ఉద్యోగం ప్రారంభమైంది.

                                *    *    *

    ఆర్తి ఫోన్ అందుకుంది.
    "నేనే, నాన్నా!"
    "ఇప్పుడు తీరిగ్గా ఉన్నావా? ఒకసారి రావాలమ్మా!"
    "వస్తున్నా." రిసీవర్ హుక్ లో పెట్టేసింది. కాంపౌండర్ తో చెప్పింది వెళుతున్నట్లు. కొద్ది సేపట్లో ఆమె లేత ఆకుపచ్చని కారు గోవిందరావ్ అండ్ సన్ అని బోర్డు ఉన్న ఆఫీసు ఆవరణలో ఆగింది. ఆమె దిగి టైమ్ చూసుకుంది. అయిదున్నర దాటింది.
    ఆర్తి ఎక్కడా ఆగకుండా తిన్నగా ఆఫీసు రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ ఆమె కోసమే చూస్తూ ఆమె తండ్రి గోవిందరావు ఉన్నాడు.
    ఆమె తండ్రికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. "ఏమిటి, నాన్నా?"
    గోవిందరావు ఎడం చేత్తో డెస్కు లాగాడు. అందులో నుంచి కొన్ని కాగితాలు తీసి, "సునీత పేరు ఎప్పుడన్న విన్నావా?" అన్నాడు.
    "లేదు."
    "ఈ సర్టిఫికేట్లలో గార్డియన్ పేరు చూడు." ఆమెకు అందించాడు. అవన్నీ ఏడెనిమిది దాకా ఉన్నాయి. ఆర్తి వాటిని చూసి, "ఇవన్నీ ఎందుకు? ఈమె ఎవరు?" అని ప్రశ్నించింది.
    "చెబుతాను. ఆ గార్డియన్ పేరు నువ్వు నా నోట విన్నావు కదూ?"
    "ఊఁ! విన్నట్లే ఉంది!"
    "అత్తయ్యను చూశావు కదూ? ఆమె నీకు గుర్తు ఉండి ఉంటుంది!"
    "ఊఁ!"
    ఆయన కాలింగ్ బెల్ నొక్కాడు. ఫ్యూను వచ్చాడు. "వెళ్ళి పొద్దున చేరిందే టైపిస్టు- తెలుగమ్మాయి- ఆమెను పిలుచుకురా?"
    ఫ్యూను వెళ్ళిన అయిదు నిమిషాలకు సునీత వచ్చింది. సునీతను చూస్తూనే ఆర్తి ఉలిక్కిపడింది. ఎవరు? కలా? నిజమా? చచ్చిపోయిన అత్తయ్య తిరిగి ఎలా వచ్చింది? కాదు.... అత్తయ్య మరణించి ఇరవై ఏళ్ళు కావస్తున్నది ఈమె ...... అంతా అదే పోలిక..... పాప కాదు కదా?
    సునీత అన్నది: "ఎందుకో పిలిపించారట?"
    "ఆఁ! ఈ సర్టిఫికేట్లు మీరు తీసుకువెళ్ళవచ్చు! అన్నట్లు ఈమె రెండవ అమ్మాయి, ఆర్తి. ఈమె తరవాత వేణు." పరిచయం చేశాడు. సునీత నమస్కరించింది.
    ఆర్తి ప్రతినమస్కారం చేసి, "మీ స్వగ్రామం ఇదేనా?" అనడిగింది.    
    "అవును!"
    సునీత వెళ్ళింది.
    "రూపమే కాదు, కంఠస్వరం, నడక అన్నీ అలాగే ఉన్నాయమ్మా!"
    "అత్తయ్య పాపే నంటావా, నాన్నా?"
    "అవునమ్మా!"
    ఆర్తి దీర్ఘాలోచనలో పడింది.

                                    3

    వేణు, గోవిందరావు కుమారుడని సునీతకు తెలిసింది. రాజీనామా ఇచ్చేద్దామనుకున్నది. కానీ, ఈ గడ్డురోజుల్లో మరొక చోట ఉద్యోగం దొరకటం కష్టం. అయినాఅతనెవరైతే ఏం? తను ఉండవలసిన దూరంలో ఉంటుంది.
    ఆఫీసులో సునీతకు ఎవరికీ లేని ప్రత్యేకత ఇవ్వబడింది. 'ఆఫీసు టైపిస్టు' అంటూ రామెను. యజమాని గదినుండి వచ్చే దేమయినా ఆమే టైప్ చెయ్యాలి. మిగతా సెక్షన్లకు జేనీ ఉంది. సునీతకు జీతం కూడా ఎక్కువే. అందుకు కారణం ఆమె స్టెనో కావడమే. జీతం కాక ఇతర అలవెన్సులన్నీ దొరుకుతాయి. ఈ పని సునీతకు తృప్తికరంగానే ఉంది. ఇంతకన్నా మంచి ఉద్యోగం కావాలని కూడా ఆమెకు లేదు.
    ఒక సంవత్సరం ప్రశాంతంగా గడిచింది.
    ఆర్తి అప్పుడప్పుడూ ఫోన్ చేసి, సునీతను పలకరిస్తూండేది. ఆర్తి అంటే సునీతకు గౌరవం ఏర్పడింది. ఆర్తి సునీతతో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతుంది.
    ఒక రోజు- ఆ వేళ మొదటి తేదీ, డిస్పాచ్ చెయ్యవలసిన ఉత్తరాలు చాలా ఉండటంవల్ల కాస్త ఆలస్యం అయింది. కవర్లన్నీ అంటించేసి, పోస్టు బాక్సులో వేసి రమ్మని పంపించేసింది. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి మరునాడు పంపవచ్చని, డెస్కులో పడేసి తాళం వేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS