Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 28

 

    ఆర్తి అప్రతిభురాలైంది ఆ వ్యక్తిని చూసి. యాదగిరి కుర్చీ ముందుకు జరుపుకుని కూర్చున్నాడు. ఆర్తికి మాట్లాడాలని కూడా తోచటంలేదు. ఎలాగో కొంతసేపటికి తేరుకోగలిగింది.
    ఆమెను సంభాషణలోకి దింపాడు యాదగిరి. తాను ఇన్నాళ్లుగా ఎక్కడ ఉన్నదీ, ఏం చేసిందీ చెప్పాడు.
    "సునీత చెప్పిందికూడాను చాలాసార్లు. ఎందుకో నాకు మొహం చెల్లదని అనిపించింది. గోవిందు యాత్రలకు వెళ్ళటంకూడా నాకు తెలుసమ్మా!"
    "మాటిమాటికీ మొహం చెల్లదంటావు. నువ్వేం తప్పు చేశావని? ఇన్ని సంవత్సరాలనుండి ఇక్కడ ఉన్నావు. ఏమిటో, మామయ్యా, నిన్ను అర్ధం చేసుకోవటం కష్టం!"
    "చేసిన తప్పు చెప్పరానిది. ఆ రోజులన్నీ కేవలం జ్ఞాపకాలే అయినాయి. ఇల్లు, ఎప్పుడన్నా ఓసారి బజారుకు - అంతే ఏదీ చెయ్యాలనిపించదు."
    "సునీతతో నీకెలా పరిచయం?"
    "ఆఁ! అద్దెకు ఇల్లు కావాలని వచ్చింది. ఆ తరవాత చనిపోయిన అత్తయ్యలాగే, ఆమే సాక్షాత్కరించి నట్లుంది. కంటికి కనిపించని అనుబంధం." చెప్పలేకపోయాడు.
    "నాన్న, నేను అదే అనుకున్నాం. వేణుకు తెలియదు. అత్తయ్య మరణంనాటికి మూడేళ్ళవాడో ఏమో? జ్ఞాపకం ఉండి ఉండదు. అప్పుడే నువ్వు కూడా జైలుకు వెళ్ళావు కదూ? నిన్నుకూడా గుర్తు పట్టడు."
    ఆరుగంటలదాకా వాళ్ళు అక్కడే ఉన్నారు.
    ఆవేళ యాదగిరి వేణుకుగూడా పరిచితుడయ్యాడు.
    నీలకంఠం,సునీత కూడా ఉన్నారు. మధ్యాహ్నం పన్నెండువరకు అయిదో నంబరు రూమ్ లోనే కాల క్షేపం జరిగింది. ఆరోజు ఆదివారం.
    "మీ బాబాయి  అనుకున్న వ్యక్తి, నాన్న చిన్ననాటి స్నేహితుడై, దూరపుబంధువైన మామయ్యగా అవతరించి, మన స్నేహాలను బలపరిచాడు." వేణు సునీతవైపు తిరిగి మళ్ళీ అన్నాడు: "ఏడెనిమిదేళ్ళ వరకూ, అక్కయ్య ఆయన ఒడిలోనే ఎక్కువసేపు గడిపేది. నేను అమ్మను విడిచేవాణ్ణి కాదనుకో! ఆయన జైలుకు వెళ్ళి దాదాపు ఇరవైఏళ్ల అనంతరం మళ్ళీ మన మధ్యకు రాగలిగాడంటే ఎంత సంతోషం!"
    "అవును ఎంత సంతోషం! ఏం కథ? ఈపాటికి మనం కరిగి నీరై ప్రవహించి గడ్డకట్టవలసిన పని." నీలకంఠం మాట వదిలాడు.
    నవ్వులు ఆ గదిని నిండాయి.
    "అన్నం వేళవుతున్నది. నాకు ఆకలిగా ఉంది, పెద్దమ్మా!"
    "లాకర్ లో పళ్ళు ...."
    "ఉండనీ, పాపా ఇప్పుడు అందరం ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాంలే. రాధకుగూడా మామయ్య ఎవరో చెప్పాలి. పద, మామయ్యా!"
    "సునీత అన్నం తినదు, పాపం!" వేణు ఊరించాడు.
    "నాలా మీరు రోజూ పళ్ళూ, పాలూ తింటారా?"
    "ఆఁ! కావాలంటే బోలెడు."
    "నాకూ కావాలంటే బోలెడన్నం."
    "ఇక పదండి, బాబూ. నా ఆకలి పెరిగిపోతూంది." అందరినీ కదలేశాడు నీలకంఠం. వెళుతూంటే, వెనక్కు తగ్గి ఒక్కడే మిగిలాడు వేణు. దగ్గిరకి వచ్చి చేతులు వెనక్కు కట్టుకుని, ముందుకు వంగి, "దేవుడు కూడా మనల్నే సమర్ధిస్తున్నాడు. నీతా, ఇంకా దగ్గిర వాళ్ళమయ్యాం కదూ?" అన్నాడు.
    "ఊఁ!"
    "ఏమిటా కళ్ళు మూసుకోవటం! రె .... రె ...." మరింత తల వంచి గొంతు పూర్తిగా తగ్గించాడు. "నీ కెంపుల పెదవుల్ని ఒక్కసారి.... మొదటిసారి .... ముద్దు పెట్టుకుంటాను, నీతా!"
    "ఊఁ?"
    "నీ పెదవులను ముద్దుపెట్టుకునేదా?"
    సిగ్గువల్ల రెండు చేతులతో ముఖం దాచుకుంది. ఆమె రెండు చేతులను విడదీసి సున్నితంగా పెదవులు ముద్దాడాడు.
    "ప్రభూ .... వేణూ!"
    "దేవీ .... నీతా!"
    కళ్ళు తెరిచి చూడకుండానే మధురంగా నవ్వింది.

                                                    *    *    *

    రహీమ్ తప్పేమీ లేదన్నది సునీత. ఆమె అంగీకరించక పోవటంవల్ల రహీమ్ కారాగారానికి పోవటం తప్పింది. అతనికి శిక్ష పడాలని అనుకోవటం లేదా అని వేణు అడిగినప్పుడు, "అది నా మంచికే జరిగింది, వేణూ. లేకపోతే నాకు ఈ సౌభాగ్యం లభించేదా? చెప్పండి" అంది.
    "ఏ సౌభాగ్యం?"
    "ఇంకా కొంటెతనం వదల్లేదు. మీరిచ్చిన వరం మీకే మతికి రాలేదా?"
    "లేదు. చెప్పు!"
    గిలిగింతలు పెట్టే చూపు, వాల్చిన కళ్ళు అదేమిటో చెప్పాయి.
    ఆర్తి, గాయం పూర్తిగా మానిన తరవాత సునీతను డిశ్చార్జి చేసింది. సుమారొక నెలపైగా హాస్పిటల్ లోనే ఉంది. డిశ్చార్జి అయ్యాక వారంరోజులు ఆగి ఆఫీసుకు వెళ్ళవచ్చన్నది ఆర్తి. ఆ రెండు నెలలూ ఆఫీసుకు సెలవు పెట్టినట్లే అయింది.     
    వచ్చేరోజు బిల్ ఎంత అయిందో అనుకుని ఓ అయిదు వందల రూపాయలు కావాలని అడిగింది వేణును.
    "దేనికి, నీతా?"
    "కావాలి. ఈ అప్పు తీరేదాకా జీతంలో..."
    "తీసుకుంటాలే. దేనికో చెప్పు!"
    ఎంత అడిగినా చెప్పలేదు. వేణు డబ్బు తెచ్చి ఇచ్చాడు. సాయంత్రం వస్తూ కన్సల్టింగ్ రూమ్ లోకి వెళ్ళింది. బిల్ విషయం ప్రస్తావించింది.
    "ఎంత తెచ్చావు?" శాంతంగా అన్నది ఆర్తి.
    "అయిదు వందలు ఉన్నాయి."
    "అక్కడ పెట్టు."
    ఫాన్ గాలికి ఎగిరి పోకుండా పేపర్ వెయిట్ కింద పెట్టింది.
    "ఈ ఫోటో ఎవరిది, పాపా!" గోడకు ఉన్న లైఫ్ సైజ్ ఫోటోను చూపించింది. మళ్ళీ సునీతకు అవకాశమివ్వకుండా అంది: "దాన్ని తీసుకువెళ్ళి, నీ కాళ్ళతో తొక్కి కాల్చివెయ్యి. తిరిగి మళ్ళీ ఎన్నడూ నేననేదాన్ని జీవించి ఉన్నాననుకోకు. వెళ్ళు. వెళ్ళిపో, పాపా!" చాల సహజంగా ఉన్నాయా వాక్యాలు.
    "డాక్టర్ ..."

                                       
    "...................."
    "మీకు కష్టం కలిగిస్తుందంటే, నేనీ పని చెయ్యక పోదును. క్షమించండి" అంది, విచారం ధ్వనించే కంఠంతో సునీత.
    ఆర్తి మాట లేదు.
    ఆ డబ్బు తీసుకున్నది సునీత, "వస్తాను, డాక్టర్. నమస్తే!"
    "ఒక్క క్షణం కూర్చో!" రివాల్వింగ్ చైర్ తో వెనక్కు తిరిగింది సునీత నిలుచునే ఉంది.
    "పాపా, మన మధ్య డబ్బు ప్రసక్తి రాకూడదు. అప్పుడే నేను నీకు డాక్టర్ ను. నువ్వు నాకు పాపవు. నేను డబ్బుకోసమే వైద్యం చేస్తున్నాననుకున్నావా, పాపా?"
    "......................"
    "కాదు. నీకు తెలిసి ఉండే ఈ పని చేశావు. నా భర్త వెళ్ళిన నాటినుండీ నే నెవ్వరినీ డబ్బు అడగలేదు. వాళ్ళే కృతజ్ఞతకొద్దీ ఏదో ఇచ్చేవారు. ఆయన ఉండగాకూడా అడిగి ఉండలేదు. అంతా ఆయనే చూసుకునేవారు. మనం డబ్బుకోసమే పుట్టామా, పాపా?"
    "................."
    "జీతంలో తీర్చుకుంటానని వేణునడిగి తెచ్చి ఉంటావు. ఒకవేళ నేను వేణువై ఉంటే నిన్ను షూట్ చేసిఉందును."    
    ఆర్తి మళ్ళీ ఇటు తిరిగింది. చెమ్మగిల్లిన కళ్ళతో సునీత అలాగే నిలబడి ఉన్నది.
    "నా దగ్గిరికి రా, పాపా!"    
    సునీత దగ్గిరికి వచ్చింది. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని ముందుకు వంచుకుని చెక్కిలిని ముద్దాడి, "ఇంటికి వెళ్ళు. రెండు రోజుల కొకసారి నియమంగా వచ్చిపోతూ ఉండాలి! ఆ డబ్బు వేణుకు మళ్ళీ ఇవ్వకు అవసరం ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ నవ్వు" అంది.
    సునీత నవ్వు తెచ్చుకున్నది.
    "డ్రైవర్ తో చెప్పాను. కారులో వెళ్ళు. ఏం?"
    
                                  *    *    *

    ఫస్టు తారీఖున సునీత ఆఫీసుకు వెళ్ళింది.
    "రిజైన్ చేశావుగా? మళ్ళీ ఎందుకు వచ్చావు?"
    "వెళుతున్నాను."
    "తక్షణం! నీ సీట్లోకి." నవ్వాడు వేణు.
    సునీత మామూలుగా వెళ్ళి వస్తున్నది. రెండు రోజుల కొకసారి ఆర్తిని చూడడానికి వెళుతూంది కూడాను.
    గోవిందరావు ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. నేనుంత ఉత్సాహకరంగా ఉండటంలేదు. తను చూసిన స్థలాలను గురించే తప్ప సారధి విషయం అసలు ప్రస్తావించకపోవటంబట్టి అతను తటస్థపడలేదని తెలిసేది.
    ఆయన ప్రతి ఉత్తరంలోను సునీతను తప్పకుండా అడుగుతూ ఉంటాడు.
    మళ్ళీ చాలా రోజులకు అయన ఉత్తరం, కొంత ఆశాజనకంగా వచ్చింది ఆర్తి దానిని ఇంటికి తీసుకువెళ్ళి చదువుకుంది అందులో ఒక పేరా -
    "...క్షేమంగా కాశీ చేరుకున్నానమ్మా రెండురోజు లైంది.
    "నిన్ననే నేను విశ్వేశ్వరాలయానికి వెళ్లాను ఉదయం కావటంవల్ల జనం బాగా ఉన్నారు. అంతలో ఎవరో ఒకతను, గడ్డం బాగా పెరిగి ఉన్నది. శ్వేతాంబరాలు ధరించిఉన్నాడు. అతను ముందు నా పక్కనుంచే వెళ్ళినా నేను గమనించలేదు. ఆ నడకా అదీ చూసి సారధి అని గుర్తుపట్టి పిలవబోయాను. అతను నన్ను చూసి కంగారుగా జనంలో కలిసి మాయమయ్యాడు. మళ్ళీ కనిపించలేదు. ఆలయం ప్రధాన ద్వారంముందు చాలాసేపు నిలుచున్నాను. అతను రాలేదు. లోపలికి వెళ్ళి చూశాను. కనబడలేదు. ఎటు నుండి వెళ్ళాడో ఏమో, మరి! ఆ ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని పోలికలు వర్ణిస్తూ అడిగాను. ఒకతను ఆ పోలికలు గల వ్యక్తి గంగానదివైపు వెళ్ళడం చూశా నన్నాడు. గంగాదాకా వెళ్ళి తిరగగలిగినంతమేరకు తిరిగాను. నిన్న రాత్రి పదిగంటలవరకూ, ఇవ్వాళ సాయంత్రందాకా నగరమంతా గాలించాను. లాభం లేకపోయింది."
    ఆర్తి చేతిలో ఉత్తరమంతా తడిసిపోతూంది కన్నీటితో పిన్ని ఎంతసేపటికి గదిలోనుండి రాకపోవటంతో తలుపు దగ్గిర రాధ పిలుస్తున్నది.
    తేరుకుని తలుపు తీసింది ఆర్తి.
    "ఎందుకు, పిన్నీ, ఏడుస్తున్నావు?"
    "ఏం లేదు. బాబాయి జ్ఞప్తికి వచ్చారు!"

                                  17

    నీలకంఠం దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. సునీత కనిపిస్తే విష్ చేసేవాడు, ఆరోజు అది మరిచిపోయినట్లున్నాడు.
    "ఇవాళ పరధ్యానం ఎక్కువైనట్లుందే?"
    "అదేంలేదు. మా నాన్న పెద్ద చిక్కు తెచ్చిపెట్టాడు, పెద్దమ్మా."
    "ఏమిటో అది! నేను వినవచ్చా?"
    "ఆఁ ఆఁ. ఇది చూడండి." కవరు ఒకటి జేబులోనుంచి తీసి ఇచ్చాడు.
    "చదవనా?"
    "అందుకేగా ఇచ్చింది?"
    సునీత అది చదివింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళిచేసుకుని తీరవలసినదేనని దాని సారాంశం.
    "మీరేమంటారు, పెద్దమ్మా?"
    "మీ నాన్నగారు రాసినట్లు చెయ్యమనే."
    "ప్చ్! నాకు చేసుకోవాలనే ఉంది. ఈ విషయంలో నా దొక నిర్ణయం కూడా ఉంది. అదేమంటే నన్నుఅహర్నిశలూ కనిపెట్టిఉంటూ, ప్రతి పనిలోనూ హెచ్చరిస్తూ, నా నిత్యకార్యక్రమాన్ని ఈ పరధ్యానం నుండి కాపాడగలిగిన వ్యక్తి కావాలని అనుకుంటున్నాను. అప్పుడే నేను పెళ్ళాడదలుచుకున్నాను."
    "ఇలా వద్దనుకుంటే దొరుకుతారా?"
    "అదీ నిజమే. అటువంటి వ్యక్తి ఎదురైతే కులం, ఆస్తి, రూపం - ఇవేవీ నాకు అవసరంలేదు. పెద్దమ్మా, మీ స్నేహితుల్లో అటువంటి వారెవరైనా ఉంటే చెప్పండి! ఇవ్వాళే నాన్నకు రాసేస్తాను. ఆయన బరువూ తీరుతుంది."
    "మంచి ఆదర్శమే! నా స్నేహితులంటారా? కాలేజీలో సుజన అనే అమ్మాయితప్ప నా కెవరూ లేరు. సుజనకు  పెళ్ళి అయింది."
    "కాలీజీ స్నేహితునే కాదు. చిన్ననాటి స్నేహితులు, ఇతరత్రా స్నేహమైనవారు..... ఎవరైనా సరే!"
    "బ్రహ్మచర్యం మీద పూర్తి గా విసుగెత్తినట్లుంది!"
    "దానికన్నా, నా పరధ్యానం అనే జబ్బుమీద, అందుకే నన్ను అనుక్షణమూ అంటిపెట్టుకుని హెచ్చరించే వ్యక్తి కోసం ఆమెకోసమే ఈ తాపత్రయం!"
    "ఓ! ఒక్కొక్కరినీ జ్ఞాపకం చేసుకోనివ్వండి..." సునీత బాల్యస్నేహితుల దగ్గిరనుండి తిరగేసుకునే ధోరణిలో అంది. కాని ఆమె కెవరూ తట్టలేదు. అందుకే, "ఎవరూ సరిగా గుర్తులో లేరు. తరవాత చెబుతాను లెండి" అన్నది.
    అంతలో భోజనం ముగించిన యాదగిరి వచ్చాడు.
    మరునాడు మామూలుగా ఆఫీసుకు వెళ్ళింది. ఎన్నడూ లేనిది, అప్పటికే వేణు వచ్చి ఏదో వ్రాస్తున్నాడు. గదిలోకి పిలిపిస్తేనే వెళ్ళింది.
    తను వ్రాసిన కాగితం, మరో కాగితం ఆమెకు ఇస్తూ, "ఇవి ఒక పాతిక కాపీలు తీసిపెట్టాలి, సునీతా!" అన్నాడు.
    అందుకుని చూసింది. పుట్టినరోజు పండుగ ఆహ్వానం.
    "ఆరు సంవత్సరాల తేడాతో నేనూ, రాధా ఒకే తేదీన పుట్టాం. మా ఇద్దరి జన్మదినం ఒకటే. నాకు ఇష్టంలేదుగానీ, అక్కయ్యే బలవంతం చేసింది. అదీగాక రాధ గోలకూడా."
    "ఇలా జరగటం అరుదు. ఇద్దరి జన్మదినం ఒకే రోజు!"
    "నీకీ సరదాలు లేవా, సునీతా?"
    సునీత తల వంచుకున్నది. వైరాశ్యంతో, "ఉన్నా, జరుపుకున్నంతమాత్రాన ఏం వస్తుంది? ఒక బర్త్ డే చేసుకున్నామంటే, ఒక సంవత్సరం వెనక్కి నెట్టి మృత్యుప్రాంగణానికి చేరువవుతున్నామని అనుకుంటాను" అన్నది.
    "ఎవరూ మృత్యువును దూరంగా ఉంచలేరు, నీతా!" సునీత ఒక్క క్షణం ఏమీ అనకుండా నిల్చున్నది. "ఒక అర్ధ గంటలో ఇవి పంపిస్తాను. కవర్లు కూడా ఇస్తే ఈ లిస్టులో పేర్లూ టైపు చేస్తాను."
    "పంపిస్తాను, వెళ్ళు."
    అతిథుల పేర్ల లిస్టులో తన పేరు లేకపోవటం గమనించింది. సునీత దానికేమీ బాధపడలేదు. తనకు వేరే చెప్పనవసరం లేదని వేణు అభిప్రాయమనుకుంది.
    ఆమె ఊహలు వమ్ముచేశాడు వేణు.
    సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి యాదగిరి, కవరొకటి ఇస్తూ, "మీ ఆఫీసు ఫ్యూనట. నీకిమ్మంటూ ఇచ్చిపోయాడు" అన్నాడు.    
    తీసుకుని చూసింది. లేత గులాబీరంగు కవరు మీద "కుమారి సునీతాదేవికి" అని అందమైన అక్షరాలతో వ్రాయబడి ఉంది. అది వేణు చేతివ్రాత.
    కమ్మని సెంటువాసన గుప్పుమంటున్నది. కవరు ఊడదీస్తే, రెండు కాగితాలు ఉన్నాయి. ఒకటి లేత ఆకుపచ్చ  రంగు కాగితం. ఆహ్వానమని కనబడుతూనే ఉంది. రెండవది వేణు ఆమెకోసం ప్రత్యేకంగా వ్రాసింది. గదిలోకి వెళ్ళి తలుపు దగ్గిరకి వేసి చదువుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS