కోటుజేబులో కాగితం పక్కనే లాకర్ మీద, ఆమెకు కనబడేలా ఉంచి చప్పుడు కాకుండా లేచి, తలుపు దగ్గిరగా వేసి కన్సల్టింగ్ రూమ్ వైపు నడిచాడు.
ఈ రెండు రోజులు ఆర్తి వేణుతో మాట్లాడనే లేదు. మరొక కాగితం కన్సల్టింగ్ రూమ్ ముందున్న పూనుకు ఇచ్చి, "నే నిచ్చానని అక్కయ్యతో చెప్పు వచ్చాక" అని వరండాలోకి వెళ్ళాడు.
* * *
నీలకంఠం ఆ ఉదయమే వచ్చాడు. కాని, సునీత జాడ ఎవరూ చెప్పలేదు. ఆందోళన పడ్డాడు. విశ్వంకాని, వేణుకాని ఎవరూ కనబడనేలేదు. పాపం, అతనికి ఇదేమిటో తిక్కతిక్కగా ఉంది.
మూడవ రోజు ఉండబట్టలేక వేణు ఆఫీసుకు వెళ్ళాడు.
అతని ప్రశ్న విని వేణు పిచ్చివాడు కాదు గదా అని నవ్వుకున్నాడు.
"మీ పెద్దమ్మ ఎవరో మాకు తెలియదు."
"తెలీదూ? సునీత .... సునీతాదేవి ..... తెలియదు ..... మిస్టర్, మీరు ..."
నవ్వాగలేదు వేణుకు. నీలకంఠం తినేసేటట్టు చూశాడు.
కొంచెం కొంచెంగా అడిగి తెలుసుకుని, "మన్నించండి. మీరు నన్ను ఫూల్ చెయ్యడానికి వచ్చారేమో అనుకున్నా. మొన్న సమ్మెలో ఆమె గాయపడింది" అని గీతాభవనం అడ్రస్ ఇచ్చి, "అక్కడే స్పెషల్ వార్డ్, రూమ్ నెంబర్ ఫైవ్ లో ఉంటుంది. వెళ్ళి చూడండి" అన్నాడు.
నీలంకంఠం ఆత్రంగా వెళ్ళాడు.
"ఏమిటో? పాతికేళ్ళ మనుషులను పసివాళ్ళుగా చేస్తావు! నువ్వు ముట్టుకుంటే మృత్యువుకూడా జడుస్తుంది, నీతా!"
ఈ వార్త ఎక్స్ ప్రెస్ డెలివరీ ఉత్తరంలో చూసిన యాదగిరి, ఒక్క క్షణం పక్షవాతానికి గురి అయిన వాడిలా అయ్యాడు. ఎవ్వరు ఉండమన్నా ఉండకుండా అప్పటికప్పుడు ప్రయాణమయ్యాడు. రైలు అయితే సాయంత్రందాకా ఉండాలని ఆపళాన బస్సు స్టాండుకు రిక్షా చేయించుకున్నాడు. బస్సు మరో రెండు గంటలకు వెళుతుందని తెలిసి ఇంటికైనా రాకుండా అక్కడే కూర్చున్నాడు. కన్నబిడ్డకు ప్రమాదం జరిగిందని విన్న తండ్రి, ఎలా కలవరపడతాడో అలా అయింది. ఏదో కంటికి కనిపించని అనుబంధం.
బస్సు హైదరాబాదు చేరుకునేసరికి ఆరున్నర అయింది. బెడ్డింగుతో సహా ఏకంగా దవాఖానాకే వచ్చాడు. టైమ్ అయిపోవడంచేత ఆర్తి లేదు, సునీత ఒక్కతే ఉన్నది. మేలుకున్నది. అంతకుముందే వేణు, విశ్వం, రాధ చూసి వెళ్ళారు. నీలకంఠం పొద్దున ఓ సంచీ నిండా పళ్ళూ, తన ఫ్లాస్కులో పాలు ఇచ్చాడు తెచ్చి.
యాదగిరిని చూసి కూర్చో బోయింది. యాదగిరి కాట్ మీద కూర్చున్నాడు. ఆయన భుజంమీద తల వాల్చి కళ్ళు మూసుకుంది.
విశ్వం ఆయనకు వ్రాసిన ఉత్తరంలో ఆమె గాయపడిన కారణాలు అన్నీ సవివరంగా వ్రాశాడు. సునీత వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఆయన అన్నాడు: "సునీతా, నాకు మాటమాత్రంగానైనా తెలుపలే దేమమ్మా!"
"పోనీ, బాబాయ్, అదంతా జరిగింది." ఆమెకు ఇష్టం లేనట్లు అంది.
కొద్దిసేపు మాట్లాడాక, "మీ డాక్టరు ఆర్తి ఫోటో చూశానమ్మా! ఆమె నాకు చిన్నప్పటినించీ తెలుసు" అన్నాడు.
కుతూహలంగా అన్నది: "ఎలా తెలుసు, బాబాయ్?"
"అదంతా ఇప్పుడు చెప్పలేనమ్మా! నేను ఆవిడ కంట పడాలనికూడా అనుకోవటం లేదు."
"ఎందుకు, బాబాయ్?"
"ఏమో .... కాదు.... వద్దు...." అర్ధంలేని విధంగా ఆ మాటలు ఉచ్చరించాడు. మళ్ళీ ఆయనే అన్నాడు: "ఏమో? రేపు వచ్చినపుడు కలుసుకుంటే కలుసుకుంటాను. కాని ఖచ్చితంగా అలా చెయ్యగలనని చెప్పలేను."
ఆర్తి ఫోటో, ఆయన గతానికి గాలమైంది. తను, తన యౌవనం, వ్యాపారం, దేశాటనం, బట్టల దుకాణం, వేరుపడుతూంటే వద్దని కాళ్ళా వేళ్ళా పడ్డ మిత్రునితో బాటు అన్నీ కళ్ళ ముందు సాక్షాత్కరించాయి.
"ఆర్తికూడా నా బిడ్డే! రేపు .... రేపు ... మాట్లాడాలి.' యాదగిరి ఓ గంట కూర్చుని వెళ్ళాడు.
16
సునీత పన్నెండవసారి ఆ ఉత్తరాన్ని చదువుకున్నది. మళ్ళీ ఒకసారి చదవాలనుకుంది. చదవుతున్నది.
"నా జీవనసర్వస్వానికి,
కార్టూన్లు వేసి కవరు పంపటం తరవాత మొన్న సంక్రాంతికి తప్ప మళ్ళీ ఎన్నడూ నీకు ఉత్తరం వ్రాసి ఎరగను. ఇప్పుడు వ్రాయవలిసిన అవసరం కలిగింది. కాదు, అక్కయ్య శిక్ష విధిస్తున్నానని నాకీ అదృష్టం కలిగించింది.
నాకైతే తెలియదుగాని, అక్కయ్య అంటుంది. నీ స్నేహం ఎన్నో ఏళ్ల క్రితమే జరిగిందట. మీ రిద్దరూ ఎక్కడ తటస్థపడ్డారో నాకైతే ఊహకు అందరానిదిగా ఉంది.
ఇది ఎందుకు వ్రాస్తున్నానంటే-
నిన్ను క్షమించమని కోరేవరకూ తనతో మాట్లాడ కూడదన్నది అక్క! నీ ఎదట, ముఖాముఖిగా చెప్పుకో లేక, ఆ దైర్యం లేక ఇది వ్రాశాను.
ఒక మహా రచయిత్రి తన రచనల్లో, తరుచూ యుగ యుగాలు, ఆరాధన, స్త్రీ, జన్మజన్మాంతరాల సంస్కారంలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటుంది. నీకు ఆమె ఎవరో చెప్పనవసరం లేదు. ఇప్పుడీ పదాల ప్రసక్తి ఎందుకంటావా? ఇవి ఉపయోగించి నేను కొన్ని మాటలు చెప్పాలని అభిలషిస్తున్నాను. విను.
యుగయుగాల్లో నేను ఆరాధించిన ఆరాధనఫలితం, జన్మజన్మాంతరాలలో నాకు కలిగిన సంస్కారం, విజ్ఞానం-వీటివల్ల వచ్చిన గర్వానికి ఈ జన్మలో నీద్వారా జ్ఞానో దయమైంది. స్త్రీగా, నన్ను అమితంగా ప్రేమించే వ్యక్తిగా మాత్రమే కాదు. భూమిమీద అన్నిటికన్నా మిన్నగా ఆరాధించబడే ఒక అజ్ఞాత మహావ్యక్తివలె నాకు నేనుగా నిన్ను ఆరాధిస్తున్నాను. అందుకు ప్రతిఫలంగా-పైకి ఎలా ఉన్నా - నువ్వు నీ మనఃస్ఫూర్తిగా నన్ను ప్రేమించానంటే అది నీకు గొప్ప అదృష్టమే.
నీతా!
ఇది హైదరాబాదు మహానగరం. చరిత్రలో దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఎన్నో ప్రేమకథలు పుట్టాయి. ఆ ప్రేమజీవులు కనిపించని ఏ శూన్యంలోనో అదృశ్యులయ్యారు. కాని, ఈ తెలుగు గడ్డ ..... నేటి ఈ ఆంధ్ర రాజధాని .... ఒక్కసారి ఊహించు.
ఒక యువరాజు ఒక సౌభాగ్యవతిని ప్రేమించాడు. ఆ ప్రేమ అందరి ప్రేమలా కాలగర్భంలో మాసిపోలేదు. దేశమే గర్వించదగిన ఒక మహానగర నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఒక మహానగర నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఒక మహాపట్టణం వెలిసింది. అది భాగ్యనగరం.
నా జన్మస్థలం ఇది కాదు. నీ జన్మస్థానం నాకు తెలియదు. మధురమైన ప్రేమతత్త్వాన్ని తన పునాధుల్లో నిలవరించుకున్న ఈ పట్టణనివాసులం మనం. మన రక్తంలో, ముఖ్యగా నీలో, ఆ ప్రేమతత్త్వం మహోధృతంగా, రక్తం కన్నా మిన్నగా ప్రవహిస్తున్నది. అందుకే నువ్వు నాకోసం తల పగులగొట్టుకున్నావు. ప్రాణమైనా అర్పించ సిద్ధపడతావు. కాని.... కాని....నేను .... నేనేం చెయ్యగలను అలా?
నువ్వు అక్కయ్యతో చెప్పావు. అక్కయ్య నాతో చెప్పింది, నీ త్యాగంలోని అంతరార్ధం అంతకుముందు విశ్వంకూడా చెప్పాడు. హెచ్చరించాడు. కానీ మూర్ఖుడి నయ్యాను. ఒక సంతోషం మిగిలింది, నువ్వు నాకు దక్కావు. చాలు!
నేను రాధతో మునపటికన్నా చనువుగా ఉంటున్నాను. ఎందుకనో ఎంత చేసినా ఆమెలో నిన్ను చూసుకోలేక పోతున్నాను. ఒకటిమాత్రం తెలుసుకోగలిగాను - నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో, నాకన్నా ఎక్కువే ఆమె నన్ను ఆరాధిస్తున్నదని.
ఇంకొక్క కోరిక ఏమంటే రాధపట్ల నా ప్రేమను సడలించను. కాని నువ్వు కలిసిమెలిసి తిరగాలి. ముభావంగా ఉండటం, సూటిపోటీ మాటలు మానమనను. నీ ఇష్టం వచ్చినట్లు నన్ను నలుగురిలో అవమానపరుచు. అని ఆ క్షణాలవరకే. మళ్ళీ నాతో సౌమ్యంగా ఉండాలి. నువ్వు నన్నెంత దబాయించినా, అని పెదవులమీది మాటలేనని నాకు తెలుసు.
లోకం దృష్టిలో మనం వివాహితులం కాకపోయినా, మానసికంగా మన పెళ్ళి ఏనాడో జరిగింది. నీ మెడలో మాంగల్యం లేకపోయినా, మనసు ఉంది.
నేను నిన్ను వాంఛించడం లేదు. నీ ప్రేమను, వేణూ అన్న మనసైన పిలుపుకోసం తహతహలాడుతున్నాను. నీతా, ఈ పిలుపుకోసం నేను ఎన్ని జన్మలైనా ఎత్తు తాను; ఎన్ని లోకాలైనా తిరుగుతాను. అ పిలుపే నాకు శాంతి నివ్వగలదు. ఇకనుంచి నన్ను 'వేణూ' అని తరుచు పిలుస్తూండు.
విశ్వం, అక్కయ్య - ఇద్దరూ పెద్ద వేదాంతులు. ఎంత సామాన్యంగా ఉంటారో అంత జ్ఞానధనులు. నిన్ను గురించిన ఉత్తమమైన వాక్యాలు వినాలంటే వాళ్ళ దగ్గిరే వినాలి. మొన్న విశ్వం ఏమన్నాడో తెలుసా? నిన్ను చూస్తే, ఏ మహాశిల్పి మలిచిన శిల్ప రాజమో స్ఫురిస్తుందిట! నీ మాటలు వింటే, అజ్ఞాన తమస్సును చీల్చే జ్ఞానరేఖల్లా ఉంటాయిట. నీ రూపం చూసి, వెయ్యగల చిత్రకారుడికి సార్ధకత లభ్యమవుతుందిట. నీ స్వచ్చమైన చిరునగవును తేనె మాటలతో లోకాని కర్ధం చెయ్యగలిగిన రచయిత ధన్యుడట. నిజంగా ఎంత చక్కని మాటలు! నేను కనీసం కవినో, చిత్రకారుడినో అయితే ఎంత బాగు!
నువ్వు నా ప్రేమకు అధిదేవతవు. నేను నీ ఆరాధకుణ్ణి. నువ్వు వేరుకాదు. నేను వేరుకాదు. మనం ఇద్దరం ఒకటే! ఈ రూపసౌందర్యమూ, హృదయ సౌందర్యమూ నావి. నేను నీవాడిని. నీ జీవితం నాకొక మహత్తర సందేశం. నాలో జీవచైతన్యమంతా నీకే అంకితం.
ముందే చెప్పాను. ఇది ఎందుకు వ్రాశానో, నన్ను క్షమించగలిగితే క్షమించు.
మనఃపూర్వక శుభాకాంక్షలతో-
నీ
వేణు."
ఎంత చదివినా తనివిదీరడం లేదు. ఇంకొకసారి....మరొకసారి ఎన్నిసార్లు అయిందో లెక్కే లేదు. ఎవరో వస్తున్నట్లు చప్పుడు. సునీత చటుక్కున దాన్ని దిండుకింద దాచేసింది. ఆర్తి గుమ్మంలోకి వచ్చింది.
"ఎలా ఉంది, పాపా?"
"జీవం పోసినవారు, మీకు తెలీదా, డాక్టర్?"
"గడుసుదానివే! వేణు ఏమంటాడు?"
"ఆఁ ..... ఆఁ ... అహఁ. ఏమీలేదు. ఉదయం వచ్చి వెళ్ళారు." తడబడింది.
"వేణు నాకుకూడా వ్రాశాడు, నేను చెప్పిన పని చేశానని. ఎదటపడటానికి సందేహిస్తున్నాడు, ఏమంటానోనని."
'నాకుకూడా అంటే, నీకు రాశాడని ఆమె అంటూందా? తనకు వేణు ఇచ్చిన ఉత్తరం ఆమె కంట బడిందా?'
"పాపా, ఎక్కువగా చదవకూడదు. అంతగా అయితే కొన్ని రోజులు ఆగాక మళ్ళీ మళ్ళీ ఇష్టం వచ్చినన్నిసార్లు చదువుకో!"
తెలుసుకున్నందుకు సునీత సిగ్గుపడింది. తల వంచుకుని, "రెండుసార్లే చదువుకున్నా, డాక్టర్!" అని అబద్ద మాడింది.
ఎందుకో ఆర్తి ముందుక వంగింది. లాలనగా ఆమె నుదురు చుంబించి, "నాకు తెలుసు, పాపా, నీ కంత కోరికగా ఉంటే వేణుతో చెబుతాను, ఇంకా రాయమని. కానీ ఒకసారే చదువుకుని భద్రంగా దాచేసుకోవాలి. ఏం?" అంది మందహాసంతో.
సిగ్గుతో తల బరువైంది సునీతకు.
మునివేళ్ళతో గడ్డం పట్టుకుని తనవైపు తిప్పుకుని, "నీ ప్రేమకు సార్ధకత ఉంది. సందేశం ఉంది. అనురత్వం ఉంది. వేణు నాకు అంతా మరో కాగితంలో రాసి చెప్పాడు. మీ రిద్దరూ పాలు, నీళ్ళలా కలిసిపోవాలి అందువల్ల రాధ భవిష్యత్తుకు ఏ హానీ రాదు. ఆ బాధ్యత నాది" అన్నది.
నిశ్చలంగా సునీత అన్న మాట: "మీ ఆజ్ఞ సర్వదా ఆచరిస్తాను."
"మంచిది. విశ్రాంతి తీసుకో. వస్తా."
* * *
