ఆర్తి హాస్పిటల్ కు చేరుకునేసరికి రక్తం కొంత గడ్డకట్టింది. మళ్ళీ ఆమెఉ చేతులమీద లోపలికి తీసుకువచ్చాడు.
ఆర్తి సునీతను ఆ స్థితిలో చూసి దిమ్మెరపోయింది. మళ్ళీ అంతలోనే నర్సును పిలిచి ఏదో చెప్పి, గబగబా పరుగుతీసింది ఆపరేషన్ థియేటర్ వైపు.
అసిస్టెంట్ డాక్టర్ భాగేశ్వరి అప్పటికే రక్తమంతా తుడిచేసి, గ్లూకోజ్ ఇంజెక్షను ఎక్కిస్తూంది. నర్స్ ఒకామె కట్టు కడుతున్నది. వేణు, రాధ అక్కడే ఉన్నారు.
ఆర్తి రాకను గమనించి, "ప్రమాదమేమీ లేదు, డాక్టర్! జస్ట్ నాలుగు కుట్లు అవసరమయ్యాయి. అంతే. బలహీనంగా ఉంది. గ్లూకోజ్ ఇస్తున్నాను" అన్నది డాక్టర్ భాగేశ్వరి.
"అమ్మయ్య!" రాధ తేలికపడింది.
"స్పృహ - ఎప్పుడు వస్తుంది?" వేణు ప్రశ్న.
"రెండు మూడు గంటల్లో ఒక అర్ధగంట ఎక్కువ పట్టినా పట్టవచ్చు."
ఆర్తికూడా కుదుటబడింది. నర్స్ కు కళ్ళతోనే ఏదో సైగచేసి, "స్పెషల్ రూమ్. నంబర్ ఫైన్" అంటూ వెలుపలికి వచ్చింది. వేణు ఆమె ననుసరించి వచ్చాడు. రాధ అక్కడే ఉంది.
ఆర్తి కేమీ చెప్ప నవసరం లేదు. ఆమె ఊహించ గలదు. పక్కన నడుస్తున్న వేణును మందలింపుగా, "మన ప్రాణమైతే అంత అజాగ్రత్తగా ఉండం. ఏం, వేణూ?" అన్నది. అందులో ఎత్తిపొడుపు ఉన్నది.
"అక్కా! అక్కా .... నేను ఇలా అవుతుందని ..."
మధ్యలోనే తుంచింది. "అందుకే నాతో అన్నీ చెప్పుకున్నావు. ఏమైనా నీకోసం సునీత రక్తం ప్రవహించింది." వ్యంగ్యం.
"నన్ను క్షమించు, అక్కా!"
"అనటం తేలిక, వేణూ - స్పష్టంగా చెబుతున్నాను, విను, సునీత ఎందుకీ సమ్మెలో భాగస్వామి అయిందో, తన ఆరాటమేమిటో నాకు చెప్పగలిగింది. ఆమె ఎంత నిస్స్వార్ధపరురాలో, అంత త్యాగజీవి. నువ్వు నా తమ్ముడివే అయినా ఏదీ చెప్పలేదు. సునీత కోలుకున్నాక నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. ఎదటబడి చెప్పలేకపోతే కాగితంమీద రాసి ఆమెకివ్వు. అంతవరకూ నువ్వు నాతో మాట్లాడవద్దు."
"అక్కా!"
"క్షమించు, వేణూ, పేషంట్లు చూస్తుంటారు." కన్సల్టింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
"సునీత నా కెంత అర్ధం కాలేదో, నువ్వూ అంతే! నాకు సరిఅయిన శిక్షే విధించావు. కృతజ్ఞున్ని, అక్కా!"
* * * *
రాధ పరుగుతో వచ్చింది. "మామయ్యా, అక్క మాట్లాడుతున్నది. నీ స్నేహితుడు విశ్వం వచ్చాడు."
వేణు వెళ్ళేసరికి విశ్వం మాటలు వినబడుతున్నాయి. సునీత ఏమిటో అంటున్నది. గదిలోకి అడుగు పెట్టబోతున్నవాడల్లా పక్కకు తప్పుకున్నాడు.
"కాదు, విశ్వం వారిని కాపాడుగలిగాను. ఆ తృప్తే నాకు చాలు."
"కోరి సుడిగుండాల్లో దూకుతావు. చెప్పినా విని పించుకోవు. డాక్టర్ గాఉర్ ఫోన్ లో పిలిచి చెబితే నమ్మలేదు నేను."
"ఎందులో దూకినా, నేనెప్పుడు ఎవరి మాట విన్నానని? న మనసు చెప్పింది చెయ్యటమే చిన్నప్పటి నించీ నా అలవాటు."
"వేణు వచ్చాడా?"
"వారే నన్నిక్కడికి తీసుకువచ్చింది. ఇందాకే రాధ వెళ్ళింది. ఈపాటికి వస్తూండవచ్చు."
"మీ బాబాయికి తెలియదు కదూ?"
"ఈ మాత్రందానికే ఆయన్ని కంగారుపెట్టడం దేనికి?"
"ఉత్తరమంటూ రాయాలి గదా? అన్నట్లు నీలకంఠంగారుకూడా లేరేమో?"
"సికిందరాబాదులో ఎవరో స్నేహితుడి పెళ్ళని వెళ్ళారు. పొద్దున ప్రొపెషన్ టైముకల్లా వచ్చేస్తా నన్నారు. ఇంటికి వచ్చే ఉంటారు."
ఆఫీసు ఉందని, టైమయ్యాక తప్పకుండా వస్తానని యాదగిరి అడ్రస్ తీసుకుని విశ్వం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు.
ఇక తను అక్కడ ఉండటం మంచిది కాదని లోపల ప్రవేశించాడు వేణు. విశ్వం పొడిగా మాట్లాడి వెళ్ళాడు. నర్స్ ఒకామె వచ్చి బన్ రొట్టె, పాలగ్లాసు లాకర్ మీద ఉంచి వెళ్ళింది. వేణు కూచోటానికి ఏమీ లేదు. నిల్చునే ఉన్నాడు.
"కూర్చోండి."
ఎక్కడ? సునీత పక్కనా? ఎన్నడూ కూచోలేదు. అందుకే సంకోచం.
"మీరు నా పక్కన కూర్చుంటే నా పవిత్రత పాడవదు."
తప్పలేదు. కాస్త దూరంగా కూర్చున్నాడు.
"ఫర్వాలేదు. నన్ను ముట్టుకుంటే మీ ఏకపత్నీ త్వానికి భంగం రాదు."
దగ్గిరికి జరిగాడు.
లాకర్ మీద ఉన్న బ్రెడ్ అందుకోవాలనుకున్న ఆమెకు అందలేదు. వేణు దానిని కొంచెం ముందుకు జరిపాడు.
"నాకు సేవ చెయ్యాలని ఉబలాటపడుతున్నారా?"
".........."
"బ్రెడ్ తినిపిస్తారా?"
రొట్టె తుంచబోయాడు. మరో మాట వదిలింది. "పేదవాళ్ళు తినే రొట్టెలు ఎంత గట్టిగా ఉంటాయో తెలుసా? వాటి గట్టిదనానికి మీ సుకుమారమైన చేతివేళ్లు కందిపోవచ్చు!"
చెయ్యి తీసి జేబులో పెట్టుకున్నాడు.
"మీ కసి తీరిఉండవచ్చు!" రొట్టె పాలల్లో ముంచింది.
"............"
"బతికి ఉన్నానా, చచ్చానా అని చూట్టానికి వచ్చారా?"
మౌనం.
"అక్కడే చావనిస్తే పోయేది."
"..............."
"నా గోల ఉండేది కాదు. పీడా వదిలేది."
".........."
"లోకంలో రోజూ దౌర్భాగ్యులెంతమంది చావడం లేదు?"
ఒక్కొక్క మాట కరకు కత్తిలా వేణును నిలువునా కోసేస్తున్నాయి. సగద్గందంగా, "నీతా....నీతా...." అని రెండుమార్లు మాత్రం అన్నాడు.
"బతికే ఉన్నా. చెప్పండి!"
"నేనేం పాపం చేశాను? నా కెందుకూ ఈ శిక్ష? నన్నెందుకు ఇలా చిత్రహింస చేస్తావు, సునీతా?"
"చిత్రహింసలూ, శిక్ష వెయ్యడాలూ నా చేతిలో ఉంటే చెప్పలేను. కాని కూటికి లేనివాళ్ళ మీద పంతం పట్టి ఆకలితో ..."
సునీత చెయ్యి పట్టుకున్నాడు. "భగవంతుని సాక్షి! వాళ్ళు కోరినట్లు చేస్తాను. చేస్తాను. ప్రమాణం చేస్తున్నాను, సునీతా!"
అతని నల్లని కళ్ళలోకి చూసింది. నీటి పొరలను నింపుకుని దీనంగా చూస్తున్నాయి. సునీత ఆపాద మస్తకమూ చలించింది. 'ఎందుకు....మీకింత ప్రేమ ఎందుకు? నాలో ఏం చూశారు, వేణూ?' ఆమె స్వగతం.
"మన్నించండి! తప్పుగా అనుకున్నాను."
"ఇప్పటికీ నామీద కరుణ కలిగింది. మన ఇద్దరి మధ్యా ఇంకెప్పుడూ ఈ ఇనపతెరలు దించకు, సునీతా!"
"పుట్టగానే, అమ్మలాంటి దానికే ఇనపతెర దించ బడింది. నాన్న అమ్మ మనసులోనే ఉండిపోయాడు. అప్పటికీ ఇప్పటికీ ఆ తెర భేదించి చూడలేకపోయాను. నా మరణమే దాన్ని తొలగించవచ్చు."
"ఏం మాటలు, నీతా."
"నే నొక వ్యభిచారిణి కూతురునని తెలిస్తే ..."
"అయితే ఏం? నీ మనస్సౌందర్యం నాకు తెలుసు. ఏ పరిస్థితిలోనూ నేను నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను. నువ్వీ దిగులు మాని ప్రశాంతంగా ఉండవూ?"
సునీత చెయ్యి కడుగుకుని పాలు తాగింది. వేణు తన చెయ్యి ఆమె వీపుకు ఆసరాగా చేసి పడుకోబెట్టాడు. కాళ్ళ దగ్గిర ఉన్న దుప్పటీ తీసి తనే ఆమెకు కప్పాడు.
సునీత అంది! "నే నేమన్నా - పట్టించుకోవద్దు. నాకు మీ క్షేమమే కావాలి. నే నెప్పుడూ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాను."
వేణు నిర్మలంగా నవ్వి, "విష్ యూ గుడ్ డ్రీమ్స్" అన్నాడు.
సునీత ఎండుగా కళ్ళు మూసుకున్నది.
* * *
సునీతను ఏ హాస్పిటల్లో చేర్చాలో శంభయ్యకు తెలియదు. ఉదయం ఆఫీసుకు వచ్చాడు, మరో ఇద్దరు కార్మికులతో.
ఇంటినుంచి వస్తున్న వేణు ఆఫీసు ఆవరణలో వాళ్ళను చూసి, అటు చూడనట్లే లోపలికి వెళ్ళ బోయాడు. శంభయ్య ముందుకు వచ్చి, దుఃఖం మిళితే మైన స్వరంతో, "అమ్మాయినే దవాఖానలో ఉంచిన్రు?" అన్నాడు.
"ఎక్కడ ఉంచితేనేం, శంభయ్యా?"
"గట్లనకురి! నూది గలత్. ఎన్కటి తన్కలమీన పన్జేస్తం. గీ హర్తాళ్ బందు చేయిస్త." పైకే ఏడ్చేస్తూ అన్నాడు.
"నువ్వు మాన్పించ నవసరం లేదు, శంభయ్యా! నేనే ఆ పని చేయిస్తాను. మీరు కోరిన రెండు రూపాయల జీతం ఇవ్వబడుతుంది. వెళ్ళండి. సునీత గీతా భవనం ఆస్పత్రిలో ఉంది."
ఆ హాస్పిటల్ అందరికి, ముఖ్యంగా కార్మికులకు బాగా పరిచయం.
శంభయ్య కూలీలతో నిష్క్రమించాడు.
ఆవేళ వేణు ఆఫీసు పనేదీ ముట్టుకోలేదు రెండు తెల్లకాగితాలు తీసుకుని, ఏమిటో మధ్యాహ్నం వరకూ వ్రాస్తూనే ఉన్నాడు. ఎన్నో కాగితాలు పాడయ్యాయి అందులో మంచిగా వ్రాశాననుకున్న కాగితాలు మూడు మాత్రమే.
రెండు గంటలకు డిస్పెన్సరీకి వెళ్ళాడు. ఆర్తి రాలేదు ఇంకా.
బెడ్ లో తలకు తెల్లని కట్టుతో సునీత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్నది. విశ్రాంతి బాగా అవసరమని చెప్పటంచేత, ప్రయత్నించి నిద్రపోగలిగింది. మలిన రహితమై పాలరాతి శిల్పపు వదనంలా ఉన్న ఆమె ముఖాన చదవలేని భావా లేవో దాగి ఉన్నట్లున్నాయి.
వేణు బెడ్ ముందు కూర్చున్నాడు. కోటు జేబులో నుంచి దస్తీ తీసి, సునీత ముఖంమీద ఏర్పడిన చిరు చెమట మృదువుగా అద్దాడు. తలమీదికి చెయ్యి పోనిచ్చి, నెప్పికలిగి నిద్రాభంగం కాకుండా నిమురుతూ, "నేను చచ్చిపోతానని రక్తంతో భూమాత నభిషేకించావు. నువ్వు నాకోసం ఎంత త్యాగం చెయ్యగలవో నిరూపించావు, నీతా, విశ్వం అన్న మాటలు నిజం. చెయ్యి జారిన రత్నం పగిలే తీరుతుంది. తిరిగి అతకదు. అయిన గాయం మానుతుంది. మచ్చ పోదు. ఏమైనా నేను అదృష్టవంతుణ్ణి నిన్ను నాకు దక్కించాడు దేవుడు! కా...ని, కా.....ని, ఎన్నాళ్ళీ కక్ష సాధిస్తావు? ఎప్పటికి నామీద కరుణ?" అని తన మాట తనకే వినిపించేటంత చిన్నగా అన్నాడు. ఆమె మొహంమీద ముఖం పెట్టి.
సునీతకు ఆ నిద్రలో అవేం వినిపించలేదు. తేజో మయమైన ఆమె ఫాలభాగంలో విజయగర్వం సుస్సష్ట మవుతూంది.
