
15
పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి ఆర్తికి ఫోన్ చేసింది సునీత, సాయంత్రం హాస్పిటల్ టైమ్ అయ్యాక అక్కడే ఉండమని.
అన్నట్లు ఆమె వెళ్ళేవరకు ఆర్తి ఎదురు చూస్తూంది.
ఆర్తికి ఇంతవరకు ఒక్క మాటైనా తెలియనివ్వలేదు వేణు.
"వేణుగారు అంతా చెప్పే ఉంటారు!"
"నాకేం చెప్పలేదు. నిజం, పాపా!"
"ఓ!" ఎక్కువ తాత్పారం చెయ్యకుండానే వివరించింది సునీత. ఏమీ దాచలేదు. తనెందుకు అందులో పాల్గొంటున్నదీ కూడా చెప్పింది.
"నేను చేస్తున్న పనిని మీరు హర్షిస్తారా, డాక్టర్?"
"నేను హర్షించను; వ్యతిరేకించను. నువ్వు ఎలా చెయ్యదలుచుకున్నావో అలాగే చెయ్యి. మరొకరి సలహాకూడా తీసుకోవటం అంత బావుండదు. ఎందుకంటే ఇందులో నీ వ్యక్తిగత సమస్యకూడా ఉంది"
త్వరగానే వచ్చేసింది సునీత.
నగరమంతా గుప్పుమన్నదీ వార్త గోవిందరావు కంపెనీ కార్మికులు చేసే సమ్మెకు నాయకత్వం వహించేది ఒక యువతి అని పాకిపోయింది.
స్థానిక దినపత్రికలన్నీ ప్రముఖ శీర్షికలతో దీన్ని ప్రకటించాయి. వ్యాఖ్యలు, విమర్శలు, సమర్ధింపులు - ఒకటేమిటి? ఎన్ని రకాల వార్తలు పుట్టాలో అన్నీ పుట్టాయి. సునీత పేరు జంటనగరవాసులకు బాగా పరిచితమైంది. ఎవరు చెప్పుకున్నా అదే మాట.
సునీత ఏ విలేకరికి కూడా ఒక్క మాట చెప్పలేదు. అందుకనే తలో రకంగా ఊహించి వ్రాశాయి పత్రికలు.
ఆ వార్త రాధ చదివి నమ్మలేకపోయింది. ఆ సునీత, ఈ సునీత ఒకరేవన్న నమ్మకం కలగలేదు. సునీత ఇంత పని చేస్తుందా?
వేణును అడిగింది.
అవువన్నాడు. వివరాలు చెప్పకుండా, పని ఉందంటూ హడావిడిగా వెళ్ళాడు.
మామయ్య ఆఫీసులో పనిచేస్తూ, మామయ్యకు వ్యతిరేకంగా చేసే ఈ సమ్మె రాధకు నచ్చలేదు. సరిపోయే జీతం ఇవ్వకపోతే అడగవచ్చు గదా? ఆఫీసులో వాళ్ళందరూ చెయ్యనిది సునీతే ఎందుకు వెయ్యాలి?
సునీత వస్తే అడగాలనుకుంది రాధ కాని ఆమె రాలేదు. సునీత అంటే సదభిప్రాయం మాత్రం మారలేదు.
సునీత-ఒక రోజు ముందు-ఆ రాత్రి శంభయ్యకు అన్నీ చెప్పింది, సమ్మె ఎలా జరిపించాలో! ఎంతో ప్రశాంతంగా జరగాలనీ, ఏమాత్రం దౌర్జన్యం చేసినా లాఠీచార్జీ తప్పదనీ అన్నది. ఒకవేళ వేణు మెత్తబడక పోతే నిరశనవ్రతం చేస్తానని వాగ్ధానం చేసింది. శంభయ్య కళ్ళు అశ్రుసిక్తములైనాయి.
వేణుకు ఒకవైపు భయంగానే ఉంది. "మాటి మాటికీ చెయ్యిజారిన రత్నం పగిలే తీరుతుంది. అతకటం జరగకపోవచ్చు" న్న విశ్వం మాటలు చెవుల్లో హోరు పెడుతున్నాయి.
ఉదయం తొమ్మిదినుంచి ఫాక్టరీదాకా ఊరేగింపు. తరవాత అక్కడ పికెటింగ్. అలాగని సునీత కార్యక్రమం రూపొందించింది.
తాడుకు వేసిన ముడి బిగుసుకుంటున్నది!
ఆరోజు ఆఫీసు మూసివేయించాడు వేణు. ఫాక్టరీ దగ్గిరికి వెళతాడని తెలిసి తనూ వస్తానంది రాధ. వేణు ముందు వద్దన్నాడు. రాధ వినలేదు.
అక్కడికి వెళ్ళాక ఎవ్వరినీ మాట్లాడించకూడదని, సునీత కనిపిస్తే అసలు మాట్లాడించవద్దని అనిపించు కుని ఆమెను కారులో కూర్చోబెట్టుకున్నాడు.
వేణు కఠినంగా చెప్పనే చెప్పాడు. అయినా ఏదో ఆశ! సునీతను పలకరించవద్దన్నందుకు విచారపడుతూనే కారెక్కింది రాధ.
వస్తున్న వేణు కారును చూసి పికెటింగ్ చేస్తున్న కార్మికులు గోలగా అరిచారు. శంభయ్య అందరినీ సర్దాడు.
ఒక సబ్ ఇన్స్ పెక్టరూ, కొంతమంది పోలీసులూ ఉన్నారు.
తను అనుకొన్నట్లే సునీత అందరికన్నా ముందు కనబడుతున్నది. తెల్లని ఖద్దరు దుస్తులు. ముఖమండలంలో ఎర్రగా శివుని పాలనేత్రంలా ఉన్న కుంకుమ బొట్టు ప్రకాశమానంగా ఉన్న కళ్ళు. ఆమె తేజస్విని అయి తోచింది వేణుకు. ఆమెవైపు చూడలేక పోయాడు. కళ్ళు మూసుకున్నాడు. 'మధురమూర్తివే కాదు, ఆదిశక్తివికూడాను. గిరిరాజతనయ అంశ కూడా నీలో ఉంది. నీతా! నీతో మనసారా మాట్లాడుకునే అదృష్టం కూడా లేకుండా, నన్ను నీ శత్రువుగా చేసుకుంటున్నా వెందుకో? గెలుపు నీదే కావాలి. నువ్వే గెలుస్తావు.'
కార్మికులందరూ ఒక వరసలో ఉన్నారు. ముందు సునీత, వెనక స్త్రీ కార్మికులు, తరవాత మగవాళ్ళు. శంభయ్య ఏమిటో అంటున్నాడు. ఒక్కరూ బీరు పోకుండా అంతా ముక్తకంఠంతో నినాదాలిస్తున్నారు ఉద్రిక్త వాతవరణం లేదు. సునీత నాయకత్వం పటిష్టంగా ఉంది.
వేణు ఫాక్టరీముందు ఉన్న ఫ్లాట్ ఫారం మీద రాధతోసహా నిల్చుని, అందరినీ ఒక్కసారి చూశాడు. తరవాత మానేజరు వెంట లోపలికి వెళ్ళాడు. రాధ అక్కడే ఉంటాను, వెళ్ళిరమ్మన్నది.
అయిదు నిమిషాల వరకు వేణు లోపలినుంచి రాలేదు. ఇప్పుడప్పుడే వచ్చేటట్లుగా లేడు. రాధ అటు ఇటు చూసింది. వచ్చేలోపుగా నాలుగైదు మాటలు మాట్లాడ వచ్చు. అంతగా చూస్తే ఏదో చెప్పవచ్చు.
ఉన్న నాలుగు మెట్లమీదుగా ఫ్లాట్ ఫారం దిగి చరచరా సునీత దగ్గిరికి వచ్చింది.
అది లోపలఉన్న మానేజరు కంట బడింది. ఏమిటో చెబుతున్నవాడల్లా ఆగిపోయాడు.
"ఆగారేం? చెప్పండి. నష్టమైతే ఏం రాదు గదా?"
"రాదు. కానీ ... అటు చూడండి, బాబు. అమ్మాయి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నది." కిటికీలోనుంచి చూపించాడు.
వేణు చూశాడు. పెద్ద చిత్రమేమీ కానట్లు, "వెళ్ళి మాట్లాడితే ఏం?" అన్నాడు.
"అదేమిటి, అలా అంటారు? వాళ్ళసలే లుచ్చాలు. ఆ ముందు నిల్చున్న దొక సైతాను..."
"మానేజరుగారూ!" వేణు కోపంగా అన్నాడు.
"ఆఁ! ఆఁ! కాదు, చినబాటు .... వాళ్ళు చెప్పిన వేమైనా తలకెక్కితే అమ్మాయి మన మాట వింటుందా?"
కనుబొమలు ముడిపడ్డాయి. అంతలో ఓ ఉపాయం స్ఫురించింది 'చెడు బోధనలు చేస్తున్నావని సునీతను హెచ్చరిస్తే? ఏం ప్రత్యుత్తరం ఇస్తుందో చూడాలి.' వేణు లేచాడు.
"నువ్వు వెళ్ళిపో, రాధా! నా మాట విను. సాయంత్రం వస్తాను. మామయ్య చూస్తే..." సునీత అప్పటికీ అంటూనే ఉన్నది.
"రాధా!" వేణు గర్జన వినబడింది.
రాధ తుళ్ళిపడింది. పోలీసులు, కార్మికులు అందరు అతన్నే చూశారు.
"నీకేం చెప్పాను?"
రాధ ముద్దాయిలా నిలబడింది.
"మాట్లాడవేం? అడ్డమైనవాళ్ళతో మాట్లాడటానికేనా నిన్ను తీసుకువచ్చింది?" వేణు రాధ దగ్గిరికి వచ్చాడు. ఎదురుగా సునీత ఉన్నది. వేణు అన్నదానికి సునీతకూడా నిరుత్తర అయింది.
"దీనికి నీ సంజాయిషీ ఏమిటి?" సునీతను ఉద్దేశించాడు.
"ఇవ్వం. నీ దిక్కున్న చోట చెప్పుకో!" కార్మికుడు ఒకడు అరిచాడు.
"రామూ!" సునీత గద్దించింది. ఆ కార్మికుడి నోరు మరి పెగలలేదు.
"నోరు పెద్దధైందా? మాట్లాడటానికి నేనే మయ్యాను? చచ్చాననుకున్నావా?"
"కాదమ్మా..."
"వెళ్ళి నీ చోటులో నిలబడు. నేనున్నాడు. "సునీత శాసనం అది.
అ కార్మికుడు యథాస్థానానికి వెళ్ళాడు. సునీత ఇచ్చే శిక్షణే అటువంటిది. నియంతలా శాసిస్తుంది. అమ్మలా ఆదరిస్తుంది.
"నడు!" వేణు చూశాడు. కాని ఆ చూపులు రాధ తలమీదుగా వెళ్ళి, సునీత దగ్గిర ఆగిపోతున్నాయి.
రాధనలా అన్నాడుగాని, తను కదలలేదు. కోటు జేబులో చేతులు పెట్టుకుని, "చేసేదేదో సరిగా ఏడవక, ఇతరులకు నూరిపొయ్యటం దేనికి?" అని అడిగాడు సునీతను.
రహీమ్ మధ్యలోనుంచి పెద్దగా అన్నాడు:" బాబుజీ, బేయిమానం జేసెటోల్లం గాము. గది మీ పెద్ద పెద్దోల్లు జేస్తరు."
వేణు ఉద్రేకంగా ముందుకు అడుగు వేశాడు. "ఫూల్! పిచ్చిగా వాగితే షూట్ చేసిపారేస్తాను." పక్కనే ఉన్న పోలీసు తుపాకి లాక్కున్నాడు.
రహీమూ, శంభయ్యా ముందుకు వచ్చారు. పోలీసు మళ్ళీ తన తుపాకి తను తీసుకున్నాడు. మరొక ఇద్దరు పోలీసులు లాఠీలతో వచ్చి, వేణుకు రక్షణగా నిలబడ్డారు.
రాధ గుండెలు దడదడలాడుతున్నాయి. వేణు అక్కడే ఉన్నాడింకా. అవతల కార్మికుల ఆవేశం కట్టలు తెంచు కుంటూంది. ఏ క్షణాన్నైనా మిన్ను విరిగి వెన్నుమీద పడవచ్చు.
సునీత బతిమిలాడే ధోరణిలో అన్నది: "దయచేసి మీరు వెళ్ళండి..."
"ఛీ!" ఛీత్కారం చేశాడు వేణు. "అంతా కృతఘ్నులు. ఆశ్రయమిచ్చారన్న కృతజ్ఞతకూడా మీకు లేదు."
"మాలిక్! క్యా బోలా?" రహీమ్ మెరుపులా ఒక పోలీసు చేతిలో లాఠీకర్ర లాగి, వేగంగా రెండు చేతులతో పట్టుకుని వేణు తలమీదికి ఎత్తాడు.
రాధ కెవ్వుమన్నది.
"రహీమ్!" సునీత ఒక అడుగు వేసి వాళ్ళిద్దరి మధ్య నిలబడింది.
రాధ కేక విని, పక్కకు జరిగి, ఆమెను పట్టుకున్నాడు వేణు. అతని తలమీద పడవలసిన దెబ్బ సునీత తల మీద పడింది.
'టప్' మంటూ తల పగిలిన ధ్వని.
"అమ్మా!" అన్న ఆర్తనాదం.
గోల.
"పట్టుకో! పట్టుకో!" అన్న సబ్ ఇన్ స్పెక్టర్ కేకలు.
ఇదంతా జరగడానికి నిమిషంకూడా పట్టలేదు.
సునీత తల పగిలిందా దెబ్బకు. ఆమెకు, వేణుకు అరడుగు దూరమే ఉంది. సునీత అతనిమీదే ఒరుగుతూ కిందికి జారింది. రక్తం ధారగా స్రవిస్తున్నది.
రాధకు కళ్ళు తిరిగాయి. ఆమెకూడా తెలివి తప్పింది.
అంతా గందరగోళం. అనుకున్న దేమిటి? జరిగిందేమిటి? వేణు క్షణంపాటు చలనరహితుడయ్యాడు. వాళ్ళ చుట్టూ గుంపు. సునీత అతని కాళ్ళ దగ్గిరే ఉన్నది.
ఏడుపు వచ్చింది. కార్మికులు కొందరు హాస్పిటల్ కు తీసుకువెళ్ళాలంటూ ఉన్నారు. శంభయ్య పెద్దగా రోదిస్తున్నాడు.
"రాధను కార్లోకి తీసుకురండి." ముందుకు వంగి సునీతను రెండు చేతులమీదికి తీసుకున్నాడు. ఇద్దరు స్తీలు రాధను కారు వెనకసీట్లో కూర్చోబెట్టారు. వేణు రక్తం కారుతున్న సునీత తలను గుండె కానించుకుని, ఎడమ చేతితో ఆమెను పొదివి పట్టుకున్నాడు. మరొక చేతిలో స్టీరింగ్ వీల్ ఉన్నది.
రక్తంతో సూటు తడుస్తున్నది. అదేం లెక్క చెయ్యలేదు.
రాధకు కారు స్టార్టయాక తెలివి వచ్చింది. కారు వేగము, అస్తవ్యస్తంగా నడుపుతున్న వేణు వైఖరి చూస్తే ఎక్కడో ప్రమాదం జరిగేలా ఉంది. రెండు చోట్ల ట్రాఫిక్ పోలీసులు నంబరు నోట్ చేసుకున్నారు కూడా!
రాధ వెనకనుంచి సునీతను అటు ఇటు ఒరిగిపోకుండా పట్టుకుంది. డైవింగ్ కష్టంగా ఉండటంవల్ల వేణు పట్టుకోమనే అన్నాడు.
