అతని తల ఒడిలో పెట్టుకుని లాలించాలన్న ఆవేశం, ఓదార్చుదామన్నంత కరుణి - కానీ సునీత ఏదీ చెయ్యలేదు.
శబ్దరహితం కాసేపు. చేతిలో కాగితాలు పేపర్ వెయిట్ కింద పెట్టింది. వాటిని అలవోకగా చూసి, "చదవను. మీరే చెప్పండి!" అన్నాడు.
చెప్పింది.
రెండిటిలో ఆమె రాజీనామా కాగితాన్ని తీసుకుని పర్రున చించేశాడు. "రాజీనామా అంగీకరించలేను. మీరు వెళ్ళండి!"
"ఎందుకో తెలుసుకోవచ్చా?"
"చెప్పను!"
"చెప్పేదాకా వెళ్ళను!"
"ఛస్తే చెప్పనుగాక చెప్పను. నువ్వు చెప్పమన్న దల్లా చెప్పడానికి నేను నీ దగ్గిర నౌకరీ చెయ్యటం లేదు. వెళతావా, లేదా?" గట్టిగా కేకలు వేశాడు. ఆఫీసులో వాళ్ళందరూ ఊపిరి బిగబట్టారు. ఫ్యూను లోపలికి వచ్చాడు.
శాంతస్వరాన సునీత అంది: "నా దగ్గిర నౌకరీ చేయించుకోగల శక్తి ఉంటే మీరు ఇలా అరిచే ధైర్యం చేసి ఉండేవారు కాదు. అనవసరంగా ప్రతిదానికీ ఆవేశ పడకండి. ఒకటిమాత్రం నిజం. కార్మికులు చెయ్యబోతున్న సమ్మెలో ముందు కనిపించేది సునీత. వస్తాను."
"ఉష్! నీతా .... నీతా ..." ఆమె వెళ్ళాక జుట్టులో వేళ్ళు చొనువుకుని టేబిల్ మీదికి ఒరిగాడు. ఆవేళ నాలుగున్నరకు ఆఫీసునుంచి తిన్నగా విశ్వం ఇంటికి వెళ్ళాడు. కారు ఆగిన చప్పుడు, పిలుపు విని నిర్మల తలుపు తీసింది.
"లేరు. ఇంకా రాలేదు" అన్నది తలుపు పక్కగా నిలబడి.
"ఇప్పుడు .... ఇంకో అర్ధగంటలో వస్తాడా?"
"పనేం లేకపోతే వస్తారు!"
"రాగానే వేణు అవసరంగా వచ్చాడు, త్వరగా మా ఇంటికి రమ్మన్నానని చెప్పండి." కారు విసురుగా బాక్ చేసి స్టీరింగ్ వీల్ గిర్రున తిప్పాడు.
స్పీడుగా వచ్చి ఆగిన కారు ధ్వని విని, క్రోటన్సు కత్తిరిస్తున్న రామదాసు గేటు తెరిచాడు. వేణు అంత పెందరాళే రావటం మానేసి పదిరోజుల పైగా అయింది. రాధ హాల్లోనే ఉంది.
"నాకోసం ఎవరన్నా వచ్చారా, రాధా?"
పలకరించినా ముభావంగానే ఉంటున్న వేణు తనంతట తాను అలా అడిగేసరికి సంబరపడింది. "లేదు, మామయ్యా. ఎవరైనా వస్తానన్నారా?"
"ఆఁ ... ఆఁ ... విశ్వం వస్తానన్నాడు." ప్లేటు ఫిరాయించాడు వేణు, తనకొరకు సునీత వచ్చిందేమోనని. రాధ అడిగిన రెండు మూడు ప్రశ్నలకు ఏదో చెప్పి తన గదిలోకి వెళ్ళాడు.
కొంతసేపటికి ట్రేలో భోజనం పెట్టుకుని గదిలోకి వెళ్ళింది రాధ. పొద్దున, మధ్యాహ్నం అన్నం తినలేదు వేణు. బాత్ రూమ్ నుంచి వచ్చి రాధ కెదురుగా కేన్ సీట్లో కూర్చున్నాడు. రాధ పళ్లాన్ని బల్లమీద ఉంచి ముందుకు జరిపింది. ఉదయంనుంచీ ఏమీ తినకపోవడంవల్ల వేణుకుకూడా ఆకలిగానే ఉంది.
"కొద్దిగా తీసేయ్, రాధా అంతా తినలేను."
సునీతకు లోలోపల కృతజ్ఞత తెలుపుకుంది రాధ. ఇదంతా ఆమె చెప్పిన ఫలితమే ననుకుందామె. మామయ్య తనతో అలా మాట్లాడి ఎన్ని రోజులైంది!
"ఇవ్వాళ అన్నం నువ్వు వండావా? వంటమనిషా?"
"వంటమనిషే!"
"అయితే నువ్వే తినిపించు. నా చేత కావటం లేదు."
రాధ చెక్కిళ్ళు ఎర్రబారాయి. వేణు మళ్ళీ అన్నాడు: "లేకపోతే తినను!"
కూర వేసి కలిపింది. వేణు నోరు తెరిచి ముందుకు వంగాడు. రాధ సిగ్గుతో తల వంచుకుని ముద్ద నోటికి అందించింది.
"నువ్వెటో చూస్తావు. అన్నంముద్ద కాస్తా ముక్కులో కుక్కేస్తావు. ఉక్కిరి బిక్కిరి ఆడదు ఊపిరి. నావైపు చూడు మరి!"
'అబ్బ! నువ్వు చిన్నపిల్లాడిలా చేస్తావు."
అన్నమంతా రాధే తినిపించింది. "ఇంకా తేనా, మామయ్యా!"
"వద్దు! ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. రేపు తినిపించు."
"ఆఫీసు సంగతేమైంది, మామయ్యా?" వెళ్ళే ముందు అడిగింది.
"ఏం కాలేదు. కార్మికులు హర్తాళ్ చేస్తామని నోటీసు ఇచ్చారు. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనియ్యి, రాధా!"
"ఒక్కమాట చెప్పు. అక్క నీతో ఏమైనా చెప్పిందా?"
"ఊఁ! ఊఁ!" ఏదో అనేశాడు. అది రాధకు సమాధానమైంది. సునీతమీద గౌరవం ఇనుమడించింది.
"అన్నీ చక్కబడతాయి. నువ్వు మనసు పాడుచేసుకోకు." తలుపు దగ్గిరికి లాగి వచ్చింది.
అప్పుడే వచ్చిన ఆర్తి పరిస్థితి చక్కబడ్డట్లు తెలుసుకుని తృప్తిగా నిశ్వాస విడిచింది.
ఏడున్నరకు విశ్వం వచ్చాడు.
గది అంతా కాగితాలమయంగా ఉంది. విశ్వాన్ని చూసి, పెన్ను మూసి కాగితాలు పక్కకు నెట్టాడు.
"ఏమిటో, ఇంటికి వచ్చి వెళ్ళావుట!" కూర్చున్నాడు.
"ఆఁ...సునీత ఏం చేసిందో చూశావా?"
"నాకేం తెలుసు? నువ్వే చెప్పాలి!"
"రిజైన్ చేసింది."
"ఎప్పుడు?"
"ఇవ్వాళ, అంతేకాదు. కార్మికులు చేసే సమ్మెను లీడ్ చేస్తున్నది."
"అసలు వాళ్ళు సమ్మె ఎందుకు చేస్తున్నట్లు?"
వేణు విశదంగా చెప్పాడు: "ఆ కార్మికు లెవరు? ఆమె ఎవరు? ఇదంతా ఏమనుకుని చేస్తున్నదో నాకు బోధపడటం లేదురా!"
"నీ జవాబు ఏమిటి?"
"చెయ్యమనే! కానీ, బ్రదర్, నాకూ ఇది ఇష్టం లేదు. కాని సునీత నడిపిస్తున్నది. ఆమె శక్తిసామర్ధ్యాలు మరొకసారి చూడాలి. వాళ్ళందరూ కలిసి ఆమె నిర్భయస్థురాలని రెచ్చగొట్టి ఉంటారని అనుకుంటున్నా. ఏమైనా, నీతా ఉన్నంతవరకు పాక్టర్టీ ఆస్తులకు ఏభంగమూ రానివ్వదు. అయినా ఎందుకైనా మంచిదని అని పోలీసు కమీషనర్ కు రాస్తున్నాను."
"హర్తాళ్ ఎప్పుడు?"
"ఎల్లుండి కావచ్చు!"
"సునీత దోషి అనే అనుకుంటున్నావా?"
"అయినాసరే, నేను ఆమెను ద్వేషించను."
"వేణూ! పరిసరాలు నిన్ను ఉద్రిక్తతకు లోను గావించినప్పుడు అంతా దోషంగానే ఉంటుంది. సహజంగా కార్మికులన్నా, ఇతర పనివాళ్ళన్నా ఉదారంగా ఉండే నువ్వు, నీ మనస్తాపాన్ని చల్లార్చుకోలేక, వాళ్ళ కోరికలు తీర్చకుండా ఈ హర్తాళ్ కు కారణం కాబోతున్నావు అసలు మానవుని మస్తిష్కమే అంత."
"నన్నేం చెయ్యమంటావురా? సునీత పంతం పట్టింది."
"ఆటువంటప్పుడు నువ్వు తగ్గకూడదా? అసలు సునీత ఇందుకు పూనుకోవటానికి కారణం ఉంది. చెప్పమంటావా?"
తల ఊపాడు వేణు.
"నువ్వు రాధలో మరుగుపడ్డ మమతను వెలికి లాగావు. సున్నిత హృదయురాలైన రాధ నీ వియోగాన్ని తట్టుకోలేదు. సునీత ఎన్ని అగ్నిపర్వతాలనైనా తనలో దాచుకోగలదు. ఈ పరిస్థితిలో నువ్వు సునీతను ప్రేమిస్తున్న పైకి అసహ్యం కలిగినట్లు ఉండటమే సునీతకు కావలసింది. ఆమె నువ్వు మనఃస్ఫూర్తిగా రాధను ప్రేమించటం కోరుకుంటున్నది. వేణూ, వింటున్నావా?"
వేణు తల తిరిగినట్లవుతున్నది. ఊఁ కొట్టాడు.
"సునీతే సమ్మె లేవదీసినదను కోకు. పూర్వపు వెల్లునకు తోడు మరొక వెల్లువ వచ్చింది. అంతే. ఇప్పటి కైనా మేలుకుని, వాళ్ళ జీతాలు పెంచి, దీన్ని ఆపుచేయించు."
"ఉహూఁ.... సునీత కల్పించుకోకపోతే అలానే చేసే వాడిని. ఈసారి నేను గెలుస్తానో, నీతా గెలుస్తుందో చూడాలి." పట్టుదలగా అన్నాడు వేణు.
కింద చింపిపోసిన కాగితాలు ఫాను గాలికి నలువైపులా పరిగెత్తుతున్నాయి. విశ్వం వాటిని ఒక్క క్షణం చూసి, నిల్చుంటూ భుజం తట్టి, "ఏం చేసినా విషమించకుండా చేసుకో. ఇప్పుడు నేనేం చెప్పినా నీ చెవి కెక్కదు. చూడు. చిరిగిపోయిన ఆ కాగితాలు అతుకుపెడితే, అది అతుకన్నట్లు అందరికీ తెలుస్తుంది. ఈ సంఘర్షణలో పడిన గాయం మానవచ్చు. మచ్చ మాసిపోదు. వేణూ, బాగా విను. చేయిజారిన రత్నం పగిలే తీరుతుంది. అతకమంటూ జరగకపోవచ్చు" అన్నాడు.
వేణుకు ఆ మాటలు సూటిగా తగిలాయి.
"వెళుతున్నాను, మధ్య ఒకేరోజు సమయం ఉంది. ఏం చేసుకున్నా నీ ఇష్టం. కాని, ఒక్కటి. ఇటు ప్రాణమిత్రుడివి నువ్వు. అటు సోదరిలాంటి సునీత. మీ రిద్దరూ నా రెండు కన్నులు. అందులో దేన్నీ పెరికి వెయ్యటానికి మాత్రం ప్రయత్నించవద్దని మిత్రుడుగా ప్రార్ధిస్తున్నాను."
వేణు గభాలున వంగి విశ్వం పాదాలు పట్టుకోబోయాడు. మాట పెగలలేదు. విశ్వం అతన్ని ఆపి, "తప్పు, నేను ఆశీర్వదించేటంత పునీతున్ని కాదు. వెళ్ళి అక్కయ్యకు నమస్కరించు. వస్తా, బ్రదర్..." అని గబగబా వెళ్ళిపోయాడు విశ్వం.
* * *
యాదగిరి ఇంకా ఊరినుండి రాలేదు. నీలకంఠం కాలేజీకి వెళ్ళాడు.
సునీత అన్నం తింటున్నదని రాజు చెప్పాడు. విశ్వం హాల్లోనే కూర్చున్నాడు. అన్నం తినేసి సునీత వచ్చింది.
"ఏమిటో వేళగానివేళ వచ్చావు. ఆఫీసు లేదా?"
"అదంతా తరవాత. ముందిది చెప్పు. నేను విన్నదంతా నిజమేనా?"
"ఏం విన్నావు?"
"అంతా నాకు వేణు చెప్పాడు. ఏం, సునీతా? ఇంకా దాచుకోవాలనుకుంటున్నావా?"
"అవును. నువ్వు విన్నది నిజం!"
ఒక క్షణం భరించరాని నిశ్శబ్దం. "వాడి హృదయంలో ఎందుకీ చిచ్చు పెడుతున్నావు, సునీతా?"
"ఒక్కసారే కాకుండా, క్రమంగా అలవాటు చేస్తున్నాను. ఒక్కసారే అయితే తట్టుకోలేరు, విశ్వం."
"దీని పరిణామం ఏమిటి?"
"బహుశా నేను మీ అందరికీ దూరం కావచ్చు."
"అటు వేణు పిచ్చివాడవుతాడు. ఏ విషం మింగినా..."
"ఓహ్, నువ్వా మాట లనకు విశ్వం." సునీత విసుక్కున్నట్లు అంది. నోరు జారిందనుకుని నాలిక కరుచుకున్నాడు విశ్వం.
"నీమీద విముఖత్వానికి బదులు మరింత సాన్నిహిత్యం కలగజేస్తే? అప్పుడు, సునీతా?" మాట మార్చాడు.
"అప్పుడేదో దారి చూస్తాలే! నేను అనుకున్నది ఒక్కటే. ఇది జీవితాలకు సంబంధించినది. నిర్మలమైన సరస్సులాంటి రాధ జీవితంలో, నేను రాయిలా ప్రవేశించి అలలు లేవదియ్యకూడదు. నా శక్తికొద్దీ ఆ సరస్సులో ప్రశాంతత కాపాడటానికే యత్నిస్తాను. రాధ కలలు వండాలి."
"పోనీ, ఈ బాధంతా పడేబదులు మరెక్కడికన్నా వెళ్ళిపోతే?"
"లాభంలేదు. నేను వెళ్ళటానికి, రాధ ఇక్కడ ఉండటమే కారణమని తిరిగి వాళ్ళ ఇంటి గడప తొక్క వద్దని ఇంటికి పంపేస్తాడు. ఆయనేమోగానీ ..... నేనే వెళ్ళలేను."
"రాధకోసం వేణును కష్టపెడుతున్నావేమో?"
"చెప్పానుగా, క్రమంగా అలవాటు చేస్తున్నానని. స్త్రీలకన్నా పురుషులు త్వరగా మనసు మార్చుకోగలరు, విశ్వం."
"మీ ఇరువురి ప్రేమకూ సజీవసమాధి చెయ్యబోతున్నావు. నీ కిది తలకుమించిన పని. నాకేం బావుండ లేదు."
"లేకపోవచ్చు, విశ్వం. లోకం గుర్తించనిదాన్ని. పతిత కూతుర్ని. నా ప్రేమ ఎవరికి కావాలి? మానవ సహజమైన, ఎదురుదెబ్బల తాకిడికి తట్టుకోలేని నిండుహృదయం కలది రాధ. ఆమెకోసం నా ప్రేమకు, చివరకు నాకే సమాధి కట్టినా కట్టబడవచ్చు..." గోడ మీద ఉన్న చిత్రంలో కృష్ణభగవానుడి ముందు రాధ, గోపికలు తన్మయంతో నాట్యం చేస్తున్నారు. కొంటె కృష్ణుడి పెదవుల నంటిన వేణువు సర్వ సంగీత రసాలను కరిగించి పోస్తున్నది. సునీత అర్ధనిమీలిత నేత్రాలతో తన చూపు దానిమీద కేంద్రీకరించింది.
విశ్వం వెళ్ళేముందు వణికే కంఠాన అన్నది: "నా గత చరిత్ర ఏమైనా, నిండు మనస్సుతో నన్ను సోదరిగా స్వీకరించావు. నా ఆఖరి క్షణంవరకూ నీ సానుభూతిని కాంక్షిస్తున్నాను."
"సోదరీ సోదరు లెవరూ లేని నాకు ఆ లోటు తీర్చావు. నాలో ఉన్న సోదర ప్రేమ అంతా నీకే అంకితం. సునీతా, వెళుతున్నాను."
* * *
