14
వేణు లో మార్పేమీ లేదు. తనింకా ప్రయత్నిస్తానని సునీత రాధకు, ఆర్తికి మాట ఇచ్చింది.
వారం రోజుల తరవాత -
యాదగిరి చిన్నకొడుక్కు పుత్రజననమై నదన్న వార్త వచ్చింది ఎక్స్ ప్రెస్ డెలివరీలో. ఆయన వెళ్ళి చూసి వస్తానని ప్రయాణమయ్యాడు.
నీలకంఠం, సునీత ఆయనతోబాటు స్టేషనుకు వెళితే బండి అందలేదు. మళ్ళీ గౌలిగూడా వచ్చారు. బస్సు మరో గంటలో ఉందని తెలుసుకుని, టైము అవుతూ ఉండటంవల్ల, తను వెళతానంది సునీత. నీలకంఠానికి పదకొండు గంటలకు పీరియడ్ కనక తనక్కడే ఉంటానని సునీతను వెళ్ళమన్నాడు.
మరొకసారి యాదగిరితో చెప్పి వచ్చేసిందామె.
మె ఆఫీసుకు వచ్చేసరికి పదింబావయింది.
లోపలికి పోబోతూంటే, ఆవరణలో వేపచెట్టు నీడన కూర్చున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను, "అమ్మాయిగారూ!" అని పిలిచాడు.
సునీత ఆగి చూసింది. శంభయ్య.
శంభయ్య ఇప్పుడు రిక్షా తొక్కడం మానేసి చాలా రోజులయింది. అది కష్టమేకాక, అనారోగ్యం కూడా త్వరగా తెచ్చి పెడుతుందని, అవ్వపోయిన రోజుల్లో తనను బిడ్డలా కంటికి రెప్పలా చూసుకున్నాడన్న కృతజ్ఞతకొద్దీ, గోవిందరావుగారితో చెప్పి, ఆయన ఫాక్టరీలో వని ఇప్పించింది సునీత.
శంభయ్య కూడా రిక్షా అంటే విసిగిపోయాడు. రోజు మొత్తం కష్టపడ్డా, రిక్షా అద్దెపోగా, రూపాయికంటే ఎక్కువ మిగలటం కష్టం. దానికన్నా ఈ ఫాక్టరీ పనే ఎంతో నయం అనుకున్నాడు.
గోవిందరావు సునీత చిన్నకోరికను ఏ సంశయమూ లేకుండా తీర్చాడు, శంభయ్యకు పని ఇప్పించి. సునీత తన ఇంట్లో ఉండగా, తను వద్దంటున్నా నేర్పిన కొద్ది పాటి చదువు, కూడికలు, తీసివేత హెచ్చవేతలు, భాగారాలు- ఇవన్నీ కూలీల్లో పలుకుబడి తెచ్చిపెట్టడానికి శంభయ్యకు తోడ్పడ్డాయి.
అందుకే శంభయ్యకు ఆమె అంటే అమిత గౌరవం. "మీరు దేవుళ్ళు, చిన్నమ్మాయి. నాకో దోవ సూపెడ్తిరి గద!" అంటూంటాడు కనిపిస్తే.
సునీత కార్మికులకు అపరిచితురాలేమీ కాదు. ఒక సందర్భంలో ఆమె వాళ్ళకు సహాయంకూడా చేసింది.
గోవిందరావు ఇక్కడే ఉన్నప్పటి మాట. అప్పటికి శంభయ్యకూడా ఫాక్టరీలో చేరాడు. వాళ్ళలో చిన్న తరహా నాయకుడుకూడా అయ్యాడు.
విపరీతంగా ధరలు పెరిగిపోతూండటం చేత, తను దినసరి కూలీ పెంచమని, ఒకరోజు చెప్పాపెట్టకుండా, ఫాక్టరీ పనిలోకి పోకుండా సమ్మె చేశారు కార్మికులు. అందుకే ఆరోజు కూలీ ఎవ్వరికీ ముట్టలేదు. అందరి కడుపులూ మాడాయి!
ఏది జరిగినా కంపెనీకి సంబంధించినంత వరకు, గోవిందరావు తప్పకుండా సునీతకు చెబుతాడు. ఎవ్వరికీ తెలియని కంపెనీ రహస్యాలుకూడా చెప్పి సలహా అడుగుతాడు. సునీత తన బుద్ధికి అప్పటికప్పుడు తోచిందేదో చెప్పేది. అదేమిటో సునీత చెప్పిండేది చేసినా, ఆయనకు కలిసే వచ్చేది. అందుకే ఆయన దగ్గిర, ఇతరత్రా ఆఫీసులో సునీత మాట కెంతో విలవ.
కూలీలు సమ్మె చేశారని గోవిందరావువల్ల తెలుసు కున్నది. కార్మికులలో బాగా పరిచయం ఉన్నవాడు శంభయ్య. అతని ఇల్లూ తెలుసును. అ సాయంకాలం ఆఫీసు కాగానే వాళ్ళింటికే వెళ్ళింది.
శంభయ్యా, మరికొందరు కార్మికులూ తమకు సంబంధించిన చర్చల్లో మునిగిఉన్నారు.
సునీతను ఎంతో మర్యాదచేసి, గౌరవంగా మాట్లాడుతూ తను కూర్చున్న చాప ఆమెకు ఇచ్చి కూర్చోబెట్టాడు శంభయ్య.
మిగతా కూలీలు ఆమె ఎవరో, ఎందుకు వచ్చిందో తెలియక, ముఖాలు చూసుకుని మాట్లాడకుండా చూస్తున్నారు.
సునీత సమ్మెను గురించి అడిగింది.
"అవునమ్మాయి! నేనంటే ఏం లేనోన్ని. మరి పెళ్ళాం బిడ్డలున్నోళ్ళు?"
"నాకూ తెలుసు, శంభయ్యా! కాని చెప్పాపెట్టకుండా సమ్మె ఎందుకు చేశారూ అని!"
"మరింకేం చెయ్యలేదంటారు?"
"ముందు మీ సేఠ్ జీ గార్ని మీలో ఒకరిద్వారా అడగవలిసింది. వారు కాదంటే అప్పుడు గదా? అసలీ పని ఎవరు చెయ్యమన్నారు?"
"ఏందో? అంత చేస్తమన్కున్నం. చేసినం." బుర్ర గోక్కున్నాడు శంభయ్య.
"ఏమైందో చూడు! మళ్ళీ రేపు ఇలాగే చేస్తే కడుపు మాడుతుంది!"
"మరి పనిలోకి పొమ్మంటరా?" ఇంకో కూలీ అడిగాడు.
"రేపు వెళ్ళండి! ఒకవైపు పని చేస్తూనే, రాయబారం పంపి సంప్రదించండి. కాదంటే అప్పుడు చూద్దాం."
"గంతే నంటరా?"
"ఊఁ! ఒప్పుకోకపోతే నేనూ చూస్తాను ఆయనకు చెప్పడానికి. మీలో కాస్త మాట్లాడగలిగినవారు రేపు ఆయన దగ్గిరికి వెళ్ళండి!"
అక్కడ ఉన్న కూలీలకు గూడా ఆమె సలహా నచ్చింది.
ఆవేళ సునీత చెప్పిన మాట కార్మికులు అందరికీ ఎరుకపరచబడింది. కొందరికి అది నచ్చలేదు. "ఆమె ఎవరు మనకు చెప్పడానికి?" అన్నారు.
"మీకు తెలవదు. అమ్మాయి కాలేజిల్ల సదివింది." శంభయ్య చెప్పజూశాడు.
"అయితే మనకేందట?" వాళ్ళలో వాళ్ళకే చీలికలు వచ్చాయి. కడుపులో మాడుతూండటం చేత చాలా మంది ఇటువైపే మొగ్గు చూపారు. మిగతావాళ్ళు పట్టు వదలేదు. పనిలోకి వెళ్ళిన కూలీలు గోవిందరావు దగ్గిరికి వెళ్ళటానికి శంభయ్యనే నియమించారు.
శంభయ్య గోవిందరావు దగ్గిరికి వెళ్ళి, వచ్చిన పని చెప్పాడు. మాటల్లో సునీత పేరుకూడా దొర్లింది. ఏదైందీ సాయంత్రం చెబుతానని శంభయ్యను పంపివేసి, సునీతను పిలిపించాడు గోవిందరావు.
"శాంతియుతంగా వాళ్ళ సమస్యను పరిష్కరించుకోమని చెప్పింది నువ్వే కదూ?" రాగానే గోవిందరావు వేసిన ప్రశ్న.
"ఎవరన్నారు మీతో?"
"నేను ఆమాత్రం తెలుసుకోగలను. నిజమే కదరా?"
భోళా శంకరయ్య (శంభయ్య) తన పేరు మాటల్లో చెప్పాడని ఊహించుగలిగింది సునీత. గోవిందరావు పొద్దున (నిన్న) చెప్పాడీ సంగతి. కనీ ఇంకా ఆమెను ఏ సలహా అడగలేదు.
సునీత సమాధానమిచ్చింది: "అవును."
"నువ్వేమంటావు?"
"నేను చెప్పింది మీకు పనికిరాదేమో?"
గోవిందరావు మౌనం. ఆయన ఎంతకూ నోరు విప్పకపోయేసరికి వెళ్ళుతున్నానని లేచింది. "కూచో, కూచో!" వారించాడాయన.

తన బిడ్డ నెవరినో అడుగుతున్నట్లు, "సునీతా! దీన్ని గురించి నువ్వేమనుకుంటున్నావో స్పష్టంగా చెప్పెయ్యి!" అన్నాడు.
ఆ మాటల్లో ఏదో జీర, బరువు.
"చెబితే, చెయ్యాలిగానీ వినటంవల్ల లాభం ఉండడు."
"కొంతవరకు అయినా చెయ్యగలనేమో చూస్తాడు. నాకన్నా నీకు పేదవాళ్ళ ఆకలిమంటలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. చెప్పమ్మా."
సునీత సహజంగా కరుణామయి. ధనవంతులంటే ఆమెకు ఎంత విముఖత్వం అయినా ఆయనంటే జాలి వేసింది.
ఆమె చెప్పిం దిది! "వాళ్ళు పనిచేసి ఉత్పత్తిని పెంచాలంటే, వాళ్ళ కడుపులు నిండటం అవసరం. అందుకు తగిన జీతభత్యాలూ ఉండాలి. వాళ్ళు ఉత్పత్తి పెంచితే మీకూ లాభమే. మీ డబ్బు అంతా తోడిపెట్టమని నేననను. మీ లాభాలనుబట్టి వీలు ఉన్నంతవరకే పెంచండి. అదే నేను చెప్పదలుచుకున్నది."
"నీకు, నీ తోటి ఆఫీసువర్కర్లకూ జీతాలు పెంచాలని నువ్వు అనుకోవటం లేదా?"
తనను పట్టి చూస్తున్నాడా? కావచ్చు. సునీత ప్రత్యుత్తరమిచ్చింది!
"నా తోటివాళ్ళే మో నాకు తెలియదు. నేను ఇక్కడ చేస్తున్న పనికి నాకు సరియైన జీతమే లభిస్తున్నది. ఇంతకన్నా పెద్దజీతం, హోదా నాకు అవసరం లేదు."
డెస్కు మీద మోచేతులు పెట్టి, రెండు అరచేతుల్లో తల పెట్టుకుని అంతా వింటూనే ఉన్నాడు. ప్రశ్నలు వేయటంగూడా చేస్తున్నాడు. ఆమె మాటలు విని ఏమిటో వణుక్కున్నాడు.
అన్ని మాటలూ సునీతకు స్పష్టంగా వినపడలేదు. "నువ్వేనమ్మా .... ఏమీ లేదు..." ఆ రెండే మాటలు వినబడ్డాయి. సునీత సాలోచనగా వచ్చేసింది.
సునీత చెప్పినట్లు కార్మికుల దినసరి కూలీ పెంచబడింది.
చిత్రమేమంటే ఆ సంవత్సరం నిరుటికన్నా లాభాలు బాగానే వచ్చాయి.
అప్పటినుండే సునీత కార్మికులకు సుపరిచితురాలైంది. వాళ్ళలో ఎవరు కనిపించినా భక్తితో ఆమెకు నమస్కరిస్తారు. ఆమె ఎదట కనీసం బీడీఅయినా కాల్చరు. ఏదైనా సునీతకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదని వాళ్ళ నమ్మకం.
* * *
ఫాక్టరీనుంచి మూడు మైళ్ళూ నడిచి రావటం వల్ల కలిగిన ఆయాసాన్ని తీర్చుకుంటున్న వాళ్ళు, సునీత ఆగగానే నిలబడి దన్నాలు పెట్టారు.
సునీత పరామర్శ చేసింది.
శంభయ్య చెప్పాడు, సంవత్సరం క్రితమే కూలీలు పెంచినా, పెరిగిపోతున్న ధరలదృష్ట్యా తమ జీవనం కష్టంగా ఉందని, ప్రస్తుతపు రూపాయిన్నరను రెండు రూపాయలకు పెంచితే తామెలాగో సర్దుకోగలమని. ఎలాగైనా సునీతను ఒక దారి చూపించమని వేడుకున్నాడు.
"నేను చూపించేదేం ఉంది, శంభయ్యా?"
"అమ్మ, మీరు గట్లొనొద్దమ్మాయి. గప్పుడు మీరు చెప్పినట్లు ఇన్కోబట్టే బతికినం గద? గీ చిన్న మాలిక్ సంగతి మాకు తెల్వదాయె!"
"మంచివాడే ననుకో! కాని వాళ్ళ నాన్న చెప్పందే ఏదీ చెయ్యటానికి వీల్లేదు."
"మరి, గాయనెమొ ఊర్లల్లనుంచి జల్దిల రారాయే. కూలీలు మాడ్తన్నరు. మీరే సోచాయించండి."
వంద రూపాయలు వస్తున్నా, ఎంతో పొదుపుగా వాడుకుంటూంటేనే, బొటాబొటిగా సరిపోతున్నాయి. రూపాయిన్నరలో నీళ్ళు, నీళ్ళ కుటుంబాలు ఎలా బతక కలుగుతున్నారో? కాని కంపెనీలో అన్ని అధికారాలూ వేణుకు ఇచ్చిపోలేదు. ఆయనకు వ్రాసి అనుమతి తెప్పించవచ్చు. చాలా రోజులు కావాలి. అంతవరకూ ఎలా? అత్యవసరమైన పరిస్థితుల్లో వేణు ఏదైనా చెయ్యాలనుకుంటే, చెయ్యవచ్చుకూడా!
అదీకాక వేణు ఇప్పుడు తలతిక్కమీద ఉన్నాడు. ఇప్పుడడిగితే ఆ రిమ్మలో ఏమంటాడో? మళ్ళీ సమ్మె ఫాక్టరీ బండ్! తాము బాగానే ఉంటారు. మధ్యలో కూలీలు పస్తులపాలిట బడతారు.
"ఏందంటవు, అమ్మాయి?"
"వెళ్ళి ఆడగండి!" తేరుకుంది సునీత.
"చేస్తరంటా?" పక్కనున్న కూలీ అనుమానం.
"చెప్పలేం! ఒక మాట,శంభయ్యా! నువ్వు చాలా శాంతంగా ఉండాలి. ఆయన చేయిచేసుకున్నా మాట్లాడకు. అంతగా అయితే బయటికి వచ్చాక నేనేదో చెప్తాను."
శంభయ్య తోపాటు సునీతనుగూడా వెళ్ళమన్నారు వెంటవచ్చిన కార్మికులు. సునీత తప్పించుకోజూసినా పడలేదు. ఇదీ ఒకందుకు మంచిదే ననుకుంది. ఈ అవకాశాన్ని మరోవైపు తను వినియోగించుకోవాలి. వేణు ఎలాగూ ఉద్రేకపడతాడు. అదే మిషగా తీసుకుని తను స్పర్ధ పెంచుకోవాలి. ఈ దెబ్బతో తనంటే వేణుకు మనసు విరిగిపోతుంది!
సునీత ఉన్నది కనక ఫ్యూను అడ్డుపెట్టలేదు. అనుజ్ఞ లేకుండా సునీత ఆఫీసురూములోకి వెళ్ళవచ్చు. ఆమె నెవ్వరూ అడ్డగించరాదు. ఇది గోవిందరావుగారి ఆజ్ఞ మరెవరైనా లోనికి వెళ్ళాలంటే ముందు తెలియజెయ్యాలి.
చప్పుడు విని తనేమిటో వ్రాస్తున్నది మూసేశాడు వేణు, సునీత దాన్ని అప్పుడే పసికట్టింది. అందులో ఒక త్రాసు బొమ్మ ఉంది. ఒకవైపు రాధ, మరొక వైపు నీతా అని వ్రాశాడు. నీతా అన్నవైపే త్రాసు మొగ్గు చూపుతున్నది.
తన పని చెడగొట్టినందుకు ఇద్దర్నీ చురచురా చూశాడు. కలం స్టాండులో పెట్టి ఆ కాగితాన్ని జేబులో వేసుకున్నాడు.
సునీత తల వంచుకున్నది.
వేణు కూచోమనికూడా అనలేదు. "ఎందుకు వచ్చారు?"
"కూలోల్ల మాట అడుగుదామని వొచ్చిన." శంభయ్య వినయంగా అన్నాడు.
"ఏమిటా అడిగేది?"
"గదే, మాలిక్! తన్క రెండ్రూపాయలైన ఉండాలంటున్నరు."
"అదంతా నాన్న వచ్చాక! ఆయననే అడగండి. నేనేం చెయ్యలేను."
"మరిచిపోతున్నారు. అవసర పరిస్థితుల్లో మీకు అన్ని అధికారాలూ ఉంటాయి." సునీత కల్పించుకున్నది.
"ఎవరన్నారు?"
"మీ నాన్నగారు, నా కన్నీ చెప్పే వెళ్ళారు."
"అలాగేం?" వెటకారంగా అన్నాడు.
"వ్యంగ్యానికిది సమయం కాదు. ఏదో చెబితే వాళ్ళు వెళతారు."
"వాళ్ళకు నోళ్ళున్నాయి. మధ్య మీ కనవసరంగా ప్రశాంత్ పుచ్చుకోవద్దు." ఎన్నడూ లేని గౌరవ సంబోధన. సునీత పెదవులమీద దరహాసం.
వేణు కిదంతా చికాగ్గా ఉంది. ఎంత తొందరగా పంపించేస్తే అంత బాగు. మళ్ళీ శంభయ్యతో అన్నాడు: "చూస్తాలే, వెళ్ళు."
"చూస్తానన్న నెన్ని చూడకుండా ఉండిపోలేదు? రెండు మూడు రోజుల్లో ఏదైనదీ చెప్పకపోతే సమ్మె చేస్తామంటున్నారు."
"బెదిరిస్తున్నారా? ఇవ్వాళే వెళ్ళి తాళాలు వేసేస్తాను. తిక్క కుదురుతుంది. వెళ్ళు. వెళ్ళిపో!" కాస్త గట్టిగా అన్నాడు.
"అదే మీ సమాధానమా?"
"అదే! చేసుకోగలిగింది చెయ్యవచ్చు!"
"సునీత, శంభయ్య బయటికి వచ్చారు. సునీత తన సీట్లోకి వెళ్ళింది. పొరుగు లాగి, రెండు తెల్ల కాగితాలు తీసి, ఓ పదిహేను నిమిషాలపాటు ఏమిటో టైప్ చేసింది. శంభయ్య నోరు తెరుచుకుని అంతా చూసి, టైప్ రైటరుకు కవరు వేస్తూంటే ఆ కాగితాలు ఏమిటని అడిగాడు.
"ఒకటి సమ్మె నోటీసు. రెండవది రాజీనామా!"
"మీరు నౌకరి ఎందుకు ఇడ్పిపెడ్తన్నరు?"
"ఆయనగారి జవాబు విన్నావుగా! మీకు అన్యాయం జరుగుతూంటే నేను ఇక్కడ సుఖంగా కూచుంటా వనుకోకు."
శంభయ్యకు అయోమయంగా ఉంది.
"నువ్వేమీ భయపడకు! మీ చిన్న సేఠ్ ను లొంగ దీసే విధానం నాకు తెలుసు. ముందు నేను నిలుచుని ఈ సమ్మె జరిపిస్తాను. ఏదన్నా జరిగితే లాభం మీకు. అవసరమైతే నిరశనవ్రతం కూడా చేస్తాను..." ధైర్యం చెప్పింది.
దర్వాజా దగ్గిర ఫ్యూను అటకాయిస్తూ, "ఎవ్వరినీ లోనికి రానివ్వవద్దన్నారు" అన్నాడు.
"రేపు నువ్వే వచ్చి, బాబుగారే పిలుస్తున్నారని చెప్పినా రానులే!" స్వింగ్ డోర్ తెరుచుకుని వెళ్ళింది. ఫ్యూను గుడ్లప్పగించి చూస్తున్నాడు.
కిటికీలోనుంచి ఎటో చూస్తున్నాడు వేణు. జాలిగొలిపేలా ఆమెను చూస్తూ, "నన్ను బతకనివ్వ దలుచుకోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు, నీతా?" అన్నాడు తగ్గు స్వరాన.
