Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 22


    వేణు వివరించాడు. విశ్వం ఎదురుప్రశ్న లేకుండా విన్నాడు.
    "ఊఁ. సునీతను ఏ దృష్టితో అయితే చూస్తున్నావో, రాధమీద నీకా దృష్టి లేదన్నమాటేగా?"
    "ఊఁ! చిన్నప్పట్నుంచీ ఉన్న చనువు ..."
    "అంతే? దీని పరిణామమేమిటో ఊహించావా?"
    "దీనికో పరిణామం అంటూ ఉంటుందా?"
    "ఏమీ ఉండదా? నువ్వు సునీతను ప్రేమిస్తున్నట్లే రాధ నిన్ను ప్రేమిస్తున్నదని తట్టలేదా?"
    వేణు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఇన్నాళ్ళకు-అప్పుడు, వేణు మనసుకు తట్టింది, రాధకూడా తనను అమితంగా ప్రేమించే వ్యక్తి అని.
    "వేణూ! నీ మనోగతం ఏదైనా, నువ్వు రాధను ఇక్కడికి తీసుకురానట్లయితే ఈ సమస్య కొంత తేలికగా పరిష్కారమయ్యేది. అటు సునీత, ఇటు రాధ- మధ్య నువ్వీ వలయంలో ఉన్నావు."
    వేణులో అప్పుడే ఆలోచన మొదలయింది. విశ్వం చూస్తూనే ఉన్నాడు. అతని మొహం పాలిపోయింది. స్వేదబిందువులు జారుతూ ఉన్నాయి.    
    "నా మిత్రుడుగా నీకు సలహా ఇస్తున్నాను. మనసుల్లో మమతలు బలంగా నాటుకోకముందే ఏదో ఒకటి చెయ్యడం ఉత్తమం. బాగా ఆలోచించు." విశ్వం అంటున్నాడు.
    కారు చాలాసేపు అక్కడే రోడ్డు మధ్యలోనే ఆగింది. అవతల లారీ ఏదో వస్తున్నట్లు హారన్ విని కారు వెనక్కు మళ్ళించాడు వేణు.
    సాయంత్రందాకా గదిలోనుండి రాలేదు వేణు.
    రాధకు ఇదేం నచ్చలేదు. చిలిపిగా, అల్లరిగా ఏ మాటన్నా నవ్విస్తూ ఉండే మామయ్య, ముభావంగా ఉండటం చూసి తనవల్ల పొరపాటు ఏమైనా జరిగిందేమోనని రెండుమూడుసార్లు అడిగింది. వేణు ఏమీ చెప్పలేదు.
    సాయంత్రం ఆర్తి వచ్చింది. ఆమె స్నానం చేసి, తీరికగా హాల్లో కూర్చున్నాక రాధ అంతా వివరించింది.
    "రెండుసార్లు అడిగాను. మూడోసారి అడిగితే కసురుకున్నాడు."
    "అసలు సంగతేమిటి?"
    "అదే తెలియదు."
    "ఊఁ!" అని వేణును పిలిచింది. రెండుసార్లకు ఒక్కమారు "ఊఁ" అంటూ వచ్చాడు. ముఖకవళికలను చూసి, "ఏమిటి, అలా ఉన్నావు?" అంది.
    "ఏం లేదు ...." తప్పించుకోచూశాడు.
    "ఏం లేకపోతే అలా ఉంటారా, పిన్నీ!" రాధ ఆర్తికి దగ్గిరగా జరుగుతూ అంది.
    "ఏం, వేణూ, నాతో చెప్పగూడదా?"
    "కాదక్కా! ఏదో ఆఫీసు గొడవ. అంతే. దీనికే పెద్ద రాద్దాంతం!" ఏదో ఒకటి చెప్పాలి మరి.
    అసలు చెప్పవలసినది దాస్తున్నాడని ఆర్తి కనుక్కోగలిగింది. పైకిమాత్రం, "అవే సర్దుకుంటాయి. అంతమాత్రానికే బుర్ర బద్దలు కొట్టుకునేట్లు ఆలోచించడం ఎందుకు?" అన్నది.
    వేణు మరో రెండు మూడు మాటలు మాట్లాడి మళ్ళీ గదిలోకి వెళ్ళాడు.

                                  *    *    *

    రెండు రోజులు గడిచాయి.
    వేణులో మార్పేమీ లేదు. ఆర్తి మళ్ళీ తరిచి అడగనూ లేదు.
    ఆఫీసులోకూడా వేణు అలానే ఉంటున్నాడు. ఫ్యూనుతోకూడా ఎంతో మంచిగా మాట్లాడే వేణు, ప్రతిదానికీ చీదరించుకుంటున్నాడు. పొరపాటున ఏదన్నా లోపం కనిపిస్తే, మొహం వాచేలా చివాట్లుపెట్టి, డిస్మిస్ చేస్తానంటాడు. అందరూ - ఒక్క సునీత తప్ప- అతని రూములోకే వెళ్ళడానికి భయపడుతున్నారు.    
    సునీతకు వేణుతో ప్రవేశించిన ఈ జబ్బు ఏమిటో తెలుసు. తను వేణుకు ఇచ్చిన ఇంజెక్షను సునీతకు చెప్పాడు విశ్వం.
    ఒకరోజు వేణు రమ్మంటున్నాడని వచ్చి చెప్పాడు ఫ్యూను. వెళ్ళింది. ఆమెను చూస్తూనే, "నీకు ఫోన్ వచ్చింది" అంటూ కింద బల్లమీద పెట్టిన రిసీవరు వైపు చూశాడు.
    సునీత దాన్ని అందుకున్నది.
    "నువ్వేనా, పాపా? మధ్యాహ్నం వేణునడిగి ఒకసారి ఇంటికి రాగలవా?"
    "ఎందుకు, డాక్టర్?"
    "పనుంది. వీలుంటుందా?"
    "చూస్తాను."
    వేణును అడిగితే, "అంత కొంపమునిగే పనేముంది?" అంటూ నొసలు చిట్లించాడు.
    సునీత మందహాసం చేసింది. "అది డాక్టర్ గారికే తెలుసు."
    "సరే. నేను పంపిన లెటర్సు అనెనే టైప్ చేసి ఇచ్చిపోవాలి. లేకపోతే కుదరదు."
    "థాంక్స్."
    రెండున్నరకుగాని తెమలలేదు. అక్కడికి వెళ్ళేసరికి ఆర్తి హాస్పిటలుకు వెళ్ళింది. మూడు కావచ్చింది టైము. ఇంట్లో లేదని తెలిసి డిస్పెన్సరీకి వెళ్ళింది.     
    ఆమెను చూసి ఆర్తి, "వచ్చావా? రాధ ఇంట్లో లేదూ?" అని అడిగింది.        
    "ఉన్నది, లోపల ఎక్కడో. రామదాసు మీ రిక్కడికే వచ్చారని చెప్పాడు."
    "రాధ దగ్గరికి వెళ్ళు! అంతా చెబుతుంది."
    మళ్ళీ ఇంటికి వచ్చింది. రాధ లైబ్రరీ రూములో కూర్చుని, కిటికీలోనుండి కాంపౌండ్ లో కనిపిస్తున్న క్రోటన్సు, పూలమొక్కలు నిశ్శబ్దంగా చూస్తూంది. సునీత అడుగుల చప్పుడు విని వెనక్కు తిరిగి, "అబ్బ! ఇంతసేపు చేశావేం, అక్కా! మధ్యాహ్నం అన్నదానిని మూడు గంటలకా?" అంది.
    "ఇది మధ్యాహ్నం కాదా?"
    "ఏమోలే!" రాధ కూర్చోమన్నట్లు చూసింది.
    రాధ చెప్పబోయేదేమిటో, ఆర్తి ఫోన్ ఎందుకు చేసిందో సునీత ఆమాత్రం తెలుసుకోలేకపోలేదు. రాధ చెప్పడానికి ఉపక్రమించింది.
    తను చెప్పాలనుకున్నదికూడా చెప్పేసి, "నావల్ల తప్పు ఏమైనా ఉందా? మామయ్యా అంటే ఉలకడు, పలకడు. నేను ఉండటం ఇష్టంలేదా అంటే, గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంటాడు. పిన్ని అడిగినా ఏదో అవకతవక జవాబు ఇస్తాడు. ఎందుకో పిన్నికూడా మళ్ళీ అడగదు. ఏం చెయ్యాలో తోచడంలేదు. ఇవ్వాళ అన్నంకూడా సరిగా తిని వెళ్ళలేదు."
    "ఊఁ!"
    "ఒకవేళ నేను ఉండటం ఇష్టం లేదంటే, వెళ్ళిపోతాను గదా?"
    సునీత సర్ది చెప్పింది. "ఆఫీసు గొడవలే అలా ఉన్నాయి. నువ్వలా అనుకోకు. ఈ సంవత్సరం నష్టం ఎదుర్కోవలసివస్తుందేమోనని వారి భయం!"
    "పోనీ, నాతో అలా చెప్పగూడదూ? నేనువిసిగిస్తావా? పోనీ, నేనంటే చిన్నదాన్ని, పిన్నికి చెప్పడానికేం? అసలు అదికాదు, అక్కా నన్ను కొరకొరా చూస్తాడు .... నాలో ఏదో దోషం ఉంది ..."
    సునీత కల్పించుకోబోయింది. రాధ ఊరుకోలేదు.
    "ఎక్కడో మారుమూల పల్లెటూర్లో ఉన్న నన్ను, ఆ అజ్ఞానంలోనే ఉంచక ఇక్కడి కెందుకు తీసుకు రావాలి? అప్పటికీ అమ్మ నన్ను వదిలి ఉండటానికి ఒప్పుకోలేదు. బస్తీ మామయ్య నాబోటి పల్లెటూరు సజ్జును పెళ్ళి చేసుకుంటాడన్న ఆశలు వదులుకున్న వాళ్ళకు, నన్నిక్కడికి పంపించమని చెప్పి పటుబట్టి తీసుకువచ్చాడు. భవష్యత్తులో కాబోయే తన భార్యగా తన భావాలనూ నన్నూ సమన్వయ పరుచుకుంటాడన్న ఆశకొద్దీ, నేను సుఖపడతానన్న దృష్టితో వాళ్ళు నన్ను పంపించారు. వాళ్ళ నెందు కీ విధంగా ఊరించాలి? నాలో అణిగిపోయి, కేవలం చనువుగానే మిగిలిన ప్రేమను ఎందుకు ప్రజ్వలింపజెయ్యాలి? నా కెందు కీ ఆవేదన కలిగించాలి?
    "ఉదయం ఎప్పుడో వెళతాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు. నేనేమన్నా అడిగితే తినేసేలా చూపులు. పిన్ని ఒకసారి మందలించిందికూడా.
    "అక్కా! మామయ్య నా మనోవేదనను గ్రహించ లేదు. నేను పీల్చే ప్రతి శ్వాస మామయ్య పేరుతో పీల్చుకుంటున్నాను. నా శరీరంలో ప్రత్యణువు మామయ్య సుఖంకోసమే పరితపిస్తూంది. ఎందుకో నన్ను తన చల్లని నీడలో ఉండే భాగ్యం లేకుండా చేస్తున్నాడు. అక్కా .... అక్కా! నేనేం చెయ్యను .... ఏం చెయ్యను ..... చెప్పు, అక్కా ..."
    రాధను చిన్నపిల్లలా దగ్గిరికి లాక్కుంది సునీత. ఆమె దీర్ఘంగా విశ్వసించింది. రాధకు కన్నీరు వెల్లువలా వస్తూంది.
    సునీత ఒడిలో తలపెట్టుకున్న రాధ అంది: "అక్కా, నేను చచ్చిపోవటానికైనా సిద్ధమే, మామయ్యకోసం..."
    'ఓహ్!' ఉద్వేగంగా రాధను హత్తుకున్నది. 'ప్రభూ .... ప్రభూ .... ఏమిటీ పెడదారుల పయనం? నన్నెందుకు సృష్టించావు? దీనికి నేనే కారణం......కదూ ...?'
    పైకి అన్నది: "రాధా, అన్నీ నేను చక్కబరుస్తాను. నువ్వు నిర్విచారంగా ఉండు. రాధా .... నా మాట విను .... నా మాట వినవూ?"
    రాధ సరిగా కూర్చున్నది. "నువ్వుమాత్రం ఏం చెయ్యగలవు?"
    "ప్రయత్నమంటూ చేస్తాను. నాకు నమ్మకం ఉంది. మీ మామయ్య అనుకున్నంత నిర్ణయాలు కారు. పిన్నితోకూయా చెప్పిస్తాను. రాధా, నువ్వు విచారపడకు."
    రాధ ఏమీ అనలేదు.
    సునీత ఆర్తి దగ్గిరికి కూడా వెళ్ళలేదు. ఆఫీసుకు కూడా వెళ్ళలేదు. ఇంటికి వెళుతూ దారిలో పబ్లిక్ టెలిఫోను బూత్ నుండి ఆర్తిని పిలిచింది.
    "నేనే, డాక్టర్! వేణుగారి జబ్బేమిటో తెలుసు కున్నాను."
    "వైద్యం ప్రారంభిస్తున్నావా, మరి!" నవ్వింది ఆర్తి.
    "ఇవ్వాళ ఏ మూలిక పనికివస్తుందా అని యోచిస్తాను. దానిని రేపే ప్రయోగించవచ్చు. మీ ఆశీర్వాదం కావాలి, డాక్టర్!"
    "పాపా! అది నీ కెప్పుడూ ఉంటూనే ఉంటుంది."
    "కృతజ్ఞురాల్ని."
    "విష్ యూ గుడ్ లక్!"
    అబిడ్స్ లో విశ్వం ఎదురయ్యాడు. అతనితోకూడా చెప్పింది. "డాక్టరు గారుకూడా నాకు అండ ఇచ్చారు. విశ్వం! నువ్వేమంటావు?"
    "హర్షించలేను. వద్దనలేను. నేను కేవలం మీ అందరి క్షేమాన్ని కోరేవాడినిమాత్రమే. ఏం చేసినా మంచినే చెయ్యి. అదే నేను కోరేది."

                                *    *    *    

    మరునాడు సాయంత్రం అయిదు గంటలకు-
    కారు డోర్ తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే, కాగితం ఒకటి మడతపెట్టి ఉన్నది. దాని మీద "మీకు" అనిమాత్రం ఉన్నది. అది సునీత చేతివ్రాతగా గుర్తుపట్టగలిగాడు వేణు.
    తీసుకున్నాడు. కారులో కూర్చుని విప్పాడు. ముత్యాల లాంటి అక్షరాలు వరసగా పేర్చినట్లున్నాయి.
    "వేణూ,
    మీరు ఉన్నత మనస్కులని అనుకున్నాను. అనుకుంటున్నాను. అనుకోవడంలో ఇకముందు కూడా మార్పు ఉండదు. ఆ అభిప్రాయం- మీ రెంత దుర్మార్గులుగా, పంతానికి మారినా-నేను మార్చుకోలేను.
    ఒకరు వద్దనుకుంటున్నా పువ్వుల్లో పెట్టి చూడటం, మరొకరు కావాలనుకున్నా మనస్సు బాధపడేలా ప్రవర్తించడం మీకే చేతనవును అని బాగా తెలుసుకున్నాను. ఇది విశ్వానికి తెలిస్తే ఏమంటాడో తెలుసా? 'కాదు, వేణు అలాంటివాడు కాదు. కాకపోతే మనిషికి ఉండే సహజమైన ఉద్రేకాలవల్ల, మీరు తాత్కాలికంగా అలా అయ్యారు' అని. అది నిజమేనని మీరు ఋజువు పరుచుకోవాలి.
    ఎన్నడూ మీ ప్రియురాలివని చెప్పుకొని ఉండలేదు. అంత సావాసం కూడా ఇంతవరకూ కలగలేదు. ఇవ్వాళే అల్లా చెప్పుకుంటున్నాను, మొదటిసారి - మీతోనే!
    నేను మరీమరీ చెప్పవలసిందేమీ లేదుకూడాను. నేను మీకు, మీతో ఎప్పటిలా ఉండాలంటే, రాధపట్ల నిరాదరణ మానండి. అదే నా కోరిక. కాదంటే జరిగే ఫలితాలు మీరు ఊహించగలరు..."
    "ఊహించగలను.....ఊహించాను, నీతా....కాదనే అంటాను. ఆ ఫలితం కళ్ళారా చూస్తాను. ఆ ఫలితానికి ప్రతిబింబంకూడా నువ్వే చూద్దువుగాని...' వేణు కాగితాన్ని జేబులో కుక్కుకున్నాడు, మరో చేత్తో నువ్వు ఇగ్నిషన్ కీ తిప్పుతూ.

                               *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS