Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 21


    వెళుతూనే విశ్వం ఇంటిముందు ఆకుపచ్చని కారు చూసింది సునీత. అంటే వేణు ఇక్కడికి వచ్చాడన్నమాట. వెళదామా, వద్దా అని తర్కించుకుంటూనే ఇంటిదాకా వచ్చింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపు తట్టబోయి మళ్ళీ ఆగింది. లోపలినుంచి మాటలు వినవస్తున్నాయి.
    ".....మనస్సాక్షిరా! నామీద ఏ కక్షా ఉన్నట్లు లేదు. కాని ప్రతిదానికీ సూటిపోటీ మాట లంటుంది. మళ్ళీ అంతలోనే ఎంతో మంచిగా మాట్లాడుతుంది..."
    ఆ స్వరం సునీతకు సుపరిచితమే.
    "హద్దులమీరి ఎన్నడన్నా ప్రవర్తించావా?" విశ్వం ప్రశ్న.
    "లేదు. నాకు తెలియకుండా జరిగితే చెప్పలేను. సునీత నా తత్త్వమేమిటో పూర్తిగా ఎరిగి ఉన్నా ఎందుకో అల ఉంటుంది. నేనుమాత్రం ఆమె మనస్తత్త్వాన్ని సరిగా గ్రహించనిమాట నిజమే! ఆమె లోతైన మనిషి. సునీతను చదవటం నాకు సాధ్యం కాలేదు.  మరికొన్నాళ్ళు ఆగితే చెప్పలేను .... విశ్వం .... నువ్వు చెప్పరా! నేనేం చెయ్యను?"
    "నేను చెప్పేదేం ఉంది? సునీతకు నువ్వంటే ఏదో వికర్షణ కలిగిఉంటుంది. ఆమె మరొకర్ని ప్రేమించిందేమో?"
    "కాదు .... నాకు బాగా తెలుసు. సునీత నన్నే ప్రేమించింది ..." ఆవేశంగా అన్నాడు వేణు. మళ్ళీ ఆర్ద్రస్వరాన, "నువ్వన్నమాట నిజమయితే ..... నిజమైతే ..... నేను సునీతనుండి దూరంగా తప్పు కుంటాను. ఆమె మనోరథం సఫలం కావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె తను కోరుకున్న వ్యక్తిని పొందటానికి తోడ్పడతాను" అన్నాడు.
    "అంటే? త్యాగం చేస్తావా?"
    "ఓహ్! నువ్వంత పెద్ద పదాలు ప్రయోగించకు. నేను వంచిన వ్యక్తి సుఖపడాలన్న స్వార్ధం. నే నెప్పుడూ స్వార్ధ పరున్నే, విశ్వం!"
    "అల్లరి వేణువనే ఇన్నాళ్ళూ అనుకున్నాను." విశ్వం వ్యాఖ్యానం.
    "కాదు. అమృతభాండం వారి హృదయం!' అచేతన అయింది సునీత. తలుపు తట్టబోయిన ఆమె చెయ్యి అలాగే ఉండిపోయింది. పరుగున వెళ్ళి కన్నీటితో వేణు పాదాలను ప్రక్షాళనం చెయ్యాలన్నంత ఆవేశం. ఆమె కదలలేకపోయింది.    
    "మీరు దేవతలు పిశాచాన్ని నేను. నీచజన్మ నాది. ఆ హీనత్వం ఎక్కడికి పోతుంది?' సునీత విశ్వాన్నికాని, నిర్మలనుకాని పిలవలేదు. మెట్లు దిగి వెనక్కు వచ్చేసింది. ఇంటికి కూడా వెళ్ళలేదు. పబ్లిక్ గార్డెనులో ఎవరూ లేనిచోట కూర్చుని చాలాసేపు గడిపింది.    
    సునీత ఇంటికి వెళ్ళేసరికి తొమ్మిదిన్నర కావచ్చింది.
    నీలకంఠం ఆమెకోసమే ఎదురుచూస్తున్నాడు పొద్దున వెళ్ళేటప్పుడు లైబ్రరీనుంచి మంచి ఫిలాసఫీ బుక్స్ తెచ్చిఇస్తానని తేవటం మరిచాడు. 'ఏమని సమాధానం చెప్పాలా?' అని అతని యోచన.
    యాదగిరికూడా మేలుకునే ఉన్నాడు.
    సునీత వాలకం చూసి నీలకంఠం జడుసుకున్నాడు (అతని పరిభాషలో) యాదగిరి ఏదో ఊహింప చూశాడు. సునీత మాత్రం ఎవర్నీ మాట్లాడించలేదు. తిన్నగా గదిలోకి వెళ్ళి, తలుపులు వేసుకుని గడియ పెట్టుకుంది.
    'అన్నయ్య తను చెప్పిన నెక్లేసు కొనితేలేదని ... అలాగే చేసేది. రావు తనతో చెప్పి, మరునాడు కొనుక్కువచ్చేవాడు. సునీత కోపం, ముఖకవళికలు అలాగే ఉంటాయి. ఆమె ... ఆమె .... కాదుగదా? యౌవనపు పొంగులో తన కళ్ళు మూసుకుపోయాయి. తనకు మెదడు మొద్దుబారింది. తనకు నిష్కృతి లేదు. తన ఆమె క్షమించదు ....' యాదగిరి కళ్ళు మూసుకుని గతాన్ని తిరగవేసుకుంటున్నాడు.
    నీలకంఠానికి నిద్ర రావటంలేదు. ఏదో పుస్తకం తిరగవేస్తూ చదవాలని ప్రయత్నిస్తున్నాడు.
    సునీత ఇక అన్నం తినదని తెలుసుకున్న రాజు వంటిల్లు సర్దుకుంటున్నాడు.
    చాలాసేపటివరకు సునీత గదిలో దీపం వెలుగుతూనే ఉంది. అంతసేపూ ఆమె ఏదో వ్రాస్తున్నట్లు యాదగిరి కాగితాల చప్పుడునుబట్టి అనుకున్నాడు.
    "విశ్వం.
    నేను చెప్పబోయే ప్రతిమాట నీ మనస్సులోనే భద్రపరుచు. నన్ను ఎప్పటిలా ఆదరిస్తావనే న నమ్మకం. నీ ప్రియమిత్రుడు వేణుకుకూడా తెలియనివ్వకు. నామీద ఒట్టు.
    నువ్వు వినే ఉంటావు, నా తల్లిదండ్రులను నేను నాకు తెలియని చిన్నవయస్సులోనే కోల్పోయానని. నీకు ఒకసారి చెప్పాను కూడా. అయితే అది నిజం కాదు.
    నా తల్లి కేతప్ప మానవమాత్రుడికి నా తండ్రి పేరు తెలియదు. నన్ను పెంచి పెద్దచేసిన అవ్వకూడా ఎరగదు. ఆ పేరు చెప్పకుండానే నా తల్లి ఆత్మహత్య చేసుకుందిట. ఎందుకు చేసుకున్నదో నాకూ తెలియదు.
    నేను పుట్టటమైతే గౌరవనీయమైన కుటుంబం లోనే జన్మించాను. అయితే నేను అక్రమ సంతానాన్ని కావడంచేత నా మేనమామ నన్నూ, నా తల్లినీ విడదీసి, నన్ను అవ్వకు పెంచుకోమని ఇచ్చాడు.
    బహుశా అమ్మ నా వియోగాన్ని భరించలేని పరిస్థితిలోనో, లేక లోకనిందను వినలేకనో ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. చనిపోయిన అవ్వ అభిప్రాయం కూడా ఇదేవిధంగా ఉంది.
    నేను అవ్వ దగ్గిరే పెరిగి పెద్దదాన్ని అయ్యాను. నాకు జ్ఞానం తెలిసేంతవరకు ఆమే తల్లీ, తండ్రీ అయి నన్ను సాకటమేకాక, చదివించి, విజ్ఞానవతిని చేసింది. తరవాత నేను స్వశక్తిమీద ఆధారపడి జీవించటం నేర్చుకున్నాను. ఇప్పటికీ నాకు నేనే ఆధారం, విశ్వం!
    అవ్వ తను చనిపోయేముందు నా జన్మరహస్యం అమ్మ పేరుతప్ప మరొక మాటకూడా చెప్పలేదు. ఆమె మరణంతో నా చదువూ ఆగింది.
    అదృష్టవశాత్తు నాకు వేణుగారి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ నేను చేరేముందు వారి  తండ్రీ, డాక్టరుగారూ నన్ను చూసి ఎందుకో తెల్లబోయారు. తరవాత చూచాయగా తెలుసుకోగలిగాను, అచ్చు నాలాగే ఉన్న వ్యక్తి ఎవరో, వాళ్ళ కుటుంబంలో ఒకప్పుడు జీవించిఉండేవారని. ఏమైనా ఈ ఉద్యోగం నా అదృష్టం. దీన్ని పోగొట్టుకోవాలని, ఇంకా పైకి వెళ్ళాలని నేను అనుకోవటం లేదు.. దీన్ని పోగొట్టుకోవాలని, ఇంకా పైకి వెళ్ళాలని నేను అనుకోవటం లేదు.    
    నువ్వు .... నువ్వేమో నీ స్వంత చెల్లెలుగా ఆదరిస్తావు. అటు గిరిబాబాయి 'అమ్మా, అమ్మా' అంటూ నేను తన బిడ్డననే అనుకుంటాడు. గోవిందరావు గారూ అంతే! నీలకంఠం - వారూ 'పెద్దమ్మా' అంటూ పసిపాపలా ప్రవర్తిస్తారు. రాజూ, నేనేదో రాజకుమార్తెనన్నట్లు గౌరవిస్తాడు. ఇక డాక్టర్.....'పాపా, పాపా' అంటూ ఏదో మాతృప్రేమను చవిచూపిస్తూ, నాలో ఏ పాపాయినో చూస్తుంది. వేణు .... నేను వారి నౌకరునే అయినా నామీద ఎన్నడూ హోదా ప్రదర్శించని ఉత్తములు. నేను వారి స్నేహితురాలిననే అనుకుంటారు తప్ప తారతమ్యాలు చూడరు. విశ్వం, నీకు తెలుసు వారు నన్ను ప్రేమిస్తున్నారని. కాని నేను వారి ప్రేమకు అర్హురాలివి కాననే అనుకుంటున్నాను. నాలోని ప్రతి అణువూ వారిని పూజిస్తున్నది. అంతేతప్ప నాకు ఆయనమీద నీ ద్వేషమూ లేదు.
    వారిని నే నెందుకు దూరంగా ఉంచుతున్నానంటే-
    రాధ ..... రాధ పేరు వినే ఉంటావు. ఆమెకోసమే! నా కోసం ఒక ముగ్ధ హృదయకుసుమాన్ని నలిపి వెయ్యటం  నా కిష్టంలేదు. నందనవనంలాంటి ఆమె భవిష్యత్తును నాశనం చెయ్యలేను. వేణును ఆమెనుండి లాక్కుని, నాలాంటిదే అయిన రాధకు చేతులారా ద్రోహం తలపెట్టలేను.
    ఒకవేళ రాధను ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే ఏం జరిగిఉండేదో చెప్పలేను. ఇప్పుడు మాత్రం నేను వారికి దూరంగా ఉండాలనే కోరుకుంటున్నాను. అందుకే మా ఇద్దరి మధ్యా ఈ అడ్డుగీతలు. నేను వేణును రాధకోసం త్యాగం చేస్తున్నాననుకోకు. నేననే దాన్ని లేకపోతే, వాళ్ళిద్దరూ ఏకమయ్యేవారు; కావచ్చు! కాదంటావా?
    కాని, నేనెంత ఏహ్యత కలిగించేలా ప్రవర్తించినా, ఆయన నాకు మరింత సన్నిహితులవుతున్నారు. ఏ పాడు ఆకర్షణ నాలో ఉందో మరి!
    విశ్వం! అనుక్షణమూ నా అందాన్ని, వయస్సును ఆటవస్తువుగా చేసుకుని నా జీవితంతో ఆడుకోవాలని, నన్నూ నా సౌందర్యాన్నీ అనుభవించాలని ఉవ్విళ్ళూరే మహానుభావులూ లేకపోలేదు. కాని దేవుడి దయవల్ల నేను ఇంతవరకూ పవిత్రంగానే బ్రతకగలిగాను. నే నెక్కడా కాలు జారలేదు.... లేదు, విశ్వం, లేదు.
    చరిత్రహీనను నేను. ఏమైపోయినా అడిగేవాళ్ళు ఉండరు. ఇదంతా నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే-వేణు నన్ను అపార్ధం చేసుకోవచ్చు. చేసుకోవటమే మంచిది. అయితే నేను నిష్క్రమించాక ఆయనకు నిజం చెప్పగల సమర్దుడివి నువ్వు ఒక్కడివే! దానికన్నా ముఖ్యం, నువ్వు నా శ్రేయోభిలాషివి. సోదరతుల్యుడివి.
    ఒకవేళ మున్ముందు రోజుల్లో, డాక్టర్ గారి మాట నిజం కావటం సంభవిస్తే, వారన్నట్లు మన మందరమూ ఒక ప్రళయాన్ని చూడవచ్చు. తట్ఫలితంగా సుఖాంతమో, లేదా విషాదంగా తలా ఒక తీరానికి చేరుకోవటమో సంభవిస్తుంది. అలా జరిగితే ఆ ప్రళయంలో మొదటి ఆహుతి నేనే అయి మీ అందరి సమక్షంలో తృప్తిగా దాటిపోగలిగే ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఆరోజు మీ పవిత్రమైన హస్తాలతోనే నన్ను సాగనంపండి. లేదా నా చితికి నిప్పంటించండి. సమాధి చెయ్యండి ....
                                                                                        -సోదరి
                                                                                          సునీత."
    "ఓహ్!" విశ్వం నుదురు తుడుచుకున్నాడు.
    "పైకి మామూలుగా అగుపించే నీ జీవనగ్రంథంలో, పుటల్లోని అక్షరాలు ఇంత వేదనాభరితంగా లిఖించబడి ఉంటాయనుకోలేదు. నేను నిన్ను ఇంతవరకూ రేఖా మాత్రంగానే తెలుసుకోగలిగాను. ఇవ్వాళ నువ్వు పూర్తిగా అర్ధమయ్యావు. అనవసరమైన ఆర్భాటం, ఆడంబరాలు ప్రదర్శించే స్త్రీలు నిన్ను చూసి నేర్చుకోవలిసింది చాలా ఉంది. ప్రపంచంలో నీలాంటివారు చాలా అరుదు.'
    విశ్వం లేచాడు. బయటికి వచ్చి, తలుపులు లాగి గొళ్ళెంపెట్టి తాళం వేశాడు. గబగబా బస్ స్టాప్ వైపు నడిచాడు, హోటల్ కు వెళ్ళి భోజనం చేద్దామన్న ఉద్దేశ్యంతో.
    
                             *    *    *

    ఆదివారం.
    నిర్మల, బాజీకూడా లేరు. ఏం చేద్దామన్నా తోచటంలేదు. స్టేట్ లైబ్రరీకన్నా వెళదామని పబ్లిక్ గార్డెను దాకా నడిచే వచ్చాడు. నడుస్తుంటే తన ముందునుంచి వెళ్ళిన ఆకుపచ్చని కారు చూడగానే వేణు స్ఫురణకు వచ్చాడు. ఇవ్వాళ ఆదివారమే. వేణు ఇంటిదగ్గిరే ఉంటాడు. గోల్కొండవైపు వెళ్ళే బస్సు అటు ఆగుతుంది. అటూ ఇటూ చూసి రోడ్డు దాటాడు. అయిదు నిమిషాలు కాకముందే బస్సు వచ్చింది.
    పెళ్ళి అయి తండ్రి అయినా కాలేజినాటి అల్లరితనం ఇంకా పూర్తిగా వదలలేదు. అందమైన ఆడ అమ్మాయిలకళ్ళల్లోకి కి సూటిగా చూసెయ్యడం, బస్సులో అయితే ఆ అమ్మాయికి 'మిస్ బస్' అని బిరుదు ఇచ్చే సెయ్యడం (లోలోపలే), పాతస్నేహితులు ఉంటే పేర్లు పెట్టేసి నవ్వుకోవడం, స్నేహితులు పక్కన ఉండి, చేతికి ఫైళ్ళ బరువు తగలకపోతే - విశ్వం వీటన్నిటినీ నెమరువేస్తూంటాడు.
    బస్సు ఆగకముందే ఎక్కెయ్యడం, మిస్ బస్ లను ఎన్నిక చెయ్యడం, స్లో రన్నింగ్ లోనే దిగటం వగైరా అన్నీ పునరావృత్తంచేస్తూ, హాస్పిటల్ ముందు బస్సు దిగేసరికి ఆర్తి ఎక్కడికో వెళుతూంది కారులో. విశ్వాన్ని చూసి కారు ఆపించింది.
    "ఇక్కడికేనండీ! వేణు ఉన్నాడా?" ఆమెకు నమస్కరిస్తూ అన్నాడు.
    "ఉన్నాడు. వెళ్ళు. కొంచెం పనిఉండి సికిందరాబాదు వెళుతున్నాను."
    కారు ముందుకు వెళ్ళిపోయింది. విశ్వం గేటు దాటి లోపలికి వెళ్ళాడు.
    హాల్లో రాధకు ఏమిటో చెబుతున్నాడు వేణు. రాధ శ్రద్ధగా వింటున్నది. విశ్వం గుమ్మానికి అవతల నిల్చుని, "వేణూ!" అన్నాడు.
    వేణు వెనక్కు చూసి, "రె! నువ్వా. రా! రా! కొత్త వాడిలా నిల్చున్నావేం?" అంటూ ఆహ్వానించాడు.
    రాధ లోపలికి వెళ్ళింది.
    "ఏమిటి, చెప్పాపెట్టకుండా దయతలిచావు?"
    "అనుకున్నాం! వచ్చేశాం."
    "అంతేనా? కొత్త వార్తలేమైనా ఉన్నాయా? అన్నట్లు బ్రహ్మచారివి గాబోలు!"
    "తాత్కాలికంగా. తప్పదు గదా?"
    కాసేపు పిచ్చాపాటీ కబుర్లు దొర్లిపోయాయి. మాటల్లో రాధ ప్రసక్తితోబాటు పరిచయం జరిగి పోయింది.    
    "నీకు పనేమైనా ఉందిరా, వేణూ?"
    "ఏం? నీకేమన్నా తగిలిందా?"
    "ఆఁ, నీతోనే ఓ గంటపాటు. అలా వెళ్ళివద్దాం రాకూడదూ?"
    "అర్జెంటా?"
    "అనుకోరాదూ!"
    "సరే! బట్టలు మార్చుకుని వస్తాను ఉండు."
    మళ్ళీ అయిదు నిమిషాల్లోనే వచ్చాడు. రాధతో చెప్పాడు వేణు, బయటికి వెళుతున్నట్లు.
    "ఎక్కడికి వెళదాం?" కారు స్టార్టు చేశాడు.
    "గోల్కొండవైపు. నెమ్మదిగా వెళ్ళనిస్తూండు."
    "పెద్ద సస్పెన్సు!" వేణు అలాగే చేశాడు.
    కొంతదూరం వెళ్ళాక విశ్వం అన్నాడు: "నేను వేసే ప్రశ్నలకు ఏమీ దాచకుండా సమాధానాలివ్వాలి!"
    "నీకు తెలీనివేమున్నాయి?"
    "లేకపోవచ్చు. కానీ మళ్ళీ చెప్పాలి."
    "అలాగే."
    కారు మరికొంత దూరం వెళ్ళింది. "వేణూ, నువ్వు సునీతను ప్రేమించావు. నిజమే కదూ?"
    "అవును."
    "రాధ-ఆమెను ఇక్కడికి తీసుకురావటంలో నీ ఉద్దేశ్యం?"
    "ఉద్దేశ్యమా? ఏం ఉంది?"
    "అదే. స్పష్టంగా చెప్పు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS