Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 21


                           సరస చేసిన తప్పు


    అది బీదా బిక్కీ నివసించే వీధి. చిన్న చిన్న పెంకుటిళ్ళు . ప్రతి ఇంటిలోనూ చిన్న చిన్న గదులు. పెద్దవీ, చిన్నవీ సామాన్లు. పిన్నలూ, పెద్దలూను. వీటి వల్ల ఒకటే ఇరుకూ, ఇబ్బందీ ను.
    పేదరికం లో కొట్టు మిట్టాడుతూ ఉన్నా, తాము తరతరాలుగా ధనవంతుల మనే ఉద్దేశంతో నూ , తమ భర్తలు బోలెడు సంపాదించి పోస్తున్నట్టు గాను, తమ ఇల్లు సుభిక్షంగా ఉంటున్నట్టు గానూ అనుకుని గొప్పలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు ఆ వీధి లోని చాలా మంది స్త్రీలు!
    ఇటువంటి ఒక వీధిలో సరస, పద్మ నివసిస్తున్నారు. ఇద్దరు స్నేహితురాండ్రు. ఎదురు బొదురు ఇళ్ళల్లో ఉంటున్నారు. సరస తండ్రి ఒక యజమాని వద్ద లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పద్మ తండ్రికి ఒక సైకిల్ షాప్ ఉంది. వాళ్లకు నెలకు నూరు మొదలుకొని నూట ఇరవై లోపుగా ఆదాయం వచ్చేది. ఈ డబ్బుతో వాళ్ళు అతి సామాన్యమైన జీవితం గడిపేవాళ్ళు. కాని, ఆ ఇంటి అమ్మాయిలూ చెప్పుకునే గొప్పలకు మాత్రం తక్కువ లేదు.
    సరస, పద్మ స్నేహితురాండ్రు గా ఉంటున్నా, లోపల ఒకరంటే ఒకరికి గిట్టేది కాదు. ఎవరికి వారు తామే అధికమని అనుకునేవారు. ఒక్కొక్క సారి వాళ్ళ ఎత్తి పొడుపు మాటల్లో ఈ అభిప్రాయం బాగా బయటపడేది. పెద్ద ఇంటి అమ్మాయిల అలవాట్లు వాళ్లకు నచ్చాయి.
    ఈ ఎత్తి పొడుపు మాటల వల్ల సరస కూ, పద్మకూ మధ్య పోట్లాట ఎప్పుడో రావలసింది. కాని, అలా జరగలేదంటే, అందులో ఒక రహస్యం ఉందన్న మాట!
    అప్పట్లో వాళ్ళిద్దరూ పదిహేనేళ్ళ పిల్లలు. పావడాలు వేసుకునేవారు. వాళ్ళ మనస్సుల్లో ఎన్నెన్నో భావాలు ఉదయిస్తూ ఉండేవి. ప్రణయం , స్నేహం, ప్రేమ మొదలైన మాటలు వాళ్ళ హృదయాలలో సుడిగాలులు రేపుతూ ఉండేవి. జీవితంలో భర్త -- భార్య అనుబంధం గురించి ఒంటరిగా కూర్చుని గంటల తరబడి మాట్లాడుకునే వారు. ఈ మాటల్లో ఇద్దరూ ఒక విలక్షణమైన సంతోషం పొందేవారు. ఈ అంతరంగిక సంభాషణలు మాత్రమె వాళ్ళిద్దరినీ ఒకటిగా ఉండేటట్లు చేసేవి..
    ఇలా స్నేహంగా ఉంటూ వచ్చినా వాళ్ళ లోలోపల విరోధం పెరగసాగింది.
    అదే వీధిలో చివరి ఇంట్లో కనకరాజు అనే కుర్రవాడో కడు ఉండేవాడు. హైస్కూల్లో చదువు కుంటున్నాడు. ముఖంలో మంచి కళ. కొంచెం ఎర్రగా ఉండేవాడు. కళ్ళు రెండూ ఆయస్కాంతములు!
    ఈ కనకుని గురించి సరస, పద్మ తరుచుగా మాట్లాడుకునే వాళ్ళు. మొదట్లో "అతన్ని అక్కడ చూశాను, ఇక్కడ చూశాను" అని అంటీ అంటకుండా మాట్లాడిన మాటలు, చివరికి పోనుపోనూ మరొక విధంగా రూపొందాయి. అతనితో వాళ్ళు మానసికంగా జీవిస్తున్నట్టు  భావించ సాగారు. ఆ జీవితాన్ని తలుచుకుని పోటీ పడసాగారు.
    ఈ పోటీలు వాళ్ళ మనో భావాలను దృడ తరం చేశాయి. కాగా, కనకు ఎక్కడైనా కనిపిస్తే చాలు, అతన్ని ఎగాదిగా చూసేవాళ్ళు. లేదా మందహాసం చేసేవాళ్ళు. త్వరలోనే అతనితో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ వీధిలోని స్త్రీ పురుషులు భేదం లేకుండా సంచరిస్తూ ఉండడం వల్ల, వాళ్ళ చేష్టలు చూసి ఎవ్వరూ తప్పు పట్టలేదు.
    కొన్ని నెలలు గడిచాయి. సరస, పద్మల మనో భావాలకు విఘాతం ఏర్పడింది. వాళ్లకు పెళ్లి చెయ్యాలని పెద్దలను కున్నారు. సంబంధాలు చూడసాగారు. పద్మకు ఆ పక్క గ్రామం లోనే ఒక వరుడు కుదిరాడు. ఆమె పెళ్ళే మొదట జరిగింది. పెళ్లి అయిన తరవాత భర్తతో వెళ్ళిపోయింది పద్మ.
    ఇకపోతే మిగిలింది సరస.
    ఆమె కుటుంబం ప్రశాంతత లేని కుటుంబం. తండ్రి ఎతిరాజు సరిగా ఇంటికి రాడు. లారీడ్రైవర్ అవడం వల్ల రోజుల తరబడిగా బయటి ఊళ్లలో నే ఉండేవాడు. అందువల్ల అతనికి కొన్ని చెడ్డ అలవాట్లు కూడా అలవడ్డాయి. ఇంటి విషయాలు సరిగ్గా పట్టించుకునే వాడు కాదు.
    తల్లి వరలక్ష్మీ చాలా బాధపడుతూ ఉండేది. భర్త ఇంటికి వచ్చినప్పుడల్లా అతనితో పోట్లాట వేసుకునేది. ఇంట్లో కుండలు, గిన్నెలూ అటు ఇటు దొర్లేవి . ఇంట్లో ప్రశాంతత లోపించేది. ఎప్పుడూ గోలగా ఉండేది.
    భర్తను పోరు పెట్టి సరస కు ఎలా గయితే నేం ఒక సంబంధం కుదిర్చింది. వరలక్ష్మీ. ఏభై మైళ్ళ దూరంలో ఉన్న ఒక నగరం పెళ్లి కొడుకు నివాస స్థలం. మునిసిపల్ ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగం. పెళ్లి కొడుకు కొంచెం డబ్బూ దస్కం ఉన్నవాడే. సంబంధం చూసి, ఖాయం చేసి సరస కు పెళ్లి చేసింది వరలక్ష్మీ.
    పెళ్ళినాడు పెళ్లి కొడుకుని చూసిన సరసకు ఆశా భంగం కలిగింది. అతను సన్నగా, ముఖం పీక్కుపోయి ఉన్నాడు.
    అతన్ని కనకుతో పోల్చి చూసుకుని ఆ రోజంతా కుమిలిపోయింది సరస. కాని ఒకందుకు తృప్తి పడింది. అప్పుడు తన స్నేహితురాలు పద్మ ఊళ్ళో లేదు. ఆమె కనక అక్కడుంటే సరస భర్తను చూసేది. సరసను నొప్పించేటట్లు మాట్లాడేది. తన భర్త కంటే  పద్మ భర్త వెయ్యి రెట్లు నయమనిపించింది సరసకు.
    కాని ఎప్పుడైనా పద్మ తన భర్తను చూడటం జరిగితే ....సరసకు ఏడుపు వచ్చింది. పద్మ పెళ్లి అయిన తరవాత  ఆమెతో తాను మాట్లాడిన మాటలన్నీ గుర్తుకి వచ్చాయి. "మావాళ్ళు మామూలు సంబంధం చూడరు. నెలకు మూడు వందలు సంపాదించే వరుడ్నే చూస్తారు. 'బాగా చదువుకుని ఉండాలి. అందంగా ఉండాలి. అలాంటివాడికే మా అమ్మాయి నిస్తా' నంటూ మా నాన్న ఖచ్చితంగా చెప్పాడు." ఇలా పద్మ భర్త నుద్దేశించి ఎగతాళి గా మాట్లాడింది , గొప్పలు చెప్పుకుంది సరస. ఇప్పుడు కనక పద్మ సరస భర్తను చూస్తె చాలు.....
    పెళ్లి అయిన తరవాత సరస అత్తవారింటికి వెళ్ళింది. వెళ్ళిన ఒక్క నెలకే జీవితమంటే ఆమెకు రోత పుట్టింది.
    అత్తవారింటికి వెళ్ళిన ఒక వారానికి భర్త శేషగిరి ఆమెను ఏకాంతంగా కలుసుకున్నాడు. అతని ముఖం చూసిందో లేదో ఆమెకు అసహ్యం కలిగింది.
    'సరసు...." అన్నాడు శేషగిరి.
    "ఏమిటి?' కసిగా అడిగింది సరస.
    అతను వణికి పోయాడు.
    "పెళ్లి కని మా అమ్మ రేపు వెడుతుంది. మనం జాలీగా సినిమా కి వెడదాం" అన్నాడు కనుసైగ చేస్తూ.
    అతని మాటలు వింటుంటే, అతను వట్టి వెకిలి వాడుగా కనిపించాడు. అది చూసి ఆమె మరీ అసహ్యించు కుంది.
    ఆమె మౌనం వహించింది. అతను ఆమె దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. జడకు కట్టిన రిబ్బను చివరను పుచ్చుకుని ఆమె అటూ ఇటూ తిప్పసాగింది.
    ఆమెకు ఏడుపు ముంచుకు వచ్చింది. ముడుచుకున్న కాళ్ళ మీద ముఖం పెట్టుకు ని ఏడవసాగింది.
    త్వరలోనే అన్ని విషయాలూ ఆమెకు తెలియ వచ్చాయి. శేషగిరి తల్లికి అణిగి మణిగి ఉండే కొడుకు. తల్లి అనుమతిస్తేనే అతను ఆమెతో మాట్లాడవచ్చు. ఆమె ఉన్న గదికి రావచ్చు. తల్లి అంటే అంత భయం శేషగిరి కి!
    అత్తగారు గోదావరి చూడడానికే భయంకరంగా ఉండేది. కోపం కనక వస్తే నోరు చెవుల దాకా సాగేది. సరస ను ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూ ఉండేది. 'అక్కడ నుంచుని ఏం చేస్తున్నావు? ఇదుగో, ఈ మంచం దొడ్లో కి తీసుకు వెళ్లి బాగా కడుగు. ఒక గుడ్డతో బాగా రుద్దు. అప్పుడే మురికి పోతుంది." అంటూ వీధి వాకిట్లో ని నడవ లోకి వెళ్ళిపోయేది. అదే ఆమె స్థిర నివాసం.
    బయటి వారికి వడ్డీకి ఆప్పు లివ్వడం గోదావరి వృత్తి. అది ఆమె కాలక్షేపం కూడా! అప్పులివ్వడం, తీసుకోవడం ద్వారా వచ్చే డబ్బే ప్రధానమైన ఆదాయం ఆ ఇంటికి.
    ఒక రోజున అమ్మవారి ఉత్సవం చూసేందుకు గోదావరి పక్క ఊరికి వెళ్ళింది. సాయంకాలం తిరిగి వచ్చేస్తా నని చెప్పి వెళ్ళింది. ఆరోజు మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉంది సరస.
    కిటికీ గుండా చూసేసరికి ఒక నీడ కదులుతున్నట్లు కనిపించింది.
    వెంటనే ఆమె గదిలోంచి బయటికి వచ్చింది. అరుగు వైపు తొంగి చూసింది. అక్కడ శేషగిరి నుంచుని ఉన్నాడు భయపడుతూ.
    అతని డ్రెస్సు ని చూసి ఆమె ఉలిక్కి పడింది. మురికీ కాకీ చొక్కా, లాగూను, గుడ్డ టోపీ ఒకటి మడిచి చేతిలో ఉంచుకున్నాడు.
    "ఏమిటిది?' బెదిరించినట్టుగా అడిగింది సరస.
    "ఉమ్" అంటూ నవ్వాడు శేషగిరి.
    "ఎందుకిలా దాక్కున్నారు?"
    "ఏమీ లేదు."
    అతను మాట్లాడలేదు.
    "చెప్పండి. ఎక్కడిదీ డ్రెస్సు?"
    "ఆఫీసులో ఇచ్చారు" అన్నాడు.
    "ఆఫీసులో మీరు క్లార్కా లేక......."
     ఏం చెప్పాలో తెలీలేదు శేషగిరి కి.
    "చెప్పండి....మ్...." ఆమె గట్టిగా అడిగింది.
    చివరికి నిజం బయట పడింది. పెళ్ళినాడు చెప్పినట్టు అతను గుమస్తా కాదు.
    మునిసిపాలిటీ వారి చిల్లర మల్లార పనులు చేసే వాళ్ళలో అతనొకడు.
    ఆరోజు ఒక మంత్రి మరణించడం వల్ల సెలవిచ్చారు. అందువల్ల శేషగిరి ఇంటికి వచ్చాడు. అంతవరకూ అతను తన ఉద్యోగం గురించి ఆమెకు చెప్పలేదు. కాకీ చొక్కా లాగూల తో సరస ఎదటికి రాకూడద నీ, ఆమెతో తాను చేస్తున్న పనిని గురించి ఏమీ చెప్పకూడదనీ గోదావరి కఠినంగా శాసించింది. అయితే ఈవేళ అంతా బట్టబయ లయింది.
    ఇది సరస గొప్పలకు పెద్ద దెబ్బగా వచ్చి పడింది.
    'ఉద్యోగం చూడబోతే ఇటువంటిదా? మమ్మల్ని మోసం చేశారు' అనుకుని ఆమె ఏడవసాగింది.
    వెంటనే పుట్టింటికి ఒక ఉత్తరం వ్రాసింది. అందులో శేషగిరి ని గురించి వ్రాసింది. "ఇంక ఇక్కడ ఉండడానికి నాకు మనస్కరించడం లేదు . చాలా కష్టపడుతున్నాను. నన్ను పిలుచుకుని వెళ్ళండి" అని తెలియ జేసింది.
    ఉత్తరానికి జవాబు వచ్చింది. ఆమె తండ్రి వ్రాశాడు.
    అత్తవారింట్లో నే ఆమె ఉండాలనీ, ఏ విధమైన కారణం గానూ ఆమె తిరిగి రాకూడదనీ ఖచ్చితంగా వ్రాశాడు తండ్రి. ఆ ఉత్తరాన్ని చేతిలో ఉంచుకుని బాధతో మునిగిపోయింది సరస.
    ఆనాడు శుక్రవారం. ఇంకా ఒక వారంలో మాఘమాసం వస్తుంది. సరస తహతహ ఎక్కువయింది. ఒక పండగ రోజునైనా పుట్టింటి కి వెళ్ళకూడదా అనుకుంది. అత్తవారింట్లో ఉండడం ఆమెకు ముళ్ళ మీద ఉన్నట్లుగా తోచింది.
    ఆమె పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు ఊళ్ళో తండ్రి లేడు. రెండు రోజులకు గాని రాలేదు. ఇంట్లో కూతుర్ని చూసేసరికి ఆమె మీద మండి పడ్డాడు.
    "ఎందుకు తిరిగి వచ్చావు?' కోపంగా అడిగాడు.
    "నాన్నా! అక్కడ ఉండడం బాధగా ఉంది. నాన్నా. మా అయన వట్టి అరవిందం! అత్తగారేమో పోగరబోతూ మనిషి!..." అలా సంగతులు చెప్పుకుంటూ వెళ్ళింది.
    తండ్రికి కోపం తగ్గలేదు.
    'అలా మనుషులు రకరకాలుగానే ఉంటారు. వాళ్ళ ననుసరించి నువ్వే మెలగాలి. ఇక్కడున్న వాళ్ళకే నేను సంపాదించి పెట్టలేక పోతున్నాను. నువ్వు కూడా వచ్చి చేరావంటే...... ఫో, ఫో....రేపే వెళ్ళాలి నువ్వు!"  
    "నాన్నా!" ఇంక చెప్పలేక సరస ఏడ్చింది. "నన్ను పొమ్మంటున్నారు గదా నాన్నా! నేను ఈ ఇంటికి రాకూడదా? ఎప్పటికీ రాకూడదా?"
    "నీకు గర్బం వస్తే వద్దువు గాని, ఈ మధ్య రాకూడదు."
    "ఓహో! అందుకోసం ఎదురు చూస్తున్నారా మీరు! ఈ జన్మలో మీకు మనవడు పుట్టడు. అందగాడ్ని చూసి పెళ్లి చేశారుగా. మనవడు పుట్టాలట, మనవడు!"
    "ఏమిటే ఈ మాటలు?"
    సరస మాట్లాడలేదు. "ఓ' అని ఏడవటం మొదలు పెట్టింది. ఆమె మాటల్లోని అంతరార్ధాన్ని తండ్రి గ్రహించడని ఆమెకు బాగా తెలుసు. అది తలుచుకుని ఆమె మరీ ఏడ్చింది.
    ఆమె మాటల కేమీ కదల్లేదు తండ్రి. కోపం మాత్రం ఎక్కువయింది."ఇదుగో , చూడు! ఈ ఇంట్లోంచి నువ్వు వెళ్లిపోవాలి. అవును ఇది తప్పదు" అంటూ బయటికి వెళ్ళిపోయాడు.
    తల్లి వరలక్ష్మీ కూతుర్ని ఓదార్చింది. "అమ్మా! అంతా కలిసి నన్ను పాడు బావిలోకి తోసేశారు! ఇంకా ఆ బావి లోనే మునగ మంటున్నారు" అని వెక్కి వెక్కి ఏడ్చింది సరస.
    తండ్రి చెప్పిన ప్రకారం ఆమె ఆ మరునాడే అత్తవారింటికి ప్రయాణం కావలసి వచ్చింది. ఏడుస్తూనే బస్సు ఎక్కింది.
    ఆరు నెలలు గడిచాయి. ఒకనాడు సరస కు తంతి వచ్చింది. "తండ్రి పరిస్థితి బాగా లేదు. బయలుదేరు" అని ఉంది అందులో. వెంటనే ఆమె ఊరికి బయలు దేరింది.
    ఆమె ఊరు చేరే లోపల గుండె పోటు వల్ల ఆమె తండ్రి మరణించాడు. ఇల్లు ఇల్లంతా దుఃఖం లో మునిగి పోయింది. కొడుకు కృష్ణ స్వామి సంపాదన మీదనే ఇక ఇల్లు గడవాలి. అప్పుడతని వయస్సు పదహారు.
    కర్మకాండలన్నీ ముగిసిన తరవాత కూడా సరస అక్కడే ఉండిపోయింది. అత్తవారింటి కి పోలేదు. రెండు నెలలు గడిచాయి. అత్తగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సరస వెంటనే బయలుదేరి రావాలని ఆమె వ్రాసింది.
    కాని, సరస ఒప్పుకోలేదు. తండ్రి మరణ వృత్తాంతాన్ని ఆమె ఇప్పుడే అత్తగారికి తెలియ జేసింది. ప్రస్తుత పరిస్థితి లో ఇంకా మూడు నెలల దాకా రావడానికి వీలుపడదని ఆమె జవాబు వ్రాసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS