Previous Page
వాస్తవ గాధలు పేజి 22


    మూడు నెలలూ గడిచాయి. సరస అత్తవారింటికి ప్రయాణం కాలేదు. అందుకు మరికొన్ని కారణాలు కూడా కలిసి వచ్చాయి.
    ఊళ్ళో ఆమె కనకుని కలుసుకోవడం కూడా ఆ కారణాలలో ఒకటి.
    కనకు ఇప్పుడు ఒక కానిస్టేబిల్ అయ్యాడు. ఒకనాడు సినిమా చూడబోయిన సరస అతన్ని దియేటర్ దగ్గర కలుసుకుంది. అతన్ని చూడడంతోనే ఆమె మనస్సు సంతోషంతో నిండి పోయింది. మైమరిచి అతనితో మాట్లాడింది. "సినిమా కి డబ్బిచ్చి ఎందుకు వెడతావు? నిన్ను నేను లోపలికి ఊరికినే పిలుచుకు పోయి కూర్చో బెట్టాడు కనకు.
    "నువ్వూ సినిమా చూడు, కనకూ!" అంది సరస.
    "నేనా?' అన్నాడు. "డ్రెస్సు మార్చుకుని వస్తా" అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు.
    మళ్లీ గంట సేపటికి అతను డ్రెస్సు మార్చుకుని వచ్చాడు. ఆ కలుసుకోవడం వాళ్లకు మరిచిపోలేని సంఘటన గా మారిపోయింది.
    ఆనాటి నుంచీ కనకుతో ఎక్కువగా మెలగ సాగింది సరస.
    ఇంట్లో తల్లి ఏదో జబ్బుతో మంచ మెక్కింది. అందువల్ల ఆమె కెటువంటి నిర్భంధమూ లేకపోయింది. స్వతంత్ర్యంగా ఉండసాగింది.
    రెండు నెలలు గడిచాయి. అత్తగారి వద్ద నుంచి తరచుగా ఉత్తరాలు వచ్చేవి. వెంటనే బయలుదేరి రావలసిందని ఖచ్చితంగా అత్తగారు వ్రాసింది.
    మొదట్లో ఏవో అబద్దాలు చెపుతూ ప్రత్యుత్తరాలు వ్రాసేది సరస. ఆ తరవాత పోనుపోను ఆమెకు ఒక ధైర్యం, అసహ్యం కలిగాయి. అత్తగారి ఉత్తరాలకు జవాబు ఇవ్వడం మానివేసింది.
    'ఇక ఎన్నటికీ ఆ ఇంటికీ వెళ్ళను' అని ఆమె నిశ్చయించు కుంది. 'ఇలాగే జీవిస్తాను. అక్కడ అత్తవారింటి కి వెళ్లి కుమిలి కుమిలి క్రమక్రమంగా చావడం కంటే ఇక్కడే జీవించడం మంచిది అని అనుకుంది."
    ఒకనాడు సరస బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. లోపల చూచేసరికి ఉలిక్కిపడింది . భర్త శేషగిరి కూర్చున్నాడు. ఆమెను చూడగానే పళ్ళికిలించాడు.
    "ఎందుకొచ్చా రిక్కడికి?" అని బిగ్గరగా అరిచింది సరస.
    "మా అమ్మ పంపించింది" అన్నాడు శేషగిరి.
    "ఎందుకు పంపించింది?"
    "నిన్ను పిలుచుకు రమ్మంది."
    "నేను రావడానికి వీల్లేదు. వెళ్ళండి."
    "అలా అనకు సరసూ! మా అమ్మకు నీ మీద కోపంగా ఉంది."
    "ఆమె కోపం ఇంక నన్నేం చేస్తుంది?" నేనక్కడికి రాను. ఖచ్చితంగా చెపుతున్నాను." అంది.
    శేషగిరి ఊరికి తిరిగి వెళ్ళలేదు. అక్కడే ఒక వారం రోజులున్నాడు. సరస కు ఎక్కడ లేని కోపం వచ్చింది. అతన్ని తిట్టి పోసింది. ఏ మాటకు చోటివ్వ కుండా మండిపడ సాగింది.
    కాని శేషగిరి దేనికీ తొణికి నట్లు తెలియలేదు. పిచ్చివానిలా నవ్వుతూ అక్కడే తిష్ట వేశాడు. గోదావరి అతనికి కచ్చితంగా చెప్పి పంపించింది. "ఒరేయ్! పెళ్ళాన్ని తీసుకు రాకుండా ఇంటికి రాకూడదు. అలా వస్తే ఇంట్లోకి రానివ్వను" అని చెప్పింది. అందుకు భయపడిపోయి ఇక్కడే తిష్ట వేశాడు శేషగిరి.
    సరస కు ధర్మ సంకటంగా తయారయింది. శేషగిరి నెలా బయటికి పంపడమా అని ఆలోచించ సాగింది.
    ఒకనాడు సరస అతనితో "నేను తరవాతి బస్సు లో వస్తాను. మీరు ముందర వెళ్ళండి" అని నచ్చిక బుచ్చిక లాడి అతన్ని ఒప్పించింది. గుడ్డల సంచి తీసుకుని శేషగిరి బస్సు స్టాండు కి వెళ్లాడు. తృప్తిగా ఒక నిట్టుర్పు విడిచింది సరస.
    ఆమెకు చిత్త శాంతి కలిగింది. అలా ఒక గంట సేపు గడిచింది. మళ్లీ శేషగిరి వాకిట్లో కనిపించేసరికి ఆమెకు చెమటలు పోశాయి. అతను మళ్లీ వచ్చాడు. ఆమెతో కలిసే అతను ఊరికి వెళ్ళాలను కున్నాడు.
    "మర్యాదగా మీరు వెడతారా ,లేదా?" అని అరిచింది సరస. శేషగిరి లోపలికి వచ్చి, తల గోక్కుంటూ కూర్చున్నాడు.
    "నువ్వు కనక రాకపోతే మా అమ్మకు కోపం వస్తుంది. నాకు అన్నం కూడా పెట్టదు."
    "అదంతా మీ ఇంటి సంగతి. నేను రాను, వెంటనే వెళ్ళిపొండి." అంది సరస.
    ఆమెను చూసి బిగ్గరగా నవ్వాడు శేషగిరి. "రా, సరసూ! మనిద్దరం వెడదాం" అన్నాడు కనుసైగ చేస్తూ. అతని మాటలు వినేసరికి ఆమెకు మరింత కోపం వచ్చింది.
    ఆరోజంతా ఒకే మొండి పట్టుగా కూర్చున్నాడు శేషగిరి. ఇల్లు విడిచి కదిలేటట్లు కనిపించలేదు. తల్లి చేసిన బోధ బాగా నాటుకు పోయింది. ఆ మరునాడు కూడా అతను కదిలే సూచన కనిపించలేదు. సరస కు అంతులేని కోపం వచ్చింది.
    ఈలోగా పద్మ ఊరికి వస్తుందన్న వార్తా ఆమె చెవిని పడింది. పద్మ ఇక్కడికి వచ్చి శేషగిరి ని కనక చూస్తె.....ఆ అవమానాన్ని ఎలా భరించడం? ఆలోచనలో మునిగిపోయింది సరస.
    ఆ తరవాత ఆమె ఆ నిశ్చయానికి ఎలా వచ్చిందో తెలియదు. ఈ సందర్భంగా కనకుని ఆమె కలుసుకుందో లేదో అదీ తెలియదు. లేకపోతె కనకు ఆమెను అలా చెయ్యమని ప్రేరేపించాడో అదీ తెలియదు.
    ఆ మరునాటి ఉదయం సరస శేషగిరి కి ఉప్మా పెట్టింది. అది తిన్న కొంచెం సేపటి కల్లా అతనికి డోకులు వెళ్ళాయి. అరగంట దాకా కడుపు నొప్పితో యాతన పడ్డాడు. ఆ తరవాత మరణించాడు.
    కొడుకు మరణ వార్తను వినగానే గోదావరి ఏడుస్తూ కేకలు వేసుకుంటూ వచ్చింది. ఇంట్లో ఆర్బాటం చేసింది. శేషగిరి మరణాన్ని శంకించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
    మృతశరీరాన్ని పోస్ట్ మార్టం కి పంపించారు. విషం కలిసిన ఆహారం వల్ల శేషగిరి మరణించి నట్లు తెలిసింది. విచారణ ముగిసిన తరవాత సరస అరెస్టు చేయబడింది.
    పదిహేనేళ్ళు నిండిన సరస జువనైల్ కోర్టు లో విచారించ బడింది. ఆమె నేరస్తురాలు గా నిర్ణయించ బడింది. ఆమెను సర్టి పైడ్ స్కూల్ కి పంపించారు.
    ఈ స్కూల్ ఒక విధమైన జైలు లాంటిది. చిన్న వయస్సు లో నేరం చేసిన వారిని ఇక్కడికి పంపిస్తారు.
    బాలికల సర్టిఫైడ్ స్కూల్ లోనే నేను సరస ను చూశాను. ఆ స్కూల్ సూపరింటెండెంట్ ఒక మహిళ. ఆమె ముందే నాతొ ఒక సంగతి చెప్పింది. సరస ఎవ్వరి దగ్గరా తన నేరాన్ని ఒప్పుకోలేదన్నదే ఆ సంగతి.
    మొదట సరస కేసుని పూర్తిగా చదివాను. ఒక మనస్తత్త్వ డాక్టర్ ఆమెను పరీక్షించిన తరవాత వ్రాసిన పెద్ద రిపోర్టు కూడా చదివాను. అయన ఒకరి దగ్గరే ఆమె తన నేరాన్ని ఒప్పుకుంది.
    అన్ని వివరాలను చదివిన తరవాతనే ఆమెను పిలుచుకు రమ్మని చెప్పాను. ఆమెను చూడగానే నేను దిగ్బ్రమ చెందాను. పద్దెనిమిదేళ్ళు నిండినా ఆమె ముఖం ముదరలేదు. బాలికలా కనిపించింది. "ఈమేనా ఇంత పెద్ద నేరం చేసింది?' అని అనిపించింది.
    "ఇక్కడికి నువ్వెలా వచ్చావు?' అని అడిగాను. ఆమె కొంచెం తటపటా యించింది.
    "ధైర్యంగా చెప్పు" అన్నాను.
    "నాకు నేరం అంటగట్టారు" అంది ఆమె. తరవాత తాను నిరపరాధి ననీ, తన భర్త స్వయంగా విషం తిని ఆత్మహత్య చేసుకున్నాడ ని ఆమె చెప్పింది.
    ఆమెను ఎక్కువగా విచారించడం వల్ల లాభం లేదను కున్నాను. ఆమెకు పద్దెనిమిదేళ్ళు నిండడం వల్ల త్వరలోనే ఆమె విడుదల కానున్నది. అందువల్ల "విడుదల అయిన తరవాత ఏం చేస్తావు?' అని అడిగాను.
    "మా అమ్మ చనిపోయింది. ఎలాగైనా సంపాదించి నేను జీవిస్తాను. ఇక్కడ టైయిలరింగ్ నేర్చుకున్నాను" అంది.
    "ఆ తరవాత పెళ్లి చేసుకుంటావా?"
    "ఉహూ! ఇంక ఎవ్వరినీ పెళ్లి చేసుకోను" అంది ఆమె.
    జైలునీ, దానికీ సంబంధించిన వాటిని చూసి వచ్చిన నాకు ఈ బాలికల సర్దిఫైడ్ స్కూల్ లోనే చాలా విచారం కలిగింది. హత్య చేసిన బాలికలు పదకొండు మంది ఇక్కడ ఉంటున్నారు. తొమ్మిదవ ఏటనే హత్య చేసిన ఒక బాలిక కూడా ఉంది. వీళ్ళందరినీ మనో వేదనతో నే చూశాను. ఎవరినీ చూసినా "ఈమేనా ఇలా చేసింది?' అనిపించింది.
    కేసుల్ని చదివితేనే తప్ప దేన్నీ నమ్మలేక పోయినాను. తాను నేరం చేసినట్లు సరస అక్కడున్న తన స్నేహితురాండ్ర వద్ద ఒప్పుకుంటున్నదట. ఇలాగే ప్రతి అమ్మాయీ తన స్నేహితురాండ్ర వద్ద తప్పు ఒప్పుకుంటున్నారట. బయట వారి వద్ద వాళ్ళల్లో చాలామంది నిజం అంగీకరించటం లేదట.
    ఏదో ఒక విధంగా వీళ్ళందరూ మారాలి. భావి జీవితంలో నైనా సమాజపు మంచి సభ్యులుగా వీళ్ళు జీవించాలి. ఇదే నా ప్రార్ధన!

                              *    *    *    *


 Previous Page

WRITERS
PUBLICATIONS