రాఘవులికి లిల్లమ్మ గుర్తుకు వచ్చింది. "బెజవాడ లో ఓ ఆడమనిషి ఉందయ్యా. అచ్చం మీ అయ్యగారి పోలికే నయ్యా. ఏవీ తేడా లేదు. నేను చూడగానే అనుకున్నాను. "అన్నాడు రాఘవులు. ఇందాక తాను చలపతయ్య గారు అడుగుతుంటే నవ్వుకున్నాడు. ఇప్పుడు ఆయనకోచ్చిన అనుమానమే తనకూ వచ్చింది.
గవరయ్య "ఆహా!" అన్నాడు ఆశ్చర్యంగా.
రాఘవులు "అవును" అన్నాడు.
"అయితే ఆమె ఏ అస్పత్రిలోనో ఆడపిల్లని కని చనిపోయి వుంటుంది పాపం" అన్నాడు గవరయ్య.
"తెలియదు . అయితే ఆమె తల్లి కూడా ఇలాగే ఆస్పత్రిలోనే పురుడు పోసుకుని ఈమెను అక్కడే వదిలేసి పోయింది. ఓ నర్శమ్మ పెంచింది ఈమెను. అయితే ఆమె నడవడి మాత్రం పెద్ద కుటుంబంలో పుట్టిన మనిషిలా ఉంటుంది?" చాలా మంచి మనిషి" అన్నాడు రాఘవులు.
'ఆమె అయి వుంటుంది . సమయం కనిపెట్టి అయ్యగారికి చెబుతాను ఈయన చాలా దయా గుణం కలవాడు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు ఎత్తుతే మనస్సు పాడు చేసుకుంటారు. మెల్లగా కదుపుతా. ఈ అయ్యగారు ఆమెకు ఏదైనా ముట్ట చెబుతారు " అన్నాడు గవరయ్య.
"చెప్పు, పాపం. సహాయం చెయ్యవలసిన మనిషే." అంటూ సమర్ధించాడు రాఘవులు.
చలపతి ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చేసరికి కొంచెం పొద్దు పోయింది. రాజారాం అప్పటికే భోజనం చేసి పుస్తకం చదువుతూ మంచం మీద పడుకుని ఉన్నాడు. సుగుణ అతని పక్కనే కూర్చుని పత్రిక చదువు కుంటుంది.
చలపతి రాకను పసికట్టి రాజారాం "చలపతి గారూ" అంటూ పిల్చారు.
చలపతి గుమ్మంలో నిలబడే "భోజనం అయిందండీ" అన్నాడు.
"మీరు?"
"ఇంకా కాలేదు."
రాజారాం మంచం దిగి చకచక ఇవతలకి వచ్చి "ఇప్పుడు పన్నెండయింది" అన్నాడు.
"మా వాళ్ళకు వాళ్ళు పరీక్ష లేవో చేశారు. అక్కడే ఆలస్యం అయింది."
"అయితే ఇప్పుడు హోటలు కేం పోతారు. మా ఇంట్లో భోజనం చెయ్యండి సుగుణా వడ్డించేయ్యి చలపతి గారు ఇక్కడే భోజనం చేస్తారు." అంటూ రాజారాం బలవంతం చేశాడు. చలపతి ఎంత వారించినా అతను వినలేదు.
ఆ పూట అక్కడే భోజనం చేశాడు చలపతి.
భోజనం దగ్గర రాజారాం గోష్టి ఆరంభించాడు. చలపతి వింటున్నాడు.
"అతన్ని భోజనం చెయ్యనివ్వండి. మీ పుస్తకం లో సంగతులు తర్వాత చేబుదురు గాని" అంది సుగుణ.
"చెప్పనివ్వండి ఎవరు చెబుతాడు ఇంత మంచి విషయాలు? ఇలాంటి స్నేహితులు దొరకటం కూడా చాలా కష్టమే" అన్నాడు చలపతి.
రాజారాం "ఇవాళ చదివిన ఈ పుస్తకం ఓ నవల. తెలుగు నవలలు నేను ఎక్కువగా చదవ లేదనుకొండి కాని చాలామంది అనటం ఈనాడు తెలుగులో నవల ఇంకా డైరెక్టు ఫారం లోకి రాలేదు అంటారు. ఈ నవల చదివితే ఆ వాదన సబబే అనిపిస్తుంది." అన్నాడు.
చలపతికి ఈ ధోరణి అది అంతా అర్ధం గాక "అవునండి. చాలామంది అలాగే అంటారు. నేనూ కొన్ని పుస్తకాలు చదివాను బొత్తిగా అర్ధం కదండీ" అన్నాడు.
'అయితే మీరు నాతొ ఎకీభవిస్తారన్నమాట. ఈ పుస్తకంలో కధ గాని, కధ నడిపే తీరు కాని, ఆఖరికి సంఘటనలు కాని చాలా అస్వభావికం గా. అవాస్తవికంగా ఉన్నాయి. ఇందులో వాతావరణం ఈ తెలుగు దేశానికి సంబంధించింది కాదండి. ఇదంతా ఇతర పుస్తకాల్లోని వాతావరణం లాగుంది."
'అంతేనండి. ఇవన్నీ కాఫీ లేనండి" అన్నాడు చలపతి.
"కరెక్టుగా చెప్పారు. ఈ నవలంతా చాలా కృత్రిమంగా వుంది. ఏ ఇంగ్లీషు పుస్తకాలో చదివి అందులో సంఘటనలు, అందులో పాత్రలూ కొంచెం పేరు మార్చి తెలుగు నవలగా మార్చేశారంతే. అంతకు తప్పించి ఇందులో తెలుగు జీవితం కాని, రచయిన లోక పరిజ్ఞానం కాని, పరిశీలన గాని బొత్తిగా కనపడవు" అంటూ రాజారాం ఆ పుస్తకం లోని కొన్ని సంఘటనలు చదివి వినిపించాడు.
"అవునండి. అందుకే నేను విసుగెత్తి ఈ నవలలు చదవటం మానేశానండి. " అన్నాడు చలపతి.
చలపతి గబగబా భోజనం పూర్తీ చేశాడు.... అతనికి ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. వాస్తవానికి అతనికి ఇలాంటి వేమీ తెలియవు. రాజారాం ఒక పట్టాన ఒదిలేట్టుగా లేడు. అక్కడే కూర్చుంటే చివరికి ఏదో ఓ సందర్భంలో తాను బయటపడి పోక తప్పదు. చలపతి భోజనం పూర్తీ చేసి చేతులు కడుక్కుని తన రూం లోకి పోయి పడుకుందామానుకున్నాడు గాని రాజారాం కుర్చీలో బయట బాల్కని లో వేయించి "రండి తాంబూలం వేసుకుని కబుర్లు చెప్పుకుందాం" అంటూ పిలిచాడు.
చలపతి వెళ్ళి కూర్చున్నాడు. సుగుణ తెచ్చి ఇచ్చిన తమలపాకులు వక్క పలుకులూ తీసుకుని చలపతి ఆ ఊరు, వాతావరణం గురింఛి ఎగుడు దిగుడు రోడ్ల గురించి సంభాషణ మార్చాలని చూశాడు గాని రాజారాం ఇలాంటి చచ్చు విషయాలు ప్రస్తావించటానికి ఇష్టపడకుండా మళ్ళీ పుస్తకాల గొడవలో పడ్డాడు.
రాఘవులు అప్పుడే భోజనం చేసి వచ్చాడు. అతను దుప్పటి కింద పరుచుకుని పడుకున్నాడు. మెట్ల వారగా రాజారాం గారి బంట్రోతు . అతని పక్కగా చేరాడు.
రాజారాం మాట్లాడుతున్నాడు. చలపతి వూ కొడ్తున్నాడు.
రాజారాం ఉన్నట్టుండి ధోరణి ఆపుచేసి రోడ్డు మీదికి చూస్తూ "పాపం అనుకున్నాడు. ఒరేయ్ గవరయ్య నువ్వు ఆస్పత్రి గేటు దగ్గరకి వెళ్ళి నే చెప్పానని చెప్పి గేటు తీయించు. పాపం పేషెంటు తాలుకూ కుర్రవాడేవడో కారీరు తెచ్చాడు గేటు కాపలాదారు ఆ కుర్రవాడ్ని టైం అయిపోయిందని లోపలికి వెళ్ళ నివ్వటం లేదు.' అంటూ పురమాయించాడు.
గవరయ్య వెళ్ళి ఆ గేటు తీయించి ఆ కుర్రవాడు లోపలికి పంపించి వచ్చాడు.
'ఆస్పత్రి చాలా పెద్దదండి. ప్రతి ఊళ్ళోను ఇలాంటి ఆస్పత్రులుంటే జనానికి పానం సుఖం" అంటూ చలపతి వాళ్ళ సంభాషణ మార్చాలని చూశాడు.
రాజారాం "ఎవడి ఏడుపు వాడిది. శ్మశానం దగ్గర కాటి కాపరికి దృష్టంతా ఊరు వైపే ఉంటుంది ఎన్ని శవాలు వస్తాయా అని. అలాగే ఆస్పత్రి గేటు వాళ్ళకి గేటు మూస్తే బ్రతిమలాడి డబ్బులిస్తారు. వాడి యావ వాడిది."అన్నాడు.
చలపతికి నిద్ర ముంచుకు వస్తోంది. మధ్యాహ్నం పూట నిద్ర పోవటం అతనికి అలవాటు.
రాజారాం ఇది గమనించి "పడుకుంటారా. ఓ యస్ కాసేపు నిద్రపోండి. నేను రెస్టు తీసుకుంటాను.' అంటూ లోపలికి వెళ్ళాడు.
చలపతి గదిలోకి పోయి మంచం మీద జారబడ్డాడు.
సాయంత్రం రాజారాం , సుగుణ, రాఘవులు చలపతి నలుగురూ స్పెషల్ వార్డు కి వెళ్ళారు. రాధ ఇంతమందిని చూసి కంగారుపడుతూ "పొద్దున్న మీరు చెప్పిన రాజారాం దంపతులు వీరేనా"అని అంది.
'ఆహా వీరే. చాలా మంచివారు. దేవత ల్లాంటి వాళ్ళు.' అంటూ చలపతి పొగుడుతుంటే రాజారాం 'అమ్మాయి అంత పొగడ్త కి మేం అర్హులం కాం. మేం ప్రస్తుతం నరక బాధలు అనుభవిస్తున్న పాపాత్ములం. దేవతలం ఎలా అవుతాం? దేవతలమే అయి వుంటే లక్షల అస్త్గి వుండి పిల్లా పాపలతో హాయిగా అనుభవిస్తూ అక్కడే ఉండక ఈ విశాఖపట్నం లో అయిన వాళ్ళందరికీ దూరం అయి ఇలా మూలుగుతూ ముక్కుతూ ఎందుకు అవస్థలు పడతాం" అన్నాడు.
"పోనీ బాగా చదువుకున్నవారు. ఈయన చాలా పుస్తకాలు చదివారు." ఇలా పరిచయం చెయ్యటం బాగుందా?' అన్నాడు చలపతి.
రాజారాం "ఆ మాటన్నారు బాగుంది." అన్నాడు.
సుగుణ, రాధ సంభాషణల్లో పడ్డారు ఎవరి పుట్టింటి వివరాలు వారు పరిచయం చేసుకుంటున్నారు.
వరండాలోంచి ఓ పేషంటుని కుర్చీలో కూర్చోబెట్టి తీసుకు వెళ్తున్నారు. ఆ పేషెంటు బాధగా మూలుగు తున్నాడు. అతని ఎముకలు బయటపడి ఒంట్లో కండ అనేది హరించుకు పోయింది. ఆ బొందిలో జీవం ఏ మూల దాగి ఉన్నదో.
రాజారాం కి ఆ దృశ్యం దుస్సహంగా తోచింది. ఇంతలో ఎక్కడ్నించో ఓ కేక బాధగా వినిపించింది.
'అసలు ఈ లోకమే దుఃఖం లో నిండి పోయిందేమో అనిపిస్తుంది. ఈ భూమ్మీద మానవుడు ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ జీవిస్తాడు. ఏడుపుల మధ్యనే కన్ను మూస్తాడు."
'అంతేనండి ఈ ప్రపంచం అంతా ఏడుపు గొట్టు ప్రపంచం" అన్నాడు చలపతి.
రాఘవులు నవ్వు ఆపుకుంటూ అక్కడ్నించి అవతలికి వెళ్ళిపోయాడు. అతనికి అక్కడ్నించి రాజారాం మాత్రం కనిపిస్తున్నాడు. చలపతి అవస్థ అతనికి చూడ శక్యం కాకుండా ఉంది.
"ఈ ప్రపంచం అంతా దుఃఖ మయం దీన్నించి ఎవరూ తప్పించుకోలేరు. డబ్బున్న వాడు, లేనివాడు ఎవరూ దుఃఖం నుంచి తప్పించు కోలేడు. ఈ సృష్టి అది నుంచి మనుష్యులు తిన్నదంతా కలిపితే సముద్రపు నీటికి మించుతుందని బుద్దుడు అన్నాడు."
అక్కడికి సముద్రం కనిపిస్తుంది.
చలపతి 'అబ్బ ఇంత సముద్రం అక్కడుందా?" అనుకున్నాడు మనస్సులో ఆశ్చర్యంగా.
అయితే గాంధీజీ ఏమన్నాడో తెలుసా? విషాదం నుంచీ వ్యధ నించీ సిసలైన ఆనందం ఉద్భవిస్తుందంటాడు.
నర్సు లోపలికి వచ్చి రాధకు ఏదో మందు ఇచ్చి వెళ్ళింది.
"మా వారికి పుస్తకాలుంటే చాలు. ఇక ఏమీ అక్ఖర్లేదు" అంది సుగుణ రాధతో.
రాధ భర్తని చూసి నవ్వు అపుకుంది ముఖం పక్కకు తిప్పుకుని.
చివరికి రాజారాం "అమ్మాయి నీకు తప్పకుండా జబ్బు నయం అయిపోతుంది. సందేహం లేదు." అంటూ ధైర్యం ఇచ్చాడు.
రాఘవుల్ని అక్కడే ఉంచి చలపతి రాజారాం గారితో వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ గారు వెళ్ళి పొయిం తర్వాత రాఘవులు కరువు తీరా నవ్వుతూ 'అయ్యగారి అవస్థ ఆ పరమాత్ముడి కే తెలియాలండి." అన్నాడు.
రాధ ఏం?' అంది.
రాఘవులు 'అయన బాగా చదువుకున్న వారని, అయన పొద్దుట్నించి ఈయన్ని జలగలా పట్టుకుని ఒకటే ఉపన్యాసాలండి. అయ్యగారు పడే అవస్థ చూడలేక పోయ్యానంటే నమ్మండి. అయ్యగారి రూముకు రావటం అంటే హడలుగా ఉండండి. పొద్దున్నా మధ్యాహ్నం కాఫీలు అక్కడే నండి. ఇయాల మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేశారండి." అన్నాడు.
రాధ నవ్వేసింది.
రాఘవులు 'అన్నిటికంటే చిత్రం అయ్యగారి భయం రాజారాం గారు తన గదిలో కొచ్చి అలమారా తెరుస్తారేమో నని, రాజారాం గారు చాలా చొరవ గల మనిషండి. 'అంటూ మెల్లిగా 'అయ్యగారు సారా బుడ్లు అందులో దాచారండి" అన్నాడు.
"ఇక్కడా మొదలు పెట్టారా?' అంది రాధ.
