మళ్ళీ ఎప్పుడు ఆవిడ దిగబడుతుంది. తన ప్రాణానికి అనిపించింది రాధకు. ఆమె ఇక ఇక్కడకు రాకుండా ఉంటే బాగుండును అనిపించింది. ఇప్పుడావిడ ఇక్కడకు గాని వచ్చిందా తన జీవితం అధః పతనం ఖాయం. ఏ నూతి లోనో దూకాల్సి వుంటుంది.
"ఒకవేళ వచ్చినా ఇప్పుడిపుడే రాదండి.
"పోనీలే పీడా విరగడయింది అనిపించింది రాధమ్మకు.
చలపతి చేతిలో పళ్ళ సంచితో బండిలో ప్రవేశించగానే రాధ సన్నగా దగ్గుతూ ఓసారి గొంతు సవరించుకుంది.
రాఘవులు అటు వైపుకి ముఖం తిప్పుకుని నవ్వు దాచుకున్నాడు.
చలపతి "ఏమండోయ్ కాస్త ఈ పళ్ళు తీసుకోండి." అన్నాడు సీటులో కూర్చుంటూ.
రాధమ్మ అ సంచి అంది పుచ్చుకుని 'అబ్బాయి గారు మొత్తానికి అఖండులే" అంది.
రాఘవులు కంగారుగా 'అమ్మగారూ అని ఆ పక్కన పెట్టండి. అంటూ మాటలు మార్చాలని చూశాడు.
చలపతి "ఏం అలా అంటున్నావు?' అన్నాడు.
బండి రాక్షసి కూత వేసి మెల్లగా ముందుకు కదిలింది.
14
విశాఖపట్నం ఆస్పత్రిలో డాక్టర్లు ఆమెను పరీక్ష చెయ్యటానికి ఓ వారం రోజులు పైగానే అక్కడ ఉండాలన్నారు. రాధను ఆస్పత్రిలోనే స్పెషల్ వార్డు లో చేర్పించారు.
రాఘవులు ఆస్పత్రి దగ్గరలోనే మేడ మీద ఓ రూమ్ చూశాడు. చలపతి తాను వుండటానికి. రూం విశాలంగా ఉంది. అక్కడ్నించి ఎదురుగ్గా ఆస్పత్రి దూరంగా సముద్రం కనిపిస్తూనే ఉంటాయి.
"పక్కగదిలో ఎవరో ఇంకొకరు దంపతులు కాబోలు వున్నారు." అన్నాడు రాఘవులు.
పొద్దున్నే చలపతి ముందు బాల్కనీ లోకి వచ్చి ముఖం కడుక్కుంటున్నాడు - రాఘవులు కాఫీ తీసుకు రావటానికి కిందకు వెళ్ళాడు అప్పుడే.
పక్క రూములోంచి పల్చటి కొలమొహం వ్యక్తీ ఇవతలకు వచ్చి "మీరు ఈ రూములోకి నిన్ననే వచ్చారా?' అంటూ చలపతిని పలకరించాడు. అతని ముఖం చూస్తె చలపతికి అతనికి నమస్కరించాలని అనిపించి నమస్కారం చేసి "అవునండి . మా వాళ్ళకి టి.బి ఇక్కడ పరీక్ష చేయిద్దామని తీసుకు వచ్చాను. వారం రోజులు ఇక్కడే ఉండాలన్నారు." అన్నాడా వ్యక్తీ.
"ఇదే మొదటి సారా రావటం ?" అన్నాడు.
చలపతి 'అవునండి" అన్నాడు.
"నేను తరచూ ఇక్కడకు వస్తూనే ఉంటానండి. అదే జబ్బు" అన్నారాయన.
అతని ముఖం చూస్తె చాలా చదువుకున్న మనిషిలా వున్నాడు. పల్చటి మల్లుపంచ. మల్లు లాల్చీ వేసుకున్నాడు. మెళ్ళో బంగారు గొలుసు ఉంది. బాగా ఉన్నవాళ్ళు కాబోలు.....
"నా పేరు రాజారాం అండి."
చలపతి తన పేరుచేప్పాడు.....
రాజారాం చాలా సానుభూతి కనబర్చాడు. "పాపం ఇంత చిన్న వయస్సులో ఎంత కష్టం? ఇంత దూరం ఓపిగ్గా తీసుకొచ్చారు మీరు" అంటూ చలపతి ని అభినందించాడు. అక్కడికి తానూ చాలా పెద్దవాడయినట్టు అయన మాట్లాడుతుంటే చలపతికి నవ్వు వచ్చింది. అయన వయస్సు కూడా ముప్పై య్యేళ్ళకు మించదు. అతని భార్య కాబోలు లోపల వంట చేస్తుంది. ఆమెకు రాధ వయస్సు ఉంటుంది కొందరు వయస్సు కి మించి మాట్లాడతారు. అతగాడు తన కంటే చిన్నవాడే.
ఈ కష్టాలతో మనస్సు విరక్తి చేసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు.
ఇప్పుడు ఈ జబ్బుకు చాలా మంచి మందులు వచ్చాయటండి ." అన్నాడు చలపతి.
"అనే అంటున్నారు? అదే ధైర్యం. నేనూ చాలా కాలం మనిషి గొప్పతనం మీద నమ్మకంతో వాదించాను గానండి చూడగా అ పుటకే అంత ఉన్నతమైనది కూడా." అన్నాడు రాజారాం.
అతని ధోరణి చలపతికి అర్ధం కాలేదు.
రాఘవులు ఫ్లాస్కులో కాఫీ తెచ్చాడు.
"మీరు కాఫీ కింద నుంచి తెప్పించకండి. ఈ వారం రోజులు సుగుణ మన నలుగురికీ కూడా కాఫీ కాస్తుంది." అన్నాడు రాజారాం చలపతి అందించిన కప్పు అందుకుంటూను.
రాజారాం ముఖంలో జరిగేదేదో జరుగుతుంది అనే నిర్లిప్తత. నిర్లక్ష్యంగా కనిపించాయ్.
చలపతి "ఎందుకండి ఆమెకు శ్రమపాపం" అంటూ వారిస్తే రాజారాం అలా వీల్లేదని గట్టిగా పట్టు బట్టాడు.
ఇంతలో అతని భార్య చేతులు తుడుచుకుంటూ ఇవతలికి వచ్చింది. ఆమె ఈ కష్టాలకు అలవాటు పడి రాటు దేలిన మనిషిలా కనిపిస్తుంది. ముఖం మీద చిరునవ్వుతో ఆమె వచ్చింది. ఆమె ముఖం చూస్తేనే అన్ని రోగాలు తగ్గిపోతాయి . అనిపించింది చలపతికి.
రాజారాం భార్యని పరిచయం చేశాడు. "చలపతి గారి భార్యకు ఇదే జబ్బట. పాపం ఇంత చిన్న వయసులో ఎంత కష్టమో అంటూ.
"మీరు మటుకు మహా పెద్దవారా ఏవిటి?" అందామె.
చలపతి కొంచెం బిగ్గరగా నవ్వేశాడు.
ఆమె చనువుగా "మావారు అంతేనండి. ఇలాగే మాట్లాడుతారు. నిండా ముప్పయి సంవత్సరాలు లేవండి. అక్కడికి తానేదో ముసలి వారయినట్టు పెద్దవారిలా మాట్లాడుతుంటారు. ఇంతా చేస్తే ఈయనకి ముప్పయ్యేళ్ళు కూడా లేవు" అందామె.
అయన మా ఆవిడ చెప్పింది కొంతవరకు సత్యమేనండి. "నా కంటికి అలా కన్పిస్తారు. క్షమించాలి ఇలా అంటున్నందుకు. అది అహంకారం అనుకునేరు." అన్నాడు.
"వేదాంత పుస్తకాలు చదివి చదివి ఇలా మాట్లాడుతుంటారండి?" అందామె.
"ఎంతో గొప్ప మనస్సు ఉన్నవాళ్ళ ఎదుట వాళ్ళని అలా ప్రేమతో అభిమానంతో చూస్తారు. అలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు తమకంటే చిన్న వాళ్ళుగాను వాళ్ళ కష్టాలు తమ కష్టాల కంటే పెద్దవి గానూ భావిస్తుంటారు." అన్నాడు చలపతి.
"మీరు అనవసరంగా నన్ను పొగుడుతున్నారు."
రాజారాం తన బంట్రోతు చేత రెండు కుర్చీలు తెచ్చి వరండాలో వేయించాడు.
చలపతి ఉన్నట్టుండి ఓ విచిత్రమైన ప్రశ్న వేశాడు. "మీకు బెజవాడ లో బంధువులు ఎవరైనా ఉన్నారా?' అని.
అ ప్రశ్నలో ఏముందో కాని రాజారాం ముఖం ముడుచుకు పోయింది. అతను షాకు తిన్నట్టుగా కుర్చీలో ఓసారి సర్దుకుని "ఏం అలా అడుగుతున్నారు?' అన్నాడు.
"అచ్చం మీ పోలిక గలవారే ఒకరు ఉన్నారు లెండి అక్కడ. మీకూ వారికీ ఏమీ తేడా లేదు. ఒక్కటే పోలిక."
రాజారాం కొంచెం కంగారు పడ్డట్టు కనిపించాడు. "ఎవరండి వారు?" అన్నాడు.
"ఓ ఆడమనిషి లెండి. కాస్త ఆస్తి ఉంది. వడ్డీ వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది."
రాఘవులు అప్రస్తుత ప్రస్తావనకు లోపల్లోపలే విసుక్కుంటున్నాడు. "చలపతయ్య గారు మాటల్లో యిట్టె దొరికిపోతారు అని లిల్లమ్మ ఓ సారి అంది. ఈయన బాగా ఉన్న కుటుంబం మనిషి ఆవిడ చెడిపోయిన దిక్కులేని మనిషి. ఈయన్ని పట్టుకుని ఆవిడ మీకు బంధువులా అని అడుగుతారు ఈ చలపతయ్య గారికి మతి వుందా అసలు" అనిపించింది రాఘవులికి.
రాజారాం కాసేపు ఆలోచిస్తున్నట్టుగా కనిపించాడు. బంట్రోతు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. రాజారాం దాటవేస్తూ "మనిషిని పోలిన మనుష్యులుంటారు. దానికే ముంది లెండి" అన్నాడు.
చలపతికి అదీ సత్యమే అనిపించింది.
రాజారాం హాస్పిటల్ కిటికీల వైపు చూస్తూ నిట్టుర్పు విడిచి "ఎంతో పాపం చేసుకుంటేనే ఇలాంటి చోటుకి వస్తారు నరకం అంటూ ఏదైనా ఉంటె ఇదే నంటాను.' అంటున్నాడు.
అతని భార్య లోపలికి వెళ్ళి పని చూసుకుంటుంది.
చలపతి "ఇంకా మెల్లగా అంటారేమిటి?' అన్నాడు.
"నేను ఎమ్మే చదివాను కాలేజీ లో లెక్చరర్ గా కొద్ది కాలం పనిచేశాను. ఇంతలో ఈ జబ్బు ముంచుకు వచ్చింది. డాక్టర్లు ఉద్యోగం పనికి రాదన్నారు పూర్తీ విశ్రాంతి అవసరం అన్నారు. మానేశాను ఏం చేస్తాను. ఇంట్లో కూర్చుంటే తోచదు. చదివిన పుస్తకాలే చదివి చదివి అవి కంఠతా వచ్చేశాయి గాని ఈ జబ్బు మాత్రం పోలేదు. కాస్త జ్వరం ఎక్కువగా వస్తే డాక్టర్లు ఆ చదువూ పనికి రాదు అంటున్నారు."
రాజారాం తన చదువు గురించి ప్రస్తావిస్తుంటే చలపతికి భయంగానూ, బెరుకుగానూ ఉండి మధ్య మధ్య రాఘవులి వైపు చూస్తున్నాడు. రాఘవులు ముఖం చాటంత చేసుకుని నవ్వుకుంటున్నాడు. చలపతి ఇది గమనించక పోలేదు.
'అమ్మగారికి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చావా?' అన్నాడు చలపతి.
"ఆహా ఇచ్చానండి.' అన్నాడు రాఘవులు.
"అయితే ఓ గంటలో వస్తానని చెప్పు. కంగారు పడుతుంది." అంటూ అతడ్ని అక్కడ్నించి పంపించేశాడు.
"ఇంత అనారోగ్యం వచ్చినా మానసికంగా కృంగి పోలేదంటే ఆ పుస్తకాలే కారణం అనిపిస్తుంది. ఆవి చదువుతుంటే ఎంత టైమూ ఎలా గడుస్తున్నది తెలియదు."
"కాదండి మరి."
"మీరేమైనా పుస్తకాలు చదువుతారా కావాలంటే ఈ వారం రోజులు కాలక్షేపానికి తీసుకోండి. తెలుగు పుస్తకాలు వున్నాయి ఇంగ్లీషువి కావాలంటే ఇంగ్లీషు పుస్తకాలున్నాయి. ఇస్తాను ఇమ్మంటారా?' అంటూ రాజారాం భార్యని పిల్చాడు.
చలపతి చప్పున వారిస్తూ "ఇప్పుడు ఎందుకు లెండి. తర్వాత నేనే అడుగుతాను." అంటూ అప్పటికి అ ప్రమాదం నుంచి రక్షించుకున్నాడు.
"అసలు మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా?" అన్నాడు రాజారాం వదలకుండా.
"ఏదో కొద్దిగా. ఎలాగైనా మీకున్నంత శ్రద్ధ లేదు."
"బహుశా మీకు నాకున్నంత విశ్రాంతి లేక అనుకుంటాను."
"రక్షించావు అని మనస్సులో అనుకుని "మరేనండి నాకు తెల్లవారి లేస్తే లక్ష పనులు, ఇంట్లో ఈ జబ్బు మనిషి. నాకు ఊపిరి పీల్చుకుందుకు కూడా వ్యవధి ఉండదు.' అన్నాడు చలపతి.
"నాకు నవలలు, కధలు ఎంత అభిమానమో తాత్విక రచనలన్నా అంత అభిమానం మా యింటి దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. ఓసారి మీరు మా ఊరు రండి చూద్దురు గాని."
చలపతికి విసుగ్గా ఉంది. అతను ఎంతసేపు మాట్లాడినా పుస్తకాల గురించి తప్పించి ఇంకో మాటా మాట్లాడటం లేదు. తనకి ఏదైతే ప్రాణ సంకటమో అదే ప్రస్తావన తెప్పించి అతను మారు మాట్లాడటం లేదు.
"అలాగే తప్పక వస్తాను." అన్నాడు చలపతి.
ఇంతలో రాఘవులు వచ్చి "అమ్మగారు రమ్మంటున్నారండి" అన్నాడు.
చలపతి "వస్తానండి' అంటూ అప్పటికి తప్పుకున్నాడు! అతను నేరుగా హాస్పిటల్ కి వెళ్ళాడు.
రాఘవులు రాజారాం బంట్రోతు గవరయ్యతో మెట్ల మీద కూర్చుని బాతాఖానీ లో పడ్డాడు.
"మీ అయ్యగారు బాగా ఉన్నవారులా గున్నారే." అన్నాడు రాఘవులు.
"కావాల్సినంత ఉంది. తినేవాళ్ళు ఉండద్దూ. ఈ ఒక్కతే సంతానం రెండేళ్ళయింది పెళ్ళయి. ఈ జబ్బు వచ్చి పడింది. అతను గొంతు తగ్గించి "చేసిన పాపం ఊ కేపోదయ్యా" అన్నాడు.
రాఘవులు "పాపమా? ఏం చేశాడాయన?' అన్నాడు.
"అయితే ఈయనేవీ చెయ్యలేదులే పాపం. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈయన చాలా మంచోరు జాలి, దయ , ధర్మం అన్నీ మంచి గుణాలున్నవారు ఈయన్ తండ్రి చిన్నప్పుడు పట్నంలో చదువుకుంటూ ఓ అమ్మాయిని మోసం చేశారట. ఆమెను అర్ధాంతరంగా ఒదిలేసి పారిపోయారని ఆమె కడుపుతో వుంటే ఆమె మానాన ఒదిలేసి వచ్చాడని అనుకుంటారు. ఇలాంటి పనులు చేసేవాళ్ళకి ఇలాంటి కష్టాలే వస్తాయి. చేసిన పాపం ఊరికే పోదయ్యా" అన్నాడు గవరయ్య.
