Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 21


    విశ్వనాథం తలుపుతీసి వెంకన్ననుచూసి ఆశ్చర్యపడి, "ఇప్పుడేగా...." అని ఏదో అనబోతూండగా "కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగడం మర్చిపోయాను. అన్యధాభావించకూడదు?" అన్నాడు వెంకన్న.
    "అయ్యో-దానిదేముంది? రంగారావు నా ప్రాణమిత్రుడు. అతన్ని హత్యచేసినవాణ్ణి పట్టుకోవడానికి నేను చేయగలిగిందల్లా మీరడిగిన ప్రశ్నలకు జవాబుచెప్పడమే గదా?" అన్నాడు విశ్వనాధం.
    మళ్ళీ ముగ్గురూ డ్రాయింగ్ రూంలోకి వెళ్ళారు-"ఈమధ్య ఎప్పుడయినా రంగారావు దిగులుగా కనబడ్డం గానీ బెంగతో అదోలా ఉండడంగానీ మీరు గమనించారా?" అన్నాడు వెంకన్న-"ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బాగా ఆలోచించి దీనికి జవాబివ్వండి-"
    విశ్వనాథం ఆలోచనలో పడ్డాడు.
    నిజానికి వెంకన్నకు విశ్వనాథ మివ్వబోయే జవాబుపై ఆసక్తిలేదు. అందువల్ల అతను గదిని శ్రద్దగా పరిశీలించ సాగాడు.
    గదిలో టేబుల్ మీద ఓ జంట ఫోటో ఫ్రేం వుంది. ఒకపక్క విశ్వనాథం, మరోపక్క ఓ అంధమయిన యువతి వున్నారు. సర్వర్ గుర్తుపట్టిన వ్యక్తి ఆమేనని వెంకన్న ఊహించాడు.
    అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఆ ముఖం కలిగిన మనిషి హృదయం ఒక హత్యకు ప్రోత్సహించగలదా? అని ఆలోచనలో పడ్డాడు వెంకన్న.
    "నాకు గుర్తున్నంతవరకూ రంగారావులో ప్రత్యేక మైన మార్పేదీ గమనించలేదు నేను" అన్నాడు విశ్వనాధం కాసేపు ఆలోచించి.
    "ఈ సమాధానం చెప్పడానికి చాలా కష్టపడ్డావులే" అని మనసులో అనుకోని-"ఆ ఫోటో ఫ్రేంలో వున్న అమ్మాయెవరు?" అడిగాడు వెంకన్న.
    "ఏం-అలా అడుగుతున్నారు. ఆమె నా భార్య!" అన్నాడు విశ్వనాధం ఆశ్చర్యంగా.
    "మీరు ఒంటరిగాన్నని చెప్పినట్లు గుర్తు" అన్నాడు వెంకన్న.
    "భార్య పుట్టింట్లో వుంటే ఒంటరిగాణ్ణి కాక ఏమవుతాను?" అని నవ్వాడు విశ్వనాథం.
    "అలాగా-ఇందాకా నేనింకోలా అర్ధంచేసుకున్నా లెండి-మీ ఆవిడ పురిటికెళ్ళిందా?"
    "పురుడూ లేదు ఏం లేదు. తల్లిదండ్రుల కొక్కర్తే కూతురు. గారంగా పెరిగింది. వారం వారం అమ్మా నాన్నల్ని చూడాలంటుంది. ఏదో నెలకీ రెండు నెల్లకీ ఓసారి తప్పనిసరయి పంపిస్తూంటాను...."
    "పుట్టిల్లెక్కడేమిటి?"
    "రాజమండ్రియే లెండి. ఇలావెళ్ళి అలా వచ్చేస్తుంటుంది. ఈసారి ఏమయిందో కాస్త ఆలస్యమయింది. అయినా నాకూ పెద్దబాధలేదు. ఎక్కువగా బయట తిరగటం నా కలవాటు" అన్నాడు విశ్వనాథం.
    "మీ అత్తారిల్లు రాజమండ్రీయా - నా తోడల్లుడిది కూడా రాజమండ్రియే మీ వాళ్ళిల్లు దానవాయిపేటలోగానీ లేదుకదా" అన్నాడు వెంకన్న.
    విశ్వనాథం తనభార్య పుట్టిల్లు అడ్రసుచెప్పి "ఏమిటీ వివరాలన్నీ అడుగుతున్నారు?" అన్నాడు.
    వెంకన్న నవ్వి-"సంభాషణ ఒకోసారి మనకు తెలీకుండానే తప్పుదార్లు తొక్కుతుంది. ఒకసారి నేను పంచాంగం కోసం పక్కింటికివెళ్ళి బ్రిడ్జిగురించి ఓ గంట సేపు చర్చించి పంచాంగం తేకుండానే వెనక్కు వచ్చేశాను. రంగారావు హత్యకేసు ముందుకెళ్ళేలా లేదు. కనీసం మీవంటి వాడితో పరిచయమైంది." అంటూలేచాడు.
    డిటెక్టివ్ మాటలు విశ్వనాధానికి అర్ధంకాలేదు.
    
                                                              6

    "నా పేరు వనజ. విశ్వనతం గారి భార్యను-" అంది ఆమె.
    ఫోటోకు మించిన అందం కలిగిన ఆమెపైనుండి వెంకన్న చూపులు వెంటనే మరల్చుకోలేక పోయాడు. "మీ పరిచయం నా అదృష్టం. కానీ నా పరిచయం మీకు అదృష్టమని నాకు తోచడంలేదు...." అన్నాడు వెంకన్న.
    "ఎవరు మీరు?" అంది వనజ కంగారుగా.
    "నా పేరు వెంకన్న. నేనొక డిటెక్టివ్ ను" అన్నాడు వెంకన్న.
    "నాతో మీకేం పని?" భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనబడింది.
    "ద్వారకా లాడ్జిలో రంగారావనే అతను హత్యచేయబడ్డాడు...." అని ఆగాడు వెంకన్న.
    "అయితే....?" అంది వనజ.
    "ఆ రంగారావు మీ భర్తకు ఆప్తమిత్రుడు."
    "అయ్యో-ఆ రంగారావుగారు చచ్చిపొయ్యారా?" అంది వనజ ఆశ్చర్యంగా.
    "నేను మీ ఇంటికొచ్చే సమయానికి ఇంట్లో మీరు ఒక్కరే వుండడం నా అదృష్టం. కాస్త ఫ్రీగా మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. రంగారావు గారు చచ్చిపోయారన్న విషయం మీకు తెలుసు. అసలు రంగారావును చంపింది మీరేనని పోలీసులు అభిప్రాయపడుతోన్నారు" అన్నాడు వెంకన్న తాపీగా.
    "ఆయన్ను నే నేందుకు చంపుతాను?" అందామె వణికిపోతూ.
    "ఎందుకు చంపుతారో నాకూ తెలియదు. శిక్షించడానికి ఎన్నో ఇతర సాధనాలుండగా మనిషి మనిషిని ఎందుకు చంపుతాడన్నది నాకు ఆశ్చర్యం కలిగించే విషయం...." అన్నాడు వెంకన్న.
    వనజ శరీరంలో వణుకు ప్రారంభమైంది. "మీ మాటలు నాకు అర్ధంకావడంలేదు. మీరేం చెప్పదల్చుకున్నదీ వివరంగా చెప్పండి" అంది.
    "మీరూ, రంగారావూ కలిసి ద్వారాకాలాడ్జిలో రూం నెంబరు పదుహేడులో దిగారు. రాత్రి తొమ్మిది గంటలకు ఇద్దరూ తలుపులేసుకున్నారు. ఓ అర్ధరాత్రివేళ రంగారావు చంపబడ్డాడు. గదిలోంచి మీరు మాయమయ్యారు. వీటన్నింటికీ బలమైన సాక్ష్యాలున్నాయి. మీరు కాదనలేరు. రంగారావు హత్యగురించి మీకు తెలియదనటానికి లేదు. గదిలోని మీ వేలిముద్రలుకూడా పోలీసులు తీసుకున్నారు."
    "నా గురించి పోలీసులెలా తెలుసుకోగలిగారు?"  అంది వనజ ఆశ్చర్యంగా.
    "మీ గురించి ఇంకా పోలీసులకు తెలియదు. నేనుమాత్రమే తెలుకో గలిగాను" అన్నాడు వెంకన్న.
    వనజ నిట్టూర్చి-"వెంకన్న గారూ! దయతో మీరు నన్ను అర్ధంచేసుకోండి. మీకు అంతా నిజం చెప్పేస్తాను. నా పేరు పోలీసుల వద్దకు చేరకుండా చూడండి" అంది.
    "నేరస్థుల్ని నేను కాపాడలేను" అన్నాడు వెంకన్న.
    "నేను చెప్పింది నేరమో కాదో చెప్పేముందు నా కధ వినండి" అంది వనజ.
    "చెప్పండి!" అన్నాడు వెంకన్న.
    
                               *    *    *

    విశ్వనాథం, వనజ, రంగారావు, అతనిభార్య సరిత నలుగురూ విశ్వనాధం ఇంట్లో భోజనాలు చేశారు. భోజనాలయ్యేక కాసేపు కబుర్లు జరిగాయి.
    "వంటలు అద్భుతం" అన్నాడు రంగారావు.
    "పొరుగింటి పుల్లకూర-అంతేలెండి!" ఆనందు విశ్వనాధం.
    "అదేంకాదు-మీ ఆవిడ చేయి మహాత్మ్యం. ఇక్కడ భోంచేశాక మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలవాలంటే భయంగా వుంది" అంది సరిత.
    "మా ఆవిడ ఇంతవరకూ ఎవరివంటనూ మెచ్చుకోగా చూడలేదు. యూగాటే రేర్ సర్టిఫికేట్" అన్నాడు రంగారావు.
    "మీ ఇంటికి భోజనానికి పిలవడం యెగేయాలని చూస్తున్నారేమో - అదేం కుదరదు" అంది వనజ.
    అంతా నవ్వేశారు. రంగారావు నెమ్మదిగా- "ఋణ ముంచుకోవడం నా కిష్టముండదు. అందుకే కూడా ఓ అద్భుతం తెచ్చాను" అన్నాడు.
    "ఏమిటది?" అంది కుతూహలంగా సరిత. తనకు తెలియకుండా తన భర్త తెచ్చిన ఆ అద్భుతం ఏమిటో ఆమెకు తెలుసుకోవాలనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS