Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 20


    "కాస్త రంగారావు భార్యను వర్ణించగలరా?" అన్నాడు వెంకన్న.
    అంత దుఃఖంలోనూ గురుమూర్తి సిగ్గుపడ్డాడు. రంగారావు భార్య పరాయి ఆడదేకాక తనకు యజమానురాలు కూడా! అయినప్పటికీ ఇన్స్ పెక్టర్ బలవంతంమీద గురుమూర్తి ఆమెను వర్ణించాడు. ఆ వర్ణన ద్వారకా లాడ్జిలోని రిసెప్షనిస్టు, బేరర్ చెప్పిందానికి సరిపోయింది.
    "అయితే రంగారావు భార్యతో హోటల్లో దిగాడన్నది నిజం!" అన్నాడు జగదీష్.
    "అదేంకాదు హోటల్లో దిగిన యువతిలాగే రంగారావు భార్యకూడా సౌందర్యవతి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వర్ణన ఉపయోగపడుతుది. ఇద్దరూ ఒకరు కావచ్చు, వేరు కావచ్చు" అన్నాడు వెంకన్న.
    "వెళ్ళి చూస్తే సరిపోతుందిగా" అన్నాడు జగదీష్.

                                       4

    కళ్ళు చెదిరే అందం రంగారావు భార్యది. మూర్తీభవించిన శోక దేవతలా వుండి కూడా ఆమె ఆకర్షణీయంగా వుంది. అందరి అందాన్నీ శోకదేవత హరించలేదని ఆమెను చూసి తెలుసుకోవచ్చు.
    "మీరే పరిస్థితిలో వున్నారో తెలిసికూడా మిమ్మల్ని కొన్ని యిబ్బందికరమైన ప్రశ్నలడగవలసి వచ్చినందుకు నాకు విచారంగా వుంది. అన్యధా భావించరని తలుస్తాను" అన్నాడు జగదీష్.
    "మీ బాధ్యత మీది..." అందామె రుద్ధకంఠంతో. రుద్ధకంఠం కూడా ఎంతో తీయగా వుండడానికి కారణం ఆడదాన్ని ఆడదాన్నిగా చూసే మగబుద్ధి కాక, ఒక విచిత్రమైన విషయమని వెంకన్న అనుకున్నాడు.
    జగదీష్ ప్రశ్నలు వేస్తూంటే వెంకన్న అట్టే మాట్లాడడు. ఎలా స్ఫురిస్తాయో కానీ జగదీష్ ఒక్క ప్రశ్న కూడా మిస్సవడు. తన శక్తి వృథా చేసుకోవడమెందుకని వెంకన్న ఉత్తర ప్రత్యుత్తరాలు వింటూంటాడు.
    రంగారావు చాలా మంచివాడు. భార్య అతని ఆరోప్రాణం. పరస్త్రీని కన్నెత్తి కూడా చూడడతను. సరదాకు భార్యతో కూడా పరస్త్రీ గురించి మాట్లాడడు.
    ఈమె చెప్పిన మాటలు నిజమైతే రంగారావు చాలా జాగ్రత్తపరుడై వుండాలని వెంకన్న అనుకున్నాడు.
    "మీ ఆయన చనిపోయింది హోటల్ గదిలో. ఆ గదిలో ఆయనతోపాటు రాత్రి ఒక స్త్రీ కూడా వుంది. ఆ స్త్రీ తన భార్య అని ఆయన చెప్పాడు. అది నిజమవునో కాదో అని తెలుసుకోవాలని వచ్చాం" అన్నాడు జగదీష్.
    రంగారావు భార్య ముఖం వెలవెలబోయింది. "ఆయన ఇంటిదగ్గర్నించి ఒంటరిగానే బయలుదేరారు. తను హైదరాబాదు వెడుతున్నానని నాకు చెప్పారు...."
    అంటే రంగారావు భార్యకు అబద్దం చెప్పాడన్న మాట!
    "ఎంతో మంచివాడైన మీభర్త మీకు హైదరాబాదు అని అబద్దం చెప్పి - మావూరు వచ్చి ఓ స్త్రీతో హోటల్ గదిలో కొన్ని గంటలు గడిపి మరణించాడు. ఈ సంఘటనపై మీ అభిప్రాయం" అన్నాడు జగదీష్.
    "ఏ పరిస్థితుల్లోనూ ఆయన్ననుమానించలేను. నన్ను బాధపెట్టే ఏదో వ్యాపార రహస్యం వుండి వుండాలి. ఆ స్త్రీతో ఆయన కొన్ని గంటలు గడిపారంటే-ఏదో విషయాలు మాట్లాడడానికే అయుండాలి" అందామె.
    తమకూడా వచ్చిన బేరర్, రిసెప్షనిస్టుల ముఖకవళికలను, కనుసైగలనుబట్టి రంగారావుతో బసచేసిన స్త్రీ అతడి భార్యకాదని ఇన్ స్పెక్టరుకూ, వెంకన్నకూ అర్ధమై పోయింది. అయితే ఆ స్త్రీని గుర్తుపట్టడం కోసం బేరర్, రిసెప్షనిస్టులు వచ్చినట్లు రంగారావు భార్యకు తెలియనివ్వరాదని వెంకన్న జగదీష్ కు సలహా యిచ్చాడు.
    ఆ స్త్రీ రంగారావు భార్య కాకపోయినప్పటికీ ఆమె కాకినాడలోనే వుంటున్నదని వెంకన్న అనుమానించాడు. ఎందుకంటే రంగారావు తమ ఊరు రైలు ప్రయాణంచేసి చేరాడు. అతను ఫస్టుక్లాసులో ప్రయాణం చేశాడు. ఫస్టుక్లాసులో ఆ రోజు టిక్కెట్లు రంగారావు, శ్రీమతి రంగారావు పేర్లపై బుక్ చేయబడ్డాయి. భార్యను మోసగించి రంగారావు కాకినాడలోని ఓ యువతితో సంపర్కం పెట్టుకున్నాడు. ఆమెతో కలసి బయల్దేరాడు. బహుశా సుఖానుభవాల కోసమే అయుంటుంది.
    రంగారావు విషయం చాలా తమాషాగా వుంది. అతను ఏం చెయ్యబోయాడో, ఎందుకు చచ్చిపోయాడో అర్ధం కావడంలేదు.
    అక్కణ్ణించి బయటకు వచ్చేక "మిస్టర్ జగదీష్! మీరు తిరిగి వెళ్ళిపోండి. నేను ఊళ్ళో కొద్దిరోజులుండి ఆ హోటల్లో రంగారావుతో బసచేసిన యువతి గురించి ఆరా తీస్తాను" అన్నాడు.
    "గడ్డిమేటులో సూదికోసం వెదుకుతున్నారేమో అన్నాడు జగదీష్.
    "అయితే ఫరవాలేదు. కొండను తవ్వి ఎలుకను పట్టడం అవుతుందేమోనని భయపడుతున్నాను" అన్నాడు వెంకన్న.
    జగదీష్ నవ్వి-"మరి సెలవు తీసుకుంటాను" అన్నాడు.
    వెంకన్న హోటల్ బేరర్ తో మాత్రం-నాది రాచపుట్టుక కాదుకానీ అప్పుడప్పుడు తిరగడానిక్కూడా తోడు కావాలనిపిస్తుంది. నువ్వు నాతో యిక్కడుండిపో. హోటల్లో కిట్టేదానికి రెట్టింపు కిడుతుంది. అయినా నేను మీ సూరిబాబుగారి తరపునెగా పనిచేస్తున్నది అన్నాడు.
    "అయ్యబాబోయ్-మీరు చెప్పినట్లు వినమన్నారండి ఆ బాబు. డబ్బులుకూడా అడగొద్దన్నారు" అన్నాడు బేరర్ కంగారుగా.
    "అడగొద్దన్నారు గానీ యిస్తే పుచ్చుకోవద్దనలేదు కదా!" అని ఓ అయిదు రూపాయలనోటు బేరర్ అందించి-"ఈ వెంకన్న ఎవ్వరికీ ఉత్తినే డబ్బులు యివ్వడు. ఆ విషయం గుర్తుంచుకుంటే నీకు యింకా డబ్బులొస్తాయి" అన్నాడు.
    
                                      5

    రంగారావు గురించి వెంకన్న చాలా వాకబులు చేశాడు. రంగారావుకు స్నేహితులేగానీ స్నేహితురాళ్ళు యెవ్వరూలేరు. రంగారావు స్నేహితుల లిస్టు మరీ చిన్న కాదు.
    వెంకన్న తన వాకబులోకి వచ్చిన ప్రతి యింటికీ వెళ్ళాడు. ఎవరి వద్దనూ కూడా రంగారావు గురించి పనికొచ్చే సమాచారం అతనికి దొరకలేదు. అయినా ఓపికగా అతను ఒకోవ్యక్తి దగ్గరికీ వెడుతూంటే బేరర్-"కథల్లో చదివి డిటెక్షన్ అంటే సరదాగా ఉంటుందని తప్పు అభిప్రాయంలో వుండేవాణ్ణి. ఇంత బోర్ వ్యవహారం ఎక్కడా వుండదు" అన్నాడు.
    రంగారావుకు బాగా దగ్గరివాడుగా భావించబడే విశ్వనాథం వాళ్ళకు రెండ్రోజుల వరకూ దొరకలేదు. వాళ్ళెప్పుడువెళ్ళినా అతడి ఇల్లు తాళంవేసి వుంటోంది.
    మూడోరోజున ఆ ఇంటి తలుపులు తాళంతీసే వుండటంతో వెంకన్న, బేరర్ కూడా తేలిగ్గా నిట్టూర్చారు.
    విశ్వనాథం ఇంట్లోనే వున్నాడు.
    "మీ కోసం రెండ్రోజుల్నించి తిరుగుతున్నాం-" అన్నాడు వెంకన్న తనను పరిచయం చేసుకున్నాక.
    "ఒంటరి గాణ్ణి-అలా తిరుగుతూంటాను" అన్నాడు విశ్వనాధం.
    వెంకన్న అడిగిన ప్రశ్నలకు అతను చాలా ఓపిగా సమాధానం చెప్పాడు. రంగారావు అంటే అతనికి చాలా గౌరవ బావముంది. అతన్నించికూడా వెంకన్నకు పనికొచ్చే సమాచారమేదీ దొరకలేదు.
    ఇద్దరూ బయటకు వచ్చేక బేరర్ కంగారుగా, "ఆయనెదురుగా చెప్పడం బాగుండదని ఊరుకున్నాను. అ రోజు హోటల్ కు వచ్చిన అమ్మాయి ఫోటో మనం కూర్చున్న గదిలో ఫోటో ఫ్రేంలో వుంది" అన్నాడు.
    వెంకన్న వులిక్కిపడి-"ఏమన్నావ్?" అన్నాడు. బేరర్ చెప్పబోతుంటే అతన్ని వారించి "మళ్ళీ చెప్పనక్కరలేదులే-ఆశ్చర్యం పట్టలేక అలా అడిగాను కానీ నువ్వు చెప్పింది నా బుర్రలోకి ఎక్కనే ఎక్కింది" అని చటుక్కున వెనక్కు తిరిగి మళ్ళీ విశ్వనాథం ఇంటితలుపు తట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS