Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 21

 

                                   21

    మరుసటిరోజు సాయంత్రం అపర రతీదేవిలా ముస్తాబై ప్రియుని కోసం నిరీక్షిస్తోంది ప్రేమ. అంతకు క్రితమే తల్లిదండ్రులు శ్రీనివాస రావింటికి వెళ్ళి పోయారు.
    ప్రేమకు ఏమి చేయటానికి తోచలేదు. కట్టిన చీర నచ్చలేదు. కట్టని చీర మడతల్లో వున్నది అందంగా అగుపించింది జడవేసుకుంటే అందంగా లేదు. వేసుకొని ముడిమీదికి మనసు మళ్ళింది. ఏది చేయబోయినా చేతులుతడబడుతున్నాయి. మనసులో మల్లెలమాలలు గ్రుచ్చుకొన్నాయి. ఆ మాలల్ని అతనికంఠంలో వేసినట్లు ఊహిస్తున్న . ఆ ఊహతో చేతిలోని మల్లెలమాల క్షణికంలా కనబడింది. అది రేపటికి వాడి నశించి' పోతుందిగానీ తన ప్రేమమాల శాశ్వతంగా వుండిపోదూ, ఒక్కొక్కపుష్పాన్ని బంధించే ఆ ప్రేమ. సౌరభంతో తన పతి కలకాలం పూజించదూ!

                                       
    ప్రేమకు ఈ పూలు పెట్టుకోవాలనిపించలేదు.
    గేటుతీసినచప్పుడైతే దిగ్గునలేచి పరుగెత్తి బైటికెళ్ళింది. ఆ వచ్చే వ్యక్తిని చూచి నిరాశభరిత హృదయంతో వెనుదిరిగింది. "ఆహా ఏమీ ఈ అందచందాలు. ఎంతసేపు తీసుకున్నారండీ ఈ ముస్తాబుకు? ఇంత అందంగా, తయారయ్యావు. ఎవరికోసమో....చెప్పు...ఊ" అంటూ గీత ఆమెను పట్టుకుని ఊపేసింది. ప్రేమ సోఫాలో కూలబడి రెండు మోకాళ్ళ చుట్టు చేతులు పట్టుకుని "ఎవరివే, నీ పరిహాసాలూ?" అంది అమాయకంగా మొహంపెట్టి చిన్న మొట్టికాయవేసింది ప్రేమను.
    "నిరంజన్ వస్తానన్నాడా?"
    ప్రేమ సిగ్గుతోనవ్వి వూరుకుంది.
    "అదీ సంగతి..." ప్రేమముఖాన్ని తనవైపు త్రిప్పుకుంది. "అయామ్ గ్లాడ్ ప్రేమా, మంచి సమయంచూసే వస్తున్నాడు.... ఎప్పుడొస్తాడు?"
    "తెలీదు"
    "వచ్చేదాకా కూచోవా?" చిలిపిగా నవ్వింది గీత.
    ప్రేమ దిగ్గునలేచి గీతచెయ్యి పట్టుకొంది. "పద- తోటలో బెంచి మీద కూచుందాం.... గీతా..." ఇద్దరూ తోటలో బెంచివద్దకు నడిచారు. "నువ్విలా ఆనందంగా వుంటావనే వచ్చాను. నువ్వు జయించావు. ఇప్పుడు మనందరిమీద ఒక భారం వుంది. విజేతలకు పలుకుబడి హెచ్చు సుమా?"
    "ఏమిటో - ఎప్పుడూ సూటిగ మాట్లాడవు"
    "ఆ...అప్పుడే అనుకున్నాను. ఏ వప్పుడే మర్చిపోయావు" ప్రేమకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది. గీతతొడనుతట్టి "ఆ....నేనేం మరచిపోలేదులే...లలిత సంగతికదూ? అసలు వాళ్ళిద్దరూ చూచుకున్నారా?"
    "ఆ"
    "ఎప్పుడు?"
    "నిన్న శంభూను చుట్టానికెళ్ళొచ్చాము. కాస్త అందరం తప్పు కున్నాము. లలితను చూస్తే ఒప్పుకోని మూఢులుంటారా!"
    నరేంద్రను చూస్తే ఒప్పుకోని మూఢులుంటారా!" ప్రేమ ఎదురు ప్రశ్న ని "అమ్మబాబోయ్ అప్పుడే మర్ధిని వెనకేసుకొస్తున్నావు" అంటూ గీత నవ్వింది.
    ఇద్దరు నవ్వుకున్నారు.
    "వచ్చేవారంలో తాంబూలం పుచ్చుకుంటారుకదా? అప్పుడు ఈ సంగతి తేల్చివేయాలి" "ఒకవేళ మీ అమ్మా వాళ్ళంగీకరించరు...మా అమ్మావాళ్ళు మధ్యవర్తిత్వం వహించటానికిష్టపడరు. అప్పుడు...కర్తవ్యమేమిటి?
    గీత గడ్డిపరక తీసుకొని నమలుతూ కూచుంది.
    ఇద్దరు దీర్ఘాలోచనలో మునిగిపోయారు ప్రేమకు ఆగమ్య గోచరంగా వుందిగానీ గీతకు ఒక ఆలోచన తట్టింది.    
    "అలాంటి సందర్భాల్లో- శ్రీ-అంద్ శ్రీమతి నిరంజన్ గార్ల అధ్వర్యాన శ్రీ నరేంద్ర. కుమారి లలితలకు రిజిస్త్రార్ ఆఫీసులో పెళ్లవుతుంది....మరొక విట్నెస్ గా గీతగారుంటారు" "లలిత కిష్టమేనా?"
    "లలితకు నరేంద్ర అంటే ఇష్టమే; ఇతరుల ఇష్టాయిష్టాలనవసరం"
    "ఆ విధంగా జరగటం నీకు అంగీకారమేనా?"
    "ఆ-విధంగా అవివాహితగా తప్పిపోయిన పెళ్ళికి హీరోయిన్ గా వుండటంకంటే ఏదైనా యిష్టమే"
    గేటు చప్పుడు విని ఆవేపుగా చూచారు.        
    నిరంజన్ రావటం చూచిన ప్రేమవదనం అరవిందమే అయింది. గీత చటుక్కునలేచి నుంచుంది ఎదురొచ్చిన నిరంజన్ తో - నిలబడి ఒక్క మాటైనా మాట్లాడకుండా- "హేవ్ ఎ హేపీ టైమ్" అంటూనే చిరునవ్వుతో వెళ్ళిపోయింది.    
    ప్రేమను పరీక్షగా చూస్తూ తృప్తిగా నవ్వాడు నిరంజన్.
    "త్వరగా రమ్మన్నావు. ఎందుకు?"
    ప్రేమ మాట్లాడలేదు. అతి మధురమైన ఈ సమయంలో అతి ముఖ్యమైన విషయం. లలితా - నరేన్ల వివాహ విషయం మాట్లాడవలసిన బాధ్యత తనపై పడింది.
    "సరే- ఓడిపోయాను....గీతవచ్చి వెళ్ళిపోయిందే" అన్నాడు నిరంజన్. ప్రేమ ఆలోచన ఇంకా తెమల్లేదు.
    "సూక్ష్మగ్రాహి.....ఎందుకొచ్చింది! సరేన్ సంగతేనా?" ఆ ప్రశ్న అతడే అడగటంతో తేలికైంది. గీత తాను జరిపిన సంభాషణలను విశదపరచింది. నిరంజన్ లోని చిలిపితనం మాయమైంది. అతనిముఖం గంభీరమైంది. ఆమె చేతిలో ఆడుకుంటూ కొన్నిక్షణాలు పరధ్యానంగా కూర్చుండి పోయాడు.
    "అన్నయ్యవుంటే బావుండేది-" అన్నది ప్రేమ, ఆ నిశ్శబ్ధాన్ని భరించలేక నేనుకూడా అదేమాట అంటాను.....కఠిన సమస్యగా వుండే అతడు ఆలోచిస్తుంటే నుదుటిమీద గీతలుపడ్డాయి. ప్రేమకు తనవ్రేళ్ళతో ఆ నుదుటిమీద మృదువుగా రాయాలనిపించింది.    
    అతనికో ఆలోచన తట్టిన గుర్తుగా గాలిలో చిటికెవేశాడు.
    "ఆ....మన సరళ భర్తవున్నాడుకదా? అతన్ని పిలవాలి. మధ్య వర్తిగా అతనుంటే బావుంటుంది.... అన్నట్లు ప్రేమా- ఆ రోజు నన్ను పిలవటం మర్చిపోతావా!" గ్రుచ్చి గ్రుచ్చి ఆమె వినీల విశాల నయనాల్లోకి లోతుగా చూచాడు.
    ప్రేమ కనుబొమలు ముడివడినై - పెదిమలపై చిరుహాసం కదలుతోంది. ఆ భావప్రకటనా తీరునుచూచి నిరంజన్ ఆమె హస్తాల్ని మెల్లగా నొక్కాడు.
    "అమ్మా వాళ్ళు వచ్చారా?"    
    "ఆ వచ్చారు. మీవాళ్ళు పెళ్ళి పెత్తనం బాగా చేస్తున్నారు"
    "ఏం చేశారు?" గాభరాగా ప్రశ్నించింది.    
    "కట్నం ఎంత కావాలి? ప్రత్యేకమైన ప్రెజెంటేషన్స్ ఏమి కావాలి? అని అడిగాడు నాన్నగారు. ఏమీ వద్దు అన్నారు. బాల ఆశ్చర్య పడ్డారు మీ నాన్నగారు!"
    "ఇంతకు ఏం జరిగిందో చెప్పండి"
    "వాళ్ళింకా ఏదీ తేల్చుకోలేదు-నా హృదయం ఇక్కడుంటే ఇక అక్కడ ఆగలేక వచ్చేశాను.    
    "అబ్బ" అంటూ పెదాలుబిగించి' కనుబొమ లెగరేసిందామె.
    "ప్రేమా-మీకుంది కాబట్టి ప్రతి కోర్కె తీర్చటానికి సంసిద్డులై వున్నారు....కానీ నాకేమీ వద్దు. నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదు ప్రేమ ఏదో అనబోయి సద్దుకుని మౌనం దాల్చింది.
    ఆమెవైపు కొంచెంసేపు నిశ్చలంగా చూచాడు.
    "నీ అనుమానం గ్రహించాను ప్రేమా.....నువ్వు ఒక్క కూతురిని ఎలాగూ నీకు కొంత ఆస్తి వస్తుంది. ఇప్పుడు తీసుకున్నా, నిరాకరించినా ఒకప్పుడైనా నీకు ముడ్తుంది. ఇక కట్నంతో ఏమనవసరం? నీకు నచ్చేది రాకమానదు. అందుకే ఇంత విశాలహృదయం-" అనుకుంటున్నావు కదూ?
    ఉహు-నీవు ఒకవేళ పేదింటి పిల్లవై యుంటే కూడా మా ఆలోచన లీవిధంగానే వుండేవి. నిన్ను నేను హృదయపూర్వకంగా ప్రేమించాను కాబట్టి నేను వెనక్కుపోలేను-కానీ నరేంద్ర విషయంలో అతడి ఆశయం పూర్తిగా నెరవేరగలదు."
    "అదెలా?"
    "గుళ్ళో పెళ్ళి చేసుకుంటారు-లేదా రిజిష్టర్ మేరేజి చేసుకుంటారు
    "గీత కూడా ఈ మాటే అన్నది."
    "ఈ సంబంధంలోని ఉత్క్రుష్టత నెరిగిన వారెవరైనా ఇదే మాట అంటారు.....ప్రేమా ఒక విషయం గ్రహించు. నరేన్ కు అమ్మాయి దొరకనందువల్ల బలవంతంగా పిల్లను పెళ్ళి చేసుకున్నాడన్న అపవాదురాగలదు. అప్రాచ్యులైన ఈ కుటుంబానికి పిల్లనివ్వటానికి సంకోచిస్తుంటే చటుక్కున వేసుకుపోయాడంటారు.....ఎవర్నో తెచ్చి పెంచుకుంటుంటే పెళ్ళిళ్ళు  కావన్న భయంతో వేరే కులం-వేరే శాఖవాళ్ళను కూడా పెళ్ళాడటానికి సిద్ధమయ్యాడంటారు. అంతేగాని ఒక ఉత్క్రుష్ణమైన ఆశయాన్ని నెరవేర్చిసంతుష్టి చెందాలనే ఆశతో ఈ విధంగా చేస్తున్నా రని అనుకోరు. వేదికలపై బల్లగుద్ది చేసే ప్రసంగాలను కార్య రూపంలో చూపిస్తే సహించలేరు. ఆచరిస్తే చూచి సహించలేరు. అదెంత ఆచరణీయమో గ్రహించటానికి నిరాకరిస్తారు, కట్న కానుకల మాట ఎత్తే సరికి తండ్రిమాట జవదాటని విధేయుడైపోతాడు. అంతవరకు తన ఇష్టా యిష్టాలకే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి పెళ్ళిమాట ఎత్తేసరికి తల్లిదండ్రుల ఇష్టాన్ని పాటించే బుద్దిమంతుడైపోతాడు. కట్నం తీసుకోవటం నేరం అని తెలిసినా తీసుకుంటాడు, దొంగచాటుగా బేరమాడ్తాడు. ఇది నూరుపాళ్ళు దొంగతనమని గ్రహించడు.....ప్రస్తుతానికొస్తే-లలితను వాళ్ళెందు కడుగుతున్నారు? కట్నం వద్దుట ఎందుకు? పిల్లవాడిలో ఏం లోపముందో? ఒకే శాఖకాదు. తప్పక పెళ్ళి చేయాలంటున్నారు. కారణమేమైయుంటుంది? ఏరి కోరి ఏమీ లేని పిల్లనెందుకు చేసుకుంటున్నాడు? అలా అయితే పడి వుంటుందని- పెద్దకోడలు అయినింటి అమ్మాయి, ఆమె మాట వినదు. సమయానికి ఆదుకుంటుందని ఈ పిల్లను అడుగుతున్నారు. అంటూ మనం ఊహించలేని విధంగా వ్యాఖ్యానిస్తారు జనం.....ఏ విధంగా చూచినా మాలాటి వాళ్ళకు కష్టమే....అడుగడుక్కు అపజయాల నెదుర్కొంటున్న మాకు ఇవన్నీ అలవాటైపోయాయి. ఈ సమస్యలకు అంతు అంటూ వుండదు.... అన్నీ స్థిరపడిన తర్వాత శంభూ విషయంలో ఎన్ని సమస్యలు తెలెత్తుతాయో..... తలంచుకుంటే అశాంతి అంతే.... తలచుకోకుండా వుంటేనే సుఖం.' నిరంజన్ ప్రేమ హస్తాన్ని తన చెంపకు ఆనించి కళ్ళు మూసుకున్నాడు.
    ప్రేమ ఉస్సురని నిట్టూర్పు విడిచింది.
    "మీకు ఏమైన తెస్తాను" అంటూ లేచింది. అయిష్టంగానే ఆమె హస్తాన్ని విడిచిపెట్టాడు.
    ప్రేమ లోపలికి వెళ్ళి ఫలహారం తీసుకువచ్చింది.
    దాన్ని అందుకున్నాడు. పళ్ళెంలోని మైసూర్ పాక్ ముక్కను చిదిమి ఒక ముక్క ప్రేమ నోటి కందించాడు. ఆమె సిగ్గుతో ముఖం త్రిప్పుకుంది. కానీ అతడు వదల్లేదు. ప్రేమ నోరు తెరవక తప్పింది కాదు. ఇక లాభం లేదనుకుని లోపలి కెళ్ళి మరొక పళ్ళెం తెచ్చుకుంది. నిరంజన్ ఆ పళ్లాన్ని లాక్కుని అన్నీ తన పళ్ళెంలో పోసి ఇద్దరికీ మధ్యగా పెట్టాడు.

                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS