Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 20

 

                                  13

    ఈనెల రోజుల్లో రాధ పూర్తిగా మారిపోయింది.
    సునీత తన ఇన్ని సంవత్సరాల జీవితం చెప్పిన పాఠాలను రాధకు బోధించింది. రాధ పుట్టి పెరిగిన జానపదాలనుండి ఐక్యరాజ్యసమితి రాజకీయాలవరకు, అపరిష్కృత నిత్యసమస్యలనుండి మరుక్షణంలో ఏం జరుగుతుందోనన్న నేటి మానవుని భయంవరకు - ఆమె చెన్ననిదంటూ లేదు.
    ఆఫీసునుండి రెండు గంటలకు వస్తుంది. అప్పటి నుంచి సాయంత్రందాకా అక్కడే ఉంటుంది. ప్రయోగాత్మకంగా దేన్ని అయినా చూపించవలసివస్తే సాధ్యమైనంతగా ప్రయత్నించేది అందుకు. నగరంలో ప్రతిచోటూ చూపించేది. బస్సు, కాకపోతే రిక్షా, లేక పోతే నడక.
    పెద్ద గ్రంథాలయంలా ఉన్న ఆర్తి లైబ్రరీ రూమ్ ఎంతో ఉపకరించింది.    
    జంటనగరాల్లో ఒక్క అందమైనవీ, ప్రసిద్ది పొందిన స్థలాలేకాక, ఆ నగరాల నగ్నరూపం, నిజస్వరూపం తెలుసుకొనటానికి అవకాశమున్న ప్రతి చోటూ తిప్పింది. అలా చెయ్యడంలో రాధ ఆశించిన దానికన్నా ఎక్కువ తెలుసుకోవచ్చని సునీత ఉద్దేశ్యం.
    ఇప్పుడు రాధ పల్లెపడుచు కాదు. నాగరిక యువతి. కట్టు, బొట్టు, అలవాట్లు, అభిరుచులు అన్నీ మారాయి. జంటనగరాల్లో ఏ మూల వదిలినా నిర్భయంగా ఇంటికి తిరిగిరాగలదు. తను ఒక్కతే వెళ్ళి కావలసిన వస్తువులు బేరం చేసుకుని తిరిగిరాగలదు.
    ఇన్నాళ్ళు వికసించని ఆమె మానసిక శక్తి వికసిస్తూంది. ఒక్కొక్క రోజు గడుస్తున్నకొద్దీ ఈ జీవితంమీద రోత పుట్టసాగింది రాధకు.
    సుందరమైన ఈ మహానగరపు వీథుల్లో, బ్రహ్మాండమైన ఆ భవనాల నీడల్లో ఎంత కుళ్ళు పేరుకుని ఉంటుందో, విశాలమై, జనసాంద్రమైన ఆ రాచవీధులలో ఎందరు దగాకోర్లు ఉంటారో సునీత వివరించింది. తను దేవేంద్రనగరం, దేవలోకం అనుకున్న ఈ అందమైన పట్టణం దొంగలకూ, దొంగ తనాలకూ, పెద్దమనుష్యులుగా చెలామణీ అయ్యే మోసగాళ్ళకూ, అవినీతికీ, అక్రమాలకూ ఆలవాలమని తెలుసుకున్న రాధ ఈ నాగరికతను అసహ్యించుకున్నది.
    పక్కింటివాడు వేలు తెగి బాధపడుతున్నాడని తెలిస్తే, పరుగులతో వెళ్ళి పరమర్శించే పల్లె జీవితానికి, వాహనాలకింద పడి, నలిగి మరణవేదన పడుతున్నా, మరణిస్తున్నా పలకరించని ఈ నాగరిక సంఘానికి ఎక్కడా పోలిక లేదు. ఎప్పుడూ ప్రవాహాల్లో సాగిపోయే జన సందోహాలు, రకరకాల వాహనాలు, ఫాక్టరీల రొదల్లో కలిసిపోతున్న బిచ్చగాళ్ళ ఆక్రందనాలు, ప్రమాదాలకు లోనైన అదృష్టహీనుల ఆర్తనాదాలు, ఆకలిమంటలతో అలమటిస్తున్న సామాన్య ప్రజానీకం ఏడుపులు ఇక్కడ ఎవరికీ పట్టవు. ఎక్కడికో? ఎందుకో? సాగిపోతూనే ఉంటారు. సాగిపోవటమే వాళ్ళ పని.
    ఎటు చూసినా నిరంతర చైతన్యం! మానవాళి జీవితం విలవలను, స్థాయిని తగ్గించివేస్తున్న నిరర్ధక చైతన్యం!
    కనిపించని గమ్యాలకు పరిగెత్తించే నిష్ఫల చైతన్యం!
    డబ్బు సంపాదనే ఇక్కడివాళ్ళకు ముఖ్యంలా ఉంది! ఆ డబ్బుకోసం ఏమైనా చేస్తారు. అడుక్కోవటం దగ్గరనుంచి హత్యలవరకు అన్ని ఆచరిస్తారు. జేబులు కత్తిరించినా, పీకలు కత్తిరించినా వీళ్ళ గమ్యం ఒక్కటే! అదే - డబ్బు! కష్టాన్ని మార్కెట్ లో అమ్ముకుని తిరిగివస్తున్న కష్టజీవి, ప్రజలను నిలువుదోపిడీ చేసిన సేఠ్ ల ఖజానాలు - ఎవరిని లూటీచేసినా, డబ్బు అనే సర్వాంతర్యామిలాంటి పదార్ధంకోసమే! అది ఎవరిదైనా, ఎంత కష్టపడి ఆర్జించుకున్నా వీళ్ళ కనవసరం. సంపాదించినదంతా తగలవేసేది క్లబ్బుల్లో పేకాటలకూ. తాగుళ్ళకూ, వ్యభిచారానికి ముసుగువేసిన బాల్ రూమ్ డాన్సులకూ - ఒకటేమిటి, సవాలక్ష!
    పైగా అన్నీ నాగరికవేషాలు, వీటన్నిటికి డబ్బెలాగైనా సంపాదించాలి. ఎలా సంపాదించినా, అదేమని ఎవరూ అడగరు. అడిగినవాడు వెర్రివాడు. ఇంకా మాట్లాడితే నేరస్థుడే!
    తన అందానికి, శరీరానికి ఖరీదుకట్టి అమ్ముకుంటుంది స్త్రీ. బహిరంగంగానే ఈ పని చేస్తుంది. ఆమెను అడ్డుకునేవారు లేరు. ఆదుకునేవాళ్ళు అంతకన్నా ఉండరు. సంస్కర్తలమని గొప్పలు చెప్పుకునే స్టేజి వాద్యగాళ్ళకూ, వీళ్ళకూ ఏదో సంబంధం ఉంటూనే ఉంటుంది. సాధారణంగా అందరూ సంఘ సంస్కర్తలని చెప్పుకున్నా అది నిజం కాదు. కొందరు మాత్రమే!
    ఒకవేళ ఆమెను సంస్కరించినా, ఆమె ఎంగిలి విస్తరి కనక, పోషించే బంధువులూ, ఆప్తులూ ఉండరు. ఉన్నా ముందుకు రారు. వచ్చినా వేలెత్తి చూపించబడి, నలుగురి నోళ్ళలోనూ నాలుగు రెళ్ళు ఎనిమిది రకాలుగా చెప్పుకోబడతారు. అందుకే ఎవరూ సాహసించరు.
    అందుకే వాళ్ళకు గత్యంతరం ఉండదు. కడుపు నిండాలి. ఆకలి ఎంత పనయినా చేయిస్తుంది. ఆకలితో ఉన్న మానవుడు దానవుడవుతాడు. అందుకే బతికి నన్నాళ్ళూ జీవచ్చవంలా ఇతరుల అవసరాలు తీర్చే యంత్రాలకన్న హీనంగా బతికి, చివరకు మృత్యువు వాత పడ్డనాడు దిక్కులేక, కార్పొరేషన్ వాళ్ళ జవానుంచేత ఈడ్చివెయ్యబడతాడు.
    డబ్బు లేనివాడి జీవితానికి గడ్డిపోచకు ఉన్నంత నిలవకూడా ఉండదు. డబ్బు లేనినాడు, లేనివాడు బతకటానికి నోచుకోదు. బతుక్కీ, డబ్బుకూ అవినాభావ సంబంధం; తెగిపోలేని లంకె! దానిముందు అమ్మ, నాన్న, సోదరులు, భార్యాపిల్లలు ఎవరూ ఎవ్వరికీ ఏమీ కారు. డబ్బే తల్లిదండ్రులు. డబ్బే సోదరులు. డబ్బే బిడ్డలు. డబ్బే అన్నీ.
    ఇక్కడ ఏది తప్పు కాదు!
    అలుముకొంటున్న నాగరికతలో అదొక భాగం!    
    అన్నిటికి నాగరికత అనే ముసుగు!
    ఇప్పుడు రాధ బజారుకు వెళ్ళాలనికూడా అనుకోదు. ఎప్పుడన్నా వేణు తీసుకువెళతానంటే, ఏదో వంక చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. ఎప్పుడూ లైబ్రరీ రూములో పుస్తకాలు తిరగేస్తూ కూర్చుంటుంది. సునీత స్టేట్ లైబ్రరీనుంచి అప్పుడప్పుడు ఇంకా పుస్తకాలు తెచ్చి ఇస్తూ ఉంటుంది. అన్నిటికి శ్రద్దగా చదువుకుని మంచివనీ, ముఖ్యమైనవనీ తోచిన మాట లను పుస్తకంలో వ్రాసుకుంటుంది. తనకు అర్ధం కాకపోతే సునీతను అడిగి తెలుసుకుంటుంది. సునీత సాధ్యమైనంతవరకు చెప్పేది. ఆమెగూడా తనకు తెలియక పోతే ఆర్తినో, నీలకంఠంనో, విశ్వాన్నో, వేణువో అడిగి తెలుసుకుని చెబుతుంది. సునీతకు మాతృభాషకాక ఉర్దూ, ఇంగ్లీషు బాగా తెలుసు. హిందీకూడా తడుముకోకుండా వ్రాసి, చదివి, మాట్లాడటంకూడా వచ్చు. తెలుగులో రాధ ఒక దారిని పడిందని తెలిశాక, ఒక్కొక్క భాషను నేర్పాలని - ముందు తెలుగు, తరవాత తనది ఇష్టమైన భాష ఉర్దూ నేర్పుతూంది.
    రాధకు సునీత దగ్గర చనువు ఏర్పడింది. ఆమెను "అక్కా!" అని పిలుస్తూంది రాధ.

                                
    రాధ వేణు, ఆర్తి, సునీతల పట్టణ జీవితాలను గురించి, కాలేజీని గురించి సునీతను అడిగేది. తనను గురించి చెప్పవద్దనుకున్న కొన్ని విషయాలుతప్ప అంతా చెప్పింది. ఏదీ దాయలేదు. ఆర్తిని గురించి ఆమెకు తెలీదు. వేణు, సునీత ఒక కాలేజీలో చదువు కున్నారని విని, కుతూహలంగా అడిగింది - "మరి మగపిల్లలు బాగా అల్లరి చేస్తారన్నావు. మామయ్య కూడా అలా చేసేవాడా?" అని.
    సునీత తడబడింది. "లేదు .... మీ మామయ్య' చాలా మంచివా డనిపించుకున్నాడు."
    రాధకు ఒక దారి అంటూ ఏర్పడ్డాక, ఒకరోజు ఆఫీసులో వేణు సునీతను పిలిపించాడు. వచ్చి మామూలుగా నిల్చుంది.
    వేణు పర్సు తెరిచి అందులోనుంచి రెండు వందరూపాయల నోట్లు తీశాడు. మడత దులుపుతూ సునీతకు ఇవ్వబోయాడు. వాటివంక అదేపనిగా చూసింది ఆమె.
    "ఎందుకని? తెలుసుకోవాలనుకుంటున్నా!"
    "ఇన్నాళ్ళకూ-రాధకు గురువువై పాఠాలు చెప్పిన..."
    "ఓహో! ప్రతిఫలం ఇస్తున్నారా?"
    "కాదు.... కాదు, సునీతా. మనఃస్ఫూర్తిగానే ఇస్తున్నా."
    "అవి దాచుకునేందుకు నాకు ఇనప్పెట్టె లేదు."
    "ఇనప్పెట్టె? అహఁ ...... అదికాదు .... నువ్వు కాదనవనే ..."
    "అవసరం లేదన్నాగా? నా డబ్బుగా మీదగ్గిరే ఉంచండి!"
    "నా దగ్గిర ఉంటే నీకేం వస్తుంది?"
    "రాదు .... కానీ ఒకప్పుడు ఒక అవసరం వస్తుంది. నేను మరణిస్తాను. అప్పుడు మీ ఆఫీసులో పనిచేసే నేను, దిక్కులేని దాన్ని కనక నా అంత్యక్రియలు మీకు అదనపు భారం కాకుండా వాటితో నెరవేర్చువచ్చు." మరొక మాటకైనా ఎదురుచూడలేదు. స్వింగ్ డోర్ విసురుగా అటు ఇటు నాలుగైదుసార్లు ఊగింది.
    వేణు తల పట్టుకున్నాడు. 'ఎందుకు? ఎందుకు, నీతా ... నే నెంత దగ్గిరికి రావాలన్నా దూరంగా ఉంచుతావు? నీతా ... నామీద ఎప్పటికి కరుణ  కలుగుతుంది?'

                             *    *    *

    సునీత చరచరా వచ్చి సీట్లో కూర్చుంది. టైప్ మెషీన్ మీద తల ఆనించింది. జేవీ చూస్తుందేమోనని చాలాసేపటివరకూ తల పైకెత్తలేదు.
    అయిదువరకు కూర్చున్నా పనేమీ చెయ్యవలసిన అవసరం కలగలేదు. గడియారం ఐదు కొడుతూండగానే ఇవతలికి వచ్చింది. వస్తూ అటు చూస్తే ఆఫీసు రూమ్ తాళం వేసిఉంది. సైనుబోర్డులో 'ఔట్' అని కనిపిస్తున్నది.
    వేణు ముందే వెళ్ళటం చాలా అరుదు. ఎంతో అవసరం అయితే తప్ప అలా ఎన్నడూ వెళ్ళడు. ఎందుకో మరి త్వరగా వెళ్ళాడు.
    ఇందాకటినుంచీ విశ్వం ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నది సునీత. తన హృదయంలో ఉన్న మూగబాధను విని అర్ధం చేసుకోగలవాడు విశ్వం ఒక్కడే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS