Previous Page Next Page 
కాగితపు పల్లకి పేజి 19

 

                                 12
    స్టేషను లో బండి ఆగటం ఆలస్యం రాఘవులు కంపార్టు మెంటు దగ్గర కొచ్చి పలకరించాడు. బండి దిగగానే సామాన్లను కిందకు దింపించేశాడు. స్టేషను లో అంతకు ముందే స్ట్రెచ్చర్ సిద్దంగా ఉంచారు. దానిమీద కూర్చుందుకు రాధ అంగీకరించలేదు. సిగ్గుపడింది. బయట వరకూ నడవటం కష్టం అని చలపతి ఒత్తిడి చేసిన మీదట ఆమె ఒప్పుకుంది.
    ఇంటికి చేరేసరికి ఇల్లంతా చాలా నీటుగా ఉంది. తన కోసరం ఆఖరికి మంచం మీద పక్క సయితం సిద్దం చేసి వుంది. వంటమనిషి వంట కూడా సిద్దం చేసింది.
    నర్సు వచ్చి ఇంజక్షను ఇచ్చింది. కొన్ని  మందులు కూడా ఇచ్చింది.
    రాఘవులు సామానులను సర్దేశాడు గదిలో -- చలపతి ఆమె మంచం మీద కూర్చుని 'యిల్లు ఎలా ఉంది?" అన్నాడు.
    "చాలా బాగుంది."
    "నీవు రాగానే చూడటానికి బాగుండాలని రఘవులి చేత సర్ధించాను."
    ఆమెకు కన్నీరు ఆగలేదు. అది దాచుకుందుకు చోటు లేక ముఖం దించేసుకుంది. ఈ రెండు నెలలలోనూ అక్కడ పొందిన అనుభవాలు, అవమానాలు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి. ఆఖరికి తాను ఓ మూల గదిలో అలా ఉండటాని క్కూడా ఇష్టపడక వదిన దెబ్బలాడి వెళ్ళి పోయింది. ఇవాళో రేపో అన్నయ్య ఉత్తరం రాస్తాడు. ఒదిన ఎలాగో రెండు రోజుల్లో బండి దిగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఇక తాను అక్కడ ఉండకుండా ఎక్కడి కైనా వెళ్తే బాగుండును అనుకుందో , అలాంటి పరిస్థితుల్లో భర్త దేవుడిలా వచ్చి అదుకున్నాడు. తాను భరించలేని ఆప్యాయతా, ఆదరణా చూపించాడు. ఇక తాను ఎక్కువకాలం బ్రతక్కపోయినా ఫర్వాలేదు. ఉన్న నాలుగు రోజులూ ఈఅప్యాయతా, ఈఅదరణ ఇలా వుంటే అదే పదివేలు తనకి.    తనకి అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఈ ఆప్యాయతా, ఆదరణా ఇలా ఉండగానే తాను కన్ను మూస్తే చాలు. అలాగే ఆమె తలఎత్తి ఎదురుగ్గా ఉన్న దేవుడు పటానికి మనసులోనే మొక్కుకుంది.
    "ఏవిటి ఆలోచిస్తున్నావు' అన్నాడు చలపతి.
    రాధమ్మ తడబడుతూ 'ఆహా ఏం లేదు.... పాపం అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. ఆమె ఎంత సేవ చేసిందో పాపం" అంది.
    రాధమ్మ కు ఇక్కడకు రాగానే మళ్ళీ రాబడి, ఖర్చులు ఇంటి బాధ్యతలు మొదలయ్యాయి.
    చలపతి జేబులోంచి మూడొందలు తీసి ఆమెకు యిచ్చాడు.
    వంటమనిషి చాలా శ్రద్దగా చాకిరీ చేస్తుంది. ఆమెకు తనంటే భయం లేదు కాబోలు. ఆమెకు పాపం ఇద్దరు పిల్లలుట. భర్త ఈ మధ్యనే చనిపోయాడుట. ఆమెకు డబ్బు అవసరం.
    రాధమ్మని మంచం దిగవద్దని చెప్పినా ఆమె వినిపించుకోవడం లేదు. వంటగది గుమ్మంలో కూర్చుని ఏవో పురమాయింపులు చేస్తూనే వుంటుంది. ఇల్లంతా కూడా వుండి వారం రోజులకు ఒసారైనా సర్దిస్తుంది. "నాదీ....నా స్వంతం అనే బాధ్యత అలాంటివి. ఇక్కడకు వచ్చిం తర్వాత తనకి సగం జబ్బు నయం అయినట్టుగా అనిపించింది. రాజశేఖరం బావ ఇప్పుడెం అంటాడు? ఆనాడు అలా దెప్పిన వాడు ఇప్పుడు తలతీసి ఎక్కడ పెట్టుకుంటాడు?"
    జీవితంలో పూర్తిగా కృంగతీసే నిరాశా నిస్పృహల్లోంచి భర్త ఆమెకు కావాల్సినంత బలం, ధైర్యం ఉత్సాహం అశలు కన్పించే అవకాశాలు అందజేసిన అతగాని అభిమానాలు, ఆదరణ ఆమెకు కొత్తలో ఉక్కిరిబిక్కిరి చేసినా వరండా లో కుర్చీ వేసుకుని కూర్చుంటే ఆరోగ్యంగా నవ్వుతూ తూలుతూ పిల్లాపాపలతో సినిమాలకి పోయే జంటలని చూస్తున్నప్పుడు, పెరటి లోకి వెళ్తే హాయిగా నవ్వుతూ ఇంటి పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండే ఇరుగుపొరుగును చూసినప్పుడు ఆమెలో క్రమక్రమంగా అసంతృప్తి, గర్వం, హరించుకు పోయి తాను అలాంటి మామూలు స్థితికి రావటానికి మనస్సు వేగిర పడసాగింది. వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగయింది. అయినా మామూలు మనిషి కావాలంటే ఇంకా అయిదారు మాసాలు  పడుతుందని చెప్పారు డాక్టర్లు. నెలనెలా ఈ రోగం కింద సగం రాబడి ఖర్చయి పోతుంది.
    అప్పుడప్పుడు ఆమె తన పెట్టె తీసి డబ్బు తెచ్చి చూసుకుంటూ వుంటుంది. తన దగ్గర ఇంకా వెయ్యి రూపాయలున్నాయి. అనుకుంటూ వుంటుంది సంతృప్తిగా.
    చలపతికి ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు. విశాఖపట్నం తీసుకు వెళ్ళమని. అసలు అందుకే రాదని అక్కడ్నుంచి తీసుకు వచ్చింది.
    చలపతి ఆనాడు వస్తూనే "రేపే విశాఖపట్నం ప్రయాణం అక్కడ వైద్యం చేయించుకో, రాఘవులు పొద్దున్నే వస్తాడు." అన్నాడు.

                              
    'అక్కడికి వెళ్ళటం అవసరమా?"
    "అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారుట. వాళ్ళు బాగా పరీక్షలు జరిపి ఇంకా మంచి మందులు ఇస్తారుట."
    రాధమ్మ కు ఇక ఈ వైద్యంతో తాను పూర్తిగా మామూలు మనిషి అవుతుందని అనిపించింది. భర్తకు అంత మంచి బుద్ది భగవంతుడు పుట్టిస్తే తానెందుకు వద్దనాలి?"
    "రాఘవులు కూడా వస్తాడు" అన్నాడు చలపతి.

                                                          13
    పొద్దున్నే రాఘవులు వచ్చాడు. ముగ్గురూ విశాఖపట్నం వెళ్ళారు ఇల్లు తాళం పెట్టి దారిలో ఓ స్టేషన్లో బండి కొంచెం ఎక్కువసేపు ఆగవలసి వచ్చింది. చలపతి పళ్ళు కొనటానికి స్వయంగా బండి దిగి ఫ్లాట్ ఫారం మీదకు వెళ్ళాడు.
    'అమ్మగారూ ఓ మాట అడుగుతాను చెప్పండి అన్నాడు రాఘవులు.
    "ఏవిటి?" అంది రాధ.
    "ఇదంతా చూస్తుంటే ఇలా అనిపిస్తుందండీ."
    "ఏం జరిగింది రాఘవులూ."
    చలపతయ్య గారికి ఇంత పెద్ద మనస్సు , ఇంత ఓపికా , ఇంత నెమ్మది ఎలా వచ్చాయా అని అందరూ ఆశ్చర్య పోతున్నారమ్మా."
    రాధ మాట్లాడలేదు.
    "వాళ్ళావిడ్ని ఇంత జాగ్రత్తగా చూస్తున్నారంటే అలాంటి మనిషి లో ఇంత మార్పు ఏవిటా అని ఒకటే ఆశ్చర్యపోతున్నారండి. మీకు తెలియంది ఏముంది? ఒక్కొక్కరోజు తప్ప తాగేసి సినిమా హల్లో పడి నిద్రపోయి ఒళ్లెరక్కుండా తిరిగే మొరటు చలపతయ్య ఈనాడు ఇంత పెద్ద మనిషి ఎలా అయ్యారు? అని అంతా ఒకటే చిత్రంగా అనుకుంటున్నారండి." దీనికంతా ఏదో ఆకర్షణ మీలోనే ఉందని వాళ్ళనుకుంటున్నారండి." అన్నాడు రాఘవులు.
    "ఏం మీ అయ్యగారి గురించి అంత గొప్పగా చేప్పుకొంటున్నారా?"
    "భలేవారండీ . ఆ మనిషి గురించి తెలిసిన వారికి ఆశ్చర్యం కాదూ మరి. ఇలా మారిపోతారని ఎవరూ అనుకోలేదమ్మా."
    "అవును గాని ఓ సంగతి అడుగుతాను చెప్పు. నేను అడిగే విషయాలు మీ అయ్యగారికి చెప్పకూడదు. ఈ అయ్యగారికి ఎవరో ఓ ఆవిడ ఉందిట." నీకు తెలుసా?"
    రాఘవులు నాలిక కొరుక్కుని 'చంపేశారు. అడక్కూడని ప్రశ్న అడిగారు" "అది వెనకటి సంగతి లెండమ్మా. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం మానేశారు."
    "ఎవరావిడ?"
    "మీరు నా గురించి అపార్ధం చేసుకోనంటే చెబుతా. ఆమె దిక్కులేని పుటక పుట్టింది. ఓ అయ్య మోసం చేసి పారిపోతే ఆయమ్మ పాపం ఆస్పత్రి లో పురుడు పోసుకుని ఈ బిడ్డను అక్కడే ఒదిలి పారిపోయింది సాకలేక. ఓ నర్శమ్మ ఈ బిడ్డను పెంచి పెద్ద చేసింది. ఆమె కాస్త ఆస్తిని అప్పచెప్పి పోయింది. ఓ పోగరబోతు నమ్మించి పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఆమెను హత్య చేయాలని చూశాడు. దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు. లేకుంటే ఈయమ్మ అప్పుడే చచ్చిపోయేది."
    "ఏం జరిగింది రాఘవులూ "అంటూ వినాలనే కుతూహలంతో రాధ పక్క మీంచి లేచి కూర్చుంది."
    అతని మీద ఏదో ఖూనీ కేసు వుందట. పోలీసోళ్ళు పట్టుకుపోయారు. వాడికి కోర్టులో యావజ్జీవ శిక్ష పడింది. ఆ తర్వాత అల్లరి చిల్లరి కుర్రాళ్ళు ఆమెను పాడు చెయ్యాలని చూశారు. అలాంటి కష్టంలోనే అయ్యగారు ఆవిడ్ని అదుకున్నారండి. అప్పట్నించి ఇద్దరికీ స్నేహం బాగా పెరిగిపోయిందండి." మీరేమీ అనుకోకుండా వుంటే ఓ సంగతి చేబుతానండి."
    "ఏవిటది చెప్పు."
    "లిల్లమ్మ చాలా మంచి మనిషండి. అయ్యగారికి మీరు కూడా అంత సేవ చేసి వుండరండి. అయ్యగారికి ఎప్పుడు జబ్బు చేసినా రాత్రిళ్ళు నిద్ర కూడా పోకుండా చాకిరీ చేసేదండి."
    'అయితే నాకంటే చాలా మంచి మనిషి అన్నమాట."
    'అది మంచో చెడో ఆమెకు అయ్యగారంటే మాత్రం మా చెడ్డ అభిమానం అండి."
    "మరి మీ అయ్యగారికి ఆమె అంటే మనసేనా?"
    "లేదండి. ఇదివరకు అభిమానంగా ఉన్నా మీరోచ్చిం తర్వాత అసలు అటు పోవటమే మానుకున్నరండి."'
    "నువ్వు అబద్దం చెబుతున్నావు."
    ఛా! ఒట్టంటి. ప్రమాణం చేసి చెబుతున్నా అయ్యగారు ఇప్పుడు బాగా మారిపోయారండి ఆవిడకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అయ్యగారి అనుమానం అండి. ఆవిడ ఓసారి అయ్యగారు ఇంటికి వెళ్తే ఆవిడ అయ్యగార్ని అడ్డమైన మాటలు అన్నదండి. అసలు ఒక విధంగా మీ పెళ్ళి జరగటానికి ఆవిడే కారణం అండి."
    'ఆవిడ ఎలా? రాధా ఉత్సాహంగా అడిగింది. ఒకనాడు తనకీ రాఘవులికి జరిగిన సంభాషణ లో రాఘవులు అప్పట్లో ఏదో రహస్యం ఉందని చెప్పాడే కాని ఎవరూ చెప్పలేదు.
    "నువ్వు చెడిపోయిన మనిషివి, తాగుతావు, జూదం అడుతావు. జగడాల వాడివి . నీకు లేని చెడు వ్యసనం లేదు. నీకు పిల్లని ఎవరిస్తారు? ఒకవేళ యిచ్చినా నీ వల్ల ఆమె ఏం సుఖ పడుతుంది. నువ్వు బాధపడి, ఆమెను కష్టాలు పెట్టి ఎందుకొచ్చిన రొష్టు నువ్విలా గాలి బ్రతుకు బ్రతకటమే మంచిది. నీకు పెళ్ళి అనవసరం.' అంటూ ఓరోజు దులిపెసిందిట. ఆమె ఎప్పుడూ ఎంతో గౌరవంగా మాట్లాడేది. ఆరోజు ఆమె అలా అనటంతో అయ్యగారికి దిమ్మ తిరిగి పోయింది. "నన్ను చేతకాని వాడి కింద జమకడతావా?' అని పౌరుషం వచ్చిందండి. "నేను పెళ్ళి చేసుకు తీరతాను." అంటూ ఆమె దగ్గర శపథం చేశారండి. ఆరోజే మిమ్మల్ని చూట్టానికి మీ ఊరు వచ్చారండి. అలా అని దెబ్బ గోట్టకపోతే అన్నయ్యగారి ఉత్తరానికి అసలు విలువ ఇచ్చేవారు కాదండి. అన్నగారంటే ఈయనకు అసలు సరి పడదండి."
    "ఏం ఎందుకని?" తెలియనట్టుగా అడిగింది రాధ.
    "అయన తన స్వార్ధం చూసుకుని ఈయన చిన్నప్పుడే ఇలా గాలికి వదిలేశారని కోపం అండి. అయన ఊసు ఎత్తితే ఎగిరి పడేవారండి.
    రాధ రాఘవులు చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉండి అతని చేత ఇంకా వాగించాలని "లిల్లమ్మ ఇప్పుడే ఇక్కడే వుందా?" అంది.
    "లేదండి ఆవిడ యాత్రలకు వెళ్ళిందండి."
    "మళ్ళీ వస్తారా?"
    "ఏమోనండి. అక్కడ ఆవిడకు తెలిసినావిడ ఒకావిడ దానధర్మాలు, పుణ్య కార్యాలూ చేయిస్తుంటుందండి. అక్కడకు ఆవిడ రమ్మంటే వెళ్ళారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS