Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 19


    జగదీష్ నవ్వేసి "మీతో నే నెక్కడ మాట్లాడగలను కానీ-సూరిబాబు గారు ఈ కేసు మీకు అప్పగించారు. నా పద్ధతిలో నేను పరిశోధించుకుంటాను. మీ పద్ధతిలో మీరు పరిశోధించండి. ఎప్పుడు ఏ సహాయం అవసరమైనా నిస్సంకోచంగా నన్నడగండి" అన్నాడు.
    "థాంక్స్!" అన్నాడు వెంకన్న.
    వెంకన్న హోటల్లో సేకరించిన సమాచారాన్ని బట్టి రంగారావు, తనతో వచ్చిన యువతితో ఏకాంతం కోసం తహతహలాడాడని ఆ రాత్రికి ఎవర్నీ గదిలోకి రావద్దని చెప్పాడనీ మాత్రం తెలిసింది. ఈ సమాచారంవల్ల రంగారావును అతనితో వచ్చిన యువతియే చంపివుండాలని ఊహించుకోవచ్చు.
    అయితే ఆమె ఈ హత్య యెందుకు చేసింది? ఎందుకు చేసినా ఈ హోటల్లోనే యెందుకు చేసింది? తన ముఖం నలుగురికీ కనబడితే ఏదో ఒకరోజున తను పట్టుబడుతుందని తెలియదా?
    ఆ యువతి ఈ హత్య చేయడానికి అవకాశముంది. కానీ అందరి అనుమానాలూ తన మీదకు విధిగా మళ్ళించబడే పద్ధతిలో హత్య చేసిందంటే ఆమె చాలా తెలివి తక్కువదై వుండాలి.
    పోనీ హత్య చేయలేదని అనుకుందామంటే ఆమె ఏమయింది?
    హఠాత్తుగా వెంకన్న బుర్రలో కొత్త ఆలోచన వచ్చింది. హంతకుడు రంగారావును హత్యచేసి ఆమెను అపహరించుకుని పోయాడేమో?
    హంతకుడు మరియొకడైన పక్షంలో రెండుకారణాల వల్ల ఆమెను అపహరించుకుని పోయివుండవచ్చు.
    మొదటిది ఆమె అందం! ఆమె అద్భుత సౌందర్యరాశి అని బేరర్ చెప్పాడు. రెండవది ఆమె ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి!
    అటువంటప్పుడు హంతకుడు ఇద్దర్నీ చంపేయక-ఒక్కరినే యెందుకు చంపాడు? రెండోవ్యక్తిని ఎందుకు మాయంచేశాడు?
    బాగా ఆలోచించగా వెంకన్నకు కొన్ని కారణాలు తోచాయి. హంతకుడు రంగారావును చంపేశాడు. ఆమెనూ చంపేయాలనే అనుకున్నాడు. అయితే ఆమె అతని కాళ్ళావేళ్ళాపడి వుంటుంది. ఆడదని జాలిపడి, ఆమె అందానికి భ్రమపడి హంతకుడామెను కూడా తీసుకుపోయి వుంటాడు. అందువల్ల మరో ప్రయోజనం అందరి అనుమానమూ ఆ యువతిమీదకు పోతుంది. కొంతకాలంపాటు ఆమె అజ్ఞాతవాసంలో ఉన్నదంటే కేసు ఒక్కడుగు కూడా ముందుకు నడవదు.
    దురదృష్టమేమిటంటే హోటల్ కు రాకపోకలకు సరైన ఆంక్షలులేవు. ఎవరైనా సరే హోటల్ ఆవరణలో అడుగుపెట్టి బయటకు పోవచ్చును. అయినా ఇంతవరకూ ఏ విధమైన ఇబ్బందులూ యెదురుకాలేదు. ఎటొచ్చీ వెంకన్న పరిశోధనకే ఇబ్బంది వచ్చింది. హోటల్లో వుంటున్న వారు కాక మరెవరైనా హోటల్లో అడుగుపెట్టిన విషయంకానీ, ఆ యువతి ఎప్పుడు హోటల్ వదిలి బయటకు పోయిందీ అతనికి తెలియలేదు.
    వెంకన్న హోటల్ గదిని బాగా పరీక్షించి కాస్త ధైర్యంచేస్తే బాత్రూంద్వారా బయట్నించి లోపలకు ప్రవేశించవచ్చునని తెలుసుకున్నాడు.
    బేరర్, రిసెప్షనిస్టు చెప్పిన వర్ణనలు వెంకన్నకు అట్టే పనికివచ్చేవి కావు. ఆ వర్ణనలు దేశంలోని అందమైన ఆడవాళ్ళందరికీ వర్తిస్తాయి.

                                   3

    ఇన్ స్పెక్టర్ జగదీష్ దగ్గరకు వెళ్ళి కొన్ని వివరాలు తెలుసుకున్నాడు వెంకన్న.
    హత్య రాత్రి రెండుగంటల ప్రాంతాల జరిగింది. హత్య జరిగినప్పుడు హతుడు పెనుగులాడలేదు. బహుశా నిద్రపోతూ వుండివుండాలి. గదిలో వేలిముద్రలు ఇద్దరివే. అవి రంగారావువీ, అతని భార్యవీ అయుండవచ్చును. మరోవ్యక్తి గదిలోకి వచ్చిన జాడలేదు. రంగారావు గురించిన భోగట్టా యింకా తెలియలేదు. అతనీ ఊరు వాడు కాదనిమాత్రం తెలుస్తోంది. అతని ఫోటోను కొన్ని పేపర్లలో వేయించడం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో ఏవైనా వివరాలు తెలియవచ్చును.
    "పాపం, రంగారావు!" అన్నాడు వెంకన్న "ఎక్కన్నించో వచ్చి ఈ వూళ్ళో బలైపోయాడు."
    జగదీష్ నవ్వి "చనిపోయినవాడల్లా పుణ్యాత్ముడు, అసలు పాపం నాది. ఈ హత్యకేసు పరిశోధించాల్సి వచ్చింది" అన్నాడు.
    "అయితే కొంతపాపం నాకూ వుందికదా" అన్నాడు వెంకన్న.
    "మీదేముందిలెండి పరిశోధిస్తే డబ్బొస్తుంది. లేకపోతే లేదు. నాదైతే ఉద్యోగధర్మం. కేసు ముందుకు నడవకపోతే పైవాళ్ళకు జవాబిచ్చుకోవాలి" అన్నాడు ఇన్ స్పెక్టర్ జగదీష్.
    "మీరు చెప్పిందీ నిజమే!" అని నిట్టూర్చాడు వెంకన్న. అతని నిట్టూర్పు ఇంకా సగంలో వుండగానే ఒక నడివయస్కుడు ఆత్రుతగా స్టేషన్లో ప్రవేశించాడు.
    "ఎవరు కావాలి?" అడిగాడు జగదీష్.
    "ఇన్ స్పెక్టర్ జగదీష్ మీరేనా?" అనడిగాడు నడివయస్కుడు.
    "నేనే? ఏం కావాలి మీకు?" అన్నాడు జగదీష్ మళ్ళీ.
    "మీరు పేపర్లో వేశారుగదా-ఆ రంగారావుగారి తాలూకు మనిషిని"అన్నాడతను.
    జగదీష్, వెంకన్న కూడా వులిక్కిపడి సర్దుకుని కూర్చున్నారు.
    ఆ వ్యక్తి రంగారావు వివరాలు చెప్పాడు.
    రంగారావుకు కాకినాడలో బట్టలవ్యాపారం వుంది. ఆ బట్టల షాపులో ఈ నడివయస్కుడు మేనేజర్ గా వుంటున్నాడు. పేరు గురుమూర్తి.
    అతను రంగారావు శవాన్ని గుర్తుపట్టి భోరున ఏడ్చేశాడు.
    పేపర్లో ఫోటో చూసి కాస్త కంగారుపడ్డా మనిషిని పోలిన మనుషులుండకపోతారా అని మనసుకు ధైర్యం చెప్పుకున్నాట్ట. ఇప్పుడవన్నీ తీరిపోయాయి. రంగారావుకు కాస్త మెడక్రిందుగా వీపుమీద సన్నని పొడుగాటి నల్లని మచ్చ ఒకటి వుంటుంది. అది తిరుగులేని గుర్తింపు చిహ్నం.
    జగదీష్ గురుమూర్తిని ఓదార్చి త్వరత్వరగా కొన్ని ప్రశ్నలు వేశాడు.
    రంగారావు చాలా మంచివాడుట. దయామయుడట. అతని పేరుచెప్పి అయిదుమంది విద్యార్ధులు కాకినాడ పి.ఆర్.కాలేజీలో చదువుకుంటున్నారుట. తన దుకాణం లోని పనివాళ్ళను అతడు కన్నబిడ్డల్లా చూసుకుంటాడుట. గురుమూర్తిని యెప్పుడూ పెద్దన్నగా భావించి గౌరవిస్తాట్ట.
    "అలాంటివాణ్ణి చంపడానికి ఏ వెధవకు చేతులొచ్చాయో?" అన్నాడు గురుమూర్తి.
    "రంగారావును అతడి భార్యే చంపింది" అన్నాడు వున్నట్లుండి వెంకన్న.
    గురుమూర్తి కనురెప్పలు టపటపలాడించి, తల అటూ యిటూ ఆడించి "ఏమిటన్నారు?" అన్నాడు.
    "రంగారావును చంపింది అతడి భార్య" అన్నాడు ఈసారి జగదీష్.
    "ఆవిడెలా చంపుతుంది - ఆయమ్మెప్పుడూ ఇల్లైనా కదలదే?" అన్నాడు గురుమూర్తి.
    "ఇప్పుడు రంగారావు భార్య కాకినాడలోనే వుందా?" అన్నాడు జగదీష్.
    "పదిరోజుల క్రితమే ఆవిడ పుట్టింట్నించి తిరిగొచ్చింది. అప్పట్నించీ కాకినాడలోనే వుంది" అన్నాడు గురుమూర్తి.
    "రంగారావు ఇక్కడికి భార్యా సమేతంగా రాలేదా?" అన్నాడు వెంకన్న ఆశ్చర్యంగా.
    వాళ్ళీ విధంగా తననెందుకు ప్రశ్నిస్తున్నారో తెలుసు కోవడానికి గురుమూర్తికి కాస్సేపు పట్టింది. కథంతా విన్నాక అతను చిరాగ్గా "చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటున్నారు. ఆయమ్మ మొగున్నెందుకు చంపుతుందీ-అన్నవాళ్ళకే కాదు, అనుకున్న వాళ్ళక్కూడా పుట్టగతులుండవు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS