రోజురోజుకు జీవించటం దుర్భరమవుతూంది. నే నొక్కదాన్నేకాదు - గర్భంలో పెరుగుతున్న శిశువు కూడాను. ఆత్మహత్య చేసుకుందా మనుకున్నాను. ప్రాణాలమీది తీపి. గర్భస్థ శిశువు తననుకూడా లోకం మొహం చూడనిమ్మని ప్రార్ధిస్తున్నట్లుండేది. అందువల్ల ఆ పని చెయ్యలేకపోయాను.
ఒక రోజున ఓ పెద్ద భవనం నీడలో అలసటగా కళ్ళు మూసుకున్నాను. కడుపులో నెప్పి అనిపించింది.అంతలో ఎవరో ముస్లిం స్త్రీ అటు వచ్చింది అదృష్ట వశాత్తు. నా బాధ అర్ధం చేసుకుని, లోపలనుండి మరోకామెను సాయంగా పిలుచుకువచ్చి లోపలికి తీసుకు వెళ్ళింది.
ఏడు నెలలన్నా కాకముందే నా పాపఫలం మృత జీవిగా జన్మించింది. నేను విచారించలేహు. ఆ నెత్తురు ముద్దను మట్టిలో కలిపేశాను.
వారం పైగా ఆ భవనంలో వెనకవైపున పనివాళ్ళు ఉండే ఇళ్ళలో, ఆ ముస్లిం స్త్రీ ఇంట్లో ఉన్నాను. నా కథ విని ఆమె ఏదో ఒక దారి చూస్తానన్నది. అంత వరకూ తన ఇంట్లో నే ఉండవచ్చుననికూడా అంది.
ఒక నెల ఆమె ఇంట్లోనే గడిపాను.
ఒకరోజు ఇంటిముందు నిల్చుని ఉన్నాను. ఆభవనం వెనకభాగాన కిటికీలోనించి ఓ మధ్యవయస్కుడు నన్ను చూశాడు. అతని వేషం ముస్లిం అని చెబుతూంది. నేను అతన్ని చూశానుకాని పట్టించుకోలేదు.
ఆ రాత్రి దీదీ ఇంటికి వచ్చినపుడు నాతో అంది - 'బేటీ! జాగీర్దారు గారు నువ్వంటే మనసుపడుతున్నాడు' అని.
ఆ బంగళా ఒక జాగీర్దారు విలాస భవనం. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. ఈసారి వచ్చినప్పుడు నేను ఆయన కంటబడ్డాను.
నేను జాగీర్దారు ఇష్టప్రకారం నడిస్తే కలిగే లాభాలు దీదీ వివరించింది. 'ఆయన నిన్ను మోసం చేస్తాడనుకోకు. భార్య లేదు. ఓ కొడుకు ఉన్నాడుకాని అతనెక్కడో ఉత్తర భారతదేశంలో సైనికాధికారిగా పని చేస్తున్నాడు. వస్తే ఎప్పుడో వచ్చి పోతాడు. అంతే. నీ జీవితాంతం ఇక్కడే ఈ భవనంలోనే ఆయన బేగంగానే రాజభోగా లనుభవిస్తావు. ఢోకా లేదు. నువ్వు ఒప్పుకో, భేటీ!'
నన్ను ఆలోచించుకోనిమ్మన్నాను. ఆమె సరే అంది. నన్ను ఇంత ఒత్తిడి చెయ్యటానికి కారణం - నేను ఊఁఅంటే ఆమెకూ కొంత లాభిస్తుంది. జాగీర్దారుగారి ఆప్తవర్గంలో ఒకతె అవుతుంది.
నేను రాత్రల్లా యోచించాను. ఎటు చూసినా ఏ దోవా లేదు. ఎలాగూ నేను లోకం దృష్టిలో లేచి పోయినదాన్ని. పతితను. అటువంటప్పుడు ఎక్కడో అనామకంగా కుక్కచావు చచ్చేదానికన్నా, దీదీ చెప్పిన మాట వినడమే మంచిదని తోచింది. తెల్లవారుజామున ఈ నిర్ణయాన్ని పదేపదే పునశ్చరణ చేసుకున్నాను.
తత్ఫలితంగా నేను బేగాన్ని అయ్యాను. అంటే సూటిగా చెప్పుకోవాలంటే, ఉంపుడుగత్తెను అన్నమాట.
నీ కిప్పుడు సుఖాలకు ఏ లోటూ లేదు. పరువు మర్యాదలకు అంతకన్నా లోటు లేదు. వచ్చిన దగ్గిరనించీ అక్కడే ఉంటున్నాను.
ఆయన నాకిక్కడ ఈ విధంగా తటస్థపడతారని నేను కలలోకూడా అనుకోలేదు. ఆ రోజు మీ దగ్గిరికి వచ్చినపుడు నాకున్న గుండెనెప్పికి వైద్యం చేయించు కోవాలన్న దృష్టి మీదే వచ్చాను. మీతో ఏకాంతంగా మాట్లాడాలని కోరుకోవటం ఎందుకూ అంటే ఇన్నాళ్ళుగా నేను పరదా పద్దతికి అలవాటు అయ్యాను. నలుగురిలో తిఅగాలన్నా, మాట్లాడాలన్నా ఆ అలవాటు పడనివ్వదు. అదీకాక పూర్వపరిచితు లెవరైనా ఆగుపిస్తారేమోనన్న భయంకూడా నాలో ఘోషా పద్ధతికి తోడుపడింది.
మీ దగ్గిరకి వచ్చి వారిని చూశాక నేను ఇక్కడ ఉండలేదు. జాగీర్దారుగారితో చెప్పి ఆయనతోబాటు లక్నో వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళూ అక్కడే ఉన్నాము. వచ్చి నాలుగు రోజులైంది."
* * *
ఆమె ముగించింది చెప్పటం. కళ్ళలోనుంచి అశ్రువులు ధారాపాతంగా జారుతున్నాయి. ఆర్తికూడా అదే స్థితిలో ఉంది. ఒక్కొక్క నిమిషమే ముందుకు వెళుతున్నది. చీకటి పడబోతున్నది.
ఆర్తి గద్గదంగా అన్నది: "కానీ .... కానీ ..... ఆయన లేరు, కళ్యాణి! నువ్వు వారి గుండెల్లో పెట్టిన చిచ్చు తన తప్పుగానే భావించారు. దానికి పరిహారం చేసుకుంటానని ఎటో వెళ్ళిపోయారు."
"వెళ్ళిపోయారా!"
"అవును. ఇంటికి వెళదాం. రా, కళ్యాణీ." ఆర్తి నిల్చుంది. కళ్యాణికూడా ఆమె ననుసరించింది. కాంపౌండర్ తో చెప్పింది ఆర్తి, ఇంటికి వెళుతున్నట్లు.
రాధ ఇంటిలోనే ఉన్నది. ఆమెతో రెండు మాటలు మాట్లాడి, కళ్యాణిని హాల్లోనే కూర్చోబెట్టి తను ఒక్కతే గదిలోకి వెళ్ళింది. రెండు నిమిషాలయ్యాక కల్యాణిని పిలిచింది.
"వెళ్ళండి. పిన్ని పిలుస్తున్నది." రాధ అంది.
కల్యాణి లేచి వెళ్ళింది.
గదిలో ఆర్తి ఒక చిన్న సైజు నిలువుటద్దం అమర్చిన బీరువా ముందు నిల్చున్నది. కళ్యాణిని చూసి దగ్గిరికి వచ్చింది. ఆమె చేతిలో ఒక కాగితం ఉన్నది.
"కూర్చో, కళ్యాణీ! ఆయన వెళ్ళిపోయేముందు రాసి పెట్టిన ఉత్తరం."
కళ్యాణి వణికే చేతులతో అది తీసుకున్నది. ఆర్తి అన్ని ఆమెకిచ్చి కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నది. కళ్యాణితో, "దాన్ని పెద్దగా చదువు నేను మళ్ళీ వినాలి, కళ్యాణీ!" అన్నది.
చదవబోయేముందు కళ్యాణి గుమ్మంవైపుచూసింది. తలుపులు తెరిచే ఉన్నాయి. అది గ్రహించిన ఆర్తి, "ఫరవాలేదు. ఎవరూ రారు" అంది.
కళ్యాణి చదువుతూంది.
"ఆర్తీ!
నీ గతాన్ని అయితే ఇవ్వాళ్ళనుండీ నీ సాంగత్యంలో మరిచిపోదామనుకుంటూ ఉన్నానో అది తిరిగి వెలికి తియ్యబడింది. నీకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నించాను. అందుకే పెళ్ళిముందు నీచేత వాగ్ధానాలు చేయించుకున్నాను. అయితే నేను అవివేకినని మరొక సారి స్పష్టపడింది. ఎందుకంటే నేను గతంలో ఎంత నీచుడిని అయినా, నువ్వు ప్రేమించిన వ్యక్తిగా, భర్తగా నీ అనురాగంలో మార్పు ఉండదని ఈ రెండు మూడు రోజుల్లో అవగాహన చేసుకున్నాను.
స్త్రీ అంటే ఎవ్వరూ అర్ధం చేసుకోలేని ఒక క్లిష్టమైన జీవి అన్న అభిప్రాయం నాకు ఉండేది. నీ పరిచయం, స్నేహం బలపడి, మన వివాహం జరిగాక అది మార్చుకోవలసిన పని తప్పనిసరి అయింది. అందుకే నేను ఇన్నాళ్ళూ మళ్ళీ నా వివాహాన్ని గూర్చి పట్టించుకోలేదు.
నాకు తెలిసినంతవరకూ నువ్వు నా దగ్గర ఏ రహస్యమూ దాచుకోలేదు. బాగా తెలుసు నాకు. కాని, నేనుమాత్రం దాచాను. అది ఎవ్వరికీ తెలియకూడదని దృఢసంకల్పం చేసుకున్నాను. అయితే అది నీ ఎడ క్షమించరాని అపరాధమని ఇవ్వాళ తోస్తున్నది.
విచక్షణ తెలిసిఉండి, ఓ రకమైన వేదాంత ధోరణికి అలవాటుపడి ఒక స్త్రీ పతనానికి అవకాశమిచ్చాను. అది నన్నిప్పటికీ వేధిస్తూంది. దానికి తగిన ప్రాయశ్చిత్తం పొందాలనే నా ఈ నిష్క్రమణ. సుకుమార మైన నీ జీవనపుష్పాన్ని నలిపి వేస్తున్నానన్న బాధకూడా నాకు ఉంది. కాని అంతకన్నా క్రూరంగా మనస్సు శాసిస్తూంది, వెళ్ళమంటూ. ఏం చెయ్యను? మొదటి నుండీ నాలో బలహీనత ఇదే! నన్ను క్షమిస్తావుకదూ?
నేను సాధ్యమైనంత త్వరలో తిరిగి రావటానికి ప్రయత్నిస్తాను. నాకన్నా దౌర్భాగ్యులు ఉన్నారని తెలుసు. వాళ్ళేవిధమైన శిక్ష అనుభవిస్తున్నారో చూడాలి. అంతా కాకపోయినా కొంతైనా జీవన సత్యాల్ని తెలుసుకోగలగాలి. ఆనాడే తిరిగివస్తాను.
అసలు తిరిగి రాననిమాత్రం అనుకోకు, నా ప్రశ్న లకు జవాబు లభిస్తుందనే నా ఆశ. దొరకకపోతే నీ క్షణంలోనైనా నీ సమక్షానికి వచ్చి వాలతాను. చివరి క్షణాలలోనైనా నీ నీడలో ఉండకపోతే, నాకు శాంతి లభించదు.
నా గతచరిత్ర ఏమిటి, ఆమె ఎవరు అంటే అవన్నీ చెప్పలేను. ఆమె కనక వస్తే నువ్వు ఏమీ అనకు. ఒక పేషంటుకు డాక్టర్ చెయ్యగలిగిన సహాయం అంతా చెయ్యి. అదే నేను కోరేది.
తిరిగి తప్పకుండా వస్తానని మరీమరీ చెబుతున్నాను. నేను మరలివచ్చేసరికి మనోజ్ఞమైన నీ రూపం నాకు కనిపించి నన్ను పునీతున్ని చెయ్యాలి.
నా నిజస్వరూపం అంతా మళ్ళీ నీ సమక్షంలోనే! నువ్వు ఎప్పటికీ వాదానివే! నేనూ నీవాడినే!
-సారథి."
* * *
కళ్యాణి వెళ్ళాక రాధ ఆర్తి నడిగింది ఆమె ఎవరని.
"నాకు చెల్లెలు వరస అవుతుంది. కాకపోతే అక్క!"
తనక తెలియని ఈ బంధుత్వం ఎక్కడిదోనని రాధ ప్రశ్నార్ధకంగా మొహంపెట్టటం చూసి, "బాబాయి తెలుసుగదూ? వారికి దగ్గిర బంధువు!" అంది.
రాధ తృప్తిపడింది.
ఆర్తి కల్యాణిని తరుచు వస్తూ, పోతుండమన్నది. కల్యాణిని చూసి ఆర్తి ఈర్ష్యపడలేదు. ఆమె నిర్మల భావాలు చూసి కళ్యాణి దుఃఖంతో, "నేను కనిపించక పోయినా బావుండేది..." అంది.
"లేదు, కళ్యాణీ. కనిపించటమే మంచిధైంది. నువ్వు వెళ్ళు. ఇకనించీ మనం అక్కాచెల్లెళ్ళం! నానుండి నీ కే సహాయం అవసరమైన మనఃస్ఫూర్తిగా చెయ్యగలను!"
* * *
