Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 19


                    కవిత కోసం ప్రార్ధన చెయ్యండి!


    జైలులో నేను విన్న కొన్ని కదల ఇతి వృత్తాలు మనం సాధారణంగా ఆశించే మానవత్వం, సంస్కృతీ , సభ్యత మొదలైన వాటికి భిన్నము లైనవి. ఈ ఇతి వృత్తాలకు కారణ భూతులైన మనుషులు మన మధ్యనే నివసిస్తున్నారు. అందువల్ల వారి కధలు కూడా మనకు అవసరమే. ఈ కారణాన్ని పురస్కరించుకునే నేను వీటిని వ్రాయడానికి పూనుకున్నాను.
    ఉదాహరణా నికి ఈ ఆష కధను వినండి. మరి.
    అషకు నలభై అయిదేళ్ళు. మంచి రంగు . బక్కపలచగా ఉంటుంది. వీటికి తోడు డబ్బు వల్ల కలిగిన ఆ మృదుత్వం , స్టైలూ కూడా ఉన్నాయి. ఇక అడగాలా, మరి! ఆమె నడిచి వెడుతూ ఉంటె , ఎవరైనా కొంచెం ఆగి చూడదగిన ఆకర్షణ ఆమెలో ఉంది.
    ఆమెకు ముగ్గురు కుమార్తెలూ, ఒక కుమారు డూను. కొడుకు ఒక పెద్ద సంస్థలో ఎగ్జిక్యూటివ్ అయినాడు. భర్త రజత్ ఇటీవలే రిటైరయి నాడు. రైల్వే లో ఉన్నత పదవిలో ఉండేవాడు. ఆడపిల్లలు ముగ్గురూ చదువుకున్న వారే. మంచి అందగత్తె లు కూడా. ఇరవై, పద్దెనిమిది , పదహారు ఏళ్ళ వాళ్లు.
    ఆష చదువుకుంది. ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతుంది. చాలా సంస్థలలో కార్యదర్శిని గాను, అద్యక్షు రాలు గాను ఉండేది. అందువల్ల ఆమె ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. కొన్ని సమయాలలో ఆమె బయటికి వెళ్లిందంటే , రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి పదకొండు , పన్నెండు అయ్యేది.
    ఇదంతా ఆమె భర్తకు నచ్చలేదు. "ఆషా! ఇంటి పనులే ముఖ్యం. ఆ తరవాతే సాంఘిక కార్యక్రమాలు!" అనేవాడు రజత్. అయన మాటల్ని ఆమె పెడ చెవిని పెట్టేది. నిజానికి గడచిన పదేళ్లుగా అయన మాటను అతిక్రమించడానికి సహసించింది ఆష. ఇప్పుడు ఆమె స్వాతంత్ర్యం మరీ ఎక్కువయింది. అయినా కుటుంబం కట్టుబాట్లు సడల కూడదనే ఉద్దేశంతో అయన ఆమెతో పోట్లాటకు దిగేవాడు కాదు.
    సాంఘిక కార్యక్రమాలలో ఆష పాల్గొంటున్నందుకు రజత్ బాధపడలేదు. ఆయన బాధకు మరొక కారణం ఉంది. సాంఘిక కార్యక్రమాల ముసుగులో ఆష విలాస జీవితం గడుపుతున్నదని అయన అనుకున్నాడు. ఇది వట్టి అనుకోవడమే కాదు. ఆమె అలాగే జీవిస్తున్న విషయం ఆయనకు తెలుసు. తెలిసి బాధపడుతూ కూడా, కుటుంబ గౌరవం ఎక్కడ పాడవుతుందో అన్న భయం కొద్ది అయన అషను ఏమీ అడిగేవాడు కాదు. అడగడానికి వీలు లేకుండాను ఉండేది.
    అయినా ఒకసారి ఆయనే అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లి కని బయటి ఊరికి వెళ్ళిన రజత్ అనుకున్న రోజుకి ఒక రోజు ముందుగానే ఇంటికి తిరిగి వచ్చేశాడు. అప్పుడు ఆష గదిలో అయన ఒక దృశ్యం చూసేసరికి......
    ఆష ఆయన్ని ఎదిరించి జవాబు చెప్పింది. తన జీవితంలో మొదటిసారిగా రజత్ ఆమెతో కోపంగా మాట్లాడడమే కాదు, ఆమె చెంప మీద బలంగా ఒక దెబ్బ కొట్టాడు కూడా.
    ఆ రోజే ఆయన్ని విడిచి పెట్టింది ఆష. దెబ్బకు దెబ్బ మనస్తత్వం తో నగరం లోని మరొక ప్రాంతంలో ఒక బంగాళా అద్దెకు తీసుకుని అందులో నివసింప జోచ్చింది ఆష. ఆమెతో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలూ బయటికి వచ్చేశారు.
                                   
    తన విలాస జీవితాన్ని రాబడి వచ్చే జీవితంగా మార్చుకుని ఆడంబరాలకు తక్కువ లేకుండా జీవించ సాగింది ఆష. తన సౌఖ్యాలు ఎల్లప్పుడూ సాగాలనే అభిలాష తో తన ముగ్గురు కుమార్తె లనూ తన దోవలోకి దింపి తద్వారా డబ్బు సంపాదించ సాగింది.
    ఇక ఆ నగరం లో జీవించలేక పోయాడు రజత్. అవమానం భరించ లేక, మరో నగరంలో నివసించే తన కుమారుని వద్దకు వెళ్లి అక్కడే ఉండసాగాడు.
    నగరంలో రెండు రకాల జీవితాలు గడిపే ధనికులూ, అధికారులూ , పారిశ్రామిక వేత్తలూ ఆష ఇంటికి తరచుగా రాకపోకలు సాగించారు. వాళ్ళ డబ్బునీ, పలుకుబడినీ తన జీవితానికి బాగా ఉపయోగించు కుంది.
    కొన్ని నెలలు గడిచాయి.
    పెద్ద కుమార్తె వదనను ఒక కంపెనీ అధికారి ఉత్తరాది ని ఎక్కడికో పిలుచుకు పోయాడు. ఇక పొతే మిగిలిన ఇద్దరు కుమార్తెలు : షర్మిలా ఒకామె; మరోకతే కవిత. చివరి కూతురు మీదనే అందరి కళ్ళూ పడ్డాయి.
    కవిత ముఖం స్నో లా తెల్లగా ఉంటుంది. కళ్ళు కొంచెం బంగారు వన్నెతో ఉంటాయి. తల పైకెత్తి చూస్తె యువతిలా కనిపిస్తుంది.
    నడక, ఒయ్యారం , స్టైల్ అన్నీ ఆమెను ఒక అపూర్వ సౌందర్య రాశిగా ప్రతిఫలింప జేశాయి.
    ధనవంతులు ఆమె మీద మక్కువ చూపారు. "ఈవేళ కవితతో పిక్నిక్ వెళ్లాను", కవిత నాతొ సినిమాకి వచ్చింది" అని ఇలా తమలో తాము సగర్వంగా చెప్పుకోవడం మొదలు పెట్టారు.
    ఆ నగరంలో అరుణ్ అనే అతను ఒక పెద్ద లాడ్జింగ్ హౌస్ ని నడుపుతున్నాడు. అతనికి కవిత అంటే ప్రాణం! మాటిమాటికి ఆమెను తీసుకుని అతనెక్కడి కో వెడుతూ ఉండేవాడు. ఒక రాత్రో, ఒక రోజో పూర్తిగా ఉండి తిరిగి వచ్చేవాడు. అయితే బయటికి తానొక పెద్ద మనిషిగా కనిపించాలని అతని అభిలాష.
    అందువల్ల అతను స్వయంగా కవితను పిలుచుకుని బహిరంగంగా బయటికి వెళ్ళే వాడు కాదు. ఈ పనిని తన లాడ్జి లోని అటెండర్ ఒకనికి ఒప్పజేప్పాడు. అతని పేరు బాలకృష్ణన్. 'బాల్కి ' అని అందరు అతన్ని పిలిచే వాళ్లు.
    బాల్కి కవితను ఒక కారులో ఎక్కించుకుని ముందుగా వెళ్ళేవాడు. అనుకున్న ఊళ్ళోనొ , లేక బంగాళా లోనో ఆమెను దింపి , అరుణ్ రాకకోసం ఎదురు చూసేవాడు. తిరిగి వెళ్ళేప్పుడు కూడా ఇంతే. బాల్కియే ఆమెను ఇంటికి చేర్చేవాడు. అతను అన్ని విషయాలూ తనలోనే ఉంచుకునేవాడు.
    త్వరలోనే ఈ పద్దతి ఇతర వాడకం దార్ల లోనూ వ్యాపించింది. అందువల్ల బాల్కికి మంచి గిరాకీ ఏర్పడింది.
    ఒకనాటి సాయంకాలం కవితను పిలుచుకుని నగరానికి ముప్పయి మైళ్ళ దూరంలో ఉన్న గ్రామ ప్రాంతానికి వెళ్లాడు బాల్కి. అక్కడ ఏకాంత ప్రదేశంలో అరుణ్ ఒక బంగళా కట్టాడు. ఆ రాత్రి అతను అక్కడికి వస్తాడు.
    బంగళా ఎదుట బాల్కి కారు నిలిపాడు. కవిత కారులోంచి దిగి మెల్లగా నడిచి లోపలికి వెళ్ళింది.
    కారు తలుపులు మూసేసి తూర్పు వైపుగా నడక సాగించాడు బాల్కి.
    తూర్పున రెండు ఫర్లాంగు ల దూరంలో పాడుబడిన రాముల వారి ఆలయం ఒకటి ఉంది. పూజా పురస్కారాలు లేని గుడి అది.
    అక్కడికి వెళ్లి రాముల వారిని భయభక్తులతో ప్రార్ధించాడు బాల్కి. కళ్ళలో నీళ్లు తిరిగాయి. "రామా! నేను చేస్తున్న ఈ పాపాలన్నిటినీ మన్నించు" అని ప్రార్ధించాడు . తరవాత బయటికి వచ్చి మెట్ల మీద కూర్చున్నాడు.
    బాల్కి విచిత్రమైన కుర్రవాడు. అప్పుడతని వయస్సు పందోమ్మిది. పదవతరగతి వరకు చదివాడు. పేద కుటుంబం. అటెండర్ ఉద్యోగం ద్వారా నెలకు అరవై రూపాయలు సంపాదిస్తున్నాడు. దానితో తల్లినీ, ముగ్గురు సోదరుల్నీ పోషిస్తున్నాడు. నిజాయితీ కలవాడు.
    ఆష ఉంటున్న ఆ వీధి మరొక కొసను అతని ఇల్లు ఉన్నది. ఆ కుటుంబం గురించి అతనికి కొద్దిగా తెలుసు.
    గౌరవహీనంగా కవిత జీవిస్తున్నందుకు బాల్కి విచారించేవాడు. అదీగాక ఇటువంటి విషయాలలో తాను పని చేస్తున్నందు కూ అతను విచారించేవాడు.
    ఈవేళ కూడా అవే తలుచుకుని విచారిస్తూ కూర్చున్నాడు. ఇంతలో "బీం బీం" అంటూ కారు హరన్ వినిపించడంతో స్మృతుల నుంచి బయట పడి పరుగు తీశాడు.
    కారు దగ్గిర కవిత నిలబడి ఉంది.
    "ఆయనకి రావడానికి వీలు కాలేదట. ఇంటి కెవరో వచ్చారట. ఫోను చేశారు. వెళ్ళిపోదాం" అంది.
    తల వంచుకునే కారు తలుపులు తెరిచాడు బాల్కి. కవిత ఎక్కిన తరవాత తాను ముందు కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.
    కారు వేగంగా వెళ్ళింది. దోవలో ఒక నది మీద వంతెన వచ్చింది. అక్కడ కారుని అపమంది కవిత. ఆగిన తరవాత కారు దిగి, వంటనే పిట్ట గోడ మీద చేతులుంచి కవిత పశ్చిమ దిశను అవలోకించ సాగింది. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు బాల్కి. మరుక్షణం ఆమె ఎందుకలా చేస్తున్నదో అతను గ్రహించ గలిగాడు. పడమటి దిశను సూర్యస్తామానం ఒకటే రంగులమయంగా కనిపించింది. ఆ దృశ్యాన్ని కవిత చూసి సంతోషిస్తూ ఉంది. కొద్దుసేపటికి ఆమె కారు వద్దకు తిరిగి వచ్చింది.
    కారు ఎక్కింది. ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించిన దానిలా కనిపించింది కవిత. 'ఈమె మంచి పిల్లగా మారకూడదా!' అని మనస్సులో ప్రార్ధన చేసుకున్నాడు బాల్కి.
    ఒక వారం గడిచింది. ఆష ఇంట్లోంచి బాల్కి కి పిలుపు వచ్చింది. ఆ సాయంకాలం ఆ నగరంలోని సముద్రతీరాన గల ఒక బంగళా కి కవితను తీసుకుని వెళ్ళాలి. ఈ విషయం చెప్పిన ఆష అతనికి అయిదు రూపాయలు టిప్స్ ఇచ్చింది.
    కారు ఎక్కింది కవిత. సముద్రతీరం వెంబడి వెళ్ళింది కారు. చెప్పిన ఆ బంగళా ముందు కారు ఆపి బాల్కి తలుపులు తెరిచాడు. మెట్లు ఎక్కుతున్న కవిత నుద్దేశించి "ఎక్స్ క్యూజ్ మీ" అన్నాడు. ఆమె వెనక్కి తిరిగింది.
    "మళ్లీ కారుని ఎప్పుడు తీసుకు రమ్మంటారు ?"
    అతన్ని ఒక్క క్షణం కాలం పాటు చూసి ఆమె తల వంచుకుంది.
    "రేపు పొద్దున...." అంది. తల వంచుకునే ఆమె వెళ్ళిపోయింది.
    ఆ సంఘటన ఎందుకో గాని బాల్కి కి విచార హేతువయింది. "ఆమెను ఎందుకలా అడిగాను? ఈ సంగతిని ఆమె తల్లి నడిగి తెలుసుకుని ఉండవచ్చు గదా?' అని అనుకున్నాడు. కాని ఒక్క విషయం మాత్రం అతను గ్రహించాడు. జవాబు చెపుతున్నప్పుడు కవిత పరితపిస్తున్నట్లు అతను పసిగట్టాడు.
    ఇంకొకసారి అరుణ్ బంగళా కి ఒక రోజు సాయంకాలం వెళ్ళవలసి వచ్చింది. కవితను దింపేసి, మామూలు ప్రకారం అతను ఆ రాముల వారి గుడికి వెళ్లాడు.
    అప్పుడే మసక చీకటి పడుతుంది. బాల్కి తిరుగు ముఖం పట్టాడు. బంగళా లో దీపాలు వెలుగుతున్నాయి. అతని చూపు తూర్పు వైపు కిటికీ మీద పడింది. దాని గుండా వస్తున్న వెలుతురులో కవిత రూపం కనిపించింది. ఆమె తన వైపే చూస్తున్నట్టు తోచింది. అతను కారు వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆమె ఇంకా ఆ వైపే చూస్తున్నట్లు గ్రహించాడు. 'ఆమె ఎందుకిలా చూస్తుండి? ఒకవేళ నన్ను సందేహిస్తుందా?" అనుకున్నాడు.
    అరుణ్ కారు రావడంతో , ఆమె ఆ కిటికీ దగ్గిర నుంచి వెళ్ళిపోయింది.
    పొద్దున కారులో వస్తూ ఉండగా కవిత బాల్కి నడిగింది:
    "రాత్రి భోజనం చేశారా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS