Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 18


    ఆ సాయంకాలం నాలుగింటి కి చెప్పబడిన ఆ సినిమా దియేటర్ వాకిట్లో గోవిందస్వామి నిలబడ్డాడు. అయన చేతిలో డబ్బు సంచి ఉంది. కాళ్ళూ చేతులూ వణుకుతూ ఉన్నాయి. అయన అటూ ఇటూ చూడసాగాడు. నాలుగయ్యే కొద్ది అయన గుండె కొట్టుకోసాగింది. వచ్చే పొయ్యే వాళ్ళ రద్దీ ఎక్కువగా ఉంది. నేర పరిశోధన శాఖ తాలుక ఇన్ స్పెకర్, అయన మనుషులూ మామూలు దుస్తుల్లో వేర్వేరు చోట్ల నిలబడ్డారు. వాళ్ళు గోవిందస్వామి ని గమనిస్తూనే ఉన్నారు.
    నాలుగయింది. కొన్ని నిమిషాలూ గడిచాయి. గోవిందస్వామి దిగులు పడ సాగాడు. చేతి గడియారం చూశాడు. పైన చూశాడు. ఉన్నట్టుండి ఎదురుగా ఒక అబ్బాయి నిలబడ్డాడు. గోవిందస్వామి ని తీక్షణంగా , "డబ్బు సిద్దంగా ఉందా?' అని అడిగాడు.
    గోవిందస్వామి కి గొంతు పూడుకు పోయింది. మాట పెగలలేదు. ఆ అబ్బాయి చేతికి నల్లని రుమాలు లేదు. డబ్బు అతనికేనా ఇవ్వవలసింది? లేక.....
    ఆ అబ్బాయి ఆయన్ని మరోసారి తీక్షణంగా చూశాడు. ఆ తరవాత అక్కడ నిలబడలేదు. త్వరగా పరుగెత్తుకు పోయి జన సమూహం లో మాయమయ్యాడు. కాని, మామూలు దుస్తుల్లో ఉన్న పోలీసు లతన్ని విడవలేదు. తరుముకుంటూ వెళ్లి పట్టుకున్నారు.
    విచారణ చెయ్యగా, చందర్ అతన్ని పంపినట్టు తేలింది. ఆ అబ్బాయికి ఇతర విషయాలేమీ తెలియవు. అతను నిరపరాధి. అతన్ని ఈ పనికి ఉపయోగించు కున్నాడు చందర్.
    ఆ మరుక్షణం చందర్ కోసం పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. అరగంట లోగా అతన్ని పట్టుకున్నారు.
    చందర్ ఏదీ ఒప్పుకోలేదు. నేరాన్ని ఎలా కప్పి పుచ్చదమా అని అతను ఆలోచిస్తున్నట్టు పోలీసులు గ్రహించారు.
    "రమేష్ ని ఒక కోచీ లో పిలుచుకు వెళ్లాను. అంతే నాకు తెలిసింది." అని చెప్పి అపివేశాడు చందర్.
    "తరవాత ఏం జరిగింది?"
    "అతన్ని కోచీలోనే విడిచి పెట్టి నేను దిగి వెళ్ళిపోయాను."
    అతని మాటలని పోలీసులు నమ్మలేదు. ఆ కోచీని వెతికేందుకు మనుషుల్ని అన్ని చోట్ల కూ పంపించాను. కాని ఫలితం లేకపోయింది. ఊళ్ళో ఉన్న అన్నీ బండ్ల ను ఆపి విచారించడం చాలా కష్ట మనిపించింది. చివరికి షెడ్ల లోనే ఉన్న బళ్ల ను గురించి విచారిద్దా మనుకున్నారు. ప్రత్యేకింప బడిన ఒక బండిని వడివేలు అనే ఒక ముసలాయన తోలినట్లు తెలియవచ్చింది. వడివేలు ఇంటికి వెళ్లి పోలీసులు తలుపు తట్టారు.
    తలుపు తెరిచి వడివేలు బయటికి వచ్చాడు. పోలీసుల్ని చూడగానే వణికి పోయాడు. విషయం అడిగేసరికి తానె అన్నిటినీ బయట పెట్టాడు.
    ఒకరోజు రాత్రి చందర్ ఇద్దరు పిల్లలతో అతని బండి ఎక్కాడు. నగరం శివార్ల లోని ఒక చోటికి బండిని తోలమన్నారు. అందుకు వడివేలు ఒప్పుకోలేదు. చివరికి మరొక చోటికి బండిని తోలమన్నాడు చందర్.
    బండి ఒక పది నిమిషాలు వెళ్లేసరికి చిన్నపిల్లల్లో ఒకడు బండి  దిగి ముందు వైపు ఎక్కి బండి వాని దగ్గర కూర్చున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తరవాత, ఆ పిల్లవాణ్ణి బండి దిగి పొమ్మన్నాడు చందర్. ఇంకా అయిదు నిమిషాలు వెళ్ళింది బండి. ఒక చోట అపమన్నాడు చందర్.
    "బండి కొంచెం అపు. బండిలో కుర్రవాడు నిద్రపోతున్నాడు. ఇంట్లోకి వెళ్లి, కుర్రవాడ్ని తీసుకు వెళ్లేందుకు మనిషి ని పంపుతాను" అన్నాడు. ఆ తరవాత దీపాలు లేని ఒక ఇంటి ఆవరణ లోకి వెళ్లి ఎవరినో పిలిచినట్లుగా ఒక కేక వేసి, చేకట్లో మాయమయ్యాడు చందర్.
    చాలా సేపయినా చందర్ తిరిగి రాకపోవడం వల్ల వడివేలు బండి దిగి ఇంటికి వెళ్లి, తలుపు కొట్టాడు. శంకర రాం అనే అతను బయటికి వచ్చాడు. వడివేలు అతనితో విషయం చెప్పాడు. అతను బండి దగ్గరికి వచ్చి చూశాడు. లోపల ఒక మూల నిద్ర పోతున్నట్టు కనుపించిన కుర్రవాడ్ని చూశాడు. తరవాత ఆ కుర్రవాడి కీ, ఆ ఇంటికీ ఏ విధమైన సంబంధమూ లేదంటూ అతను వెళ్లి పోయాడు.
    వడివేలు కి అంతా అయోమయంగా తోచింది. బండిలో యెక్కి కుర్రవాడ్ని తట్టి లేపాడు.మరుక్షణం ఉలికి పడ్డాడు. ఒక మూలకు ఒరిగిపోయిన ఆ కుర్రవాడు కింద పడ్డాడు. తాకి చూడగా అతను మరణించి నట్లు తెలుసుకున్నాడు. వడివేలు నెత్తురు గడ్డ గట్టింది. పళ్ళు కరుచుకున్నాడు.
    తరవాత బండి ఎక్కాడు. గుర్రాన్ని అదిలించాడు. బండి శరవేగంతో పరుగెత్తింది. ఒక పార్కు దగ్గరికి వెళ్ళగానే వడివేలు కుర్రవాని మృత శరీరాన్ని పైకి తీశాడు. దాన్ని బయటికి విసిరి వేసి, ఇంకా వేగంగా బండిని తోలుకు పోయాడు.
    వడివేలు చెప్పిన విషయాలన్నింటి ని విన్నారు పోలీసులు. అతన్ని తీసుకు వెళ్లి పోలీసుల ముందు నిలబెట్టారు. అతన్ని చూడగానే చందర్ ఉలికి పడ్డాడు. ఇక నిజం దాచలేక పోయాడు. జరిగినదంతా చెప్పసాగాడు.
    రమేష్ ని తీసుకు వచ్చేందుకు నందు అనే కొత్త అబ్బాయిని వాడుకున్నాడు చందర్. నందు పక్క వీధిలోని వాడు. అతనితో రమేష్ కి కొద్దిగా పరిచయం ఉంది. నందు కి ఆశ చూపి రమేష్ ని రప్పించాడు చందర్.
    మొదట ముగ్గురూ ఒక హోటల్ కి వెళ్ళారు. కావలసిందంతా తెప్పించుకుని తిన్నారు. రమేష్ కి అంతులేని సంతోషం!
    
    తరావాత ఒక కోచి బండి ఎక్కారు. ఇంకా కోచి బండ్లు ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్నాయి. నగర శివార్ల లోని ఒక చోటికి బండిని తోలమన్నాడు చందర్. అంతదూరం వెళ్ళడానికి ఒప్పుకోలేదు బండివాడు. "అలా అయితే ఇక్కడికి వెళ్లు"అని మరొక ప్రాంతం పేరు చెప్పాడు.
    బండి జరిగింది. గుర్రపు బండి కావడం వల్ల వెళ్ళేటప్పుడు చప్పుదవుతూ ఉండేది. కొంచెం దూరం వెళ్ళిన తరవాత బండిని అపమన్నాడు చందర్. కోచీ తలుపు తెరిచి , కిందికి దిగి , నందు బండి వాడు కూర్చునే చోటికి దగ్గరగా యెక్కి కూర్చున్నాడు. అతన్ని అలా చెయ్యమన్నది చందర్. ఆ తరవాత బండి మళ్లీ జరిగింది.
    లోపల చందర్ రమేష్ తో పాటు కోర్చున్నాడు. అతని మనస్సులో సంఘర్షణ ఒకటి సాగుతూవచ్చింది.
    రమేష్ ని ఒక చోట దాచి ఉంచి, రమేష్ తండ్రి వద్ద నాలుగు వేల రూపాయలు రాబట్టుకోవాలని చందర్ అభిలాషించాడు. అయితే ఇప్పుడు అతని కో సందేహం కలిగింది. రమేష్ ని ఎక్కడ దాచి ఉంచడం? అది ఎలా వీలవుతుంది? తరవాత అతని తండ్రి వద్ద డబ్బు ఎలా రాబట్టుకోవడం?
    బండి పోను పోను అతనిలో ఆదుర్దా ఎక్కువయింది. రమేష్ ని ఎక్కడికో ఒక చోటికి తీసుకు వెడితే  , అది నందు కి తెలిసి పోతుందని చందర్ అనుకున్నాడు. నందు కి చందర్ దురభిప్రాయం తెలియదు. అతన్ని తన పనికి ఒక సాధనంగా ఉపయోగించు కున్నాడు చందర్.
    ఉన్నట్టుండి ఒక నిశ్చయానికి వచ్చేశాడు! ఆ భయంకర దృశ్యాన్ని తలుచుకుంటేనే అతనికి వణుకు పుట్టింది.
    రమేష్ ని చూశాడు. అభమూ శుభమూ ఎరగని ఆ పిల్లవాడు బండిలో ఒక మూలగా కూర్చున్నాడు. అలా ఒక్క క్షణం. మరుక్షణం రమేష్ గొంతుని చందర్ చేతులు గట్టిగా అదిమి వేశాయి. కుర్రవాడు ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    నగరం నడి వీధిలో బండి వెడుతున్న ఆచప్పుడు లో ఒక హత్య జరిగింది.
    చేతులు తీసివేసిన తరవాత చందర్ గుండె కొట్టుకుంది. చెమట కళ్ళలోకి కారు చూపుని అడ్డగించింది. ఎంత పని చేశానా! అనుకున్నాడు. కుర్రవాడు కళ్ళు తెరిచి లేవకూడదా అనుకున్నాడు. అతని శ్వసనూ, గుండెనూ తాకి తాకి చూశాడు. రెండూ మౌనంగా నిద్ర పోతున్నాయి.
    తరవాత బండి ఒక చోట అపమన్నాడు. కిందికి దిగి, వడివేలు ని మోసగించి మాయమయ్యాడు. మరునాడు బెదిరింపు ఉత్తరాలు వ్రాసి గోవిందస్వామి పంపాడు.
    పార్కు దగ్గర పడి ఉన్న రమేష్ మృత శరీరాన్ని మరునాడు ఆ పోలీసు స్టేషను కి చెందిన పోలీసులు చూశారు. కుర్రవాడేవరో వాళ్లకు తెలియలేదు. మృత శరీరాన్ని శవ పరీక్ష కు పంపించారు. అ తరవాత అతనే గోవిందస్వామి కుమారుడు రమేష్ అని తెలియ వచ్చింది.
    కోర్టు విచారణ జరిగే సందర్భంలో మానసికంగా బాధపడుతున్న వాడిలా కనిపించాడు చందర్. లోలోపల ఏదో అనుకుని అనుకుని విచార పడుతున్నట్టు కనిపించింది. అతనికి న్యాయమూర్తి మరణ శిక్ష విధించాడు. శిక్ష పడినట్లు వినగానే, "నాకిది కావలసిందే" అని చందర్ బిగ్గరగా అరిచాడు.
    అప్పీలు లో కూడా మరణ శిక్ష ఖాయం చెయ్యబడింది.
    జైలు లో చందర్ గడిపిన కొన్ని నెలల జీవితం విచిత్రమైంది. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడు. సరిగా అన్నం తినడు. మనస్సులో దేన్నో తలుచుకుని తలుచుకుని విచార పడుతున్నట్టు కనిపించేది. ఎవరైనా అతడు చేసిన నేరం గురించి అడిగితె, "సార్! ఆ కుర్రవాడు చావకుండా బతికుండకూడదా? బతికుండ కూడదా, సార్!" అని మాటి మాటికి అనేవాడు.  ఉన్మత్తుని లా జైలు కటకటాలకు తన తలను మోటించి నెత్తురు వచ్చేంత వరకూ రుద్దేవాడు.
    అతని మానసిక వ్యధ ఆరోజు కా రోజు ఎక్కువవుతూ వచ్చింది. ఒకనాటి రాత్రి ఉన్నట్టుండి ఒక పెద్ద అరుపు వినిపించడంతో జైలు కాపలాదారు దిగ్భ్రాంతి చెండాడు. అరుపు విన వచ్చిన వైపుగా పరిగెత్తాడు. చందర్ గదిలో నుంచి ఆ శబ్దం వచ్చింది. జంతువులా భయంకరంగా అరుస్తూ గదిలో అటూ ఇటూ పరిగెత్తుతూ ఉన్నాడు చందర్.
    "ఏయ్, మాట్లాడకుండా ఉండు." అని అరిచాడు కాపలావాడు.
    కాని, చందర్ వినిపించుకున్నట్టు లేదు. పిచ్చిపట్టిన వానిలా గది చుట్టుతా పరుగెత్తాడు. అతని అడుగుల చప్పుడు దుం ధూం అంటూ గది గోడల మీద ప్రతి ధ్వనించాయి. ఒళ్ళంతా చెమటలు కారుతున్నాయి. దెబ్బతిన్న జంతువులా అతను అరుస్తూనే ఉన్నాడు.
    "ఒరేయ్ -- అపు" అని బిగ్గరగా అరిచాడు కాపలావాడు.
    ఆ అరుపును విని ఒక్క క్షణం ఆగాడు చందర్. కాపలావాడు అతన్ని ఎగాదిగా చూశాడు. చందర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఒక్క క్షణమే అతనలా నిలబడ్డాడు. తరవాత మళ్లీ ఏవేవో కేకలు వేస్తూ గది చుట్టూతా పరుగెత్తడం మొదలు పెట్టాడు.
    తాను చేసిన హత్యను తలుచుకుని అతడు భయపడ్డాడా? చచ్చిపోయిన వాడు దయ్యమై పట్టి పీదిస్తున్నాడా? లేకపోతె జరిగినవి తలుచుకుని ఉన్మత్తుడయ్యాడా? ఎవ్వరికీ తెలియదు.
    అరగంట సేపు గది చుట్టూతా పరుగెత్తాడు. తరవాత మైకం వచ్చి డామ్మని కింద పడ్డాడు.
    ఆ మరునాడు మొదలుకొని అతనిలో ఏదో ఒక మార్పు! ఏదో తలుచుకుని ఏడుస్తూనే ఉండేవాడు.
    అతను దయ చూపమని రాష్ట్రపతి కి పెట్టుకున్న అర్జీ నిరాకరించ బడింది. త్వరలోనే అతనికి విధించబడిన మరణ శిక్ష నెరవేర్చబడింది కూడా.

                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS