బండి కదిలేముందు రాజశేఖరం "అసలీ జబ్బు పెళ్ళికి ముందే ఉందేమో" అన్నాడు.
రంగనాధం కొంచెం కంగారు పడి "అబ్బే లేదు బావా...." అన్నాడు.
ఇంతట్లో ఎలా ముంచుకు వస్తుందయ్యా" అన్నాడు రాజశేఖరం.
"అంటే మీ ఉద్దేశం?" అంది సుభద్రమ్మ.
"నువ్వు అంబ కాళిలా మీదపడకు. తొందరపడ్డాం అనిపిస్తుంది అప్పుడే అనుమానం తగిలి ఉంటె బాగుండేది."
రంగనాధం పెళ్ళిలో ఒకప్పుడు చేసిన గొడవకి, రభస కి రాజశేఖరం ఈ అవకాశం వదలకుండా దేబ్బతీశాడని గ్రహించి "ప్రమాణం చేసి చెబుతున్నా అన్నాడు.
'అప్పట్లో పైకి తేలకపోయినా పెళ్ళి జరిగిన తర్వాత ఇలాంటి జబ్బులు బయట పడుతుంటాయి. అన్నాడు రాజశేఖరం.
సుభద్రమ్మ "ఏదో జరిగిపోయిందిగా ఇప్పుడు ఏం అనుకోని ఏం లాభం?' అంటూ సర్దేసింది.
11
అద్దం లోంచి ముఖం చూసుకుంటే తన మార్పు తనకే కొట్టావచ్చినట్టుగా కనిపించింది రాధమ్మ కు. ముఖం జబ్బు ముఖంలా కనిపిస్తుంది బాగా పీక్కుపోయింది. నీరసంగా అనిపిస్తుంది.
రంగనాధం మాట పడ్డాననే అభిమానంతో మటమటలాడుతూ రాజశేఖరాన్ని తిడుతున్నాడు. తల్లి కూడా గొంతు కలిపింది.
"తొందరపడి ఈ పెళ్ళి చేశారట. వారి తమ్ముడిని మనం మోసం చేశామట. అతనలా అంటుంటే ప్రాణం చచ్చిపోయింది. వాళ్ళకి మల్లె తెలిసి తెలిసి మనం ఈ పెళ్ళి జరిపించలా." అన్నాడు రంగనాధం.
"ఏమిటీ రాజశేఖరం అంతమాట అన్నాడూ?" అంది తల్లి ముక్కు మీద వేలు వేసుకుని.
"అనరూ- అంటారు. లోకువగా ఉంటె ఎన్నయినా అంటారు. కామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగా అనిపిస్తుందిట వాళ్ళు మోసం చేశారని అంతా చేస్తారని అనుకున్నారు కాబోలు" అంటుంది వదిన గారు.
"మాట తేలిగ్గా అనేశాడు."
"పెళ్ళయిం తర్వాత ఖర్మ కాలి జబ్బు చేస్తే వదిలేస్తారా ఏవిటే. పెళ్ళి చేసుకున్న తర్వాత కష్టం అయినా, నష్టం అయినా భరించక తప్పదు. ఎన్నాళ్ళని వూరుకుంటారు?" అని అంటుంది వదిన.
రాధమ్మకు ఈ ఘర్షణ అంతా వినిపిస్తోంది. ఆమెకు ఈ ధోరణి బాధాకరంగా ఉంది. ఆమెకు రాజశేఖరం బావ ధోరణి కష్టం కలిగించింది. ఆయనేమీ తనని భరించనని అనలేదు. అయినా అక్కడే ఉంటె జరుగుబాటు ఉండదని తగ్గుతుందని తగ్గిం తర్వాతే అక్కడకు వెళ్ళవచ్చు నని తాను అనుకుంది. అందుకే వచ్చింది ఇక్కడకు బావ ధోరణి చూస్తె ఇక తాను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి పోవాలని కాబోలు. నెమ్మదిగా తమ భార్య భర్తల మధ్య అనుబంధం తెంపేసి తన్ని అయన నుంచి వేరు చేసి ఆయనకి ఇంకో పెళ్ళి చెయ్యాలని కాబోలు ఆయనగారి చింత.
వదినగారి ధోరణి ముదురు పాకంలో పడింది. తల్లి వారిస్తున్నా వినకుండా ఆమె ఇంకా గొడవగా అరుస్తూనే ఉంది.
రంగనాధం భార్యని సమర్ధిస్తూ అవునే దాని పిల్లల జాగ్రత్త దానిది దాని కొచ్చిన జబ్బు ఏం తక్కువదా." అన్నాడు.
ఆమె చెప్పినట్టు చేసినా ఇంకా అనుమానమే ఇంట్లో ఎవరైనా కాస్త కలత బడితే ఆమె ఊరంతా గొడవ చేస్తుంది. చీటికీ మాటికీ పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది.
"పొతే పొమ్మనకూడదు . వాడంతకంటే చవట. దాని కాళ్ళు పుచ్చుకుంటున్నాడు." అంది తల్లి తన దగ్గర కొచ్చి.
'నా మూలాన ఆమె వెళ్ళిపోవటం దేనికి? నాలుగు రోజులు అగలేకపోయారా ?" అంది రాధ.
తల్లి వలవలా ఏడ్చేసింది. "హాయిగా సంసారం చేసుకుంటున్నవనుకుంటే ఇదేక్కడ్నించి దాపురించిందే తల్లి నీ ప్రాణానికి" అంటూను.
ఇక ఇక్కడ్నించి వెళ్ళిపోతే బాగుండును అనిపిస్తుంది రాధమ్మ కు. ఇంట్లో పోరు పెరిగిపోయింది.
ఆఖరికి ఓ నాడు వదిన ఇంట్లో పెద్ద గొడవ లేవదీసి పుట్టింటికి వెళ్ళిపోయింది . పిల్లల్ని తీసుకుని రంగనాధం కావాలని పంపించాడని తల్లి అంటుంది. ఎంతవరకూ సబబో మరి.
ఓరోజు తనకి బాగా జ్వరం వచ్చేసింది. నూట రెండు దాటిపోయింది. మంచం మీద లేవ లేకపోయింది. రంగనాధం తనయితే హోటల్లో భోజనం చేస్తాడు. ఇంట్లో పరిస్థితి? తల్లి లేవక తప్పలేదు. అలాగే మూలుగుతూ , ముక్కుతూ అంత జ్వరం లోనూ నాలుగు మెతుకులు వండి పడేసింది. ఈ హైరాణా లో ఆమెకు ఇంకా జ్వరం పెరిగిపోయింది.
రాధమ్మ రాత్రంతా వలవల ఏడుస్తూ గడిపింది. తెల్లవారుతుంది అంటే ఆమెకు భయంగా వుంది. ఏవిటి భగవంతుడా ఈ ఖర్మ? ఇక తనకి ఇక్కడ్నించి మోక్షం లేదా? ఈ రోగం నయం కాకపోయినా ఫర్వాలేదు. ఈ ప్రాణాలు నాలుగు రోజులు అటూ ఇటూగా పోయినా ఫర్వాలేదు. కాని తనకి కావాలసిందల్లా ఈ నాలుగు రోజుల పాటయినా ఆప్యాయతా, ఆదరణ ఉండే వాతావరణం లో ఉండాలని ఉంది" అని అన్పిస్తుంది.
తెల్లవారి లేచేసరికి గుమ్మం ముందు బండి కనిపించింది. బండి లోంచి భర్త దిగాడు. ఆమె గబగబా లేచి ఎదురు వెళ్ళాలని ప్రయత్నించింది. కాని, రాత్రంతా నిద్ర లేదేమో మంచం మీంచి లేవలేకపోయింది.
చలపతి హుషారుగా చేతిలోనూ, చంక ల్లోనూ పొట్లాలు ఇరికించుకుని లోపలికి వచ్చాడు.
అలా భర్తను చూడగానే ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది.
వస్తూనే "పగలయితే రోజంతా బండిలోనే గడపాల్సి వస్తుందని, రాత్రి ప్రయాణం సాగించాను. ఏవిటి ఇక్కడ మీ వాళ్ళంతా గొప్ప గొప్ప వైద్యాలు జరిపించి ఏదో నయం చేయిస్తారనుకుంటే ఇలా చిక్కిపోయావు?" అన్నాడు. చలపతి కుర్చీ మంచం దగ్గరా లాక్కుని కూర్చుంటూ.
'అన్నయ్య అయితే అల్లంత దూరంలో గుమ్మంలో నిలబడే మాట్లాడతాడు. ఆ అన్నయ్య ఇప్పుడు ఇక్కడ ఉంటె బాగుండును" అనుకుంది రాధ.
"ఇన్నాళ్ళకు గుర్తుకు వచ్చానా?' అంది ఆమె.
"ఇన్నాళ్ళకయినా రాగలిగాను. సంతోషించు ఏ రోజుకారోజు నువ్వే వస్తావని ఎదురు చూసి చూసి ఇక ఆఖరికి చొరవ చేసి వచ్చేశాను. ముఖ్యంగా నిన్ను తీసుకు పోదామని వచ్చాను."
రాధమ్మ పేలవంగా నవ్వేసింది. "ఈ పరిస్థితుల్లో నన్ను తీసుకు వెళ్ళి ఏం చేస్తారు?" అంది.
"ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి నయం చేయించుకోలేక పోయావు. ఇక్కడే ఉంటె నువ్వు ఇంకా చిక్కి పోతావు." అన్నాడు చలపతి.
"ఎన్నాళ్ళైనా ఉంటాను . ఏం? ఇది నాకు కొత్త చోటా? అమ్మ పాపం రాత్రి పగలూ లేకుండా చాకిరీ చేస్తింది."
ఇంతలో తల్లి చలపతి గొంతు విని లోపలికి వచ్చింది. ఇంత ,ముఖం చేసుకుని కుశల ప్రశ్నలు వేసి ఆమె మళ్ళీ బావి దగ్గరకు వెళ్ళిపోయింది.
చలపతి ఆ గదిని పరిశీలిస్తుంటే "నేనే ఈ వేర్పాటు చేయించాను పిల్లలు అస్తమానూ ఇటు వస్తుంటే వాళ్ళని రానివ్వకుండా ఆ తలుపు వేయించేశాను" అంది.
"ఇంట్లో హడావుడి వినిపించటం లేదే?"
"వదిన వాళ్ళు పుట్టింటికి వెళ్ళారు."
"ఇప్పుడు ఒక చెంపని నువ్వు మంచాన పడి వుంటే ఇప్పుదావిడ పుట్టింటికి వెళ్ళటం దేనికి?"
ఎందుకో ఈయనకు ఈ అరాలన్నీ. 'సరే, మీరు చెప్పేది మరీ బావుంది. నేను వచ్చాను గదా అని ఆవిడ పుట్టింటికి వెళ్ళటం మానుకుంటుందా?" అంది.
"అంతేనా ఏమైనా గొడవ లోచ్చాయా?' అన్నాడు చలపతి.
రాధ కొంచెం సర్దుకుని "అబ్బే....ఆమె ఊరుకే వెళ్ళింది. గొడవ లెందుకు వస్తాయి?' అంది.
"డాక్టరు గారు రోజూ వస్తున్నారా?" అన్నాడు చలపతి.
"ఈ రెండు నెలలూ రోజూ వైద్యం జరిపించాడు అన్నయ్య" అంది రాధ.
అతనికి ఆమె ఆరోగ్యం తీరు చూస్తుంటే ఆమె చెప్పింది సబబుగా తోచలేదు.
మీ వాళ్ళు చాలా బాగానే చూశారు కాని ఇక్కడ వాతావరణం నీకు సరిపడలేదు. అందుకే నీ ఆరోగ్యం ఇలా ఉంది. యిక్కడే ఉంటే నీ ఆరోగ్యం ఇంకా పాడయి పోతుంది." అన్నాడు.
"అదే అంతా అంటున్నారు. అన్నయ్య జాతకం అలాంటిది. వాడు ఎంత చేసినా మాటపడక తప్పదు.
"అది సరేలే. మీ అన్నయ్య చాలా కష్టపడ్డాడని నేను ఒప్పుకుంటూన్నానుగా. కాని ప్రస్తుతం ఇక్కడ్నించి మకాం మార్చేయాలి. తప్పదు . నీ బట్టలు, సామాన్లు సర్దేసేయ్యి."
చలాపతి అక్కడ ఆమె కోసరం అప్పటికే చేసిన ఏర్పాట్లు వివరించాడు. ఓ వంట మనిషిని కుదిర్చాడు. ఆమె కేవలం వంట మాత్రమే కాకుండా ఆమెకు అడుగడుగునా ఆడుకుంటూ వుంటుంది కూడాను. ఆమెకు సపర్య చేస్తుంది కూడాను.
` రాధ భర్త అలా చెబుతుంటే వదిన అన్నయ్య ఇక్కడ ఉంటె బాగుండును అనిపించింది. వాళ్ళకి చెప్పు దెబ్బలు కొట్టినట్ట్టుగా అయన ధోరణి వుంటుంటే బుద్ది వస్తుందేమో."
"వింటున్నావా అమ్మా" అంది తల్లితో.
"వింటున్నానమ్మా నేనేం చెప్పను" అందామె.
రాధకు నిండు గర్వం ! అన్నగారు రాగానే భర్త అన్నవన్నీ చెప్పింది. అతను వచ్చేసరికి సాయత్రం బాగా పొద్దు పోయింది. అతను వచ్చేసరికి చలపతి మంచం మీద కూర్చుని భార్యకు బట్టాయికాయిల తొనలు ఒలుస్తున్నాడు. రాధ తల దువ్వుకుని ముస్తాబై వుంది.
రంగనాధం గుమ్మం లోంచి కాస్త లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని చలపతి ని పలకరించాడు. ""చెల్లాయికి వైద్యం బాగానే జరుగుతోంది కాని, ఎందుకో అంతగా ఆరోగ్యం ఇంప్రూ కాలేదు" అంటూ.
"పోనీండి. మీరు చెయ్యగలిగింది మీరు చేశారు. ఇక్కడ వాతావరణం ఈమెకు సరిపడక పోవచ్చు. నేను తీసుకు వెళ్ళి వైద్యం చేయించాలనే వచ్చాను" అన్నాడు చలపతి.
రంగనాధం తనకి మనస్సులో ఉన్నదే జరగబోతున్నందుకు తెరిపిన పడ్డట్టుగా లోలోపల సర్దుకుని పైకి మాత్రం "చెల్లాయి వస్తానన్నదా? పోనీ నాలుగు రోజులు ఇక్కడే ఉండకూడదు" అన్నాడు మర్యాద కోసం.
"ఎందుకు రాదు? ఇక్కడ ఆరోగ్యం కుదుట పడనప్పుడు రాక ఏం చేస్తుంది?" అన్నాడు చలపతి.
ఇక్కడ తాను చేయించిన వైద్యాలు , అయిన ఖర్చులు రంగనాధం పావుగంట సేపు ఏకరవు పెట్టాడు. తల్లి కూడా గుమ్మం వార నిలబడి కొడుకు మాటలకి వంత పలికింది.
"రాధ చాలా హుషారుగా ఉంది. ఇవాళ వాళ్ళాయన వచ్చారని కాబోలు" అంటూ రంగనాధం పరాచికం ఆడాడు.
చలపతి రాదని తీసుకుని ఆరోజే ప్రయాణం అయ్యాడు. స్టేషను కి తల్లి, రంగనాధం వెళ్ళారు. చలపతి భార్య కోసమని కొన్ని ప్రత్యేకపు ఏర్పాట్లు చేయించాడు. ఓ బెర్తు పూర్తిగా రిజర్వు చేయించి దాని మీద పడుకుందుకు వాలుగా పక్క వేయించాడు. ఆమెకు కావాల్సిన మందులూ, పళ్ళూ కొన్నాడు.
బండి కదలిపోయేముందు అతని ప్రవర్తనకి నిశ్చేష్టులయి నిలబడ్డ రంగనాదాన్ని , తల్లిని రాధమ్మ పలకరించింది. ముక్కు నులుపుకుంటూ గర్వంగా, ధీమాగా "ఇక మీరు ఏ దిగులూ , భయాలూ, భాధలూ లేకుండా నిశ్చింతగా ఉండండి. ఎప్పుడయినా ఓ ఉత్తరం ముక్క రాస్తుండండి. అంది.
చలపతి తాను కొన్న పళ్ళు సంచిలో సర్దుతూ ఈ మాటలు వినిపించుకోలేదు.
రంగనాధం చిన్న బుచ్చుకున్నాడు. తల్లి కన్నీరు పెట్టుకుంది.
బండి కనుచూపు దూరం పోయేవరకూ రాధ బందిలోంచి చేతులు ఊపుతూనే ఉంది. చలపతి కూడా పక్క కిటికీ లోంచి తల ఇవతల పెట్టి చూస్తున్నాడు.
"చిత్రంగా ఉంది నాయనా. అలా నలుగురూ అనుకున్న చలపతేనా ఈ అల్లుడు అనిపిస్తుంది." అంది రంగనాధం తల్లి. ఆమె ఆశ్చర్యంగా ముక్కు మీద వేలు వేసుకుంది.
రంగనాధం పశ్చాత్తాప స్వరంతో "మనమే తొందరపడ్డాం. ఇలాంటి వ్యక్తీ అని తెలుసుకోలేక పోయాం." అన్నాడు.
'అంత చెడిపోయిన మనిషికి కూడా భగవంతుడు అంత అపేక్ష పెట్టాడు. అమ్మాయికి ఇంత కష్టం వచ్చింది. ఈ కష్టంలో అతని ఆదరణ ఆప్యాయత అదే అండ" అందామె.
రంగనాధం కావాలని రాజశేఖరం పేర ఉత్తరం రాశాడు. "మేం ఎంత వారించినా వినకుండా రాధను చలపతి వచ్చి తీసుకుపోయాడు. అక్కడే వైద్యం చేయిస్తాడుట. ఆమె కోసరం అక్కడ ఓ వంట మనిషిని కుదిర్చాడుట. ఇద్దరు డాక్టర్ల ని ఏర్పాటు చేశాడట. నర్సు రోజూ ఇంటికి వచ్చి ఇంజక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయించాడుట. విశాఖపట్నం లో పెద్ద హాస్పిటల్ ఉందట. ప్రత్యేకంగా T.B. స్పెషలిస్టు లు అక్కడ ఉన్నారుట. అక్కడికి తీసుకెళ్ళి ఓ సారి పరీక్ష చేయిస్తాదట. వాళ్ళు ఇంకా లేటెస్టు మందులేమైనా చెబుతారేమోనని ఎవరో సలహా చెప్పారట.' అంటూ రాశాడు.
అతను ఉత్తరం పోస్టులో వేసిం తర్వాత ఓనాడు రాజశేఖరం స్టేషన్లో కొట్టిన దెబ్బకు సరికి సరయిన సమాధానం ఇచ్చినట్టుగా తృప్తి పడ్డాడు రంగనాధం.
