ఫారిన్ సెంట్?
"ఒక డబల్ రూం కావాలి" అన్నాడతను.
"నో ప్రోబ్లం. మీ పేర్లు చెప్పండి" అంది రిసెప్షనిస్టు.
"నా పేరు రంగారావు" అన్నాడతను.
"ఆమె పేరు...."
"ఆమె నా భార్య...." అన్నాడతను.
రిసెప్షనిస్టు సన్నగా నవ్వుకుని "అడుగో బేరర్-రూం నంబర్ పదిహేడని చెప్పండి" అంది రంగారావు, అతని భార్య బేరర్ సాయంతో గదికి చేరుకున్నారు.
"మీకేం కావాలంటే అది తెస్తాను" అన్నాడు బేరర్.
"నాక్కావలసిందల్లా ఒక్కటే-తెల్లారేదాకా యీ గదికి యింకెవ్వరూ రాకపోవడం" అన్నాడు రంగారావు, బేరర్ రంగారావును చూసి నవ్వుకున్నాడు. కొత్తగా పెళ్ళైనా అయుండాలి లేదా చాలా రోజుల తర్వాత భార్యను కలుసుకుంటూ వుండివుండాలి అని అనుకున్నాడు.
బేరర్ వెళ్ళగానే తలుపులు వేసి "అమ్మయ్య!" అని శీఘ్రంగా ఆమెను సమీపించి బలంగా కౌగలించుకున్నాడు రంగారావు. ఆమె అతని కౌగిట్లో ఒదిగి పోయింది. అలా యిద్దరూ పదినిముషాలైనా వుండిపోయారు.
ఆమె నెమ్మదిగా అతన్ని విడిపించుకుని "ఫ్రెష్ గా వుంటుంది. స్నానంచేసి వస్తాను" అంది.
"స్నానం నేనూ చేస్తాను" అన్నాడు రంగారావు.
ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. సిగ్గు కళ్ళలో ఏ రంగూ లేకుండా స్పష్టంగానే ప్రతిఫలించింది. ఆ సిగ్గు అతనికెంతో నచ్చినట్టుంది. అందులోనూ సిగ్గుతప్ప అభ్యంతరంలేని ఆమె చూపులు అతన్ని ఉత్సాహపరిచాయి.
ఇద్దరూ స్నానాలఆదిలో గంటసేపు జలక్రీడలాడారు.
"ఈ హోటల్ బాగుంది కదూ?" అన్నాడతను స్నానం పూర్తయ్యాక.
"నాకు హోటల్ కనబడటంలేదు. ఎటు చూసినా మీరే కనబడుతున్నారు-మీరు నాకు యెప్పుడూ బాగుంటారు" అందామె.
అతనామెను దగ్గరగా లాక్కుని "నీకు భగవంతుడు చక్కనిరూపు యిచ్చాడు. నీ కళ్ళకు వశపర్చుకునే చూపుఇచ్చాడు. ఈ రెండింటికే మతిపోయి చస్తూంటే యింకా అద్బుతమైన ఆ పలుకులెందుకు? ఆడదానికి తెలివితేటలు జతగూడితే మగాడు చిత్తే!" అన్నాడు.
ఆమె నవ్వి-"మిమ్మల్నే చిత్తుచెయ్యాలన్న సరదా నాకు లేకపోలేదు. మిమ్మల్ని చూస్తూనే పరవశించి వశం తప్పే నా మనసు అందుకు సహకరించడంలేదు-" అంటూ ఆవులించింది.
"అప్పుడే ఆవులిస్తున్నావు...." అని నవ్వాడతను-"ఎన్ని దొంగవేషాలు వేసినా ఈ రాత్రికి నిన్ను నిద్రపోనివ్వను...."
"మా ఎదుట నన్ను నేనే మరిచిపోతాను-నిద్రను మరువలేనా?" అని కిలకిలా నవ్విందామె.
2
"ఎస్-డిటెక్టివ్ వెంకన్న స్పీకింగ్!" అన్నాడు వెంకన్న.
"నేనండి ద్వారకా లాడ్జి ప్రొప్రయిటర్ సూరిబాబును మాట్లాడుతున్నాను. మీ రొక్కసారి దయతో మా హోటల్ కు రావాలి-" అన్నాడవతలి వ్యక్తి.
"ఏమిటి విశేషం?"
"హత్య!" అన్నాడు సూరిబాబు.
వెంకన్న తక్షణం ఫోన్ పెట్టేసి-"ఫోన్ కాల్ విన్నారు కదా-ఏమని నోట్ చేసుకున్నారు-" అన్నాడు తన అసిస్టెంట్సు సీతమ్మ, రాజమ్మలవంక తిరిగి, అతనికి ఏ ఫోన్ కాల్ వచ్చినా అతనితోపాటే వాళ్ళు వినే ఏర్పాటుంది అక్కడ!
సీతమ్మ చాలా సీరియస్ గా ముఖంపెట్టి-"రాత్రి మీకు చాలా కబుర్లు చెప్పాలనుకున్నాను. కానీ మీరు మంచం చేరుతూనే గుర్రుపెట్టి నిద్రపోయారు..." అని చదివింది.
వెంకన్న తన ముఖం గంభీరంగా చేసి-"వంటింటి ఫోన్ కాల్స్ మీరు వినకూడదని నేను చెప్పలేదూ?" అన్నాడు.
అతని ఆఫీసూ, ఇల్లూ ఒకటే! కానీ వెంకన్న భార్య పద్మావతీ దేవి ఆఫీసులో అడుగు పెట్టదు. అతనితో మాట్లాడాలంటే వంటింట్లోంచి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ అసిస్టెంట్సు వినకూడదని అతను శాసించాడు. వాళ్ళు అతని శాసనం మన్నించినా అప్పుడప్పుడు చనువు కొద్దీ అతణ్ణి ఎగతాళి పట్టిస్తూంటారు.
"చిన్న పొరపాటు.....మన్నించండి...." అంది సీతమ్మ.
"ఇది చిన్న పొరపాటు కాదు. అవతల సూరిబాబు హత్య అంటున్నాడు. మీరేమో నామీద జోకులు వేస్తున్నారు. హత్య గురించి విన్నప్పుడు సీరియస్ గా ఉండడం నేర్చుకోండి-" అని వెంకన్న వాళ్ళకు తన తదుపరి కార్యక్రమం చెప్పి అక్కణ్ణించి కదిలాడు.
వెంకన్న వెళ్ళేసరికి రిసెప్షనిస్టు అతన్ని విష్ చేసి రూం నంబరు పదిహేనుకు వెళ్ళమంది. అతనక్కడికి చేరుకునే సరికి పోలీసు బలగం సిద్దంగా వుంది. ప్రొప్రయిటర్ సూరిబాబు కూడా అక్కడే వున్నాడు. వెంకన్న కళ్ళు శవంకోసం వెతికాయి.
మంచంమీద వుంది శవం! గుండెల్లో పిడివరకూ దిగి వుంది చాకు!
సూరిబాబు అతనికి వివరాలు చెప్పాడు.
నిన్నరాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో రంగారావు అనే అతను తన భార్యతో కలిసి ఈ గది తీసుకున్నాడు. ఉదయం ఏడుగంటలకు బేరర్ వెడితే గది తలుపులు తోయగానే తెరుచుకున్నాయి. మంచంమీద రంగారావు చచ్చి పడుకున్నాడు. అతని భార్య గదిలో లేదు.
"వెంకన్నగారూ! మన పోలీసు డిపార్టుమెంటుపై నాకు చాలా గౌరవం వుంది. కానీ వారు కొన్ని పద్ధతులకు కట్టుబడి పరిశోధించాలి కదా-అందువల్ల పరిశోధనకు కాస్త ఆలశ్యం కావచ్చు. ఇది ముందుగా పధకంవేసి చేసిన హత్య అని నాకు అనుమానం. నా హోటల్ గదిని హత్యాస్థలంగా ఎన్నుకోవడం నాకు చాలా విచారంగా వుంది. ఆ హంతకుడు లేక హంతకురాల్ని మీరు వీలైనంత త్వరగా పట్టుకోవాలి. నా హోటల్లో హత్య జరగడం హంతకులకు ప్రమాదకరమని రుజువుకావాలి. మీరు కోరిన ఫీజు యిస్తాను" అన్నాడు సూరిబాబు.
ఇన్ స్పెక్టర్ జగదీశ్ చాలా హడావుడిగా వున్నాడు. అక్కడ చేరిన కొంతమంధిని అతను వరుసగా ప్రశ్నలు వేస్తున్నాడు. అతను వెంకన్నను చూసి పెద్దగా ఏమీ చలించకుండా "మీ రిక్కడికి యెలా వచ్చారో చెప్పగలరా?" అనడిగాడు.
"నడిచి వచ్చానంటే పాతజోకు అవుతుంది. పోలీస్ ఇన్ స్పెక్టర్లకు పాతజోకులు చాలునని నాకు తెలుసు. అయినా పాతజోకులు వెయ్యడం ఈ వెంకన్నకు పరువు తక్కువ. కాబట్టి కొత్తజోకు వేస్తాను."
"వెయ్యండి" అన్నాడు జగదీష్.
"ఈ హత్యను నేను కలలో చూశాను. కలలో నిజం ఎంతుంటుందో తెలుసుకుందామని ఇక్కడకు వచ్చాను. కొంతయినా వుంది" అన్నాడు వెంకన్న.
"కలలో హత్య చూస్తే హంతకుణ్ణి కూడా చూసేవుంటారు" అన్నాడు జగదీష్.
"అవును చూశాను...." అన్నాడు వెంకన్న.
"పోలీసుల దగ్గర జోకులువేస్తే పీక పట్టుకుంటుంది. హంతకుడెలా వుంటాడో చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు మీకుంది" అన్నాడు జగదీష్ సీరియస్ గా.
"నేను ఉత్తమపౌరుణ్ణి నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తాను. ఎటొచ్చీ నేను కవిని, చిత్రకారుణ్ణి కాను కాబట్టి హంతకుణ్ణి వర్ణించలేను, చిత్రించలేను. మీరు ఫోటోలు చూపిస్తే గుర్తించగలను" అన్నాడు వెంకన్న అమాయకంగా ముఖంపెట్టి.
