అమ్మాయిని అడ్డం పెట్టుకుని.......
నగరానికి వచ్చిన తరవాత రామరత్నం తన పేరుని ఆర్. చందర్ అని మార్చుకున్నాడు. మెయిన్ రోడ్డు ఒక దానిలో మేడ మీద ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. 'ఆర్. చందర్, టింబర్ మర్చంట్(కలప వ్యాపారి) అని ఒక బోర్డ్ తగిలించాడు కూడా.
లోపల టేబిల్, కుర్చీ వేసుకుని అతను సాగించిన వ్యాపారమంతా మోసపు పనులు తప్ప మరేమీ కాదు. అనేక రకాలుగా అనేకుల్ని మోసం చేస్తూ రోజులు వెళ్ళ దోస్తున్నాడు. అతనిచే మోసగించ బడిన వాళ్ళెవ్వరూ అతని మీద కేసు బనాయించడానికి ముందు రాలేదు. అంత తెలివిగామోసం చేసేవాడు.
చందర్ నివసిస్తున్న భవనానికి పక్క భవనం లో సంబంధం అనే అయన నివసించే వాడు. ఆయనది కమీషన్ వ్యాపారం. అందులో కొంచెం లాభం సంపాదించాడు. అయన కెప్పుడూ డబ్బు కొరతే!
ఒకసారి ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉండగా సంబంధం, చందర్ కలుసుకోవడం జరిగింది. ఇద్దరూ తమ వ్యాపారాలు గురించి మాట్లాడుకున్నారు. కలప వ్యాపారం లో తాను వేల సంఖ్యలో డబ్బు పెట్టినట్లుగా కోతలు కోశాడు చందర్. సంబంధం కూడా వెనకాడ లేదు. కమీషన్ వ్యాపారంలో తన వద్ద వేల సంఖ్యలో డబ్బు తిరుగుతూ ఉంటుందని జంకూ బంకూ లేకుండా చెప్పాడు.
ఈ విధంగా వాళ్ళిద్దరూ తాము కోసిన కోటల్లో పడిపోయారు. సంబంధం కమీషన్ వ్యాపారంలో తాను పెట్టుబడి పెట్టేందుకు అభిలషిస్తున్నానని చందర్ చెప్పాడు. చందర్ కలప వ్యాపారం విషయమై తన పలుకుబడి ని వినియోగించదలచి నట్లు సంబంధం చెప్పాడు. ఇలా వాళ్ళిద్దరూ ఒట్టి వాగ్దానాలు చేసి ఒకరి నొకరు మోసగించు కున్నారు.
ఒకరోజు తమ ఊరికి రావలసిందిగా చందర్ ని సంబంధం ఆహ్వానించాడు. అయన ఊరు యాభై మైళ్ళ దూరంలో ఉంది. పంచాయితీ ఊరది.
వాళ్ళిద్దరూ ఒక శనివారం నాడు ఆ ఊరు చేరుకున్నారు. ఇంట్లో చందర్ కి ఉపచారాలెన్నో చేశాడు సంబంధం. తన్మయుడయ్యాడు చందర్.
ఆ ఇంట్లో చందర్ ని మైమరపింప చేసింది శశిరేఖ! ఆమె సంబంధం పెద్ద కుమార్తె. ఆమెకు ఇరవై ఏళ్ళు ఉంటాయి. ఎస్.ఎస్.ఎల్. సి పాసయింది. నైలాన్ చీర ధరించి, ఒయ్యారం ఒలక బోస్తూ ఆమె ఇంట్లో అటూ ఇటూ తిరిగింది. 'లిల్లీ, లిల్లీ; అంటూ ఆమె కుక్కను పిలిచేతీరే చందర్ ని ఆకర్షించింది.
"ఈమె నా కుమార్తె-- శశి రేఖ." అని పరిచయం చేశాడు సంబంధం. "నమస్కారం" అంటూ రేఖ కళ్ళు పెద్దవి చేసుకుని చందర్ ని చూసింది. చందర్ అలాగే తన్మయుడై పోయాడు.
నగరానికి వెళ్ళిన తరవాత చందర్ కేమీ తోచలేదు. రేఖ గుర్తుకి వచ్చేది. అతను యెందరో యువతుల్ని చూశాడు. కాని, రేఖ ఆకర్షించి నంతగా ఎవరూ ఆకర్షించ లేదు. ఆమె మీద మరులు కొన్నాడు.
ఒక వారం గడిచింది. ఒక సాయంకాలం చందర్, సంబంధం కలుసుకున్నారు.
"మా ఊరికి ఒకసారి వెళ్లి వద్దాం రండి" అన్నాడు సంబంధం.
"అదే నేనూ ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే అడిగారు" అన్నాడు చందర్.
"ఊరికి వెళదాం . కాని, కొంచెం తటపటా యిస్తున్నాను."
"ఎందుకు?"
"ఒక బంగారు గొలుసు తీసుకు రమ్మని ఒక్క సంవత్సరంగా చెపుతుంది రేఖ. అలాగే అలాగే అంటూ నేనూ తల అడిస్తున్నాను. కాని, ఇంతవరకూ గొలుసు కొనలేక పోయాను. బిజినెస్ కే డబ్బు చాలడం లేదు" అన్నాడు సంబంధం.
"మీకు కావలసింది గొలుసేగా ?' అడిగాడు చందర్.
"అవునవును" అన్నాడు సంబంధం.
"దిగులు పడకండి" అని వెళ్ళిపోయాడు చందర్.
ఆ తరవాత వారం ఒక కొత్త గొలుసుతో సంబంధం ముందు నిలిచాడు చందర్. సంబంధం కళ్ళు జిగేల్ మన్నాయి.
"ఏమిటి?'
"అదంతా ఏమీ అడగకండి. రేఖకు దీన్నివ్వండి. అమ్మాయి ఆశ పడింది" అంటూ గొలుసు ని అయన చేతికిచ్చాడు.
ఆ మరునాడు ఇద్దరూ 'మ--' ఊరికి వెళ్ళారు. గొలుసుని చూడగానే రేఖకు ఎక్కడలేని సంతోషం కలిగింది.
"ఈయనే కొన్నారు" అని సంబంధం చందర్ ని చూపాడు. రేఖ క్రీగంట చూసిందో లేదో అతను ఉప్పొంగి పోయాడు.
ఆ తరవాత చందర్ తరచుగా సంబంధం తో కలిసి 'మ' ఊరికి వెళుతూ వస్తూ ఉండేవాడు. ప్రతి తడవా వెళ్ళే టప్పుడు రేఖ కోసం ఏదో ఒకటి తీసుకు వెళ్ళేవాడు చందర్. ఒక తడవ పట్టుచీర. ఒకసారి ఉంగరం. మరొక సారి గాజులు. ఇంకోసారి నెక్లెస్-- ఇలా ఆ కుటుంబంతో ఒక సంబంధం ఏర్పరుచు కున్నాడు చందర్.
సంబంధానికి కావలసిందల్లా డబ్బు ఒక్కటే. ఎలాగయినా తాను ధనవంతుడు కావాలి. అందుకు ఏ మార్గం అనుసరించినా పరవాలె దను కునేవాడు.
చందర్ ఎందుకు బహుమతులు తెస్తున్నాడో సంబంధం అర్ధం చేసుకున్నాడు. తన కుమార్తె రేఖ మీది మొహం కొద్ది అతను విలువ గల బహుమతులు తెస్తున్నట్టు సంబంధం గ్రహించాడు. చందర్ తరుణ హృదయాన్ని ఇంకా రెచ్చగొట్టి అతని ద్వారా బోలెడు వస్తువులు సంపాదించాలని సంబంధం అనుకున్నాడు. అప్పుడు చందర్ ముప్పయి ఏళ్ళ వాడు. అందువల్ల సంబంధం అతన్ని మాటిమాటికి 'మ' ఊరికి పిలుచుకు వెళ్ళేవాడు. రేఖను కలుసుకునేటట్లు చేసేవాడు. వస్తువుల ద్వారా అతని వద్ద నుంచి డబ్బు రాబట్టుకునే వాడు సంబంధం.
చందర్ కి రేఖ అంటే అంతులేని ప్రేమ. ఆమెకూ, ఆమె కుటుంబానికి బహుమతులూ, వస్తువులూ ఇచ్చేవాడు.

ఇలా చేయడానికి గాను చందర్ ఇంకా ఎక్కువగా మోసపు పనులకు దిగేవాడు.
చందర్ బహుమతులు ఎక్కువగా ఇవ్వను, ఇవ్వను సంబంధానికి దాహం ఎక్కువవుతూ వచ్చింది.
ఒకనాడు సంబంధం చందర్ వద్దకు వచ్చాడు. 'నాకో మూడు వేల రూపాయలు కావాలి. బిజినెస్ కి చాలా అవసరం" అన్నాడు.
"మూడు వేల రూపాయలా?' అంటూ ముఖం పైకెత్తాడు చందర్.
"అవును, అర్కెంటు ! నాకు ఎనిమిది వేలు లాభిస్తుంది."
కొంచెం సేపు చందర్ మాట్లాడలేదు. తరవాత "మ్....చూస్తాను" అని దీర్ఘం తీశాడు.
ఒక వార మయింది. సంబంధం తహతహ చెందసాగాడు. చందర్ కనక తలుచుకుంటే డబ్బు ఇవ్వగలడని ఆయనకు తెలుసు. ఏదో మోసం చేసే అతను డబ్బు సంపాదిస్తున్నాడని ఆయనకు తెలుసు. తొందర పెడితే, డబ్బు ఇస్తాడనుకున్నాడు. కాని, చందర్ ఇవ్వలేదు.
ఇలా ఉండగా ఇద్దరూ 'మ' ఊరికి వెళ్ళడం తటస్థించింది. సాయంకాలానికి ఊరు చేరుకున్నారు.
ఆరోజు రేఖకు జ్వరంగా ఉంది. లోపల ఒక గదిలో పడుకుని ఉంది. సంబంధం లోపలికి వెళ్లి ఆమెను చూసి బయటకు వచ్చాడు. బయటికి వస్తూ ఉంటె ఆయనకో ఆలోచన తట్టింది. నడవ లోకి వెంటనే రాకుండా కొంచెం సేపయిన తరవాత వచ్చాడు. మరీ దిగులుగా ఉన్నట్టు నటించాడు.
ఆయన్ని చూడగానే, "ఏమిటి?" అని దిగులుగా అడిగాడు చందర్.
"రేఖకు ఒళ్ళు బాగా లేదు" అన్నాడు మెల్లగా.
"రేఖకా?' ఉలికిపడ్డాడు చందర్.
"అవును."
సంబంధం నెమ్మదిగా లేచాడు. సైగ చేసి చందర్ ని గది లోపలికి తీసుకు వెళ్లాడు. అక్కడ మంచం మీద పడుకున్న రేఖ ను చూపించాడు. నీరసంగా ఆమె పడుకుని ఉండడం చూసేసరికి చందర్ కళ్ళు చెమ్మగిల్లాయి.
ఇద్దరూ బయటికి వచ్చారు. చాలా విచారించాడు చందర్. నడవ లోకి రాగానే "ఏమిటి, ఒళ్లు?' అని అడిగాడు మెల్లగా.
"బొమికల్లో ఇన్ ప్లేషనట. ఏమిటో అంటున్నారు. రాజవైద్యం చెయ్యాలి."
"మ్."
"మీ దగ్గర మూడు వేలు బిజినెస్ కోసం అడిగాను. నిజానికి బిజినెస్ కోసం కాదు. రేఖ వైద్యం కోసమే అడిగాను. మీరేమో లేదన్నారు" అన్నాడు సంబంధం.
"లేదని ఎప్పుడు చెప్పాను? చూడ్డామన్నాను. నాలుగు రోజుల్లో మీకు డబ్బు ఇచ్చేస్తాను , సరేనా?" అన్నాడు.
"ఏదో వీలయితే చూడండి..." విచార పడుతున్నట్లు చెప్పాడు సంబంధం.
నగరానికి తిరిగి వెళ్ళిన తరవాత చందర్ రకరకాల ఆలోచనలు చేశాడు. చివరికో నిర్ణయానికి వచ్చాడు.
నగరంలోని ధనికుల్లో గోవింద స్వామి అనే అయన ఒకడు. ఆయనకు పదకొండేళ్ళ కుర్రవాడున్నాడు. అతని పేరు రమేష్. ఒక్కడే కొడుకు కావడం వల్ల, అతని మీదే అయన పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు.
ఆ కుర్రవాడ్ని ఎత్తుకు వచ్చి అతన్ని పణం గా పెట్టి గోవింద స్వామి వద్ద నుంచి డబ్బు రాబట్టుకుందామని చందర్ నిశ్చయించాడు. అనుకున్నట్టే ఆచరణ కు దిగాడు.
ఒకరోజు రాత్రి గోవిందస్వామి ఇంట్లో ఒకటే అల్లకల్లోలంగా ఉంది.
చీకటి పడే సమయంలో బయటికి వెళ్ళిన రమేష్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి పదయింది. పదకొండ యింది. ఇంటిల్లి పాదికి దిగులు ఎక్కువయింది.
చివరిసారి రమేష్ ని చూసింది పన్నెండేళ్ళ నిత్య అనే అమ్మాయే. ఒక కుర్రవాడితో కలిసి రమేష్ బయటికి వెళ్ళడం ఆమె చూసింది. అయితే, ఆ కురవాడేవరో ఆమెకు తెలియదు.
ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరికీ కునుకు పట్టలేదు. తెల్లవారడం తరువాయి నగరం లోని నలు వైపులకూ గోవిందస్వామి మనుషుల్ని పంపించాడు. తరవాత ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం తెలియజేశాడు.
ఆ సాయంకాలం మూడింటి కి అయన తన ఆఫీసులో ఉన్నాడు. ఒక కంపెనీ లో అయన కాషియర్ . ఒక ప్యూన్ అయనకోక ఉత్తరం తీసుకు వచ్చి ఇచ్చాడు. ఆశ్చర్యపడుతూ దాన్ని విప్పి చదవడం మొదలు పెట్టాడు.
"మీ అబ్బాయి మా వద్ద జాగ్రత్తగా ఉన్నాడు. దిగులు పడకండి. ప్రస్తుతం మాకు నాలుగు వేల రూపాయలు కావాలి. ఈవేళ సాయంకాలం నాలుగింటి కి రోడ్డు లోని సినిమా దియేటర్ కి ఎదురుగా నాలుగు వేల రూపాయలతో మీరుందండి. మా మనిషి ఒకడు వస్తాడు. చేతికి నల్లని రుమాలు ఉంటుంది. అతనికి కనక మీరు డబ్బు ఇస్తే, అరగంట లో మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చేస్తాడు.
-- సీక్రెట్ సొసైటీ."
ఉత్తరం చదవగానే గోవిందస్వామి కేమీ తోచలేదు. నాడులన్నీ కొట్టుకున్నాయి. వెంటనే ఫ్యూన్ ని పిలిచి, "ఉత్తరం ఎలా వచ్చింది?' అని అడిగాడు. ఎవరో ఒకతను వాకిట్లో తన చేతికా ఉత్తరం ఇచ్చి వెళ్లి పోయాడని చెప్పాడు.
గోవిందస్వామి స్నేహితుల ఇళ్ళకు పరిగెత్తాడు.
వాళ్లతో సంప్రతించాడు. ఆ రాత్రి దిగులుగా ఇంటికి దారి తీశాడు.
ఆ మరునాడు పదకొండు గంటలకు అయన ఒక పోలీసు ఉన్నతోద్యోగిని కలుసుకున్నాడు. జరిగినదంతా ఆయనకు తెలియజేసి, అయన సహాయాన్ని అర్ధించాడు. పోలీసు వారీ కేసులో నిమగ్నులైనారు.
ఆ రాత్రి గోవిందస్వామి కి మరొక జాబు వచ్చింది. అయన బంధువు ఒకాయన ఆ ఉత్తరం తీసుకు వచ్చాడు. జాబుని తన ఇంట్లోకి విసిరివేసి వెళ్లి పోయినట్లు అయన చెప్పాడు.
ఉత్తరం విప్పి చదివాడు గోవిందస్వామి. మొదటి ఉత్తరం లో వలె ఇందులోనూ నాలుగు వేల రూపాయలి వ్వలసిందిగా పేర్కొన బడింది. ఇంకా ఇలా ఉంది. "మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మాకు తెలిసింది. జాగ్రత్త." ఈ విధంగా కనక చేస్తే మీ అబ్బాయి మరణాని కి మీరే బాధ్యులయిన వారవు తారు. డబ్బు ఈవేళ రాకపోతే మీ అబ్బాయే మొదటి బలి! తరవాత మీ అల్లుడు, భార్య , మీరు..."
