10
గుమ్మంలో అడుగు పెడుతూనే వదిన గారు పిల్లలు చనువుగా దగ్గరకు రాబోతే కసురుకుని వాళ్ళను దూరంగా తీసుకు పోయింది. అంత దూరంలో నిలబడే పలకరించింది.
తల్లి పుట్టెడు దుఃఖంతో దగ్గరగా తీసుకుంది.
రంగనాధం సామాన్లు లోపల పెట్టిస్తుంటే "ఆ సామానులు అవతల మూల గదిలో పెట్టించండి." అంటూ వదిన గారూ పురమాయించింది. పిల్లలు మళ్ళీ దగ్గరకు రాబోతే వాళ్ళను నాలుగు బాదులు బాదింది. వాళ్ళు బాకా ఎత్తేశారు.
రంగనాధం పళ్ళు పిండుకుంటూ విసుక్కుంటున్నాడు.
తల్లి తన కోసరం అంతకు ముందే కేటాయించిన గదిలో తీసుకు పోయింది. అప్పటికే అక్కడ తన కోసరమంటూ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. తనకో మంచం, తన భోజనానికి ఓ కంచం, ఒక గ్లాసు వేరు. తను తాగే మంచినీళ్ళు వేరే. ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి వాతావరణం చూస్తె ఇక తాను ఆ గది విడిచి ఇవతలకు రాకూడదని నిర్భంధం చేసినట్లుగా అమెకుఅర్ధం అయింది. అదే ప్రపంచం అనుకుని తాను రోజులు గడపాలి.
అయినా ఆమె అలవాటు కొద్ది కొంత స్వేచ్చగా ఉండబోయింది గాని, వదినగారు ఆఖరికి అన్నయ్య సయితం నిర్మొహమాటంగా ఆమె స్వేచ్చను హరించారు. దాంతో రాధమ్మ తన గది గుమ్మం విడిచి ఇవతలికి రావటం పూర్తిగా మానుకుంది.
పిల్లలు పొరపాటున ఆ చాయలకు వస్తే వదినగారు ఊరంత గొడవ చేసేస్తున్నది. తల్లి మాత్రం తన జీవితం ఇలా బ్రద్దలయినందుకు ఎదురుగ్గా కూర్చుని రోజుకో మారైనా కన్నీరు తుడుచుకుంటుంది.
ఇక్కడకు వచ్చిన వారం రోజుల్లోనూ ఇక్కడ తన స్థానం ఎంత బలహీనమైనదో ఇక ముందు ముందు ఇక్కడ తాను ఎన్ని విధాలుగా మానసికంగా హింస అనుభవించవలసి ఉంటుందో తెలిసిపోయింది.
అలా కిటికీ లో వారగా కూర్చుని అక్కడ్నుంచీ పెద్ద వీధి లోంచి పోయే జనాన్ని, వాహనాల్ని చూస్తూ ఆమె కాలక్షేపం చేసుకుంటుంది. రంగనాధం ఓ డాక్టర్ని కుడుర్చాడు గాని అతను ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు రాక తోచినట్టుగా వైద్యం చేస్తున్నాడు. ఒకటికి రెండు సార్లు తల్లి హెచ్చరిక చేస్తే రంగనాధం విసుక్కుంటాడు....
ఓనాడు ఇంట్లో రంగనాధం భార్య ఘర్షణ పడ్డారు. పొద్దున్నే తల్లి బావి దగ్గర కూర్చుని అంట్లు తోముకుంటుంది. తను అలా మంచం మీద కూర్చుని వాళ్ళ ఘర్షణ వింది.
"ఈ పిల్లలు ఆ పక్కన పోవద్దంటే మానరు. చీటికీ మాటికీ అటు చొరబడుతున్నారు. చెబితే వినరు. వాళ్ళని ఆపటం నా వల్ల కావటం లేదు. కొట్టినా వాళ్ళకి భయం లేకుండా వుంది." చిన్న బాబిగాడు ఏకంగా ఆ గదిలోకి వెళ్ళి గ్లాసుతో నీళ్ళు ముంచుకుని తాగేశాడు. నాకు మా చెడ్డ భయంగా వుంది. అత్తగారు ఆ గది విడిచి ఇవతలకి రారు. ఒక్కతినే ఇంత చాకిరీ చెయ్యాలంటే నా దుంప తెగుతుంది.' అంది ఆమె.
రాధ మనస్సు చివుక్కుమంది. మళ్ళీ తనే సర్దుకుంది. తనకొచ్చిన జబ్బు అలాంటిది గనక ఎవరి భయం వారిది అని.
"పోనీ ఓ పని చేస్తే 'అన్నాడు రంగనాధం.
"ఏం చేసినా అంతే నండి. అదే కాకుండా ఈ చాకిరి ఒక్కత్తెను చేసుకోలెకుండా వున్నాను.' అంటుంది వదిన గారు.
"ఏం చేస్తాం నాలుగు రోజులు ఓపిక పట్టాలి. ఆ గుమ్మం తలుపులు మూసేస్తే సరి. పెరట్లో కూడా ఓ తడిక అల్లిస్తే సరిపోతుంది. పిల్లలు ఇక అటు వెళ్ళకుండా రేపట్నించీ వాళ్ళ వంట వేరే చేసుకుంటారు. పోనీ, అదీ నీకు సమ్మతమేనా?"
"పోనీ అలాగైనా చెయ్యండి" అక్కడికీ ఆమెకు పూర్తిగా సర్దుబాటు చేసుకోలేక పోయింది. "పిల్లా జల్లా కలవాళ్ళం. అది ఇంకోటి ఇంకోటి కాదు. క్షయ జబ్బు. అందుకని భయపడుతున్నాను. లేకపోతె ఆమె అంటే నాకేమైనా కోపమా?"
ఆ మరునాడే ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగాయి. ఆ గది తలుపులు మూసేశాడు. రాధమ్మ కు అవతల అన్నగారి సంసారం తో ఉన్న సంబంధం అలా ఆ గుమ్మం ఒక్కటే. ఎప్పుడైనా ఆమె ఆ గుమ్మం దగ్గరే కూర్చుని వాళ్లతో ఊసులాడుతుంటుంది. అది కాస్తా మూసి వేశారు. ఆమెకు ఇప్పుడు వీధి వైపు కిటికీ ఆధారం అయింది. అక్కడ కూర్చుంటే కొద్దిగా జన సందడి వినిపిస్తుంటుంది. కాస్త కాలక్షేపం.
పెరట్లో కూడా తడిక కట్టేశారు. పిల్లలు ఇప్పుడు బొత్తిగా కంటికే కనబడటం లా. తలుపు అవతలి నుంచి వాళ్ళ గొంతులు మాత్రం వినిపిస్తుంటాయి.

వదినగారు ఎవరివంట వాళ్ళకే చేసుకోమని చెప్పేసింది. తల్లీ కన్నీరు తుడుచుకుంటూనే పొయ్యి రాజేసింది.
రంగనాధం ఇటు రావడం పూర్తిగా తగ్గించేశాడు. రెండు రోజులు కోసారి గుమ్మం దగ్గరే నిలబడి యోగ క్షేమాలు తెలుసుకుని పోతుంటాడు. మందులు కావాల్సి వస్తే కొనిచ్చి పోతుంటాడు.
ఇక్కడకు వచ్చిం తర్వాత భర్త దగ్గర్నుంచి రెండు ఉత్తరాలు వచ్చాయి. రెండు ఉత్తరాలు కూడా తమ జాబులు వ్రాసిన రెండు రోజులకే వచ్చాయి. రెండు ఉత్తరాలలోనూ భర్త చాలా ఆందోళన వ్యక్తం చేశాడు. తాను అక్కడి నించి వచ్చిం తర్వాత ఏమీ తోచడం లేదట. ఇంటికి వస్తే విసుగ్గా చికాగ్గా ఉంటుందట. తన చేతి వంట తిని ఇప్పుడు హోటలు తిండి తింటుంటే రిచించటం లేదుట. తిక్కగా వుంటుందిట. తాను వచ్చేసిం తర్వాత ఒక్క సినిమా కూడా చూడలేదుట. 'అమ్మగారు వెళ్ళిం తర్వాత ఇల్లు బాగా చిన్న బోయిందండి" అని రాఘవులు కూడా అంటున్నాట్ట. ఇలా రాశారు రెండు ఉత్తరాలూనూ . ఆ ఉత్తరాలు ఆమెలో కొత్త జీవం పోశాయి. అంతవరకూ జరిగిన వైద్యం కంటే ఆ ఉత్తరాలు ఆమెలో సగం జబ్బుని తగ్గించినట్టుగా అనిపించింది. ఆ ఉత్తరాల్లో వివరాలు అన్నగారికి, తల్లికి , వదిన గారికి అందరికీ చెప్పింది గర్వంగా. అక్కడే ఉంటె భర్త తన్ని ఎలా చూసేవారు అన్నది వేరే సంగతి. ఈ రోగిష్టి మనిషిని చూడగా చూడగా ఎవరికైనా విసుగుదల పుట్టవచ్చు. అలా అక్కడే ఉంటె ఇక్కడి వాళ్ళకంటే ఎక్కువగా అసహ్యించుకునే వారేమో.... ఎవరైనా దూరంగా ఉంటె ఇలాగే రాస్తారేమో. అన్నయ్య ఇక్కడ్నించి అలాంటి ఉత్తరాలే రాసేవాడు. భరించాల్సి వచ్చినపుడే అసలు రంగు బయటపడుతుంది.
అన్నయ్య ఆ మాటే వ్యంగ్యాత్మకంగా అన్నాడు. వదిన అలాగే అంది. ఆఖరికి తల్లి కూడా వాళ్ళ ధోరణి లోనే ఉంది. వాళ్ళ మాటలలోనూ సత్యం లేకపోలేదు అనిపించింది. ఉత్తరాలయితే రాయగలిగారు గాని డబ్బు పంపగాలిగారా? ఏదో అక్కడ వున్నప్పుడు తాను భర్తకు తెలియకుండా వెనక వేసుకున్నదే ఇప్పుడు ఆధారం అయింది. వచ్చేటప్పుడు తప్పకుండా "డబ్బు పంపుతాను" అన్నారు. కాని ఇంత వరకూ పంపలేదు. డబ్బు అడుగుతూ రాయటానికి ఆమె మొహమాట పడింది. అయిదారు మాసాల సంసారం అక్కడే చేసింది తాను. ఈ మూన్నాళ్ళ ముచ్చటకే భర్త మీద తనకి అంత అధికారం లేదు. ఆయనంతట అయన పంపుతే ఫర్వాలేదు. కాని తాను శాసించి ఏ ముఖం పెట్టుకుని అడుగుతుంది.?
మంచం మీద కూర్చుంటే పానీపాట లేకుండా ఉన్నప్పుడు ఆలోచనలే ఒక్కొక్కప్పుడు కాలక్షేపం -- ఆలోచనలు ఒక్కొక్కప్పుడు అదుపు తప్పి తప్పుదోవన పడతాయి. అనవసరమైన విషయాలు కూడా ఆలోచనల్లోకి వస్తాయి. తన మీద తనకే ఉక్రోషం వస్తుంటుంది.
"ఇప్పుడే ఏముందే తల్లి ముందుంది ముసళ్ళ పండగ." అంది తల్లి.
ఆమె గుండెలు గుభేలు మన్నాయి. భర్త ఈసారి వారం దాటినా తన ఉత్తరానికి సమాధానం రాయలేదు. ఆమెకు ఆరాటం పట్టుకుంది. అప్పుడే వదిన ఎగతాళి మొదలు పెట్టింది. తల్లి అబ్బాయి దగ్గర్నించి ఉత్తరం వచ్చిందమ్మా" అని అడిగింది. ఆమె కూడా భయపడింది. "పోనీ ఓసారి అబ్బాయిని పంపిస్తే " అని కూడా అంది. ఆ మర్నాడే ఉత్తరం వచ్చింది.
రాధ గర్వంతో ఆ పూట ఇంతముఖం చేసుకుని ధీమాగా మాట్లాడింది.
ఓనాడు చంటి పిల్లకు కాస్త జ్వరం వచ్చింది. అది రెండు రోజులయినా తగ్గలేదు. రెండు మూడు సార్లు ఆ పిల్ల గొంతు చించుకుని దగ్గింది. వదినగారు పెద్ద గొడవ చేసేసింది. రంగనాధం కంగారు పడ్డాడు. డాక్టరు గారు చూసి భయం లేదన్నారు. అయినా అనుమానం తీరలేదు.
'అతనేనా ఆయనకు నువ్వంటే ప్రాణం అంటున్నావు. ఒక్కసారయినా రాగలిగాడా?' అంది తల్లి.
'ఆయనకు బోలెడు పనులే. క్షణం తీరిక ఉండదు.' అంటూ సమర్ధించింది రాధమ్మ....
డబ్బు తాను ఇస్తున్నా డాక్టర్ని తీసుకురావటం మందులూ మాకులూ కొనటం వీటికే రంగనాధం విసుక్కుంటున్నాడు.
రాధ ఉండబట్టలేక "డబ్బు నాది , నాకు ఎవరు మటుకు చేసేదేముంది? కాస్త మందులూ మాకులూ తేవటం , ఇంతేగా? ఆమాత్రం చేయ్యటానిక్కూడా విసుగుదలయితే ఆ మనిషిని ఏమనుకోవాలి?" అంది.
"వాడు ఒక్కడే కదమ్మా. అవతల ఆఫీసులో పని రద్దీ ఎక్కువ. అందుకని అలా విసుక్కుంటూ వుంటాడు! ఏవీ అనుకోకు అని సర్ది చెప్పింది తల్లి.
రాధమ్మ శాంతంగా కోలుకుంది. నీరసం బాగా తగ్గినట్టుగా అనిపించింది. అయితేనేం బాగా చిక్కిపోయింది. మానసికంగా, ఆమెకు చాలా ఇరకాటంగా వుంది. సూటిపోటీ మాటలు, విసుగుదలలు ఎక్కువయ్యాయి.
ఆఖరికి తల్లి కూడా విసుక్కోవటం మొదలు పెట్టింది. భర్త దగ్గర్నించి ఉత్తరం రావటం , నాలుగు రోజులు ఆలస్యం అయితే అందరూ చులకనగా , విసుగుగా చూస్తున్నారు.
తల్లి కోపంగా చేతిలో విసనకర్ర నేల మీదకు విసిరేసింది "ఉన్నదేదో చేశాను. వంకలు పెట్టక తిను" అంది.
రాధమ్మ కు అభిమానం వేసింది. ఆమెకు తల్లి వండిన వంకాయ కూర నచ్చలేదు. అసలే జ్వరం నోరు పైగా ఆ కూర మరీ చప్పగా రుచేమీ లేకుండా చేసిందని ఆమెకు కోపం. ఆ కూర కోపంగా పక్కకు నెట్టేసింది.
తల్లికి కోపం వచ్చింది. "వచ్చిందేమో సామాన్య రోగం కాదు. పెద్ద జబ్బు. పెట్టిందేదో తిని జాగ్రత్తగా ఉండాలి గాని అన్నిటికీ వంకలు పెడితే ఎలా చావటం , రోగిష్టి మనిషికి ఇన్ని సూకరాలు పనికి రావు తల్లీ" అంది.
రాధమ్మకు అభిమానం ముంచుకు వచ్చింది. అసలు అన్నమే తిన బుద్ది పుట్టలేదు తనకి.
ఆరోజు రాజశేఖరం దంపతులు వచ్చారు చూడటానికి. సుభద్రమ్మ కన్నీరు పెట్టుకుని చాలా బాధపడింది. రాజశేఖరం విసుక్కుంటున్నాడు. అతను ముఖం చిట్లించుకుని "ఏమైనా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయా?" అన్నాడు.
రాధ ఈ బావగారిని మంచి చేసుకుందుకు చేతులు జోడించి "ఫర్వాలేదు" ఇప్పుడు బాగా తగ్గించి బావా" అంది.
తల్లికి అంతదూరపు ఆలోచన లేదు. ఆమె ఏడుస్తూ "ఇది బతికి బట్టకట్టినప్పుడు మాట" అంటూ ఏవేవో చెబుతుంది.
తన్ని చూడటానికి వచ్చేవాళ్ళు కొందరు 'అబ్బే అసలు ఇది క్షయ కాదండీ. క్షయ జబ్బయితే ఇలా ఉండరు. ఇదేదో అజీర్తి వ్యాధిలా గుంది అంటారు. అలా వాళ్ళు అతుంటే ఇంటిల్లిపాదీకి కొండంత బలంగా వుంటుంది. దానికి తగ్గట్టే రంగనాధం ఓసారి ఓ వైద్యుణ్ణి తీసుకు వచ్చాడు. అతను చూసి 'అబ్బే అది మీరనుకున్న జబ్బు కాదండి" అన్నాడు. రంగనాధం ప వారం రోజులు అతడి వెంట పడ్డాడు. అతనేవో మందులు ఇచ్చాడు. అవి వాడితే గుణం ఏవీ కనబడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఓసారి కొద్దిగా నెత్తురు కక్కుకోంది. దాంతో అంతవరకూ వున్న సంతృప్తి. భ్రమ మంచు తొలిగిపోయినట్టుగా తొలగిపోయి మళ్ళీ అంతా ఎప్పటి స్థితికి దిగజారి పోతుంటారు.
కొందరు మరీ కంగారుగా చెబుతుంటారు. ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఇక బ్రతకరని ఇక అలాంటి ఆశలు పెట్టుకోవటం వృదా అని తాము చూసినవి, విన్నవి రకరకాలుగా గుండెలు అవిసిపోయేలా చెబుతుంటారు. అలా మొహం మీద చెప్పకూడదని అలా చెప్పటం ఒకవేళ వాస్తవమే అయినా అవతల వాళ్ళు భయపడతారని వాళ్ళు ఆలోచించరు. అలా చెప్పటం, భయపెట్టడం అదో సంతృప్తి కొందరికి. అలా వాళ్ళు చెబుతే ఓ నాలుగయిదురోజులు ఇంటిల్లిపాదీ గుబులుగుబులుగా ఉంటారు.
రాజశేఖరం "శ్రద్దగా వైద్యం చేయిస్తున్నారా?" అన్నాడు.
రంగనాధం "బాగానే చేయిస్తున్నాం. గుణం కూడా కనిపిస్తుంది. "అన్నాడు. కాని రాధమ్మ బాగా చిక్కిపోయినట్టుగా కనిపించింది. ఆమెలో పెళ్ళి నాటి జీవకళ లేదు. ఆ చురుకుదనమూ లేదు. కళ్ళు బాగా లోతుకు పోయాయి. చిదక దవడలు పడ్డాయి. రాజశేఖరం ఉన్న రెండు రోజులూ ఆమె మంచం మీద కూర్చుంటే వాళ్ళేమీ అనుకుంటారో నని కాస్త అటూ ఇటూ తిరుగుతూ హుషారు తెచ్చుకుని నాలుగు మాటలు మాట్లాడుతూ హుషారుగా ఉన్నట్టుగా కనిపించింది.
రాజశేఖరం దంపతులు రెండు రోజులుండి వెళ్ళిపోయారు. రంగనాధం స్టేషను వరకూ సాగనంపటానికి కూడా వెళ్ళాడు. దారిలో రాజశేఖరం అవనలసిందేదో అనకుండా ఉండలేక పోయాడు. "ఇప్పుదక్కడికి పంపితే మాత్రం ఏవిటి సుఖం? ఇక్కడే ఉందనీ, బాగా తగ్గిం తర్వాతనే పంపుదువు గాని" అని.
"ఏమో అది ఎలా అనుకుంటే అలా ఏర్పాటు చేస్తాను." అన్నాడు రంగనాధం.
'అలా అంటే ఎలా? వాళ్ళు చిన్నవాళ్ళు . మనం బాగా ఆలోచించే చెప్పాలి. వాళ్ళ ఇష్టం అంటే ఎలా కుదురుతుంది? ఆశలే చలపతి చాలా పనుల్లో మునిగి వుంటాడు. ఈ జబ్బు మనిషిని పెట్టుకుని వాడు ఏం నిభాయించుకోగలడు? ఆమెని యిక్కడే ఉండనీ, బాగా తగ్గిన తర్వాతనే పంపించవచ్చు." అన్నాడు రాజశేఖరం.
"ఈ నెల్లాళ్ళు పొయిం తర్వాత వెళ్ళి పోతానంటుంది."
"మనకెందుకండీ మధ్యనీ? అతగాడు రమ్మంటే ఆమె వెళ్తానంటుంటే మధ్యనీ మీరు వద్దంటారు ఏవిటి?" అంది సుభద్రమ్మ.
"అదేమన్న మాటే. ఈ జబ్బు మనిషికి వాడెం చేయగలడు? అసలే వాడు ఖర్చు మనిషి?
"పెళ్ళానికి జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేడా?" అంది సుభద్రమ్మ.
"వాడు ఏం చెయ్యగలడే . వాడికేం తెలుసు. కుర్ర మొహం. మనమే ఆమెకు వైద్యం జరిపించి తగ్గిం తర్వాత పంపటం భావ్యం."
