Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 17


    
    ఈ మాటల్లో కూడా వెంకన్నకు క్లూ ఏమీ తెలియలేదు. అతడు నిరుత్సాహంగా ఇంటిముఖం పట్టాడు.
    "అన్నకంతే ముందే వచ్చేశారు-" అంటూ అభినందించింది అతడి భార్య పద్మావతీదేవి.
    
                                      12

    "డియర్ సురేష్!"
    సురేష్ కళ్ళు విప్పాడు. అతఃది చేతులు వెనక్కు కట్టబడి ఉన్నాయి. మూతికి టేపు అంటించబడి వుంది. అతడు తన ఎదురుగా ఉన్న మనిషిని గుర్తుపట్టి ఆశ్చర్యంగా ఏదో అనబోయి పెదవులు సహకరించక ఊరుకున్నాడు.
    "మీ యింట్లో ఎవ్వరికీ స్పృహలేదు. నీకు సాయపడడానికి ఎవ్వరూ రారు-" అన్నాడతను.
    సురేష్ అతడివంక చూస్తూ ఉన్నాడు.
    "డియర్ సురేష్! మీ నాన్న రాజకీయవాది. అయితే ఆయన ప్రజల అజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్పితే వాళ్ళను తప్పు మార్గాన నడిపించటంలేదు. కానీ నువ్వు-కొంతమంది యువతీ యువకులను మత్తుపదార్ధాలకు అలవాటుచేసి వారిని నీ ప్రయోజనలకుపయోగించుకుంటున్నావు. మీ నాన్న పదవిని ఉపయోగించుకుని నువ్వు దేశద్రోహుల ముఠాలో జేరిపోయావు. ఆయనకు తెలియకుండా స్మగ్లింగు వ్యవహారాల్లోకి దిగావు. అంత వరకూ కూడా నిన్ను క్షమించగలను.
    అయితే పరువుగల యువతీ యువకులీ వ్యవహారాల్లో నీకు సాయపడాలనుకున్నావు. వారిని నీ గుప్పిట్లో ఉంచుకోవాలనుకున్నావు. అందుకని వారిని మత్తుపదార్ధాలకు అలవాటుచేశావు. నీ స్వప్రయోజనం చూసుకున్నావు కానీ నీ కారణంగా కొన్ని నిండు జీవితాలెలా నాశనమై పోయాయో తెలుసుకోలేదు. ఇది చాలా దారుణం.
    ఇప్పుడు నువ్వు నీలాంటివారిని మరి కొందర్ని తయారుచేస్తున్నావు. వారందర్నీ నేను స్వయంగా కలుసుకొని హెచ్చరించాను. వాళ్ళు వినలేదు. వారికి నీ పద్ధతి ఆదర్శంగా ఉంది. వారిని లొంగదీయడానికి ఒక్కటే పద్దతి ముందు నిన్ను చంపి - ఆ తర్వాత వాళ్ళలో మార్పు రాకపోతే ఒక్కొక్కరినీ వాళ్ళనూ చంపేస్తాను...." అన్నాడతను.
    సురేష్ తల ఆడించాడు. అతఃడు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు గ్రహించి ఆ వ్యక్తి-"నీ మూతినుంచి టేపు విడదు. నీ సందేహాలేమిటో నాకు తెలుసు. అన్నింటికీ జవాబులిచ్చి అప్పుడే నిన్ను చంపుతాను. నువ్వు అడగదల్చుకున్నదేమిటంటే-నీ స్మగ్లింగ్ వ్యవహారాల్లో నా జోక్యమెందుకని!
    నీలాంటి వాళ్ళను మట్టుబెట్టడానికి నా వంటివాడు, మినహా మార్గంలేదు. చట్టం, ధర్మం మిమ్మల్నే మీ చెయ్యలేవు. నీ ప్రవర్తన ఎలాంటిదో  నీ తండ్రికి చెప్పి హెచ్చరించాననుకో ఆయన నిన్ను సంస్కరించడానికి బదులు-తనూ నీ దారికి మళ్ళవచ్చు. పదవి గురించి పాకులాడుతూ నిన్ను సరైన దారిలో పెట్టనందుకు నీ తండ్రికిప్పుడీ పుత్రశోకం భరించక తప్పదు.." అని ఆగి "నువ్వూ నీలాంటి వాళ్ళూ కొన్ని అన్యాయాలు చేయడం కోసం పటిష్టమైన ముఠాలేర్పర్చుకున్నట్లే నేనూ నీలాంటి వాళ్ళను మట్టుపెట్టటంకోసం నా మాటను ఏమాత్రమూ వ్యతిరేకించని అనుచరుల్ని ఏర్పర్చుకున్నాను. వాళ్ళ సాయంతో మీ అందర్నీ పరశురాముడిలా వెతికి వెతికి చంపుతాను. కేవలం నా కారణంగా చెడ్డ వాళ్ళందరూ నాశనం కాకపోవచ్చు,. కానీ దేశం చెడ్డవాళ్ళతో నిండకుండా ఉండడానికి సహకరించినవాడి వవుతాను...." అన్నాడు.
    సురేష్ పెనుగులాడుతున్నాడు. అతడికి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
    సరిగ్గా అప్పుడే ఆ వ్యక్తి జేబులోంచి ఓ సిరంజి తీశాడు. సురేష్ చూస్తూండగా అందులోకి ఏదో ముందు ఎక్కించాడు.
    "నీ యింట్లో నీ తండ్రి సంరక్షణలో నీ ప్రాణాలు తీస్తున్నాను. ఈ కథ వెంకన్నకు తెలియబరుస్తున్నాను. ఆయన ద్వారా ఇది దేశంలోని దుర్మార్గులందరికీ హెచ్చరిక కాగలదు. నువ్వు వెంకన్న దగ్గరకు వెళ్ళావు. నాకు కాస్త ప్రమాదమేననిపించింది. నీ తండ్రి అధికార మదాంధుడై వెంకన్నను నిర్లక్ష్యం చేయడంవల్ల గానీ-ఈ రోజు నాకీ అవకాశం వచ్చేదికాదు-"
    ఆ వ్యక్తి సురేష్ ను సమీపించాడు.
    సురేష్ వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నాడు - కట్లు విప్పుకుందుకు.
    "నానుంచి నువ్వు తప్పించుకోలేవు. అయిన నీకు నా చేతుల్లో చావుడం అదృష్టం. నేను పుణ్యాత్మున్ని. హంతకుడినే అయినా మంచి హంతకుణ్ణి! ఎంతో మంచి హంతకుణ్ణి! అందుకే నిన్ను చంపాలని నెలరోజుల క్రితమే అనుకున్నప్పటికీ-కొన్నాళ్ళాగాను.
    నీకు పద్మిని అనే ఆమెతో వివాహం కుదిరిందని తెలిసింది. నువ్వు ఎందరో అమాయకుల జీవితాలు నాశనం చేశావు. అలాంటి నిన్ను నాశనం చేస్తూ-తత్ఫలితంగా మరో అమాయక యువతి జీవితం నాశనంచేయటం నాకు ఇష్టంలేదు. అందుకే నా మనుషుల్ని నియమించి మీ వివాహం చెడగొట్టాను. వివాహం చెడిపోయినా ఆమె జీవితం నవ్వులపాలు కాకుండా ఉండడానికి ఓ యువకున్నీ సిద్దంచేశాను...."
    సురేష్ అతడి మాటలు వినడంలేదు. ఆ వ్యక్తి చేతిలోని సిరంజి వంకే భయంగా చూస్తున్నాడు. మరుక్షణంలో అది అతడి శరీరంలోకి దిగబడింది......

                                -:ఐపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS