"ఎందుకా? తండ్రి అయినా, మీ కొంటెతనం తగ్గనందుకు" అంది నవ్వుతూ.
"ఏమండీ! మీతో ఒక విషయం చెప్పాలి" అంది రాధ సంశయిస్తూ కొంతసేపటికి.
చెప్పమన్నట్లు ఆసక్తిగా చూశాడు మధు.
"ఇన్ని రోజులు ఈ విషయాన్ని మీనుండి దాచాలని దాచలేదు. చెప్పడం అవసరం లేదని పించింది. ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏర్పడింది. మీరు విన్న తరవాత నన్ను అపార్ధం చేసుకోరన్న నమ్మకంతో చెబుతున్నాను." అని మాధవ, తన గత విషయాలను మధుతో చెప్పింది.
అంతా విన్న మధు కొంతసేపు మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచించ సాగాడు. అతని మౌనాన్ని రాధ భరించలేక పోయింది. కొంతసేపటికి మధు ముఖ కవళికలు మారాయి. అతను రాధను దగ్గరికి తీసుకున్నాడు. రాధ ఆధారాలు భయంతో కంపిస్తున్నాయి. అతను ఆమె భయాన్ని గుర్తించాడు.
"రాధా! సుధ శ్రేయస్సు ను కోరి నీవు జరిగిన విషయాన్ని తెలిపావు. ఆవిధంగా తెలపటం వలన, నేను అపార్ధం చేసుకుంటే, అది నీ కెంత బాధాకరమైన విషయమో, తెలిసి కూడా ధైర్యంగా యదార్ధాన్ని చెప్పావు. రాధా! నిన్ను భార్యగా పొందిన నేను చాలా అదృష్ట వంతుణ్ణి" అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. తనను మన్నించ గలిగిన భర్త విశాల హృదయానికి రాధ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆమె కంటి తడిని అతని పెదవులు తుడిచాయి.
మరునాటి సాయంకాలం మధు మాధవ వాళ్ళింటి కి వెళ్లాడు. మాధవ ఇంటిలో లేడని, అతని తలిదండ్రుల వలన తెలిసి కున్నాడు. సుధ కూడా తను బయలుదేరే సమయానికి ఇంటిలో లేదు. అతడు మెల్లగా మాధవ, తన చెల్లి సుధ ఒకరి నొకరు ప్రేమించు కుంటున్నట్లు తెలిపి, వారి వివాహ విషయమై మధు మాధవ తల్లి దండ్రులను అడిగాడు. మాధవ తండ్రి ముక్కోపి ఆ మాట అన్న అతడు తోక త్రొక్కిన తాచులా లేచాడు. కోపంతో తన కుమారుడు అటువంటి పనులు చేయడని పలికాడు. అందుకు మధు వారి కలయికలను ఋజువు చేస్తా నన్నాడు. అంతస్తు, పరువు ప్రతిష్ట లనే ముఖ్యంగా భావించుకునే మాధవ తండ్రి కది భరించరాని అవమానంగా తోచింది. సుధ తమ ఇంటికి రావటాన్ని అతను చాలాసార్లు చూచాడు. ఆమెను కోడలుగా చేసుకోడం అతని కిష్టం లేదు, ఇష్టం లేదంటే , అన్ని విషయాలను తెలుసుకోనిన మధు విషయాన్ని రచ్చ కీడుస్తాడ ని తెలుసుకొని, అతను ఋజువు చేస్తే వివాహానికి అంగీకరిస్తా నన్నాడు.
అక్కడి నుండి మాధవ తండ్రితో కలిసి, మధు బీచి వైపు దారి తీశాడు. సుధ అదృష్టవ శాత్తు , మాధవ దురదృష్టవ శాత్తు-- ఆరోజు ఇద్దరు బీచిలో కలిసి మాట్లాడుతున్నారు. మాధవ ను చూచిన సుదే అతని దగ్గరి కెళ్ళి "మీరు కూడా వచ్చారే" అంటూ మాట్లాడ సాగింది. కొంతసేపటికి వారిని వెదుకుతూ వచ్చిన మధు వాళ్లు -- సుధ, మాధవ ఉన్న చోటికి వచ్చారు. సుధ ఏదో మాట్లాడుతూ, గల గలమని నవ్వుతుంది. దూరం నుంచి చూచిన మధు తండ్రికి ఆగ్రహం అవమానం కలిగాయి. కాని, విధి లేక నిగ్రహించు కోగలిగాడు. తలవని తలంపుగా వాళ్ళని చూచిన సుధ, మాధవ కంగారు పడ్డారు. మాధవ తండ్రి కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి.
"ఇందుకా ఇన్ని రోజులు వివాహం వద్దని మమ్మల్ని మభ్యపెడుతూ వచ్చావు. ఇంకా నేనేమో అనుకున్నాను." అంటూ కటువుగా పలికాడు. మాధవ కు అంతా అయోమయంగా తోచింది.
"అది కాదు నాన్నా..." అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు . కాని తండ్రి అతనిని మాట్లాడ నివ్వలేదు.
"నీవేమీ చెప్పనక్కర్లేదు. మధుగారూ! మీ ఇష్ట ప్రకారం ముహూర్తం పెట్టించండి. నేను పరువు ప్రతిష్టల కోసం, మాట కోసం బ్రతికే మనిషిని" అంటూ బయలుదేరాడు. సుధ, జరిగినది ఎదురు చూడని విషయమైనా, తన అదృష్టానికి సంతోషించింది. ఇందంతా ఎలా జరిగిందో ఆమె కర్ధం కాలేదు. భయపడుతూ ఆమె అన్నయ్యను అనుసరించింది. మాధవ కు తండ్రితో బయలుదేరక తప్పలేదు. జరిగిన యధార్ధాన్ని తండ్రితో చెప్పాలని ఎంత ప్రయత్నించినా అతడు మాధవకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు.
తను ఆశించిన దానిని పొందలేక పోయినందుకు ఎంతో బాధపడుతున్న మాధవకు, తన కయిష్టమైన ఈ వివాహం ఎంతో క్రుంగ దీసింది. ఎందుకు తనకీ శిక్ష? నిజమే! తాను రాధకు చేసిన ద్రోహానికి ఈ శిక్ష ననుభవించవలసిందే ననుకున్నాడు. తన ప్రమేయం లేకుండా తన ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా అతని వివాహం సుధతో జరిగిపోయింది. వివాహానికి కొన్ని రోజుల వ్యవధితో రాధ తండ్రి ఆరోగ్యం బాగుగా లేక, మంచం నుండి లేవలేని పరిస్థితి రావటం వలన రాధ తండ్రిని వదిలి కదలలేక పోయింది. అందువల్ల ఆమె సుధ వివాహాన్ని చూడలేక పోయింది.
* * * *
దాదాపు ఇరవై రోజుల తరవాత , రాధ తండ్రి ఆరోగ్యం కుదుట పడింది. ఆమె అత్తవారింటికి కొచ్చేటప్పటికి సుధ అత్తవారింటికి వెళ్ళింది. మాధవ జీవితం యాంత్రికంగా జరిగి పోతుంది. ఆనాటి తన తండ్రి, మధుల ఆకస్మికమైన రాకకు కారణం, మాధవ కింత వరకు అర్ధం కాలేదు. కాని, అతను ఆ విషయమై సుధను ఎప్పుడు ప్రశ్నించ లేదు. ఇప్పుడు ప్రశ్నించి అతడు చేయ గలిగిందేమీ లేదని ఊరుకున్నాడు. సుధ ఆశించిన వాడిని పొంద గలిగింది. కాని, పొందగలిగిన దానిని తనివి తీరా అనుభవించే అదృష్టానికి ఆమె నోచుకోలేదు. మాధవ మౌనం కొన్నిసార్లు ఆమెను బాధించ సాగింది. తనను నమ్ముకున్న భార్యకు తాను సంతోషాన్ని కలుగజేయ వలసింది భర్తగా తన విధి గనుక, అతనామేతో జీవితాన్ని గడుపుతున్నాడు. అది సుధకు ఎంతో ఆనందాన్నిచ్చింది. కాని, మాధవ మనస్సు లో ఏమాత్రం ఆనందం లేదని ఆమె తెలుసుకో గలిగింది. వివాహానికి మునుపు కూడా, అతను మౌనంగా ఉండేవాడు. ఇప్పుడు కూడా అంతే. తన నుండి అతనేదో దాస్తున్నాడని ఆమె పసి కట్టింది. కొద్ది రోజులలో రమ వివాహం జరిగిపోయింది. రమను అత్తవారింటికి పంపి, రమ తల్లితండ్రులు కొడుకు, కూతురు పెళ్ళిళ్ళ తరవాత తమ బాధ్యత తీరిందను కుని తీర్ధయాత్రలకు బయలుదేరారు.
సుధకు-- అత్తమామలు, రమ వెళ్ళిన తరవాత, ఇంట్లో మరీ ఒంటరి తనమనిపించి , నాలుగు రోజుల పాటు వాళ్ళింటి కి వెళదామనిపించి , మాధవ ను కూడా పిలవాలనుకుని--
"మీరు కూడా రండి, మా వదిన , బాబును మీరు చూడనే లేదు. నాలుగు రోజుల పాటుండి రావచ్చు" అంది.
"నీవు వెళ్లి రా, సుధా! మరెప్పుడైనా నేను వస్తాను" అన్నాడు. సుధ బయలుదేరింది.
సుధ , అన్న వదినెల కంటికి, మునుపటిలా సంతోషంగా కనిపించలేదు. అదే మాట మధు అడిగాడు.
"అవునన్నయ్యా! వారెందుకో ఆనందంగా ఉండటం లేదు. కేవలం నన్ను సంతోష పెట్టటం తన బాధ్యత కదా, అని సంతోష పడుతున్నారు. కాని, వారికి నా వలన ఎటువంటి ఆనందం లేదని తెలుసుకున్నాను." అంది సుధ.
ఆ మాటలను విన్న రాధ ఆశ్చర్య పోయింది.
"ఇందులో అతని కయిష్ట మేమున్నది. అతను, నీవు ప్రేమించుకునే గదా వివాహ మాడారు?" అన్నాడు మధు.
"నేను ప్రేమించిన మాట వాస్తవమే, అన్నయ్యా! కాని, వారు నన్ను ప్రేమించ లేదు."
"సుధా! ఏమిటి నీ వంటున్నది ?" అని మధు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. సుధ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి.
"అవునన్నయ్యా! రమతో వాళ్ళింటి కెళ్ళినప్పుడు వారిని ప్రధమంగా చూడటం తటస్థించింది. అదెందుకో , వారిని చూచినప్పటి నుండి, వారిపై ఎన్నో కోర్కెలను నేను పెంచుకున్నాను. వారెప్పుడు కనీసం చనువుగా నైనా నాతొ మాట్లాడలేదు. చొరవ తీసుకుని, నేనే ఒకసారి వారితో బీచికి వెళ్లాను. వారు కాదనలేక సమ్మతించారు. వారు తరుచుగా బీచికి వెళతారని తెలుసుకున్న నేను, వారిని ఏకాంతంగా కలుసుకోవాలనే కోర్కె ను చంపుకోలేక అప్పుడప్పుడు బీచికి వెళ్ళేదాన్ని. వారి ప్రతిసారి ఒకే ఒక ప్రత్యేకమైన స్థలంలో కూర్చోవటం వలన వారిని కలుసుకోవటం తేలికైంది. నేనుగా వెళ్లి వారితో మాట కలిపెదాన్ని. వారెప్పుడూ ఏదో బాధపడుతున్నట్లు వారి మౌనం నాకు తెలిపేది. నేను దానిని గురించి పెద్దగా ఆలోచించలేదు. నా కోర్కెను కూడా నేనెప్పుడు వారితో తెలియ జేయలేదు. నేను వారిని ప్రేమించిన సంగతి, మేము అక్కడున్న సంగతి మీకెలా అర్ధమయిందో , ఇప్పటికి నాకు తెలియదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేకపోయింది. ఆరోజు మీరు అకస్మాత్తుగా రావడం, మామగారు వారికి కనీసం మాట్లాడటానికి కూడా అవకాశ మివ్వకుండా వివాహాన్ని నిస్చయించటం జరిగాయి. ఇప్పుడు చెప్పన్నయ్యా! వారు నన్ను ప్రేమించలేదు కదూ?" అంటూ సుధ దుఃఖాన్ని నిగ్రహించుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగింది. అసలు విషయాన్ని తెలుసుకోనిన మధు తాను చేసిన పొరపాటు ను తెలుసుకొని మిక్కిలి బాధ పడ్డాడు. రాధ స్థాణువు లా నిలుచుండి పోయింది. మరలా సుధే మాట్లాడింది.
"అన్నయ్యా! అయన ప్రవర్తనను చూస్తె, ఆయనేవరినో ప్రేమించినట్లున్నదన్నయ్యా!" అంది.
"అవునమ్మా!" అన్న తరవాత మధు తన పొరపాటు ను గుర్తించి మాట మార్చాలని ప్రయత్నించాడు. కాని, సుధ పట్టు వదలలేదు.
"ఏం టన్నయ్యా! నీవు కూడా ఏదో నా దగ్గర దాస్తున్నావు. వారు మునుపాక అమ్మాయిని ప్రేమించి నది తెలిసినట్లయితే , నీవెందుకు ఈ వివావానికి సమ్మతించావు ?' అని నిలదీసి అడిగింది.
భర్త నోరు జారి చెప్పిన మాటలకు రాధ చాలా నొచ్చుకుంది. ఇక అక్కడుండ లేక ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది. అయినా, వారి సంభాషణ లు అక్కడికి బాగా వినిపిస్తుంది. భర్త చెప్పబోయే మాటలను సుధ ఏ విధంగా అర్ధం చేసుకుంటుందో వినాలన్న కుతూహలం తో రాధ వారి సంభాషణ ను జాగ్రత్తగా వినసాగింది.
"చెప్పన్నయ్యా! చెప్పవూ?' అని బ్రతిమాలు కుంటుంది సుధ.
చెప్పక తప్పదను కున్నాడు మధు.
"అవును, సుధా! మాధవ ఒక అమ్మాయితో స్నేహంగా నున్న మాట వాస్తవమే. కాని, వారిద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు. వారిరువురు కేవలం స్నేహితులుగానే విడిపోయారు." అన్నాడు మధు.
"ఏం టన్నయ్యా! నీ మాటలు , వారిరువురు కొంత కాలం స్నేహంగా ఉండి, స్నేహంగానే విదిపోయారా? నేను నమ్మను. వారు కేవలం స్నేహం గానే విడిపోయి నట్లయితే , వారు ఆమెను ఎందుకు మరువలేక పోతున్నారు?' అంది సుధ ఆవేశంగా.
"సుధా! నీవు పొరపడుతున్నావు. అది ఇంకొకరి విషయంలో అయితే ఏమో? నేను చెప్పలేను. అది మీ వదిన విషయంలో గనుక నేను నమ్ముతున్నాను." అన్నాడు మధు. సుధ పరోక్షంగా నైనా, రాధ ను గురించి చేడుగా అనుకోటాన్ని అతను ఓర్చుకోలేక యధార్ధాన్ని చెప్పాడు.
"అన్నయ్యా! ఏమిటి నీవంటున్నది . వ...ది...న..." అంటూ ఇక ముందు మాటాడలేక పోయింది. మధు రాధ తనతో చెప్పిన విషయాలను పూస గుచ్చినట్లు చెప్పాడు. కాని సుధ అతని మాటలను నమ్మలేక పోయింది. వారిరువురికి అతి సన్నిహితమైన సంబంధం ఉండి ఉన్నందు వల్లనే మాధవ రాధను మరువలేక పోతున్నాడని నిశ్చయించు కుంది. అదే మాటలను రాధ భరించ లేకపోయింది. తాను సుధ శ్రేయస్సు కోరి చెప్పిన మాటల పరిణామం ఈ విధంగా ఉంటుందని తాను ఆలోచించలేదు. సుధ మాటలు రాధను గాయపరిచాయి. సుధ తన అనుమానంతో మధు మనస్సు ను కూడా అనుమానాన్ని రేకెత్తించింది.
"అవును. కేవలం స్నేహంగానే విడిపోయి ఉంటె, అతనెందుకు రాధను మరువలేక పోతున్నాడు?' ఇదే ప్రశ్న మధుకు పదేపదే గుర్తుకు రాసాగింది. సుధ ఆ వార్తను కాస్త తల్లితండ్రుల చెవిని వేసింది. కోడలు వల్ల తమ అల్లారు ముద్దుల కూతురు జీవితం నాశనమైందని తెలుసుకొని, కోపంతో రాధను దూషించడం ప్రారంభించారు. నాలుగు రోజుల పాటుండి , సుధ భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రశాంతంగా, స్వర్గతుల్యంగా ఉన్న వారి సంసారంలో కల్లోలం మొదలైంది.
* * * *
మధు రాధతో బొత్తిగా మాట్లాడటం లేదు. మౌనంగా ఉంటున్నాడు. రాజమ్మ ఏదో సాకుతో ఎప్పుడు రాధను పుల్ల విరుపు మాటలు అంటూనే ఉండేది. ఆమె మాటలను, భర్త మౌనాన్ని రాధ భరించలేక పోయింది. మనస్సుకు కాస్త ఊరటగా ఉంటుందని హేమ ఇంటికి బయలుదేరుతూ--
"అత్తయ్యా! హేమ వాళ్ళింటి కి వెళ్లి వస్తాను" అంది.
రాజమ్మ కు కోడలి పై ఎక్కడి లేని కోపమొచ్చింది.
"హేమ ఇంటికే వెళుతావో? లేకపోతె నేహితుని కోసమే వెళ్ళుతావో? నాకేం తెలుసు. నాకు చెప్పవలసిన అవసర మేముంది. వెళ్ళు" అంది రాజమ్మ, కడుపులోని అక్కసు ను పైకి కక్కుతూ. రాధ ఆ మాటలను భరించలేక పోయింది. ఆమె కనులు అశ్రు పూరితాలయ్యాయి. గదిలోకి వెళ్ళుదామని వెనుదిరిగింది. మధు అక్కడనే నుంచున్నాడు. అంటే, అత్త తనను అన్న మాటలు విని ఊరుకున్నా డన్న మాట. ఆమెకు దుఃఖం ఆగలేదు.
"ఏమండీ. అత్తయ్య మాటలను మీరు కూడా నమ్ముతున్నారా? వద్దండీ? నేనే పాప మెరుగను " అని బావురుమని ఏడ్చింది. మధు మాట్లాడలేదు.
"ఏమండీ! మాట్లాడండి. నాకు అటువంటి అభిప్రాయం లేదని ఒక్కసారి చెప్పండి" అంటూ అతనిని వేడుకుంటుంది రాధ.
మధు మాట్లాడలేదు.
"ఏమండీ మాట్లాడరూ?"
"ఏమని మాట్లాడతాడు. నీలాంటి దాని ముఖం చూడటమే పాపం. నీవు ఇంట్లో ఉంటె వాడికీ మనశ్శాంతి ఉండదు. మాకూ మనశ్శాంతి ఉండదు. మీ తలిదండ్రుల దగ్గర ఉండటమే అందరికీ శ్రేయస్కరం" అంటూ రాధ బట్టల పెట్టెను బయటికి తెచ్చి వేసింది. బాబు ఏడుస్తున్నాడు. ఒక్క పరుగు న రాధ బాబును తీసుకుని ఏడవసాగింది.
మధు మాట్లాడలేదు. రాజమ్మ బట్టల పెట్టెను చూపుతూ తొందర చేస్తుంది.
"ఏమండీ! మీకు కూడా నేను వెళ్లి పోవడమే ఇష్టమా? చెప్పండి?" రాధ విలపిస్తూ అడిగింది . మధు మాట్లాడలేదు.
రాధ ఇక బ్రతిమాలడం మానేసింది. ఆమె బ్రతిమాలుకున్న కొలది, అతను మరింత బిగుసుకు పోతాడని ఆమెకు తెలుసు. అతని మౌనంలోని అంతర్యం ఆమెకు బోధపడింది. ఔను, తాను వెళ్ళిపోవటం అతనికి ఇష్టమే. ఆమె అభిమానం దెబ్బతిన్నది. ఇక మారు మాట్లాడలేదు. తన ఏ ఒక్క వస్తువును ఆమె తాకలేడు. తన తల్లిదండ్రులు తన కిచ్చిన రెండు జతల గాజులు మాత్రం ఉంచుకొని, మిగతా నగలను తీసి అక్కడుంచి, కట్టు బట్టలతో , బాబును తీసుకొని బయలుదేరింది. బయలుదేరే ముందు భర్త వేపు చూసింది. అతడు రాయిలా నుంచున్నాడు. ఎటో చూస్తున్నాడు. ఆమె అతని కన్నుల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది.
"ఏమండీ! వివాహానికి ముందు, మీరు చేసిన ఎన్ని తప్పులను నేను మన్నించ గలిగాను. అలాంటప్పుడు నేను ఒకరితో కేవలం స్నేహంగా ఉన్నదాన్ని మన్నించెంత విశాల హృదయం మీలో లేదా? చెప్పండి?'
మధు మాట్లాడలేదు.
"అవును. మిమ్మల్ని నని ప్రయోజనం లేదు. అటువంటి విశాల హృదయాన్ని, క్షమా శక్తిని , స్త్రీలకు వరాలుగా ప్రసాదించిన దేవుడు పురుషులకు ప్రసాదించ లేదు. వస్తాను. కాదు, నిజాన్ని నిలకడ మీద తెలుసుకున్న మీరే నా దగ్గరికి వస్తారు" అని బాబును తీసుకుని అక్కడి నుండి చరచరా వెళ్ళిపోయింది.
రాధ బాబు నెట్టుకుని నడుస్తూ ఉంది. అమెది గమ్యం లేని పయనం.
* * * *
