చేతులు కడుక్కుని మంచంమీద నడుం వాల్చి అదే ఆలోచించాడు. రాధ వంటగదిలో ఎక్కడివక్కడ ఒదిలేసి తలుపులు వేసి మంచం మీద నడుం వాల్చింది.
చలపతి ఒక్కపొడి పొట్లం జేబులోంచి తీసి తాను కొంత వేసుకొని మిగిలింది ఆమెకు ఇచ్చాడు. ఆమె తీసుకొని "రేపటికి డబ్బు కావాలి" అంది.
"ఎంత?"
"రెండొందలు"
చలపతి ఎక్కడ్నించి తెను?" అని తన అసమర్ధతని బయట పెట్టడానికి ఒప్పక 'అలాగే రేపు ఇస్తా" అన్నాడు.
అంతే ఆమె ఇంక మాటలు పోదిగించ లేదు. గోడ వైపుకి తిరిగి పడుకుంది.
చలపతికి ఈమె ప్రవర్తన ఇటీవల కొద్ది రోజులుగా ఎదురు తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఏ పని చెప్పినా విసుగుదల వ్యక్తం చెయ్యటం ఒక మాటకి పది మాటలు సమాధానాలు చెప్పటం తన్ని చూస్తె అనురక్తి అభిమానానికి బదులు కోపతాపాలు వ్యక్తం చెయ్యటం , ఆ భావాలు ఆమె మనస్సులోనే దాచుకోకుండా బయటికి వ్యక్తం చేసే వెంపరి తనానికి పూనుకోవటం తో రానురాను ఆమె ప్రవర్తాన అతనికి దుస్సహంగా తయారయింది.
మళ్ళీ అతనికి నవ్వు వచ్చింది తన ధోరణికి. లిల్లమ్మ ఎత్తి పొడుపులు , రాధమ్మ పరాచికాలూ గుర్తు కొచ్చాయి. "తాను తప్పతాగి అసభ్యంగా కొంపకి వస్తే లిల్లమ్మ కాబట్టి భరించింది గాని అందరూ భరించగలరా?" అందులో పెద్ద కుటుంబం లోంచి వచ్చిన స్త్రీ గారంగా పెరిగిన పిల్ల.
చలపతి ఓమారు కోపంగా గోడ వైపుకి తిరిగిన భార్య వైపు తిరిగి చిన్నగా దగ్గి మంచం మీద లేచి కూర్చున్నాడు.
గోడ మీద గడియారం పది గంటలు కొట్టింది.
9
నెల మధ్యలో రాధకు సుస్తీ చేసింది. రెండు రోజుల జ్వరం వచ్చింది . మంచం దిగలేదు. చలపతి హోటలు నించి భోజనం తెప్పించాడు. ఆ రెండు రోజులు అతనెక్కడికి కదల్లేదు.
ఓ వారం రోజులు లేచి కులాసాగా తిరిగినా మళ్ళీ జ్వరం వచ్చి మంచాన పడింది. ఈసారి రెండు రోజుల్లో తగ్గలేదు. ఓసారి రక్తం కక్కుకుంది.....
చలపతి కంగారు పడి డాక్టర్ పరీక్ష చేయించాడు. అయన చాలా విధాలుగా పరీక్షలు చేసి చివరికి చాలా బాధపడుతున్నట్లుగా కనిపించి "ఈమెకు T.B జబ్బు ఇప్పుడే ఆరంభం అయింది" అన్నాడు.
రాధ గుండెల్లో రాయి పడినట్టుగా కూర్చున్న చోటనే స్పృహ తప్పి గోడకి వాలిపోయింది. చలపతి చప్పున ఆమెను పట్టుకున్నాడు.
డాక్టరు ఫర్వాలేదు ఈ మాట విని షాక్ తింది. అంత కంగారు అవసరం లేదు. క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడే జబ్బు అంత మరీ ప్రమాదం లేదు. చాలా మండులున్నాయ్ తగ్గిపోతుంది.' అన్నాడు.
చలపతి నీళ్ళు కారిపోయాడు. అతని ముఖం ముడుచుకు పోయింది.
'అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తీ విశ్రాంతి అవసరం. ఏమాత్రం శ్రమ పడకూడదు. కొన్నాళ్ళు అలా జాగ్రత్త పడితే తగ్గిపోతుంది." అన్నాడు డాక్టరు.
రాధ కోలుకుంది. ఆమె కళ్ళు తెరిచి భర్త మీదకు వాలిపోయింది నీరసంగా. దారి పొడగుతా ఆమె తన్నేమీ అడగలేదు. అలా భర్త మీదకు వంగి కళ్ళు తుడుచుకుంటూనే ఉంది.
చలపతి ఈ పరిణామానికి బాగా షాకు తిన్నాడు. అతను ఆమెను దగ్గరగా హత్తుకుని "భయం లేదు. తగ్గుతుందని డాక్టరు చెప్పారు" అన్నాడు.
ఇంటికి చేరగానే అన్నగారికి ఉత్తరం రాసింది. ఏడుస్తూ ఆ ఉత్తరం రాసింది.
ఇలాంటి జబ్బు నాకు వస్తుందని, నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని నేను అనుకోలేదు. డాక్టరు గారు ఎంతో ధైర్యంగా చెప్పారు. ఫర్వాలేదు తగ్గి పోతుందన్నారు. అయన కూడా మంచి మందులున్నాయిట. ఇప్పుడే జబ్బు అంత తీవ్రమైనది కాదట. ఈ జబ్బు వచ్చి మాములుగా తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారుట. అయితే పూర్తిగా విశ్రాంతి కావాలంటున్నారు. అందుకని అక్కడికి రావాలని అనుకుంటున్నాను. కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకుంటే కాస్త తగ్గిం తర్వాత ఇక్కడికి వచ్చెయ్య వచ్చు అని రాసింది.
ఇలా రాశానని భర్తకు చెప్పింది. అతను అలాగే అన్నాడు.
అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
"రాత్రి బాగా నిద్రపోలేదు కదూ?' అన్నాడు చలపతి.
ఆమె తలవంచుకుంది.
"అలా మనస్సులో బాధపడితే జబ్బు ఇంకా పెరుగుతుంది. తగ్గదు."
"నేనేమీ బాధపడటం లేదు ధైర్యంగానే ఉన్నాను." అంది రాధ.
చలపతి ఈ జబ్బుకు ఎలాంటి మనో వికారాలు లేకుండా తనకి ధైర్యం ఇవ్వడం ఆమెకు ఈ పరిస్థితిలో అన్నిటి కంటే ముఖ్యం అయిన సంగతి.
అన్నయ్య ఉత్తరం రాశాడు "నేను వస్తున్నాను ఎలా వీలయితే అలా చేద్దాం అని.
ఆ ఉత్తరం చలపతి చూసి "పోనీ ఇక్కడే ఉండరాదూ. వైద్య సదుపాయం అదీ ఇక్కడ బాగుందిగా." అన్నాడు.
ఆమె వెళ్ళాలనే నిశ్చయించుకుంది. అదే అంది. "ఈ రోగిష్టి మనిషిని పెట్టుకుని ఇక్కడ మీరేం తిప్పలు పడగలరు. అందులోనూ చిన్నప్పట్నించీ స్వేచ్చగానూ, స్వతంత్ర్యంగా నూ తిరిగిన వారాయే." అంది.
అన్నగారు రాగానే ఆమె ప్రయాణానికి సిద్దమైంది. తన బట్టలు పెట్టె నిండా సర్దుకుంది.
రంగనాధం చలపతి మొహం చూడ్డానికి, ఎదుట పడటానికి సిగ్గు పడుతున్నాడు. అతను ఎంతో జంకుతూనే ఇక్కడకు వచ్చాడు. చెల్లి తనకి రాయకపోయినా ఆ ఉత్తరం అతనికలాగే ధ్వనించింది. ఈ పరిణామం అతనికి ఎదురు దెబ్బ తిన్నట్టుగా అనిపించింది. గుమ్మంలో అడుగు పెట్టగానే చలపతి ఏం విరుచుకు పడతాడో ఏం మాట పడవలసి వస్తుందోనని జంకుతూనే అతను తలుపు మీద చెయ్యి వేశాడు బెదురూ గొంతుతోనే "రాదమ్మా" అని పిల్చాడు.
రాధమ్మ తలుపు తీసింది. ఎదురుగ్గా బెడురుచూపులతో లోపలికి అడుగుపెట్టిన అన్నగారిని చూడగానే ఆమె దుఃఖం ఆపుకోలేక పోయింది. ముఖం మీదకు చీర చెంగు కప్పుకుని వలవలా ఏడ్చేసింది.
రంగనాధం కూడా చలించాడు. ఆమెను ఊరడించి ఆమె తెప్పరిల్లిం తర్వాత "ఇంతకీ మీ అయన ఏమంటున్నాడు?" అన్నాడు.
'అయన చాలా బాధపడుతున్నారు."
రంగనాధం బెడురుగానే "ఏమైనా విసుక్కుంటూన్నాడా?' అన్నాడు.
"విసుగా! అయన అసలు అక్కడికి వెళ్ళవద్దు. ఇక్కడే వైద్యం చేయిస్తాను అని పట్టుపడుతున్నారు. నేనే ఇక్కడ వుంటే చేసిపెట్టే వాళ్ళు లేరని వెళ్తానన్నాను. నా యిష్ట ప్రకారం చేయ్యమన్నారాయన." అంది రాధ.
అయినా రంగనాధం నమ్మకం లేక చలపతి రాగానే అతని ముఖం చూడలేక యెదుటపడి నసుగుతూనే "ఇంటావంటా లేని ఇలాంటి జబ్బు ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది." అన్నాడు.
చలపతి చాలా శాంతంగా "ఫర్వాలేదు . తగ్గిపోతుంది లెండి. ఆమెకు మంచి విశ్రాంతి ఆహారం అవసరం. ఆమెకు కొన్నాళ్ళ పాటు ఎవరైనా చాలా శ్రద్దగా చాకిరీ చెయ్యాలి. అయినా నేను ఏర్పాటు చేయిస్తాను. ఆమె ఇక్కడే ఉంటె."
రంగనాధం గుండెలు కుదుట పడ్డాయి. కుదుట పడ్డా అక్కడుతో ఆగకుండా గడుసుదనపు ఆలోచనలు చేయబోయాడు. అయితే రాధమ్మ వాటిని పారనివ్వలేదు.
"సరే, అయితే చిక్కే లేదు" అంటూ రంగనాధం ఆమెను ప్రయాణం చేశాడు.
చలపతి ఆమెకు కావాల్సినవన్నీ కొనిచ్చాడు. ఈలోగా రాజశేఖరం దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చింది. "రాధమ్మ కు సుస్తీ అని తెలిసింది . ఓ రెండు నెలల పాటు అమెని పుట్టింటికి పంపటం మంచిది. కాస్త విశ్రాంతి గానూ ఉంటుంది. జబ్బు తొందరగా నయం అవుతుంది.' అంటూ రాశాడు.
రంగనాధం గుండెలు దడదడ మంటూనే ఉన్నాయి. ఎటువంటి సంకట పరిస్థితులు ఏర్పడకూడదు అనుకున్నాడో" అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జబ్బు మామూలు జబ్బు కాదు. క్షయ అంటు వ్యాధి. తనకు ఇద్దరు పిల్లలున్నారు భార్య ఈ ఉత్తరం చూడగానే వ్యతిరేకించింది. ఆమె తన దగ్గర పెద్ద గొడవ చేసింది.
మరో చెంప తల్లి గొడవ చేసింది. వెళ్ళి తీసుకు రమ్మని. భార్యని సముదాయించి ఇక్కడికి వచ్చాడు. అయితే ఇక్కడ పరిస్థితులు అతనిలో కొంతవరకూ తెరిపి నిచ్చింది. చలపతి ఓ సమస్యలా పరిణమించలేదు. రాధా పట్ల అతని ఆదరణ లో లోపం లేదు. అతను ఎలాంటి అసభ్యం అమర్యాద కనబర్చలేదు. అతని శీలం మంచిది కాదని, అతను చెడి పోయిన వాడనీ ఎవరో చెప్పింది పట్టుకుని తాను అంత గొడవ చేసినా చలపతి లాంటి అపవాదు వేసే అవకాశం ఉన్నా అతను తెలిపోలేదు. చాలా హుందా కనపర్చాడు.......అక్కడికదే కొంత నయం.
ఇక్కడే ఉంటె భర్తకి కొన్నాళ్ళ కు విరక్తి లాంటిది కలగవచ్చు. ఇప్పటి సానుభూతి ఆదరణ ఇలాగే ఎల్లకాలమూ ఉంటాయని ఏవిటి నమ్మకం? ఒకచెంప విపరీతపు ఖర్చులు మరొక చెంప ఇంటికి వస్తే రోగిష్టి మనిషి. ఎంతటి వారికైనా విసుగ్గా ఉంటుంది. అలాంటి ధోరణి కలగాకుండానే ఓ రెండు మాసాల పాటు పుట్టింటిలో వైద్యం చేయించుకుని ఆరోగ్యం బాగు చేసుకుని అప్పుడు తిరిగి వస్తే తన సంసారం ఎప్పటి మాధుర్యం అలా నిలుస్తుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించే ఆమె ఈ ప్రయాణానికి తల పెట్టింది. "రాజశేఖరం బావ కూడా ఇదే ఆలోచనతో ఉత్తరం రాశాడు" అనుకుంది రాధ.
స్టేషను లో బండి కదలబోయే ముందు చలపతికి కన్నీరు ఆగలేదు. అతను బయటపడకుండా ముఖం పక్కకి తిప్పుకున్నా సూర్యరశ్మికి అతని కనుకొలకుల్లో తళుక్కుమన్న నీటి బిందువు రాధ కంట పండింది. రంగనాధం గమనించాడు.
బండి కనుచూపు దూరం వరకూ అతను చేతులు ఊపుతూనే ఉన్నాడు. రాధమ్మ కిటికీ లోంచి తల ఇవతల పెట్టి చూస్తూ ఉంది.
