వెంకన్న ముఖం గంభీరంగా మారింది-"చూడండి చైర్మన్ గారూ-అపరాధ పరిశోధన నా వృత్తి! నిజం తెలుసుకుని పార్టీలకు చెప్పడం నా వృత్తిలోని ఒక భాగం మీ అబ్బాయి సురేష్ కీ, వరదయ్య కుమార్తె పద్మినికీ మధ్య ఒక తమాషా నాటకం జరిగింది. ఆ కారణంగా వాళ్ళిద్దరూ పరస్పరం అపార్ధం చేసుకున్నారు. ఈ నాటకానికి కారకులెవరు? వరదయ్య అనుకునేందుకు లేదు. ఇంత నాటకం నడిపేస్తోమతూ, అవసరమూ ఆయనకు లేదు. మీవాటం చూస్తూంటే ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని ఆత్రపడుతున్నట్లూ, ఆగినందుకు సంతోషిస్తున్నట్లూ అనిపిస్తుంది. ఈ నాటకం మీరే ఆడించారని నేను అంటాను...."
"ఈ మాట అనేముందు నేనీ ఊరి చైర్మన్ ననీ, బాధ్యత తెలిసిన వాడిననీ మీరు గ్రహించాలి. మా అబ్బాయి ప్రేమించాడు కదా అని ఇష్టం లేక పోయినా ఆ పిల్లను కోడల్ని చేసుకోవాలనుకున్నాను. ఆ పిల్ల ఎలాంటిదో తెలిశాక మావాడికిష్టమున్నాసరే ఈ పెళ్ళి జరుగానివ్వను. అయితే ఇలాంటి విషయాల్లో నాటకాలాడాలని నేననుకోను. ఆ అవసరమూ నాకు లేదు. నాకే కాదు-ఈ పెళ్ళి చెడగొట్టాల్సిన అవసరం ఎవరికీ ఉండదు-" అన్నాడు చైర్మన్.
"ఎవరికీ ఎందుకుండదు? ఉదాహరణకు ఊళ్ళోని ధనికులెవరైనా మీ అబ్బాయికి తన పిల్ల నివ్వాలను కున్నారనుకోండి. అందులో అసహజమేమీ లేదు. వాళ్ళు మీ అబ్బాయికి సంబంధం కుదిరిపోయిందని నిరుత్సాహపడ్డారనుకోండి-అందులోనూ అసహజముండదు. ఆ సంబంధం చెడగొట్టడంకోసం వాళ్ళింత నాటకమాడితే అందులోనూ....."
వెంకన్న ఇంకా ఏదో అనబోతూండగా చైర్మన్ ఆపి - "మీరు చెప్పేది చాలా అసహజంగా ఉంది నాకు...." అన్నాడు.
వెంకన్న గంభీరంగా చైర్మన్ వంక చూసి - "ఈ నాటకం గురించి మీకేమీ తెలియనిపక్షంలో ఒక విషయం గుర్తుంచుకోండి. నాటకం జరిగినమాట నిజం. నేను చెప్పిన కారణాలు కాని పక్షంలో ఆ నాటకం మరేదైనా ప్రమాదకరమైన ఉద్దేశ్యంతో నడుపబడి ఉండవచ్చు. మీరు నాతో మనసు విప్పి మాట్లాడి సహకరించగలిగితే-నేనూ మీకు సాయపడగల్గుతాను. మీరు నా సాయం అవసరం లేదనుకుంటే అది వేరే సంగతి.." అన్నాడు.
"ఐ కెన్ టేకో కేరాఫ్ మై సెల్ఫ్! లేని పక్షంలో మునిసిపల్ చైర్మన్ ఎలా అయ్యాననుకుంటున్నారు?" అన్నాడు చైర్మన్.
"అయితే నేను వస్తాను. ఈ రాత్రికి మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి-" అన్నాడు వెంకన్న.
చైర్మన్ తనలో తను నవ్వుకుని - "డిటెక్టివులకు ప్రతి మామూలు విషయంలోనూ వ్యూహాలు కనబడతాయి...." అనుకున్నాడు.
11
వెంకన్న తన ఇల్లుచేరుకోగానే సీతమ్మ అంది-"బాస్! మీరు పంపినతను అతడి గురించి వివరాలు పంపాడు. ఈ రాత్రంతా అతడిమీద నిఘా ఉంటుందని హామీ యిచ్చాడు. అతడి పేరు సుదర్శనరావు అట.
నేరాలతోనూ, పోలీసులతోనూ సంబంధం లేకుండా నాలుగు రిక్షాలు, రెండు ఆటోలు, ఒక టాక్సీ అద్దెకు తిప్పుకుని ఆ ఆదాయం మీదా, బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్లమీంచి వచ్చే ఆదాయం మీదా హాయిగా రోజులు వెళ్ళబుచ్చుతున్న సుఖజీవి అట. అతఃడికీ మాన్ ఎదురింటివాళ్ళకీ చుట్టరికం ఉన్నమాట కూడా నిజమేనట-"
ఈ సమాచారం విని వెంకన్న ఆశ్చర్యపడ్డాడు. సురదర్శనరావు చెప్పిన దాంట్లో కొంత నిజముంది. అయితే అతడు తనకు ఫోన్ చెఇస్నమాత మాత్రం అబద్దం కాదు. అతడు ఎవరు? సురేష్-పద్మినిల వివాహంతో అతడికి ఏం సంబంధం?
సుదర్శనరావు కుటుంబం గురించి పూర్తి వివరాలు చదివాడు వెంకన్న. అతడికి పెళ్ళీడు కూతుళ్ళు లేరు. వివాహమై పదేళ్ళయింది. భార్య జీవించే ఉంది అతడికీ వ్యవహారంలో ఏ అవసరమూ కనబడడంలేదు. పోనీ డబ్బు తీసుకుని ఎవరికైనా పనిచేశాడా అనుకుందామా అంటే అతడు ఉన్నత కుటుంబీకుడు.
ఈ నాటకంలో తనకు ఎంతో కొంత సమాచారం ఇవ్వగలవాళ్ళు ఇద్దరే ఇద్దరున్నారు. వారిలో ఒకడు సుదర్శనరావు. అతడీ రాత్రి ఏదైనా అఘాయిత్యం తలపెడితే తెలుసుకునేందుకు తన మనిషి కాపలా ఉన్నాడు. అతడేమి చేయకపోతే తానతడినుంచి అదనపు సమాచారం రాబట్టడం కష్టమే!
తనకు సాయపడగల రెండో మనిషి శేఖర్!
రాత్రి ఎనిమిది కాగానే రాజమ్మ, సీతమ్మలు ఇళ్ళకు వెళ్ళిపోయారు. వెంకన్న భోజనమయేక భార్య పద్మావతీ దేవితో - "దేవీ! నువ్వు అనుమతిస్తే ఒక్క గంట బయటకు వెళ్ళివస్తాను...." అన్నాడు.
"నేను నిమిత్త మాత్రురాలిని. వద్దని మిమ్మల్ని ఆపగలనా?" అంది పద్మావతీదేవి-"ఒక్క గంటలో వెనక్కు రాగలిగితే నేనెంతో సంతోషిస్తాను-"
వెంకన్న తిన్నగా శేఖర్ యింటికి వెళ్ళాడు. అతడి ఇంటికి ఏ విధంగా వెళ్ళవచ్చునో వెంకన్నకు పద్మిని ద్వారా తెలిసింది.
అప్పటికి శేఖర్ ఇంట్లోనే ఉన్నాడు-ఒంటరిగా!
"నా పేరు వెంకన్న-నేను డిటెక్టివును!"
శేఖర్ కంగారులో వినయం మిళితంచేసి డిటెక్టివుకు మర్యాదచేశాడు. వెంకన్న కూర్చుని - "సురేష్ తో సంబంధమైన పద్మిని విషయంలో మీరేదో నాటక మాడారు. నాటకం నాకు తెలిసింది. ఎందుకాడారో నాకు తెలియదు. తెలుసుకుందామని వచ్చాను-" అన్నాడు.
శేఖర్ ముందు కంగారుపడ్డాడు. తనకేమీ తెలియదన్నాడు. వెంకన్న జరిగిన కథంతా ఓ క్రమంలో చెప్పి-"మీరు కాదంటే కుదరదు. ఇదంతా నాటకమే. ఇందులో మీ ప్రమేయం చాలా ఉంది-" అన్నాడు.
శేఖర్ చాలాసేపు ఆలోచించి-"చూస్తూంటే ఇది నాటకంలాగే ఉంది. కానీ ఇందులో నా ప్రమేయం లేదు-" అన్నాడు.
"మీ ప్రమేయం లేకపోతే మరెవరిదో ప్రమేయం ఉన్నది. ఆ వ్యక్తి ప్రమేయం తో ఈ నాటకంలో ఎందరో పాత్రలు నిర్వహించారు. మీరూ అలా మీ పాత్ర నిర్వహించారు. ప్రమేయం ఎవరిదో మీకు తెలిసి ఉండాలి-" అన్నాడు వెంకన్న.
"తెలియదు-...." అన్నాడు శేఖర్.
"తెలుసు...." అన్నాడు వెంకన్న.
"మీరలా అనేముందు నా గురించి విచారించండి. నేను చాలా చాలా సామాన్యున్ని. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నా బ్రతుకు బ్రతుకుతున్నాను. ఇలాంటి నాటకాలు నేనెందుకాడతాను? ఇలాంటి పాత్రల్లో ఒకడిని నేనెందుకౌతాను? ఈ విధం గా ఆలోచిస్తే మీరసలు నా వద్దకు వచ్చివుండేవారుకాదు-"
వెంకన్న సాలోచనగా శేఖర్ వంక చూశాడు.
అవును-ఇదేం నాటకం! ఈ నాటకంవల్ల ప్రయోజనం ఎవరికి? శేఖర్ లాంటి వాళ్ళు ఇలాంటి వ్యవహారాలు నడపలేరు. ఎవరి ప్రమేయం మీదనో ఈ పాత్ర స్వీకరించాడనుకున్నా-ఈ నాటకం నడిపించే మనిషి ఆశించే ప్రయోజనమేమిటి?
ప్రతి ఒక్కడూ తననడిగితే ప్రశ్న ఇదే! నేనెందుకు ఇలాంటి నాటకం ఆడతాను?
చైర్మన్ అడిగినా, శేఖర్ అడిగినా, సుదర్శనరావు అడిగినా మరెవ్వరడిగినా ఈ ప్రశ్నకు జవాబు ఏమని చెప్పగలడు?
కానీ-ఇందులో ఏదో నాటకముంది, అదేమిటి?
దీనికి జవాబు ఎక్కడ దొరుకుతుంది?
వెంకన్న శేఖర్ ను చివరిసారిగా ఒకే ప్రశ్న వేశాడు- "పద్మినిపై నీకున్న ఆసక్తి ఏమిటి?"
"మొదట్లో ఆమెను అపార్ధం చేసుకున్నాను. ఇప్పుడామె ఒప్పుకుంటే వివాహం చేసుకుందుకు సిద్దంగా వున్నాను-" అన్నాడు శేఖర్.
