Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 17


    "ఓహ్, నీనుండి నే నెన్నడూ లాభ నష్టాలు లెక్క చేసుకోలేదు. నువ్వు నానుండి ఏ సహాయం కోరినా చేస్తాను. దయచేసి..."
    పశ్నలకు జవాబులిస్తూ, అడుగుతూనే ఓ వైపు వ్రాయటం పూర్తి చేసింది. వేణు సగం కూడా వ్రాయలేదు. వ్రాసినవి బాస్కెట్ లో పడేసి, కార్బన్లు వేరుగా ఉంచి, "అవి కూడా ఇవ్వండి. రాసేస్తాను" అనగానే వేణు ఇచ్చాడు.        
    "నీకు కార్టూన్లు వేసి కవరు పంపాక, నువ్వు కాలేజీ మానేసిన నాటినుండీ నువ్వంటే నా కెందుకో సానుభూతి
ఏర్పడింది. నేను ధనవంతుడినన్న కక్ష నీ కుంటే..." ఆగి సునీతవైపు చూశాడు. ఆమె అతన్నే చూస్తూంది. ఆ చూపుల్ని తప్పించుకుంటూ రివాల్వింగ్ చైర్ లో అటు తిరిగాడు. కానీ ఆ మాట పూర్తి చెయ్యలేదు.
    "నే నేదో అంటాను. నువ్వేదో జవాబిచ్చానని నేను అలాగే జవాబిస్తాను. ఫలితం నువ్వు బాధపడతావు. నేను బాధ పడతాను. నువ్వే ఆలోచించు, సునీతా."
    "సమయం చిక్కితే తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటూనే ఉన్నారు."
    "నేను? నేనా, సునీతా?"
    "మీరు కాదు. మీకు తెలీదు, వేణూ. ఈ ధనవంతులు చెయ్యబట్టే నేను అమ్మకు దూరమయ్యాను. మీ ధనవంతుల పరువు ప్రతిష్టలే నన్ను అమ్మఒడిలో ఆడుకోనివ్వలేదు. వాళ్ళ కీర్తి కాంక్షే నాన్న ఎవరో తెలీనివ్వలేదు." వ్రాయటం ఆపింది. ఆమె కళ్ళ నుండి రెండు బాష్పకణాలు జారి వ్రాస్తున్న కాగితాల మీద పడ్డాయి.
    వేణును ఆ మాటలు కదిల్చాయి. ఇవన్నీ నిజమేనా? చిక్కు ప్రశ్నలు! తేలని సమస్యలు!
    సునీత సరిగా వ్రాయలేకపోయింది. పెన్ మూసేస్తూ, "మన్నించండి, సరిగా రాయకుండా మీ పని చెడగొట్టినందుకు. పొద్దున్నే వచ్చి టైప్ చేసి ఇస్తాను" అన్నది.
    ఫ్యూను వచ్చాడు. అవసరమైన ఫైళ్ళు కార్లో పెట్టాడు.
    'ఉదయం వెళ్ళేటప్పుడు మామయ్య పంతులమ్మను తెస్తానని చెప్పాడు.' రాధ వరండాలో ఎదురుచూస్తూ కూర్చున్నది ఆర్తి ఇంకా రాలేదు.
    కారు చప్పుడు విని మెట్లు దిగి వచ్చి చివరి మెట్టు మీద నిల్చుంది. ఆమెకు కొద్ది దూరంలో గారేజీ ముందు కారు ఆగింది. కార్లోనుండే రాధను చూసింది సునీత. కారులో ఎవరో అమ్మాయి ఉండటం చూసి రాధ రెప్పల్ని రెండుసార్లు తాటించింది.
    సునీతే పంతులమ్మ అని వేణు చెప్పినప్పుడు రాధ నమ్మలేదు. "ఈ అమ్మాయి పంతులమ్మ కావటమేమిటీ?" అంది.
    "మరి ఇంకెలా ఉంటుంది?"
    "కళ్ళజోడు, చేతిలో గొడుగు, చేతిలో సంచీ..." రాధ వర్ణించింది పంతులమ్మలను. వారు మతప్రచారానికి పల్లెటూళ్ళవెంట తిరిగే మిషనరీవాళ్ళని రాధ నమ్మకం. ఎలాగైతేనేం సునీతను తన ఉపాధ్యాయురాలిగా అంగీకరించింది, ఒక గంటసేపు చెప్పాక.
    సునీత చాలాసేపు అక్కడే ఉంది. ఆర్తికూడా కొద్దిసేపటిలో వచ్చింది. ఆవేళ అక్కడే అన్నం తినమన్నది రాధ. సునీత తప్పించుకోవాలన్నా పడలేదు. ఆర్తికూడా తినమంది. ఆమె చెబితే సునీత కాదనదు.
    వేణు సినిమాకు వెళదామన్నాడు. "ఓ నేను తయారు" అంది రాధా.
    ఆర్తి రానన్నది.
    "అబ్బ! నువ్వు ఎక్కడికీ రానంటావు. రా, పిన్నీ." దగ్గిరగా జరిగింది.
    ఆర్తి మాట్లాడలేదు. "నువ్వు చెప్పరాదూ?" అని సునీతవైపు తిరిగింది రాధ.
    బహువచనాలు గౌరవపదా లేమీ తగిలించలేదు. అమాయికంగా ఉండే రాధ మాటలు సునీతకు ముచ్చట గొలిపాయి. తను కొత్తదైనా, టీచరైనా నువ్వనే అంటూంది. రాధ అంటే వాత్సల్యం లాంటి భావం కలిగింది. కళ్ళను చక్రాల్లా తిప్పేస్తూ, ఆమె మాట్లాడే ప్రతి మాట సునీత భావాన్ని మరింత బలపరిచింది.
    ఆర్తికూడా సినిమాకు వచ్చింది.    
    తన జీవితం, అనుభవపూర్వకమైన లోకజ్ఞానం, పరిసరాలు, సంస్కారం, సహృదయత, సాంఘిక జీవనం, వైజ్ఞానిక పురోగమనం, మంచీ చెడూ మొదలైన విషయాల మీద రాధ చదువు కేంద్రీకరించాలని సునీత తలంచింది. సినిమానుండి తిరిగి వస్తూ ఆర్తితో అదే చెప్పింది.
    "వెదకబోయిన తీగ కాలికే తగిలింది!" వేణు అన్నాడు.
    సినిమాకు వెళ్ళేముందు సునీత ఆఫీసులో మగవాళ్ళతో పాటు పని చేస్తుందని విని, కళ్ళు పెద్దవి చేసి, "నీకు సిగ్గువెయ్యదూ?" అంది రాధ.
    "ఇంకా కొన్నాళ్ళయితే నువ్విలా అనవు. ఇక్కడ పొట్టతిప్పలకోసం ఉద్యోగాలే కాదు, ఎంత నీచానికైనా పాల్పడతారు. నిండు ప్రాణాలు తియ్యడానికైనా వెనుదియ్యరు."
    సినిమా కూడా దానికి తగ్గట్టుగానే ఉంది, డిటెక్టివ్ చిత్రం కావటంవల్ల. రాధకు ఆ సినిమా నచ్చలేదు. పోదామని ఒకటే గొడవ. అందుకే ఇంటర్వల్ కాకపోయినా తిరిగి వచ్చారు.
    సునీత ఇంటికి వెళుతూ, "రానురాను ఇటువంటి దృశ్యాలు మామూలుగా చూడటం నేర్చుకోవాలి. మొదట ఎలాగో ఉంటుంది. నువ్వు మొదట తెలుసుకో వలిసింది, దేన్నీ సూటిగా అనకూడదని. ప్రతి మాటకూ వెనక ఎంతో యోచన అవసరం" అని చెప్పింది.
    "నే నేమో అనుకున్నా, పట్నాన్ని గురించి..."
    "నీబోటివాళ్ళందరూ ముందు అలాగే ఊహిస్తారు. నెమ్మదిమీద అన్నీ తెలుసుకోవాలి."
    సునీత వెళ్ళాక వేణు ఆర్తితో అన్నాడు: "అప్పుడే పాఠాలు మొదలుపెట్టింది. నాకు కూడా అవి వింటుంటే ఆమె దగ్గిర చదువుకోవాలనిపిస్తూంది. సునీత ఎంత విజ్ఞానవతి!"
    ఆర్తి కళ్ళు మూసుకుంది. 'అవును. అత్తయ్య కూడా అంతే!' మనసులో అనుకుంది.
    రాధ ఏదో ఆలోచిస్తూ ఇదేం పట్టించుకోలేదు.

                                 *    *    *

    గోవిందరావు సేవాగ్రామ్ నుంచి ఉత్తరం వ్రాశాడు. అందులో మామూలు వార్తలే తప్ప అంత ఉత్సాహకర మైన వార్తలేమీ లేవు.
    మొదటి రోజున తనకు వచ్చిన అక్షరాలన్నీ వ్రాసి చూపించింది రాధ. ఆమె స్వతహాగా తెలివైంది కనక, ఏ విషయాన్ని అయినా బోధపరచడానికి సునీత ఎక్కువగా శ్రమపడి చెప్పే అవసరం తప్పింది.
    సునీతకు కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి. అందులో తనకు అవసరమైన పనులను తనే స్వయంగా చేసుకోవటం ఒకటి. ఎంతో అవసరమైతే తప్ప ఇతరుల సహాయం కోరదు.
    ముందుగా ఆమె రాధకు చెప్పిన పాఠమే అది. "మనకు తెలిసి, చేసుకోగల ప్రతి పనినీ సాధ్యమై నంతగా మనమే చేసుకోవాలి. ఒకళ్ళకు చెప్పి, వారు చేసే లోగా మనం రెండు పనులు చేసుకోవచ్చు."
    ఇంకా "మితభాషిత్వం అలవరుచుకోవాలి. మౌనం కింద ఎన్నో బాధలను అణిచిపెట్టవచ్చు. మన తత్త్వ మేమిటో ఇతరులకు అర్ధమవదు. అందువల్ల మనం అంటే ఓ విధమైన తెలియనితనం వాళ్ళను గౌరవంగా ప్రవర్తించేట్లు చేయిస్తుంది" అంది.
    ఎప్పుడూ సునీత చేతిలో బాగ్ ఉండటం రాధ గమనిస్తూనే ఉంది. దాన్ని గురించి అడిగి తెలుసుకుంది. "ఇందులో ఏముంటాయి? ఎప్పుడూ వెంటేసుకుని తిరుగుతావు?"
    "ఇందులోనా? డబ్బు. ఇంకా అవసరమైన వస్తువులు. తీసి చూడు" అంటూ బాగ్ రాధకిచ్చింది.
    రాధ ధాన్ని తెరిచి చూసింది. అందులో ఓ పెన్నూ, పెన్సిలూ, దస్తీ, చిన్న చాకూ, రబ్బరూ, ఓ పాకెట్ సైజు నోటు పుస్తకం కనిపించాయి.
    "ఇవన్నీ ఎందుకు?"
    "నా అవసరమే వాటితో! ఆఫీసులో, బయటా వాటిలో దేనితోనైనా అవసరం ఉంటూనే ఉంటుంది."
    మొత్తంమీద సునీత ఒక విశిష్టమైన వ్యక్తిగా రాధ తలంచింది.

                              *    *    *

                                  12

    "హలో! ఎవరు మాట్లాడేది? నేను డాక్టర్ ఆర్తిని."
    "నమస్తే, డాక్టర్! నా పేరు కళ్యాణి, నన్ను చూశారు గాని పేరు వినలేదు." అవతలి కంఠం అంది.
    "కావచ్చు. మీకేం కావాలి?"
    అవతల ఒక నిట్టూర్పు, "కావలసిందేమో అక్కడికి వచ్చాకే చెప్పాలనుకుంటున్నాను. అయిదు గంటలకు హాస్పిటల్లోనే ఉండండి, డాక్టర్, నేను వస్తాను."
    "ఇప్పుడు చెప్పకూడదా?"
    "చెప్పవలసింది చాలా ఉంది. ఫోన్ లో వీలు ఉండదు."
    "సరే," ఆర్తి ఫోన్ పెట్టి వాచీ చూసుకున్నది. నాలుగున్నర దాటింది. అంటే మరో అర్ధగంట అన్నమాట. ఉన్న నలుగురైదుగురు రోగులను పంపించేసి, ఆమెకోసం ఎదురుచూస్తూ కూర్చున్నది.
    కన్ సల్టింగ్ రూమ్ లో గోడ గడియారం అయిదూ పన్నెండు నిమిషాలు చూపిస్తుండగా, ఒక కారు కాంపౌండ్ లో ప్రవేశించింది. ఆర్తి ఆ కారును, అందులోనుంచి దిగుతున్న ఆమెను చూస్తూనే నివ్వెర పోయింది.
    ఆమె సారధి వెళ్ళబోయేముందు కనిపించినామె. ఆమెను చూశాకనే సారధిలో ఆ మార్పు వచ్చింది; అతని నిష్క్రమణం జరిగింది.
    ఆర్తి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం రౌద్రంగా మారింది. ఆమె లోపల అడుగు పెడుతూంటే, "గెటౌట్. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎవరి జీవితంలో చిచ్చుపెట్టడానికి?" అని అరిచింది.
    ఆమె వెళ్ళలేదు. గుమ్మంలో అలాగే నిల్చుంది.
    కొంతసేపటికి ఆర్తి తనను తాను నిలదొక్కు కున్నది. కోపోద్రేకాన్ని తగ్గించుకుంటూ, "దయచేసి వెళ్ళిపో, కళ్యాణీ! నిన్ను గెంటించవలసి వస్తుంది. ప్లీజ్!" అంది.
    కళ్యాణి మరొక అడుగు లోపలికి వేసి, "మీరు ఏ శిక్ష విధించినా నేను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పనిదే వెళ్ళలేను. ఒక పరిపూర్ణ పురుషుని గురించి మీకు కొంత తెలిసినా, మరికొంత తెలపాలని వచ్చాను. ఆయన మీ భర్త సారధి" అన్నది.
    తుపాకి పేలినట్లయింది ఆర్తికి. ఒక్కసారి శరీర మంతా చల్లబడింది నిస్సత్తువగా కుర్చీలో కూల బడింది. 'ఓహ్! ప్రభూ..... ప్రభూ...' అనుకుంది పదేపదే.
    అయిదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
    ఆర్తి కుర్చీలోనుంచి లేచింది. కళ్యాణివైపు చూస్తూ. "నా వెంట రండి" అన్నది. కళ్యాణి ఆమెను అనుసరించింది.
    తిన్నగా వాళ్ళిద్దరూ ఆర్తి ప్రైవేట్ రూమ్ లోకి వెళ్లారు. ఆర్తి కల్యాణిని కూర్చోమన్నది. తనూ కూర్చుంది.
    "మీరు చెప్పదలుచుకున్నదేదో చెప్పండి!"
    కల్యాణి శిరస్సు వంచింది. "నిజనిజాలేమిటో తెలుసుకోండి. ప్రశాంతంగా నేను చెప్పేదంతా విని, నన్ను క్షమించగలిగితే కృతజ్ఞురాల్ని."
    "తప్పులు చెయ్యడం మానవసహజం, మీరు చేసినది క్షమించరాని తప్పయితే-చెప్పలేను."
    కళ్యాణి టేబుల్ మీద ఉన్న సారథి ఛాయా చిత్రాన్ని మరొకమారు చూసి చెప్పటం మొదలు పెట్టింది.
    
                                 *    *    *

    "ఈ జంటనగరాలకు నూట పాతికమైళ్ళ దూరంలో ఉన్న ఒకానొక గ్రామంలో నేను జన్మించాను. మా పూర్వికులు ఆ ప్రాంతంవాళ్ళు కాకపోయినా, ఉద్యోగ రీత్యా వచ్చి అక్కడే స్థిరపడ్డారు. కనక అదే మా స్వగ్రామ మనుకోవాలి. మా నాన్న అక్కడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూండేవారు. నేను అక్కడే కొంతవరకు చదువుకున్నాను.
    పదిహేను సంవత్సరాల వయస్సులో ఉండగా నా వివాహం జరిగింది. నా భర్తపేరు పార్ధసారధి.
    మేము ఉంటున్న గ్రామానికీ, ఆయన గ్రామానికీ పదిమైళ్ళ దూరం, అప్పట్లో ఆయన హైదరాబాదులో చదువుకుంటూండేవారు. మేము వివాహితుల మనేగాని, పెళ్ళిలోను, ఫోటోల్లోను తప్ప మళ్ళీ ఎన్నడూ తిరిగి చూసుకోలేదు.
    ఎందుకో వారికి వైవాహిక జీవితం అంటే ఇష్టం ఉన్నట్లుగా నా కెన్నడూ కనిపించలేదు. మేము వ్యక్తిగతంగాకలుసుకోకున్నా, ఉత్తరాలు మాత్రం నడుస్తూండేవి. ఆయన ఉత్తరాల్లో ఏవో వేదాంతం -నా కర్ధంకాని భావాలనుబట్టి - సాంసారిక జీవితానికి ఆయన విముఖులని నేను ఊహించుకునేదాన్ని.
    ఆయన సలహా ననుసరించే మా నాన్న నన్ను దగ్గర్లో ఉన్న బస్తీకి పంపించారు హైస్కూలు చదువుకోటం, అక్కడ మా పిన్నిగారింట్లో ఉండి చదువుకుంటూండేదాన్ని.
    సెలవుల్లో కూడా ఆయన అసలు ఇంటికి రాకపోయే వాడు ఒకవేళ వచ్చినా మా ఇంటికి వచ్చేవాడు కాదు. అసలు వాళ్ళ ఇంటి దగ్గిరా ఉండేవాడు కాదుట. పగలల్లా ఎక్కడెక్కడో చేలల్లో తోటల్లో తిరుగుతూ గడిపి, రాత్రి ఏ తొమ్మిదింటికో ఇంటికి చేరేవారు. మళ్ళీ వీడుకూడా రాకముందే లేచి వెళుతూండేవారు. చేలల్లో, తోటల్లో తిరగటంలో వారికి ఏ ఆనందం లభించేదో. ఎప్పుడూ అలా ఎందుకు తిరుగుతారో నాకు అంతుబట్టకపోయేది. తరవాత తరవాత ఆయన ప్రకృతి సౌందర్యాన్ని బాగా ఆరాధించేవాడు తెలుసుకో గలిగాను.
    సెలవులు అయిపోయేవి. నాకుగాని, మా అమ్మా నాన్నలకుగాని చెప్పనైనా చెప్పకుండా ఆయన ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోయేవాడు. చూడాలన్న నా కోర్కె. కోరికగానే ఉండిపోయేది. నేను మళ్ళీ పిన్నిగా రింటికి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళాక ఓ అయిదారు రోజులకు నాకు ఉత్తరం వచ్చేది ఆయన దగ్గిరనుండి.
    ఈ రకమైన ఆయన తత్త్వం నాకు కోపం తెప్పించేది.
    ఇంటి దగ్గిర ఉన్నప్పుడు అత్తయ్య అంటుండేది, గదిలో కూర్చుని, పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకునేవారుట. లేకపోతే కిటికీ దగ్గిర నిల్చుని, ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ గడుపుతారుట. పలకరిస్తే పదిమాటలకు ఒకసారి ఆఁ అనో, ఊ అనో ముక్తసరిగా సమాధానాలిచ్చేవారుట. మళ్ళీ ఇంకో మాట యినా మాట్లాడకుండా ఆలోచనలు.
    మరి హాస్టల్సులోనూ, కాలేజీలోనూ ఎలా ఉండే నాలో, ఏమో?
    మరొక విశేషం వారిలో ఉండేది. తను ఏ రహస్యమూ నా దగ్గిర దాచుకునేవారు కాదు. కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలు ఆయనకు ప్రేమలేఖలు వ్రాసేవారు. అవి తిరిగి నాకు పంపుతూ, ఈ అమ్మాయి ఇలా ప్రేమలేఖ వ్రాసిందని, దీనికి సరియైన జవాబు ఎలా ఇవ్వాలో తనకు తోచటంలేదని, నన్ను తగిన సలహా ఇచ్చి ఆ ప్రేమలేఖ బారినుండి విముక్తుణ్ణి చేసే ఉపాయం చెప్పమని అడిగేవారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS